" అమ్మకు ఆత్మీయ వీడ్కోలు "

 

నా పేరు ప్రసన్న. మా కుటుంబం గత మూడు సంవత్సరాలుగా ధ్యానమార్గంలో పయనిస్తూ, ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతున్నాము. ఈ క్రమంలో మా తల్లిగారైన శ్రీమతి వేదనాయకి గారు ఇటీవల తమ దేహత్యాగం గావించారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతోమందికి విద్యాదానం చేసి పదవీ విరమణ పొందిన మా అమ్మగారు మా ద్వారా "ఆనాపానసతి ధ్యానం" నేర్చుకుని, ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ, అనేక పుస్తకాలు చదువుతూ ఉండేవారు. తమ 73 ఏళ్ళ వయస్సులో కూడా ధ్యానప్రచారం చేస్తూ "తిరుచానూరు ధ్యానకేంద్రం"లో ఆమె ఎక్కువగా సంగీత కీర్తనలు పాడుతూ అందరినీ అలరించేవారు. మా అమ్మగారు ఎక్కువగా పత్రిసార్ ఆడియోలు వింటూ, వీడియోలు చూసేవారు. పత్రిసార్ మాటంటే ఆమెకు వేదవాక్కు. "నేను దేహత్యాగం చేసిన తరువాత నా వీడ్కోలు పత్రీజీ చెప్పినట్లు ధ్యాన పద్ధతిలోనే చేయండి; అర్థం పర్థం లేని కర్మకాండలు ఎంతమాత్రం చేయవద్దు" అని తరచూ మాకు చెప్పేవారు.

 

ఎలాంటి ఇబ్బంది పడకుండా అమ్మ 2013 డిసెంబర్ 8వ తేదీన తన భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిన తరువాత, ఆమె కోరిక మేరకు మేము ఎలాంటి కర్మకాండలు చేయలేదు. పదవరోజూ బంధువులనూ, పిరమిడ్ మాస్టర్స్‌నూ ఆహ్వానించి .. మా అమ్మగారి ఫోటో ముందు ఒక గంట ధ్యానం చేసి, ఆమెతో మా ధ్యానానుభవాలను పంచుకుని .. మా అమ్మగారు తన డైరీలో వ్రాసుకున్న ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక అంశాలనూ మరి కొన్ని నవ్వించే జోకులనూ అందరికీ చదివి వినిపించాము. చివరిగా మరోసారి ధ్యానం చేసి చక్కటి విందును ఆరగించి .. తన నిజలోకాలకు తరలి వెళ్ళిన అమ్మ మరణాన్ని ఒక ఉత్సవంలా ఆనందంగా జరుపుకుని ఆమెకు ఆత్మీయవీడ్కోలు ఇచ్చాం ! ఇలా మా అమ్మగారి చివరి కోరికను తీర్చడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ ప్రయత్నం నాకు సహకరించిన మా బంధుమిత్రులకూ .. మరి తిరుచానూరు, తిరుపతి ధ్యానమిత్రులకూ నా ధన్యవాదాలు.

 

 

 

 

Dr. G.B. ప్రసన్న

తిరుపతి
సెల్: +91 9885400709

Go to top