" శిక్షణ - రక్షణ రెండూ పొందాం "

 

హైదరాబాద్ వాస్తవ్యులు మరి సంపన్న వైశ్య కుటుంబానికి చెందిన శ్రీ కొణిజేటి అశోక్ కుమార్, శ్రీమతి ఉషారాణి దంపతులు .. సేవాధర్మానానికి చెందిన ఆధ్యాత్మిక పథగాములకు ఆదర్శనీయులు! వారి గురుసేవాభారం, గురుభక్తి ఎల్లలు లేనిది! మెహదీపట్నం .. గుడిమల్కాపూర్‌లోని వారి "కొణిజేటి గ్రూప్ ఆఫ్ గార్డెన్స్" ఎందరో గురువుల ప్రవచనాలూ, మహాసభలూ, టీవీ షూటింగ్‌లతో పాటు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన ధ్యాన కార్యక్రమాలకు నిలయం! ఆ యా కార్యక్రమాలకు వారు వేదికలను ఉచితంగా ఏర్పాటు చేయడమే కాకుండా భోజన సదుపాయాలను కూడా వితరణ చేయడం వారి ధార్మిక శక్తికి నిదర్శనం! భగవంతుడు ప్రసాదించిన సంపదను ధార్మిక రీతిలో సద్వినియోగం చేసూకుంటూన్న ఆ మహాపుణ్యమూర్తులకు విశేష అభినందనలు తెలియజేసుకుంటూ జూలై 20వ తేదీన తమ షష్టిపూర్తి మహోత్సవాన్ని జరుపుకున్న శుభసందర్భంలో తమ మనోగతాన్నిమనతో పంచుకుంటూన్న శ్రీమతి ఉషారాణి గారితో "ధ్యానాంధ్రప్రదేశ్" ..

మారం శివప్రసాద్, సెల్: +91 93472 42373


 

మారం: "నమస్తే మేడమ్! మీ షష్టిపూర్తి ఉత్సవం సందర్భంగా ధ్యానాంధ్రప్రదేశ్ తరపున ఆత్మీయ శుభాకాంక్షలు! పిరమిడ్ ధ్యానకుటుంబానికి అత్యంత ఆప్తులు అయిన మీ గురించి మీ ముఖతః తెలుసుకోవాలనుకుంటున్నాం!


ఉషారాణి: ధ్యాన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు! రాజమండ్రికి చెందిన జమీందారుల కుటుంబంలో నేను జన్మించాను. అయితే పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆస్తిపాస్థులను కోల్పోయిన మా నాన్నగారు రాజమండ్రిలోని "ఆంధ్రజ్యోతి సంస్కృత కళాశాల"లో ఆధ్యాపకులుగా చాలా సంవత్సరాలుగా పనిచేశారు.

 

"ఆంధ్రా అనీబిసెంట్"గా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత సంఘసేవిక బత్తుల కామక్షమ్మ .. శ్రీయుత న్యాళం రామలింగేశ్వరరావుగార్ల ధర్మవితరణతో స్థాపించిన "ఆంధ్రజ్యోతి సంస్కృత కళాశాల"కు అప్పట్లో చాలా గొప్ప పేరు ఉండేది. కామాక్షమ్మగారు బాలబాలికలనూ, వితంతవులనూ మరి నిరాశ్రయులైన స్త్రీలనూ చేరదీసి .. వారికి తమ వంతు సహాయం చేసేవారు. వేలాది కుటుంబాలకు మరి నిరాధారులైన స్త్రీలకు వారు చేసిన సేవ వెలకట్టలేనిది!

