" ఆనాడూ .. ఈనాడూ .. అదే ఆత్మీయత "

 

 

నా పేరు రామ్‌చందర్. నేను "కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లిమిటిడ్" కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా 2004 లో పదవీ విరమణ పొందాను. గతంలో పత్రీజీ అదే కంపెనీలో రీజియనల్ సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేసినప్పుడు నేను వారితో కూడా పనిచేశాను. అప్పట్లో సహోద్యోగులుగా వారు మాతో అనేక ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటిస్తూ "పిరమిడ్ శక్తి" గురించి విశేషంగా చెప్తున్నా .. మరి ధ్యానం గురించి, ధ్యానశక్తి గురించి వివరించినా .. మేము ఏదీ పట్టించుకోలేదు. ఆ తరువాత వారు 1992లో తమ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ధ్యాన ప్రచారానికే అంకితం చేశారని తెలిసింది!

 

ఆ తరువాత వారి కోసం ఎంత ప్రయత్నం చేసినా నేను వారిని కలవలేకపోయాను. 2011లో ఒకసారి సికింద్రాబాద్ అల్వాల్‌లో వారి ధ్యానశిక్షణా కార్యక్రమం ఉందని తెలుసుకుని వెళ్ళి వారిని కలిసాను. వారి స్నేహపూర్వకమైన ప్రవర్తనలో ఆనాటికీ, ఈనాటికీ అదే తీరు! ఎంత మాత్రం తేడా లేకుండా .. నన్ను ఎంతో ఆత్మీయంగా పలుకరించారు! వందలాది మంది హాజరైన ఆ కార్యక్రమంలో వారు వివరించిన ధ్యాన విశిష్ఠత, శాకాహార ప్రాముఖ్యత, పిరమిడ్ శక్తి .. లోగడ విన్నవే అయినా మళ్ళీ సరిక్రొత్తగా విని వారి సమక్షంలో ధ్యానం చేసి ఆత్మానందాన్ని పొందాను. ఆ రోజు నుంచి మాంసాహారం వదిలి వేసి, ధ్యానం చేస్తూ, అనేక పిరమిడ్ ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం మొదలుపెట్టాను.

 

ఈ క్రమంలో ఒకరోజు నేను మేడ మెట్ల మీద నుంచి దిగుతూ క్రింద పడిపోయాను. కాలు మెలి తిరిగిపోయి అడుగు వేయలేని పరిస్థితిలో కూడా నేను ధ్యానశక్తినే నమ్ముకుని ఏ మందులూ వాడకుండా ఆపరేషన్ వంటివి లేకుండా కేవలం ధ్యానశక్తితో ఉపశమనం పొందాను. గతంలో "ఆర్ట్ ఆఫ్ లివింగ్"లో చేరి ఏడు సంవత్సరాల పాటు నేను వారి బోధనలు విన్నాను. ఇక పత్రీజీకి కలిసిన వెంటనే ధ్యానం మొదలుపెట్టి ధ్యానప్రచారం మొదలుపెట్టాను. సికింద్రాబాద్ లోని రామకృష్ణాపురం శ్రీ N.S.రావు గారి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ పిరమిడ్ శక్తిపై నేను కూడా ప్రయోగాలు చేశాను. "కేప్ పిరమిడ్" లో టమోటాలు, బ్లేడ్‌లు ఉంచి పరీక్షించి సత్ఫలితాలను పొందాను.

 

బెంగళూరు, కడ్తాల్, కొల్హాపూర్, కర్నూల్ పిరమిడ్‌లను సందర్శించి వాటిల్లో ధ్యానం చేసి మా ఇంటి పై కూడా పిరమిడ్ నిర్మాణానికి సంకల్పం చేసుకున్నాను. 2013లో పిరమిడ్ నిర్మాణం పూర్తి చేసి అందులో ప్రతి ఆదివారం సాయంత్రం 6గం||ల నుంచి 8గం||ల వరకు ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తరువాత నా చిరకాల మిత్రులు, నా సహోద్యోగి అయిన పత్రీజీని మళ్ళీ కలిసినందుకు సంతోషిస్తూ జగత్ కల్యాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి తమ జన్మను పరిపూర్ణం చేసుకుంటున్నందుకు వారిని అభినందిస్తున్నాను. వారు స్థాపించిన "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్" ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో ధ్యానవెలుగులు నింపుతున్నందుకు ఆనందిస్తున్నాను!!

 

 

 

S.K. రామ్‍చందర్

సికింద్రాబాద్
సెల్: +91 98852 99300

Go to top