" నా బహుముఖ ప్రజ్ఞత్వానికి కారణం - నా ధ్యానశక్తి "

 

సీనియర్ పిరమిడ్ ధ్యానయోగి, బాధ్యతాయుతమైన గృహిణి మరి ఉన్నత విద్యావంతురాలు అయిన శ్రీమతి గాయత్రి .. రాజకీయ రంగంలో కూడా తమ సత్తా చాటుకుంటూ కర్నూలు జిల్లా డోన్ పట్టణ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం .. పిరమిడ్ ధ్యాన ప్రపంచానికే గర్వకారణం! ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి .. చదువు, క్రీడలు, వ్యాయామం, కళలు, ధ్యానం .. వంటి గొప్ప అంశాలను మేళవించిన అధునాతన విద్యావిధానాన్ని పిల్లలకు అందించే హైస్కూల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా మరి డోన్ పట్టణ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా తమ పదవీ బాధ్యతలను ఏకకాలంలో నిర్వహిస్తూ అందరిచే "శహభాష్" అనిపించుకుంటున్నారు. ధ్యానశక్తితో తమ జీవితంలో సాధించిన ఘనవిజయాలను ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులతో పంచుకుంటూన్న ఈ గుణాధికురాలికి విశేష అభినందనలు తెలియజేసుకుంటూ ..

మారం శివప్రసాద్, +91 93472 42373


మారం: డోన్ పట్టణానికి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు కంగ్రాచ్యులేషన్స్ మేడమ్! మీ గురించి తెలియజేయండి!


గాయత్రి: "శ్వాస మీద ధ్యాస" ధ్యానవిద్యను ప్రపంచానికి అందిస్తూన్న పత్రీజీకీ .. మరి ధ్యానప్రచారం ద్వారా తమతమ జీవితాలను ధన్యం చేసుకుంటూన్న పిరమిడ్ మాస్టర్లకూ .. అందరికీ నా కృతజ్ఞతలు! "మదనపల్లె పిరమిడ్ మాస్టర్"ను అయిన నేను కాలేజీ టాపర్‌గా B,Sc., MCA పూర్తి చేశాను. మా అమ్మ G.సూర్యకుమారి B.Sc.,(Ag) చేశారు .. మరి మా నాన్న G.సుధాకర్ గారు M.A. పూర్తి చేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

 

మా అన్నయ్య లోకేష్ IIT లో Aeronatical Engineering మరి USA లో MS పూర్తి చేసి .. అమెరికాలో స్థిరపడ్డాడు. మరి ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్‌గా అక్కడ ధ్యానప్రచారం చేస్తున్నాడు. మా తమ్ముడు మహేష్ కుమార్ B.Tech, IIT లో MBA పూర్తిచేసి చక్కటి ఉద్యోగంలో స్థిరపడ్డాడు! మేము మా అమ్మగారి ద్వారా ప్రప్రధమంగా "ఆనాపానసతి"ధ్యానం నేర్చుకున్నాం! 1998 లో చిత్తూరు జిల్లా, మదనపల్లెలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ "డాక్టర్ యుగంధర్" మరి "యోగానంద"గార్ల ధ్యానం క్లాసుకు హాజరయిన నేను ధ్యానం గురించి వారు వివరించిన శాస్త్రీయమైన విషయాలను ఆసక్తిగా విని .. వాటిని స్వయంగా అనుభూతి చెందాలని ధ్యానం అభ్యాసం ఖచ్చితంగా చెయ్యడం మొదలుపెట్టాను.

 

శాకాహారుల కుటుంబంలో పుట్టిన నేను ధ్యానశక్తితో అతి తొందరగా సమన్వయం చెందుతూ .. ఎన్నో సంవత్సరాలు నన్ను వేధిస్తూన్న మైగ్రేన్ తలనొప్పి బారి నుంచి బయటపడ్డాను. నా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను "ఆస్ట్రల్ విజన్స్"గా చూసుకుంటూ .. "ఆస్ట్రల్ యాత్రలు" చేస్తూ ఎన్నెన్నో లోకాలకు చెందిన విశేషాలను అధ్యయనం చేసేదాన్ని! పిరమిడ్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొని, పత్రీజీ దగ్గర ఎన్నో విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేదాన్ని!

