" నా సంకల్పమే నన్ను పత్రీజీ చెంతకు చేర్చింది "

 

 

బెంగళూరు మహానగరం లోని ఏడు వింతల్లో మొట్టమొదటి అద్భుతంగా నిలిచి .. " టైమ్స్‌మేగజైన్ " వారి అవార్డును గెలుచుకున్న " పిరమిడ్ వ్యాలీ "లోని " మైత్రేయ బుద్ధా మెగా పిరమిడ్ " .. పత్రీజీ మహా సంకల్పానికి నిలువెత్తు సాకారరూపం ! మానవ నిర్మిత అద్భుత నిర్మాణాలలో దేశవిదేశాల సందర్శకులతో కొనియాడబడుతూన్న ఈ బృహత్ నిర్మాణంలో పాల్గొన్న పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ల జీవితాలు ధన్యం ! ఆది నుంచి మెగా పిరమిడ్ నిర్మాణంలో అంకితభావంతో పాల్గొంటూ .. తమదైన కార్యదీక్షాదక్షతతో ప్రతి ఒక్కరి మన్ననలను చూరగొంటూన్న పిరమిడ్ ఇంజనీయర్ మరి Geo Technical Engineering లో M.Tech పూర్తి చేసిన విద్యాధికులు " శ్రీ PSRK ప్రసాద్ " గారితో ఆత్మీయ ఇంటర్వ్యూ ధ్యానాంధ్రప్రదేశ్ కోసం ..
-మారం శివప్రసాద్, 9618306173.

 

మారం: నమస్కారం ప్రసాద్ గారూ! మెగా పిరమిడ్ నిర్మాణంలో మీ కార్యదక్షత ప్రతి ఒక్కరికీ సుపరిచితమే! మీరు పిరమిడ్ ప్రపంచంలోకి ఎలా వచ్చారు?


ప్రసాద్ ప్రయాగ: 5 ఫిబ్రవరి, 2003 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో " సత్తెనపల్లి రామారావుగారి " ధ్యాన శిక్షణా తరగతి జరిగింది. అప్పట్లో నేను రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్‌గా ఆకివీడులో పనిచేస్తున్నాను. ఆ రోజు రామారావు గారి ధ్యాన ప్రవచనాలు నాకు ఎంతగానో నచ్చాయి ! ఆ మర్నాడు మళ్ళీ వెళ్ళి భీమవరం పిరమిడ్ మాస్టర్ " తటవర్తి వీర రాఘవ రావు " గారి సందేశాలను కూడా వినడం జరిగింది.

 

ఇక ఫిబ్రవరి 2003 వ సంవత్సరం 13,14,15 తేదీల్లో గురువు గారు పత్రీజీ వస్తున్నారని తెలుసుకుని వెంటనే కుటుంబసమేతంగా వారి ధ్యాన శిక్షణా తరగతికి వెళ్ళి ధ్యానం చేసి .. వారిని కలిసాను. భీమవరంలో మూడు రోజుల పాటు జరిగిన ధ్యానయజ్ఞంలో పాల్గొని ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుని పిరమిడ్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాను. అప్పట్లో వయోవృద్ధులు, మరి పుట్టపర్తి సత్యసాయి బాబా వారి భక్తులు, అయిన " శ్రీ D.S.శాస్త్రి " గారితో నాకు మంచి పరిచయం ఉండేది. గొప్ప సంపన్నులు అయిన వారు పుట్టపర్తిలో స్థిరనివాసం ఏర్పరచుకుని తమ స్వంత ఊరు ఆకివీడులో " శ్రీ సత్యసాయి భజన మందిరం " నిర్మాణానికి సంకల్పించారు. భారీ ఎత్తున నిర్మించ తలపెట్టిన ఆ మందిరం నిర్మాణ బాధ్యతను వారు నాకు అప్పగించారు. దాంతో నేను ఆ మందిరం పై ఒక " ధ్యాన పిరమిడ్‌ను నిర్మించుదాం " అని కోరగానే వారు వెంటనే 18'x18' పిరమిడ్‌ను నిర్మించడానికి ఒప్పుకున్నారు ! జూన్ 19 కల్లా భజన మందిరం, పిరమిడ్ నిర్మాణం అన్నీ పూర్తి చేసి దానిని బ్రహ్మర్షి పత్రీజీచే ప్రారంభోత్సవం చేయించుకోవడం జరిగింది. ఇలా నా ఆధ్యాత్మిక ప్రయాణం పిరమిడ్ నిర్మాణంతోనే మొదలయ్యింది !

