" పిరమిడ్‍లతో ప్రయోగాలు "

 

నా పేరు దేవేంద్రబాబు. మద్రాసు రాష్ట్రంలో పుట్టిన నేను మా నాన్నగారి ఉద్యోగరీత్యా బోధన్‍లోని "షక్కర్‌నగర్"లోనే నా బాల్యం గడిపాను! ఆ రోజుల్లో మా నాన్న "నిజామ్ షుగర్‌ప్యాక్టరీ" లో ఫోర్‌మన్ గా పనిచేశారు. నేను నా ప్రాథమిక విద్యాభ్యాసం 1 నుంచి 5 వ తరగతి వరకు షక్కర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ నాటి ధ్యాన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీతో కలిసి చదువుకున్నాను! ఆ పై బోధన్‌లో 6,7 తరగతులు చదివి .. సికింద్రాబాద్‌కు మా మకాం మార్చాము.

 

తరువాత ఉద్యోగరీత్యా మద్రాసు, సికింద్రాబాద్‍లో పనిచేసి దాదాపు 51 సంవత్సరాల తరువాత "బోధన్ బోధిసత్వుడు" పుస్తకం చదివి "సుభాష్ పత్రీజీ" గురించి తెలుసుకున్నాను. వెంటనే అడ్రస్ వెతుక్కుంటూ వారి ఇంటికి వెళ్ళి .. వారిని కలిసి చిన్ననాటి విషయాలను ముచ్చటించుకున్నాము. నన్ను అప్యాయంగా ఆదరించి, కడుపు నిండా భోజనం పెట్టి నాకు ధ్యానం గురించి వారు చక్కగా వివరించారు.

 

ఇక అప్పటినుంచి పత్రీజీ కార్యక్రమాలకు విరివిగా హాజరు అవుతూ .. పిరమిడ్‌లతో ప్రయోగాలు చేస్తూ .. ఎన్నో గొప్ప ఫలితాలను పొందాను. "పళ్ళు, కూరగాయలు, విత్తనాలు వంటివి పిరమిడ్‌లో ఉంచినప్పుడు వాటి ఉత్పాదక శక్తి మరింత పెరుగుతుంది" అని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాను. ఇక తలనొప్పి మొదలుకుని గుండె జబ్బుల వరకు పిరమిడ్ శక్తి అన్నది ఆరోగ్యరంగంలో ఎంత స్వస్థతను కలుగజేస్తుందో అనేక ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది.

 

నేను గత 18 యేళ్ళుగా షుగర్, బి.పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి జబ్బులతో బాధపడుతూ అనేక మంది డాక్టర్లు దగ్గరకు తిరిగి .. లెక్కకు మించి మందులు వాడి పూర్తిగా విసిగిపోయాను. కేవలం పిరమిడ్‌లో ధ్యానం చేసి పై జబ్బులన్నింటి నుంచీ విముక్తి పొంది .. ఏ మందుల అవసరం లేకుండానే నా ఈ 68 సంవత్సరాల వయస్సులో కూడా హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాను. అందరూ నన్ను ఇప్పుడు "హ్యాపీ దేవా" అని పిలుస్తున్నారు! పిరమిడ్ శక్తి గురించి రకరకాల అధ్యయనాలు చేసిన నేను .. ప్రతి ఒక్కరూ పిరమిడ్‌లో ధ్యానం చేసి .. పిరమిడ్ శక్తి లాభాలను ఇతోధికంగా పొందాలని మనవి చేస్తున్నాను. తమ ధ్యాన-శాకాహార-పిరమిడ్ శక్తి ప్రచారాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత సంచలనాలను సృష్టిస్తూన్న నా చిన్ననాటి మిత్రులు బ్రహ్మర్షి పత్రీజీకి అభినందనలు తెలియజేసుకుంటూ ..

 

దేవేంద్రబాబు

సికింద్రాబాద్
మీ "హ్యాపీ దేవా"
సెల్: +91 99853 63339.

Go to top