 

స్త్రీలకు ప్రత్యేకం అయిన వారి కళాశాలలో నేను ఒకటవ తరగతి నుంచి సంస్కృతంలో M.A. వరకు చదివాను! ఆ కళాశాలలో సంస్కృతం ప్రతి తరగతికి ఒక ముఖ్య సబ్జెక్ట్! అలా 10 వతరగతికి వరకు చదివి M.A. డిగ్రీకి సరిసమానమైన "సాహిత్య విద్యాప్రవీణ" అనే నాలుగేళ్ళ కోర్సును పూర్తిచేసి M.A. సంస్కృత్ పట్టాను అదే కాళాశాల నుంచి పుచ్చుకుని .. అక్కడే నాలుగేళ్ళపాటు లెక్చరర్‌ గా పనిచేశాను! స్త్రీల అభ్యుదయానికి బత్తుల కామాక్షమ్మ గారు చేసిన అనన్యసామాన్యమైన కృషి చిన్నతనంలోనే నాకు ఎంతో స్ఫూర్తిదాయకం అయ్యింది. ఆ మహానుభావురాలి ప్రేరణ చేతనే నేను "సేవ" అనే దృక్పథాన్ని పొందాను. ఎందరో స్త్రీల జీవితాలలో వెలుగులు నింపిన ఆ మహిళామణి భరతభూమికే గర్వకారణం!

 

మారం: "గురువులను గౌరవించుకోవడంలో .. మరి వారికి సకల వసతులు కల్పించడంలో .. మీ ఆతిధ్యం ఎంతో గొప్పది! ఈ ఆధ్యాత్మిక నేపథ్యం మీకు ఎలా అబ్బింది?


ఉషారాణి: నా వివాహం హైదారాబాద్‌లోని సంపన్న వైశ్య కుటుంబానికి చెందిన శ్రీ కొణిజేటి అశోక్ కుమార్‌గారితో 1976 మార్చి 17 న జరిగింది. నేను చదువుకున్న సంస్కృత విద్య, అలవరచుకున్న సేవాదృక్పథం మరి మా శ్రీవారి ధర్మనిరతి అన్నీ కలిసి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ఎంతగానో ఎదిగేలా చేసాయి. చిన్నప్పుడు నేను 2వ తరగతి చదువుతున్నప్పుడే "శ్యామలాదండకం" స్పష్టంగా చదివేదాన్ని. దానికితోడు 3వ తరగతి నుంచే ప్రతిరోజూ రాజమండ్రిలోని "గీతాభవన్"కు వెళ్ళి భగవద్గీత పఠనం చేసేదాన్ని. "కాళిదాసు", భారవి" ఇద్దరూ నాకు అత్యంత ఇష్టమైన గొప్ప కవులు. కాళిదాసు రచించిన "అభిజ్ఞాన శాకుంతలం" అనే దివ్య కావ్యాన్ని నేను సంస్కృతంలో చదివి ఆకళింపు చేసుకున్నాను. అందులోని ఒక గొప్ప శ్లోకం నాకు గురుసేవ పట్ల ఎంతో ప్రేరణ కలిగించేది.

 

"శుశ్రూషస్య గురూన్ కురు ప్రియ సఖీ వృత్తిమ్ సపత్నీజనే భర్తృ
విప్రకృతాపి రోషణతయా మాస్మప్రతీపం గమః
భూయిష్టం భవదక్షిణ పరిజనే భాగ్యేషు అనుత్యేకినీ
యాంత్యేవం గృహిణీపథం యువతయో వామాః కులసాధ్యయః"

 

అంటే ..


"గురువులను సేవించు! సహస్త్రీలపట్ల, సపత్నులపట్ల అత్యంత ప్రియంగా, స్నేహంగా ప్రవర్తించు! భర్త అయినా, విప్రులయినా కోపిస్తే రోషంతో ఎదురు చెప్పకు! సేవకులపట్ల అమిత కరుణతో, ధనాన్ని, వెచ్చించి ఇవ్వు! భాగ్యవంతురాలిని ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించకు! ఈ విధమైన ప్రవర్తన కలిగిన సాధ్వీమణులు ‘గృహిణి’ అనే పదానికి అర్హులు .. ఇలాంటి కులకాంతలే ఆదర్శనీయులు."