 

మారం: చాలా బాగుంది! విద్యాధికుల కుటుంబంలో పుట్టిన మీరు వ్యాపారరంగంలో ఉన్న "ఫణిరాజ్" గారిని వివాహం చేసుకోవడంలోని నేపధ్యం వివరిస్తారా?!


గాయత్రి: చిన్నప్పటి నుంచి కూడా "జీవితంలో ఏదో ఒకటి .. విభిన్నమైనది సాధించాలి" అన్న తపన నాకు ఉండేది. ధ్యానంలోకి వచ్చాక ఆ తపన మరింత తీవ్రమై .. సాధించాల్సిన లక్ష్యానికి ఒక రూపకల్పన నేను చేసుకోగలిగాను. పిల్లలకు ఒక చక్కటి విద్యావిధానాన్ని అందించాలన్న లక్ష్యంతో చదువుతో పాటు ధ్యానం, సంగీతం, నృత్యం, వ్యాయామం, క్రీడలు మరి కరాటే వంటి ప్రత్యేక విద్యలను వారికి అందించి .. వారిని ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దడానికి చక్కటి ప్రణాళికలు వేసుకున్నాను. అయితే "నేను ఉద్యోగం చేసుకుంటూ మరొక ఉద్యోగస్థుడిని పెళ్ళి చేసుకుంటే నా ఆశయాల పరిధుల మేరకు నా ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి అనేక సంవత్సరాలు పడుతుంది" అని నాకు అనిపించింది! "అందుకే శరీరంలో ఓపిక ఉన్నప్పుడే ఇవన్నీ సంపూర్ణంగా చేసెయ్యాలి" అని ధ్యానంలో వచ్చిన నా అంతరంగ ప్రేరణను అనుసరించి .. డోన్ పట్టణానికి చెందిన సంపన్నులు, వ్యాపారవేత్త మరి నాలాగే ఉదాత్త భావాలను కలిగి ఉన్న పట్టభద్రులు K.V.ఫణిరాజ్ గారిని నాకు భర్తగా ఎంచుకున్నాను. 2002 డిసెంబర్ 15న మా వివాహం జరిగింది. మాకు ఇద్దరు అమ్మాయిలు; పెద్దమ్మాయి "వైష్ణవి"కి 9 సంవత్సరాలు, చిన్నమ్మాయి "మాన్యత"కు 5 సంవత్సరాలు.

 

మారం: మీ చిన్నమ్మాయి "మాన్యత"ను ప్రాణాంతకమైన జబ్బు నుంచి మీరు కాపాడుకున్నారని తెలిసింది .. ఆ వివరాలు ..?!


