" ఒక మామూలు గృహిణిని .. సంపూర్ణ ఆత్మజ్ఞానిలా ఎదిగాను "

 

 

నా పేరు లక్ష్మి. 2007, సెప్టెంబర్ 6వ తేదీన ఒకానొక ధ్యానయజ్ఞం నిర్వహణకు గాను "మాచవరం" వచ్చిన పత్రీజీ .. మా వారు P.అమ్మిరెడ్డి గారి అభ్యర్థన మేరకు మా ఇంటికి విచ్చేశారు. ధ్యానం గురించి అప్పుడు వారు వివరించినా .. విని ఊరుకున్నానే తప్ప ధ్యానం చేయలేదు! కానీ ఆ తరువాత కొన్ని రోజులకే వైజాగ్ పిరమిడ్ మాస్టర్ వీరజగదీశ్వరీ దేవి గారు వచ్చి ధ్యానం గురించి వివరించగానే .. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను.

 

గత కొన్ని సంవత్సరాలుగా వెన్నుపూసనొప్పి, బి.పి., గుండెజబ్బు, మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ లక్షల రూపాయల మందులు వాడి విసిగిపోయిన నేను ధ్యానం మొదలుపెట్టిన మూడు నెలల్లోనే నా అన్ని జబ్బుల నుంచి దాదాపు విముక్తి చెందాను. ధ్యానంలో ఆనందాన్ని స్వయంగా రుచిచూస్తూ .. దానిని మరింత మందికి అందించాలన్న తపనతో మా వారితో కలిసి మాచవరం చుట్టుప్రక్కల ఉన్న 13 గ్రామాల్లో ధ్యానప్రచారాలను విస్తృతం చేశాం. అప్పటివరకు ఒక గృహిణిగా కేవలం ఇంటి బాధ్యతలకే పరిమితమై జీవిస్తూన్న నేను .. నాకు తెలిసిన ఈ దైవ విద్యను వేలాది మందికి అందించి వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తెచ్చుకునేలా చేసి .. నా జీవితాన్ని ధన్యత నొందించుకున్నాను. ధ్యాన ప్రచారంలో భాగంగా ఆ యా ఊళ్ళకు మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు పొందిన ఫలితాలను వివరిస్తూంటే నాకు ఎంతో ఆత్మానందం కలిగేది. ధ్యానమే మందులుగా, ధ్యానప్రచారమే చికిత్సగా బ్రహ్మానందాన్ని పొందుతూ మా స్వగృహం పై 11X11 పిరమిడ్ నిర్మాణం చేశాం.

 

2011, జూన్ 13 వతేదీన బ్రహ్మర్షి పత్రీజీ విచ్చేసి .. "జీసస్ పిరమిడ్ ధ్యానమందిరం"గా దానికి నామకరణం చేశారు. అప్పటి నుంచి మా పిరమిడ్‌లో "పౌర్ణమి ధ్యానం", ప్రతి సోమవారం 3 గం||లకు అఖండ ధ్యానం, ప్రతిరోజూ ప్రాతఃకాలం 4.00 గం||ల నుంచి సాయంత్రం 6.00 గం||ల వరకు సామూహిక ధ్యానం కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. వ్యాపార నిర్వహణ పరంగా ఎంతో బిజీగా ఉండే మా వారు కొన్నిసార్లు ధ్యానప్రచారానికి నా వెంట రాలేకపోయినా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ నాకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు. అంతకు ముందు ఎంతో భయస్థురాలిగా వుండే నేను ధ్యానప్రచారం వల్ల అందరితో కలివిడిగా తిరుగుతూ, వారి మన్ననలను పొందాను.

 

ఒక మామూలు గృహిణిని అయిన నేను ఇలా ఒక అద్భుతమైన మాస్టర్‌గా "ఆత్మప్రగతి మార్గం"లో ముందుకు పయనిస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి ముఖ్య కారకులు అయిన నా గురువు బ్రహ్మర్షి పత్రీజీ కీ .. మరి నా భర్త P.అమ్మిరెడ్డి గార్లకూ సర్వదా కృతజ్ఞురాలిని!

 

మా వారు .. P.అమ్మిరెడ్డి గారు .. గత 30 సంవత్సరాలుగా కీళ్ళ నొప్పులు మరి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతూ ఎంతో ఆందోళనతో మనశ్శాంతి కరువై ఉండేవారు; ఆర్థికపరంగా మంచి ఉన్నత స్థితిలో ఉన్నా అనారోగ్యపరంగా బాధపడుతూ భయం భయంగా ఉండేవారు. ధ్యానం ప్రారంభించిన కొన్నాళ్ళకే తమ జబ్బులకు గల గత జన్మకర్మ కారణాలను తెలుసుకుని వాటి నివారణకు ధ్యానం ధ్యానప్రచారమే మంచి మార్గంగా వారు తెలుసుకున్నారు!

 

ధ్యానం పట్ల దృఢ విశ్వాసంతో ఉంటూ వ్యాపార పరంగా తమ వద్దకు వచ్చే వాళ్ళకు ధ్యానసమాచార పత్రాలనూ, "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రికలనూ పంచి పెడుతూ చక్కటి స్వాధ్యాయ విస్తరణ చేశారు. నిరంతరం కర్తవ్యనిర్వహణలోనే గడిపిన మా వారు .. శ్రీ అమ్మిరెడ్డి గారు .. 2014 జూన్ 18వ తేదీన తమ భౌతిక శరీరాన్ని వదిలేసి ఉన్నతలోకాలకు తరలివెళ్ళిపోయారు! వారి ప్రేమపూర్వక సహకారంతో ఒక సంపూర్ణ ఆత్మజ్ఞానిలా ఎదిగిన నేను .. ప్రపంచమంతా ధ్యానం, శాకాహారం మరి పిరమిడ్ శక్తి యొక్క గొప్పదనాన్ని తెలుసుకునేలా నా వంతు కృషిచేస్తానని నా గురువు పత్రీజీకి విన్నవించుకుంటున్నాను.

 

P.లక్ష్మి

మాచవరం

తూర్పుగోదావరి జిల్లా
+91 99496 18477

Go to top