 

ఈ పద్యాన్నీ, తాత్పర్యాన్నీ పదే పదే చదివిన నేను చిన్నతనం నుంచే గురుశుశ్రూష పట్ల ఉవ్విళ్ళూరేదాన్ని. అత్తవారింట అడుగుపెట్టిన తరువాత ఆ పద్యాన్ని మరవకుండా నా నడవడిని మరింత ఉన్నతీకరించుకున్నాను. నా పెళ్ళయిన తరువాత ఒకసారి మా మామగారు విపరీతంగా సాంఘిక నవలలు చదివే అలవాటు ఉన్న నన్ను గమనించి .. "అమ్మాయీ! ఈ నవలలు చదివే సమయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల పఠనానికి వినియోగించు! ఆ గ్రంథాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి" అన్నారు. వారి ఉపదేశాన్ని ఆదేశంగా తీసుకుని నేను వెంటనే జ్ఞానసంబంధమైన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.

 

మా మామగారి అంత్యదశలో వారి దగ్గర కూర్చుని "గీతామకరందం", సత్యసాయిబాబా వారి "ఆత్మారామం" చదివి వినిపించేదానిని. భారతం, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు చదివి, ఆకళింపు చేసుకుంటూ నా జీవితాన్ని సాగించాను. ఈ క్రమంలో సంస్కృతం నాకు చేసిన మేలు నేను ఎన్నటికీ మరచిపోను. ఇతిహాసాలు, ప్రబంధాలు మరి భగవద్గీతలోని సంస్కృత పద్యాలను సంస్కృతంలో చదువుతూంటే .. ఆ శైలి, ఆ భావం, గాఢత, ఆ పవిత్రతా . తనువునూ, మనస్సునూ ఆనందకాలంలో విహరింపజేస్తాయి.

 

తెలుగులో ఎవరైనా చదువుతారు కానీ .. సంస్కృత భాషలోని సొగసు, గొప్పదనం ఆ భాష తెలిసినవారికే అర్థం అవుతుంది. అందుకే ఎంతోమంది విదేశీపండితులు కూడా ఆ భాష నేర్చుకుని దాని గొప్పతనాన్ని వేనోళ్ళ ప్రశంసించారు.

 

మారం: "ఎందరో గురువులనూ, మహనీయులనూ దర్శించి సేవించి వారికి ఆతిధ్యం ఇచ్చారు కదా! వారిలో మీకు ప్రేరణ కలిగించిన వారి గురించి తెలియజేయండి!
ఉషారాణి: గురువులనూ, మహనీయులనూ దర్శించడం మరి వారిని మా ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి ఆతిథ్యం ఇవ్వడం మా వారికి ఎంతో ఇష్టం! వారికి సేవ, శుశ్రూష చేయడం నాకు ఇష్టం! అలా మేం దర్శించిన, మరి మా గృహాన్ని పావనం చేసిన గురువులు ఎందరో!! వారికి ఆతిథ్యం ఇవ్వగలగడం మా కుటుంబం చేసుకున్న మహాభాగ్యం!

 

మౌనీ బాబా" .. "ప్రబల్ జీ మహరాజ్" .. "చతుర్వేదీ స్వామి" .. "సత్యసాయిబాబా" .. బ్రహ్మర్షి పత్రీజీ" మేం బాగా ఇష్టపడిన గురోత్తములు!

 

1992 లో భగవాన్ సత్యసాయి బాబా .. హైదరాబాద్ లోని "శివం" కు వచ్చినప్పుడు మొదటిసారి వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాం. అంతకు ముందు 1992లో బాబా వారు స్పెయిన్ దేశం వెళ్ళినప్పుడు అక్కడి భక్తులు వారిని రిసీవ్ చేసుకున్న తీరు, వారిని గౌరవించిన విధి విధానం, అక్కడ బాబావారు ఇచ్చిన ప్రవచనాలు అన్నీ న్యూస్ పేపర్ ద్వారా చదివిన మా వారు .. "ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ఇంత గొప్ప గురువు గురించి ఎక్కడో ఉన్న విదేశీ భక్తులు చెబితే తెలుసుకోవలసి వచ్చిందే" అని ఎంతో బాధపడ్డారు. అయితే మా భాగ్యవశాత్తు అతి తొందరలోనే బాబా వారు హైదరాబాద్ "శివం"కు రావడం .. మరి మేం వెళ్ళి వారిని దర్శించుకోవడం జరిగింది.