 

మారం: ఇంజనీరింగ్ విద్య చదివినంతనే మీరు పిరమిడ్ నిర్మాణరంగంలోకి రావాలని ఏమీ లేదు. దీని వెనుక ఏదో ఆధ్యాత్మిక నేపథ్యం ఉండే ఉంటుంది !


ప్రసాద్ ప్రయాగ: అది నిజం ! మా నాన్న గారు మరి భీమవరం వాస్తవ్యులు " శ్రీ ప్రయాగ సూర్యనారాయణ " గారు భగవాన్ సత్యసాయి బాబా గారి భక్తులు ! వారు పది సంవత్సరాల పాటు సత్యసాయి విద్యసంస్థల్లో తెలుగు మరి సంస్కృతం భాషల్లో లెక్చరర్‌గా పనిచేశారు. నేను, మా అన్నయ్య అనంతపూర్‌లో చదువుకుంటూ పుట్టపర్తికి వస్తూపోతూ బాబా వారితో అనుబంధాన్ని కలిగి ఉండేవాళ్ళం. ఈ నేపధ్యంలోనూ మా అక్కయ్యల పెళ్ళి, మా ఉన్నత చదువులు అన్నీ కూడా బాబా దయతో ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోయాయి. ఇలా పుట్టపర్తితో సంబంధాన్ని కలిగి ఉంటూ .. అక్కడి కట్టడాలు, దేశవిదేశాల యాత్రికులను చూసి ఎప్పటికైనా " నేను కూడా ఒక గొప్ప గురువు సాంగత్యంలో ఉండి .. అక్కడి నిర్మాణాల బాధ్యత తీసుకోవాలి " అని బలంగా అనుకునేవాడిని. అలా 1986లో నా మదిలో మొలకెత్తిన ఆ బీజం మహావృక్షమై నేడు నన్ను పత్రీజీ దగ్గరికి చేర్చింది. మరి " పిరమిడ్ వ్యాలీ " నిర్మాణంలో పాల్గొని నా జన్మ ధన్యం అయ్యేలా మరి " నా కల సాకారం " అయ్యేలా చేసింది.

మారం: మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎలా లభించింది?


ప్రసాద్ ప్రయాగ: 2004 జూలై నెలలో నేను విజయవాడలో జరిగిన పిరమిడ్ వ్యాలీ .. బెంగళూరు ట్రస్ట్ సభ్యుల మీటింగ్‌కు హాజరయ్యాను. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒకానొక కన్వీనర్‌గా ఆ మీటింగ్‌కు హాజరయి ఇంటికి వచ్చాక .. అక్కడి విశేషాలను నా శ్రీమతి " సుచిత్ర " తో పంచుకున్నాను. అన్నీ విన్న ఆమె వెంటనే " మనం కూడా బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోదాం " అని చెప్పింది. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ చదువులు, నా ప్రభుత్వ ఉద్యోగం మరి చీకు చింతా లేని జీవితం. " ఇప్పుడు అన్నీ వదిలేసి బెంగళూరుకు తరలి వెళ్ళడం ఎలా సాధ్యం? " అని నేను ఆలోచనలో పడ్డాను ! కానీ బెంగళూరు వెళ్ళి పిరమిడ్ వ్యాలీ నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని మాత్రం నా మనస్సు తహతహలాడసాగింది !

 

పిరమిడ్ వ్యాలీకి అప్పటి మేనేజింగ్ ట్రస్టీ " పాల్ విజయ్‌కుమార్ "గారిని సంప్రదించి నా మనస్సులోని మాటను పత్రీజీకి తెలిపాను. వెంటనే వారు " ఎస్ " అనడం మరి నేను ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి భార్యపిల్లలతో సహా పిరమిడ్ వ్యాలీకి తరలి రావడం చకచకా జరిగిపోయింది. ఎన్నో జన్మలుగా ఆ స్థలంతో మాకు అనుబంధం ఉన్నట్లు అనిపించి ఈ పదేళ్ళ కాలం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. బెంగళూరులోనే చదువుకుని పెద్దయిన మా పిల్లలు ఇప్పుడు యూనివర్సిటీ చదువుల్లో ఉన్నారు.