గాయత్రి: 2011 సంవత్సరంలో .. "మాన్యత" రెండేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు .. Primitive Neuro Ectodermal Tumor అనే ప్రాణాంతకమైన జబ్బు బారిన పడింది. రెండు కాళ్ళు చేతులు పాక్షికంగా పక్షవాతం బారిన పడడంతో పాప చిన్న గ్లాసును కూడా స్థిరంగా పట్టుకోలేక పోయేది. దాదాపు మూడు సంవత్సరాల పాటు బెంగళూరులోనే ఉండి అత్యాధునిక చికిత్సలు చేయించాము. ఈ క్రమంలోనే నేను పాపను తీసుకుని బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి "మెగా పిరమిడ్ కింగ్స్ ఛేంబర్" లో కూర్చుని ధ్యానం చేసేదాన్ని! మూడుసార్లు మూడు రాత్రులు పాటు పిరమిడ్‌లోనే అఖండ ధ్యానంలో గడపడం జరిగింది. పత్రీజీ వ్యాలీలో ఉన్నప్పుడల్లా వెళ్ళి వారిని కలవడం .. వారెంతో ధైర్యం చెప్పడం .. నన్ను మానసికంగా ఎంతో ఉన్నతురాలిని చేసింది. సందర్భోచితమైన వారి కర్తవ్యపూరిత సందేశాలే మమ్మల్ని కార్యోన్ముఖులను చేసి .. మేము మా పాపను కాపాడుకునేట్లు చేశాయి. సమస్యపట్ల భయాన్ని విడిచి స్థిమితంగా ఆలోచిస్తూ ధైర్యంతో దానిని ఎదుర్కోవడానికి పత్రీజీ అందించిన ప్రేమపూర్వకమైన తోడ్పాటు ఎంతో విలువైంది! Healing music ను play చేస్తూ నేను పాప ప్రక్కన కూర్చుని రాత్రంతా ధ్యానం చేసేదాన్ని! Visualization Techniques ఉపయోగిస్తూ పాపను చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం! దాదాపు మూడు సంవత్సరాలపాటు నేను చేసిన ఈ "స్వస్థతా ధ్యానయజ్ఞం"లో నాతో పాటు నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు నా భర్త అందించిన సంపూర్ణ సహకారం .. మరి అన్నింటినీ మించి ధ్యానశక్తి .. ఎంతో గొప్పది. ఆరోగ్యం పై ధ్యానశక్తి ప్రభావం శాస్త్రీయంగా ప్రయోగించబడుతూ వైద్యరంగానికి ఒక ఆశావహ చికిత్సావిధానంగా రూపుదిద్దుకుంటూన్న ఈ తరుణంలో .. స్వీయ అనుభవం ద్వారా దానిని పరీక్షించి మరీ సత్ఫలితాలను పొందిన మేము సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మా పాపను తిరిగి పొందడం ఒక అద్భుతం! ఇప్పుడు మా అమ్మాయి డోన్‌లో మా స్కూల్లోనే ఒకటవ తరగతి చదువుకుంటూ చక్కగా ఆట-పాటల్లో పాల్గొంటూ .. ఏకసంథాగ్రాహిగా చదువులో తన ప్రతిభను ప్రదర్శిస్తోంది! ధ్యానం వలన కలిగే లాభాలను మనందరం అందుకునేట్లు చేస్తూన్న పత్రీజీ చరితార్థులు! వారి శిక్షణలో మనం అందరం స్థితప్రజ్ఞులుగా మారి సకల సమస్యల పట్ల సరియైన దృక్పథంతో వ్యవహరించగలిగే నిబ్బరాన్ని పొందగలుగుతున్నాం!

 

మారం: మీరు తీర్చిదిద్దుతూన్న "ONERIO స్కూలు" గురించి వివరించండి ..


గాయత్రి: "ONERIO" స్కూలు అంటే "DREAM" .. కల"! నా కలలకు ప్రతిరూపం అయిన "ONERIO SCHOOL" పేరును నేను గ్రీక్ భాష నుంచి సేకరించాను! గ్రీక్ మైథాలజీ అన్నా, ఈజిప్ట్ కట్టడాలు అన్నా నాకు చిన్నతనం నుంచీ ఎంతో ఇష్టం! అందుకే ప్రాచీన గ్రీకు దేశపు చరిత్రను లైబ్రెరీలో విస్తృతంగా అధ్యయనం చేసిన నేను ఈజిప్ట్‌లోని పిరమిడ్ కట్టడాల విశిష్ఠతను తెలుసుకుని ఆశ్చర్యపోయాను. భూ మధ్య రేఖకు సమాంతరంగా దాదాపు 10,000 సంవత్సరాలకు పూర్వమే .. గ్రహాంతర వాసులచే .. నిర్మింపబడిన గ్రేట్ గిజా పిరమిడ్ కట్టడాలు .. వారి అద్భుత మేధస్సుకు ప్రతిరూపాలు. గణిత మరి ఖగోళ శాస్త్ర అద్భుతాలకు పుట్టిల్లు అయిన గ్రీకు దేశపు సాంకేతిక పరిజ్ఞానం మరి ఈజిప్ట్ దేశపు పిరమిడ్ వింతల మేలు కలయికలో పుట్టిన అద్భుత పదమే"ONERIO" అంటే "DREAM" .. మా స్కూల్‌లో .. ప్లే స్కూల్ నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు ప్రణాళికాబద్ధమైన విద్య అందించబడుతుంది. సువిశాలమైన ఆరు ఎకరాల క్యాంపస్‍ లో అధునాతన వసతులలో కూడిన బిల్డింగ్‌లో క్లాస్‌రూమ్‌లు రూపొందించాం. మరి అవుట్‌డోర్ గేమ్స్ కు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతి విద్యార్థి క్రీడల్లో తప్పకుండా పాల్గొనేట్లుగా తర్ఫీదు ఇస్తాం! PET లో వ్యాయామం మరి కరాటే శిక్షణ తప్పనిసరి!

