" నా కూతురికి .. బిడ్డగా .. మళ్ళీ "

 

 

నా పేరు జ్యోతి భవాని. నేను వైజాగ్ పిరమిడ్ మాస్టర్ గీతా సత్యవతి గారి ద్వారా 2000 సంవత్సరంలో ధ్యానం నేర్చుకున్నాను. "ధ్యానం వల్ల జీవితం ఆనందమయంగా మారుతుంది" అని తెలుసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టిన మొదటి సిట్టింగ్‌లోనే అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా విశేషమైన కాంతి తరంగాలు నన్ను ముంచెత్తుతూ ఉన్నట్లూ, నా సూక్ష్మశరీరం బయటికి వచ్చి నేను ఏవేవో లోకాలు తిరుగుతూ ఉన్నట్లూ అనుభూతి చెందాను. ధ్యానంలో ఎవరెవరో ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి నాకు అనేకానేక విశేషాలను తెలియజేస్తూ .. నాకు అమృతం త్రాగించారు.

 

ఇలా రోజుకు 3 నుంచి 5 గంటలు చొప్పున రాత్రిళ్ళు ధ్యానం చేస్తూ అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన అనుభవాలను పొందాను! ఆ తరువాత క్రమంలో నేను "పీటర్ రిఛెలూ"గారి "ఆత్మాయణం" పుస్తకంలో వివరించబడి ఉన్న లోకాలూ, అక్కడ చెప్పిన సత్యాలూ చదివి .. "ధ్యానం చేయడం మొదలుపెట్టిన తొలినాళ్ళల్లోనే నేను పొందిన అనుభవాలన్నీ నిజమే"అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నిరంతరం ధ్యానం చేస్తూ అందరికీ ధ్యానం గురించి తెలియజేస్తూ నా సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టాను.

 

ఈ మధ్య ఇంజనీరింగ్ చదివిన నా కుమారుడు అకస్మాత్‌గా తన శరీరాన్ని వదిలి ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. నాతో ఎంతో క్లోజ్‌గా ఒక ఫ్రెండ్‌లాగే ఉండే నా బాబు అలా నన్ను వదిలివెళ్ళిపోవడం నాకు చాలా బాధ కలిగించినా .. ఆ తరువాత వాడు నాకు ధ్యానంలో కనిపించి .. నన్ను ఓదార్చి .. "నేను భూమి కంటే కూడా ఉన్నతమైన తలంలో ఒక అధికారి దగ్గర ఆనందంగా ఉన్నాను; నా గురించి నువ్వు ఎంత మాత్రం బాధపడకుండా నీ జీవిత లక్ష్యం గురించి ప్రశాంతంగా సాధన చేసుకో" అని చెప్పాడు!

 

ఆ మాటలతో నాలో ఏదో తెలియని శక్తి వచ్చి .. వాడు వెళ్ళిన 18వ రోజునే "మండల ధ్యాన తరగతులు" రూపకల్పన చేసుకుని ధ్యానప్రచారం ముమ్మరం చేశాను. ఈ క్రమంలో నా అనుభవాలన్నీ శ్రద్ధగా విన్న గురువు పత్రీజీ నన్ను 2014 సార్వత్రిక ఎన్నికలలో "పిరమిడ్ పార్టీ" తరపున విశాఖపట్టణం నియోజక వర్గానికి MP గా నిలబడమని ఆదేశించడం .. మరి నేను దానిని శిరసావహించి నియోజకవర్గం పరిధిలో మరింత ముమ్మరంగా ధ్యానశాకాహార ప్రచారాలను నిర్వహించడం జరిగింది!

 

ప్రచార కాలంలో రాత్రిళ్ళు ధ్యానం చేసుకుంటూ పగలు ఇంటి పనులు చక్కబెట్టుకుని .. ధ్యాన ప్రచారంలో తలమునకలై తిరుగుతూ ఎక్కడా ఏదీ బేలన్స్ తప్పకుండా పరిపూర్ణ జీవితాన్ని జీవించాను. ఈ క్రమంలో ఉన్నత లోకాలకు చెందిన ఆస్ట్రల్ మాస్టర్స్ నన్ను ఒక పసిబిడ్డలా చూసుకుంటూ నాకు తమ అనంతమైన ప్రేమను పంచి .. తమ శిక్షణలో అజేయశరీరుడిలా మారిన నా కొడుకును "నా కూతురికి బిడ్డ"గా మళ్ళీ మాకు అందించారు! ధ్యానయజ్ఞ నిర్వహణ ద్వారా ఇంత గొప్ప ధ్యానామృతాన్ని మాకు పంచిన బ్రహ్మర్షి పత్రీజీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాలాగే ఈ జగతి అంతా కూడా ధ్యాన శక్తితో కూడిన శాంతి, ప్రేమ, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని త్రికరణశుద్ధిగా కోరుకుంటూ ..

 

 

దాడి జ్యోతి భవాని

విశాఖపట్టణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మీ జ్యోతి భవాని

+91 92484 05682

Go to top