 

మారం: ఈ పది సంవత్సరాల కాలంలో అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించండి?


ప్రసాద్ ప్రయాగ: బెంగళూరు మహానగరానికే తలమానికంగా నిలిచిన ఈ అద్భుత నిర్మాణాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ! 5000 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా నిర్మించిన 160'x160' మెగా పిరమిడ్‌తో బాటు కింగ్స్ ఛాంబర్ నిర్మాణాన్ని కూడా ఇక్కడి విశేషంగా చెప్పుకోవచ్చు ! 51 డిగ్రీల 51 నిమిషాల నిర్ధిష్ఠ కోణంతో " ట్రూ నార్త్ " కు సమాంతరంగా మెగా పిరమిడ్ నిర్మించబడింది. ఇలా ప్రతి ఒక్క పిరమిడ్‌ను కూడా " నిర్దిష్ఠమైన క్షేత్రమితీయ కొలతలతో నిర్మించుకున్నప్పుడు అవి శక్తిక్షేత్రాలుగా రూపొందుతాయి " అన్న విశిష్ఠతను తెలుసుకున్న చాలా మంది సివిల్ ఇంజనీర్లు ఈ మధ్యకాలంలో ఇళ్ళ పై కప్పులనూ, వాటర్ ట్యాంక్‌లనూ మరి బెడ్‌రూమ్‌ లనూ పిరమిడ్ ఆకారంలొ నిర్మిస్తున్నారు. పిరమిడ్ సైజు పెద్దదయిన కొద్దీ దాని యొక్క శక్తిక్షేత్ర పరిధి మరింత విస్తరిస్తూ అందులో ధ్యానం చేసే వారికి దాని ప్రభావం సుస్పష్టంగా తెలుస్తుంది.

 

30 ఎకరాల సువిశాల " పిరమిడ్ వ్యాలీ " ప్రాంగణంలో మెగా పిరమిడ్‌తో పాటు అత్యాధునిక హంగులతో నిర్మించబడ్డ ఆంఫీ థియేటర్ కూడా ఆధ్యాత్మిక ప్రయోగాలకు వేదికగా నిలుస్తోంది. దేశవిదేశాలకు చెందిన నవ్యయుగ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్తలూ, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలూ, హీలర్లూ ఇక్కడికి తరచుగా వచ్చిపోతూ తమ తమ పరిశోధనలతో క్రొత్త క్రొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు. బెంగళూరు నగరానికి చెందిన " స్పేస్ రీసెర్చ్ క్లబ్ " వారు తమ సాంకేతిక పరికరాలతో వ్యాలీకి విచ్చేసి పిరమిడ్ వేదికగా రాత్రిళ్ళు ఖగోళంలో జరిగే వివిధ మార్పులను అధ్యయనం చేస్తున్నారు. పిరమిడ్ వ్యాలీ నిర్వహణా సంబంధమైన వివిధ భవనాలు, " కెఫెటేరియా " .. " పగోడాల రూపంలో నిర్మించిన అతిథి గృహాలు " .. " డార్మెటరీలు " .. మరి " వసతి గృహాలు " .. " భోజనశాలకు " అన్నీ కూడా అత్యంత నాణ్యతతో నిర్మించబడ్డాయి. ఎప్పటికప్పుడు దాతల సహాయ సహకారాలతో అవసరం ఉన్నంతమేర ఆర్థిక వనరలను సమకూర్చుకుంటూ దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్నది పిరమిడ్ వ్యాలీ ! దేశ విదేశలకు చెందిన ఆధ్యాత్మిక గ్రంథరాజాలతో అలరారుతూన్న " గ్రంథాలయం " మరి ప్రముఖంగా నిలుస్తోంది.