 

ప్రతిరోజూ ప్రార్ధన తరువాత క్లాస్ రూమ్‌లో పదినిమిషాల "ధ్యానం" చేయిస్తాం .. మరి వారంలో ఒకరోజు ప్రతిక్లాస్ టైమ్ టేబుల్‌లో "ధ్యానం"కు కేటాయించబడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థి కూడా సంగీతం విభాగంలో చేరి .. కర్నాటక సంగీతం డ్రమ్స్, కాంగో, గిటార్, పియానో వంటి ఏదో ఒక కళలో నైపుణ్యాన్ని సంపాదించాలి. కళల విభాగంలో కూడా పెయింటింగ్, క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్ క్లాసులు ప్రవేశపెట్టాం!

 

ఎకడమిక్ ఇయర్ మొదట్లోనే విద్యార్థి తన ఇష్టాన్ని అనుసరించి చదువుతో పాటు ఏదో ఒక కళ మరి సంగీత విభాగాల్లో తప్పకుండా చేరాల్సివుంటుంది. అన్ని విభాగాల్లో కూడా నైపుణ్యం కలిగిన ట్యూటర్స్ పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. క్యాంపస్‌‍లో ఉన్న లైబ్రెరీలో ప్రతి ఒక్కరూ మెంబర్‍గా చేరి స్వాధ్యాయం చెయ్యాలి! మనో వికాసానికి దోహదం చేసే ఇలాంటి చక్కటి ప్రశిక్షణ వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతూ చదువులలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. మొత్తం మీద పిల్లల సంపూర్ణ ఎదుగుదల కోసం చేస్తూన్న ఈ శాస్త్రీయ కార్యక్రమాలవల్ల .. 2013 లో మా స్కూల్‌లోనే నిర్వహించబడిన AP State Level Hand Ball టోర్నమెంట్‌లో రాష్ట్రవ్యాప్తంగా 200 మంది పాల్గొంటే .. కర్నూలు జిల్లా జట్టు ప్రథమంగా నిలిచి .. ఆ జట్టులో నలుగురు ఆటగాళ్ళు మా స్కూల్ విద్యార్థులే! రాష్ట్రస్థాయి ఛాంపియన్లు అయిన వీళ్ళు త్వరలో జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఆడబోతున్నారు!

 

ఆదర్శవంతమైన విద్యా విధానంతో చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడతూన్న ఆత్మజ్ఞాన సంపన్నులైన మా స్కూల్ విద్యార్థులు .. భవిష్యత్తులో ఏ దేశంలో ఉన్నా, ఏరంగంలో సెటిల్‌ అయినా చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలను తమ పిల్లలకు సంతోషంగా చెప్పుకోవాలన్నదే మా ఆశ, ఆకాంక్ష!! ఇటీవలే .. ఏప్రిల్ 2014 మాసంలో .. మా స్కూలును దర్శించిన పత్రీజీ .. ఇక్కడి కార్యనిర్వహణ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు!