 

వారి దర్శనానికి వెళ్ళేరోజు కూడా మా మామగారు, మామగారి సోదరి, మా అత్తగారు అనారోగ్యంతో మంచంలో ఉన్నారు. వారిని వదిలి క్షణం కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి! అయినా వెళ్ళాలని మనస్సు ఆరాటపడుతోంది! ఇక లాభం లేదని కళ్ళు మూసుకుని కూర్చుని "నేను మీ దగ్గరకు ఎలా చేరను?" అని బాబాను ప్రార్థించాను. కర్తవ్యం స్ఫురించడంతో ఇంట్లో ఉన్న పని వాళ్ళకు మా పెద్ద వాళ్ళను అప్పగించి బాబా దగ్గరికి వెళ్ళిపోయాను. నా సంకల్పం, ప్రార్థన బాబాకు చేరింది కాబోలు .. వెంటనే మా దంపతులకు వారి దర్శనం, పాదసేవ, సాంగత్యం మరి సందేశం .. అన్నీ ఏకకాలంలో అనుగ్రహించారు. అంతకు ముందు ఇంటో ప్రతిరోజూ మా మామగారికి నేను చదివి వినిపించే "ఆత్మారామం" పుస్తకంలోని "అష్టైశ్వర్య ఆత్మస్థితులు" .. వాటి గురించి బాబా మాకు వివరించారు.

 

నేను వెంటనే ఉలిక్కిపడ్డాను! ఎందుకంటే ఆ అష్టైశ్వర్య ఆత్మస్థితులను మా మామగారి కి చదివి వినిపిస్తూ నేను .. "ఇప్పుడే ఈ చిన్న వయస్సులో ఇవి నాకెందుకు?" అనుకునేదాన్ని .. కానీ "అది నా ఆలోచనలోని పొరపాటు అని బాబావారు బోధనలలో తెలిసింది.

 

మారం: "అష్టైశ్వర్య ఆత్మస్థితులను వివరంచండి మేడమ్!"


ఉషారాణి: 1. శబ్దబ్రహ్మమయి 2. చరాచరమయి 3. జ్యోతిర్మయి 4. వాఙ్మయి 5. నిత్యానందమయి 6. పరాత్పరమయి 7. మాయామయి 8. శ్రీమయి
ఈ ఎనిమిది స్థితులు గురించి చెబుతూ "ఇవి వదిలివేసేవి కావు .. పట్టుకోవలసినవి" అని నొక్కి చెప్పారు బాబా! అప్పుడు నాకు "ఓహో! ఇది వైరాగ్యం కాదు .. వైభోగం అన్నమాట" అని నాలో ఉలిక్కిపాటు కలిగింది. బాబా వారి ద్వార అలా సత్య దర్శనం పొందిన మేము ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాం! ఆ తరువాత పత్రీజీ పరిచయభాగ్యంతో ఆ సత్య దర్శనం మనస్సులోకి ఇంకి .. సత్యపూర్వకంగా జీవించడం మొదలుపెట్టాం!

 

మారం: "పుట్టపర్తితో మీ అనుబంధం?"


ఉషారాణి: 1993లో ఒక్కసారి ప్రశాంతి నిలయంలో బాబా గారి ప్రత్యేక దర్శనం మాకు లభించింది. ఆ తరువాత ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళినా .. వేలాది మంది ముందు మాత్రమే వారి దర్శనం లభించింది. వారి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా నాలో ఎన్నో సందేహాలు వస్తూండేవి. అన్నింటికీ ఒకే సమాధానంగా బాబా "ఏకం సత్ ..విప్రాః బహుధా వదంతి" అంటూ "సత్యం ఒక్కటే .. కానీ విప్రులు దానిని అనేక విధాలుగా వివరిస్తారు కనుక మనస్సును నిశ్చలంగా ఉంచుకో" అని చెప్పారు! ఎన్నోసార్లు మా దంపతులం పుట్టపర్తిలో సామాన్య సేవకుల్లా సేవ చేశాం!