 

పిరమిడ్ మాస్టర్ల సామూహిక ధ్యాన శక్తి యొక్క సంకల్ప శక్తికి ప్రత్యక్ష సాకారంగా నిలిచిన బెంగళూరు పిరమిడ్ వ్యాలీ నిర్మాణంలో పాలుపంచుకోవడం నా జన్మకు లభించిన అదృష్టంగా భావిస్తూ .. నేను చెయ్యవలసిన పనిని పూర్తి చేసే అవకాశాన్ని నాకు అందించిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గొప్ప యజ్ఞంలో తమ సహాయ సహకారాలను అందించిన " నా శ్రీమతి సుచిత్ర "కు మరి " నా ఇద్దరు కూతుళ్ళకు " నేను సర్వదా ఋణపడి ఉంటాను ! ఈ గొప్ప శక్తిక్షేత్రంలో నివస్తిస్తూ ఉండడం వల్ల వారు కూడా ఎంతో నేర్చుకుంటూ చక్కటి మానసిక పరిపక్వతనూ మరి దేహ ఆరోగ్యాన్నీ పొంది వారి వారి చదువుల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు ! తల్లిదండ్రులుగా ఇది మాకెంతో గర్వకారణం !

 

మారం: ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఎంతమంది మేనేజింగ్ ట్రస్టీలతో కలిసి పనిచేశారు?


ప్రసాద్ ప్రయాగ: పిరమిడ్ వ్యాలీకి ఛైర్మన్ బ్రహ్మర్షి పత్రీజీ, వైస్ ఛైర్మన్ " శ్రేయాన్స్ డాగా " గారు ! ఇక 2003 నుంచి 2007 వరకు పాల్ విజయ్ కుమార్‌ గారు, 2008 నుంచి 2010 వరకు I.V.రెడ్డి గారు, 2010 నుంచి 2012 వరకు P.చంద్రశేఖర్ గారు, 2013లో కొంతకాలం పాటు S.K.రాజన్ గారు మళ్ళీ ఇప్పుడు I.V.రెడ్డి గారు మేనేజింగ్ ట్రస్టీలుగా తమకు అప్పగించబడిన బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తూ వచ్చారు. వీరందరితో కలిసి నేను మొదట పిరమిడ్ ఇంజనీయర్‌గా .. మరి 2010 నుంచి ‘ ట్రస్టీ ’ గా కూడా నా బాధ్యతలను నిర్వహిస్తున్నాను. 2005 లో పరిమిత సంఖ్యతో కూడిన ధ్యానుల సమక్షంలో మొట్టమొదటిసారి బుద్ధపౌర్ణమి ఉత్సవాలను జరుపుకున్న పిరమిడ్ వ్యాలీ ఈ రోజుకి సర్వాంగ సుందరంగా పరిపూర్ణతను సంతరించుకుని ఇతర సంస్థల కార్యకలాపాలను కూడా వేదికగా నిలుస్తోంది.

 

ఇటీవల .. 2014 మే నెలలో జరిగిన " కర్ణాటక ధ్యానమహాచక్రం - ఏడు రోజుల " పాటు అద్భుతంగా సాగి .. రాబోయే బృహత్ యజ్ఞాలకు క్రొత్త వాకిళ్ళను తెరిచింది. రోజుకు సుమారు నాలుగైదు వేలమంది ఆ ప్రాంగణంలో కూర్చుని ప్రాతఃకాల అఖండ ధ్యానంలో పాల్గొని పత్రీజీ సందేశాలను వినడం .. అత్యద్భుతమైన దృశ్యం ! ఇక్కడ రోజువారీ జరిగే కార్యక్రమాలు, వర్క్‌షాపులు, హీలింగ్ సెషన్‌లూ, విద్యార్థులకూ మరి యువతకూ ప్రత్యేక శిక్షణా తరగతులు ఎందరెందరికో అద్భుతమైన విజ్ఞానాన్ని పంచుతున్నాయి. అద్భుతమైన గురువు .. మరి మెగా ధ్యాన పిరమిడ్‌ల యుగకర్త .. బ్రహ్మర్షి పత్రీజీ ఉద్యమంలో భాగస్వామినై నా జన్మ ధన్యం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

 

 

PSRK ప్రసాద్
బెంగళూరు

పిరమిడ్ వ్యాలీ ఇంటర్వ్యూ
సెల్: 08147093630

Go to top