 

మారం: "ఒకానొక పిరమిడ్ మాస్టర్ .. తలపెట్టిన ఏ పనినైనా అద్భుతంగా నిర్వహించగలడు" అని నిరూపించారు మీరు! ఇక పోతే మరి చిన్న వయస్సులోనే మీ రాజకీయ రంగప్రవేశం గురించి ..


గాయత్రి: శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు "రాజకీయ నాయకులు, మరి అధికారులు పరమార్థ సాధకులుగా ఎదిగి ఆత్మజ్ఞాన పరాయణులైన పాలకులుగా ఉన్నప్పుడు .. సంఘంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి" అని సెలవిచ్చారు. బ్రహ్మర్షి పత్రీజీ ఉద్బోధించింది కూడా ఇదే! మరి నేను మున్సిపల్ ఛైర్మన్‌గా పోటీ చేయడానికి ప్రేరణ కూడా అదే! దీనికి తోడు మా అత్తవారింటి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కలిగి తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నత పదవులను అధిష్టిస్తూ వస్తూన్నారు. మా వారి తాతగారు మా స్వగ్రామం అయిన "బోగోలు"కు సర్పంచ్ గా ఆనాడే పనిచేస్తే .. మా వారు తన 18వ యేటనే ఆ గ్రామానికి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు! భారతదేశ గ్రామపరిపాలనా చరిత్రలో చిన్న వయస్సులో సర్పంచ్‌గా ఎన్నికయి మా వారు రికార్డు సృష్టించారు.

 

మా మామగారు, పెదమామ గారు, వాళ్ళ పిల్లలు అందరూ MLA, MLC వంటి ఉన్నత పదవులను పొందినవారే! ఈ నేపథ్యంలో మా వారు K.V.ఫణిరాజ్ గారి సహకారంతో . . మా పెద్ద మామగారి కుమారుడు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయిన శ్రీ K.E.కృష్ణమూర్తి గారి ప్రోత్సాహంతోనే ఇటీవల డోన్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఛైర్‌పర్సన్‌గా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం జరిగింది! ఇదే ఎన్నికల్లో మా వారు కౌన్సిలర్‌గా ఎన్నిక అయ్యారు! ఒక ఆత్మజ్ఞానయుత పరిపాలకురాలిగా నేను నా సంఘపరమైన బాధ్యతను చక్కగా నిర్వహించగలనని నా దృఢ అభిప్రాయం. ధర్మబుద్ధి, నీతి నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థతలతో కూడిన ఉత్తమ పాలనను నేను డోన్ ప్రజలకు అందించడానికి కృషిచేస్తాను.

 

ఒక కాలేజీ టాపర్‌గా .. గృహిణిగా .. డోన్ పట్టాణానికే తలమానికంగా వున్న "ONERIO SCHOOL" కు మేనేజింగ్ డైరక్టర్‌గా .. ఇప్పుడు "మ్యున్సిపల్ ఛైర్‌పర్సన్‌"గా .. మరి అన్నింటికీ మించి ధ్యాన శాకాహార ప్రచారాలను త్రికరణ శుద్ధిగా చేపట్టే ఒక "పిరమిడ్ మాస్టర్"గా నేను అన్ని పనులనూ ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతున్నానంటే దానికి కారణం "నా నిరంతర ధ్యానసాధనా శక్తి" అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంత గొప్ప ధ్యానవిద్యను నాకు అందించి నా జీవితానికి అర్థాన్నీ, పరమార్థాన్నీ కలిగించిన నా గురువు బ్రహ్మర్షి పత్రీజీకీ, నాకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్చి నన్ను ఒక అద్భుతమైన గురువు దగ్గరకు చేర్చిన నా తల్లితండ్రులకూ .. మరి నా కలల సాకారానికి తన చేయూతనిచ్చి ప్రోత్సహిస్తున్న నా భర్త ఫణిరాజ్ గారికీ, మా అత్త మామలకూ నేను సర్వదా కృతజ్ఞురాలిని!

 

 

 

K.P. గాయత్రి

డోన్ పట్టణం
కర్నూలు జిల్లా

Go to top