" ధ్యాన పుష్కరిణి "

 

 

నా పేరు శ్రీరాములు. నల్గొండ జిల్లా "భూదాన్ పోచంపల్లి" గ్రామానికి చెందిన నేను ప్రస్తుతం వ్యాపారరీత్యా హైదరాబాద్, కొత్తపేటలో నివాసం ఉంటున్నాను. 2003లో ఒక స్నేహితుని ద్వారా ధ్యాన పరిచయాన్ని పొందిన నేను పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో పోచంపల్లి మరి హైదరాబాద్‌లలో అనేక ధ్యానయజ్ఞాలను నిర్వహించడం జరిగింది. నిరంతర ధ్యానసాధన ద్వారా ఎన్నెన్నో ధ్యాన ఫలితాలను పొందుతూ నా జన్మను ధన్యం చేసుకుంటున్నాను.

 

ఈ క్రమంలో ఇటీవల వ్యాపార విస్తరణ నిమిత్తం నేను హైదరాబాద్ శివార్లలో పది ఎకరాల భూమిని కొని చదునుచేయిస్తూండగా .. వినాయకుడు మరి నాగేంద్రుని రూపాలను పోలిన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ ప్రదేశంలో నా మిత్రులు రాజేశ్వర శర్మగారితో కూర్చుని ధ్యానం చేయగా .. అక్కడ ఒక ధ్యానమందిరం నిర్మించమని సూర్యభగవానుని ఆదేశం వినిపించింది!

 

వెంటనే 6-01-2014 రథసప్తమి రోజు ధ్యాన మందిరం నిర్మాణం మొదలు పెట్టి .. పనులు వేగవంతం చేశాము. ప్రతిరోజూ ఆ ప్రదేశంలో మేం ధ్యానం చేయడం .. పని వాళ్ళతో కూడా ధ్యానం చేయించడం చేసేవాళ్ళం! ఈ క్రమంలో ఒకరోజు ఆ ప్రదేశంలో పెద్ద "పుష్కరిణి" కూడా ఏర్పడి ఉన్నట్లు కలలో నాకు అద్భుతమైన విజన్ రావడం .. మరి కలలోనే సూర్యభగవానుడు నన్ను తీసుకువెళ్ళి నాకు పుష్కరిణిని చూపించడం జరిగింది! మెలకువ రాగానే కూర్చుని ధ్యానం చేసుకుని కలలో నాకు కనిపించిన ప్రదేశానికి వెళ్ళి త్రవ్వించగా కేవలం నాలుగు అడుగుల లోతులోనే తియ్యటి కొబ్బరి నీళ్ళ రుచిని కలిగిన మినరల్ వాటర్ లాంటి స్వచ్ఛమైన నీటి ప్రవాహం గంగలా బయటికి వచ్చింది! రోజురోజుకూ ఆ పుష్కరిణి నీళ్ళతో నిండి పోవడంతో చుట్టు ప్రక్కల ప్రజలు ఆ మహత్యాన్ని కళ్ళారా చూడడానికి జాతరలాగా విచ్చేస్తున్నారు!

 

2014 జూలై 5 వ తేదీ పత్రీజీ పుష్కరిణి దగ్గరకు విచ్చేసి .. పుష్కరిణిని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన వారందరితో ధ్యానం చేయించారు. "ఉత్తరోత్తరా ఒక మహా ధ్యాన అభ్యాస క్షేత్రం ఈ పవిత్ర తీర్థంలో వెలుస్తుంది .. మరి అసంఖ్యాకంగా ప్రజలు విచ్చేసి ఇక్కడ ధ్యానగంగనూ, ఆత్మజ్ఞానగంగనూ గ్రోలి తరిస్తారు" అని పత్రీజీ భవిష్యవాణి పలికారు! గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్ మరి వార్డు మెంబర్లంతా ఆ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా శ్వాస, నా ధ్యాస, నా జపం, జీవం అన్నీ నాకు పత్రీజీనే! వారిని నా హృదయంలో నిలుపుకునే నేను ప్రతి పని చేస్తుంటాను. వారికి నా కృతజ్ఞతాభివందనాలు!!

 

 

ధ్యానమైన శ్రీరాములు

కొత్తపేట

హైదరాబాద్
సెల్: +91 95055 88833

Go to top