" మాది ధ్యాన - శాకాహార కుటుంబం "

 

 

నా పేరు విశ్వరూపాచారి. నేను బేతంచర్ల కరెంట్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నప్పుడు నాతో పాటు పనిచేసే నా స్నేహితుడు K.శ్రీనివాసులు ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను. డిసెంబర్ 2000 సంవత్సరంలో కర్నూలు ధ్యానయజ్ఞం లో పాల్గొని పత్రీజీని కలిసి వారి సమక్షంలో ధ్యానం చేసాం. ఇక అప్పటి నుంచి మా కుటుంబ సభ్యులం అందరం ప్రతి సంవత్సరం జరిగే ధ్యానమహాయజ్ఞాల్లో, ధ్యానమహాచక్రాల్లో పాల్గొంటూ "ధ్యానశాకాహార కుటుంబం"గా చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం!

 

డోన్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ మరి కర్నూలు పిరమిడ్ మాస్టర్ హరికుమార్ గార్ల ఆధ్వర్యంలో 41 వారాల ధ్యానతరగతులను ఏర్పాటు చేసి మా గ్రామంలో ఎంతో మందికి ధ్యానపరిచయం చేశాం. బేతంచర్ల భువనేశ్వర్ రాజు గారి సహకారంతో మా ఇంటిపై 12'X12' పిరమిడ్ మరి చక్కటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. వీటి నిర్మాణాలకు వైజాగ్ ప్రసాద్ గారు రూపకల్పన చేయడం జరిగింది.

 

నా భార్య పద్మావతమ్మకు ధ్యానంలో వచ్చిన సందేశం ఆధారంగా మా పిరమిడ్‌కు "వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానమందిరం" అని నామకరణం చేసుకోవడం జరిగింది. 7-03-2012 న పత్రీజీ ఆశీస్సులతో మా చిన్న కుమారుడి వివాహం సందర్భంగా .. మా పిరమిడ్ ప్రారంభోత్సవాన్ని కర్నూలు సీనియర్ మోస్ట్ మాస్టర్స్ శ్రీ/శ్రీమతి ఆంజనేయశర్మ దంపతుల చేతుల మీదుగా జరిపించుకున్నాం! వారికి మా కృతజ్ఞతలు!

 

పిరమిడ్ ప్రక్కనే ఉన్న మా గ్రామ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు క్రమం తప్పకుండా వచ్చి చక్కగా పిరమిడ్‌లో ధ్యానం చేసుకుని, లైబ్రెరీలో వున్న నవీన ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి శాస్త్రీయమైన మరి విజ్ఞానదాయకమైన ధ్యాన సమాచారాన్ని పొందుతున్నారు. విద్యార్థుల ప్రవర్తనలో కూడా ఆశాజనకమైన మార్పువస్తోందని ఉపాధ్యాయులు చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో 2014, జూలై 13 వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీ మా గ్రామానికి విచ్చేసి పిరమిడ్‌ను, గ్రంథాలయాన్ని సందర్శించి గ్రామస్థులందరితో ధ్యానం చేయించారు! ధ్యానజ్ఞాన ప్రచారావకాశాల ద్వారా మా జన్మలను ధన్యం చేస్తూన్న పత్రీజీకి ధన్యవాదాలు!

 

నా పేరు పద్మావతి. నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా వున్నాను. నాకు ప్రతిరోజూ ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తూంటాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు పాము రూపంలో వచ్చి మా ఇల్లంతా తిరిగి వెళ్ళినట్లు అతి స్పష్టమైన ధ్యానానుభవాన్ని నేను పొందాను. ఎన్నోసార్లు నా సూక్ష్మశరీరం బయటికి వచ్చి తిరగడం గమనించాను. "నా ఆఖరి శ్వాస వదిలేవరకు ధ్యానం .. ధ్యాన ప్రచారమే నా జీవిత లక్ష్యం" అని గురువు గారికి మనవి చేసుకున్నాను.

 

నా పేరు తిమ్మయాచారి. మా తల్లితండ్రుల ద్వారా ధ్యానపరిచయాన్ని పొందిన నేను .. మొదటిసారి ధ్యానంలో కూర్చోగానే ఎన్నడూ చూడని విధంగా అందమైన ప్రకృతి దృశ్యాలు మరి ప్రకృతిలోని వివిధ జీవరాశులు నాకు దర్శనం ఇచ్చాయి. 2009 శ్రీశైలం ధ్యానయజ్ఞంలో పాల్గొన్నప్పుడు .. ప్రాతఃకాల ధ్యానంలో ఏడు పడగల పాము నాలో చేరి పదినిమిషాల పాటు నాతో నాట్యం చేయించిన అనుభూతి పొందాను. ధ్యానం వల్ల నాకు కలిగిన మరొక గొప్ప వరం .. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడే ఆమె గర్భంలో ఉన్న బాబును నేను చూసుకున్నాను! ఆ అనుభవం నా జీవితంలో మరచిపోలేనిది! మా ఇంటిపై నిర్మించిన పిరమిడ్‌లో గ్రామప్రజలు వచ్చి ధ్యానం చేసుకుని తమ తమ దీర్ఘకాలిక జబ్బుల నుంచి విముక్తి పొందుతున్నారు. శాకాహారం యొక్క ఉపయోగం తెలుసుకుని .. చాలా మంది శాకాహారులుగా మారడం జరిగింది. స్వాధ్యాయ యజ్ఞంలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 7:30 గం||ల నుంచి 8:30 గం||ల వరకు ధ్యానం తరువాత .. ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదివి గ్రామస్థులందరికీ వినిపించి .. వాళ్ళకు చక్కటి జ్ఞానబోధ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన పత్రీజీకి కృతజ్ఞతలు.

 

 

విశ్వరూపాచారి K.కొత్తపల్లి

బేతంచర్ల మండలం
కర్నూలు జిల్లా

Go to top