 

మారం: "బాబాతో మరిన్ని మీ అనుభూతులు..?"


ఉషారాణి: బాబా మహా దివ్యపురుషులు! వారి సాంగత్యంలో మేము ఎన్నెన్నో దివ్య అనుభూతులను పొందాం. 1993లో మేము కొత్త ఇల్లు కట్టుకుని అందులో ఒక విశాలమైన "బాబా హాల్‌ ను కట్టాలి" అని సంకల్పించుకుని స్థలం కోసం చాలా వెతికాం. ఇప్పుడు మేం ఉంటున్న స్థలం వ్యవసాయభూమి! ఒకరోజు మా వారు కాకతాళీయంగా అందులో నిలబడి ఉండగా ఒక పెద్దాయన వడివడిగా వచ్చి "బాబా అంటే నీకు ఇష్టమా? ఇష్టమా? ఇష్టమా?" అని మూడు సార్లు అడిగాడు. "అవును, అవును, అవును" అని మా వారు మూడు సార్లు సమాధానం చెప్పగానే "అయితే నాకు డబ్బు ఇవ్వు" అన్నారాయన! పదిరూపాయలు తీసి ఇవ్వగానే .. మళ్ళీ "బాబా అంటే నీకు ఇష్టమా?" అని అడిగాడు. "అవును" అని మా వారు సమాధానం ఇవ్వగానే మళ్ళీ డబ్బు ఇవ్వమని అడిగారు.

 

మా వారు ఈసారి 50 రూపాయలు ఇవ్వగానే ఆ పెద్దాయన అక్కడ భూమిని తన రెండు చేతులతో కెలికి, పిడికెడు మట్టి తీసి పట్టుకుని మా వారికి చూపిస్తూ చేయి తెరిచారట! అందులో ఒక తాయెత్తు! ఆ తాయెత్తును మా వారికి ఇచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు! మేం ఆ తాయెత్తును మా పూజా మందిరంలో పెట్టి దాదాపు ఈ విషయం మర్చిపోయాం! ఆ స్థలంలోనే మేం నాలుగు అంతస్థుల విశాలమైన ఇల్లు కట్టుకుని అందులో బాబా హాలు, ధ్యానమందిరం తో సహా పూర్తి చేసి 1996 కార్తీక పౌర్ణమి రోజున గృహప్రవేశం చేశాం!

 

పాత ఇంటి నుంచి కొత్తఇంటికి మారేటప్పుడు తాయెత్తు గుర్తుకు వచ్చి చూస్తే ఎక్కడా కనబడలేదు! బాబావారే ఆ పెద్దాయన రూపంలో వచ్చి ఆ తాయెత్తును ఇచ్చి వెళ్ళారని అర్థం అయ్యింది! ఆ తరువాత కాలంలో అదే స్థలంలో నాలుగు కల్యాణమండపాలను కూడా నిర్మించడం జరిగింది.

 

మారం: "చాలా అద్భుతం మేడమ్! మరి పత్రీజీ సాంగత్యం మీకు ఎలా లభించింది?"


ఉషారాణి: 2001 లో మా మేనల్లుడు Ch.నర్శింహారావు వచ్చి "అత్తయ్యా! ‘పత్రీజీ’ అనే ఒక గొప్ప గురువు వున్నారు; వారి ధ్యానకార్యక్రమం నేను రవీంద్రభారతి లో చూశాను. ఆ నిర్వాహకులు ఎంతో కష్టం మీద హాలు దొరికించుకుని ఆ ప్రోగ్రాం చేశారట. మనకు నాలుగు కల్యాణమండపాలు ఉన్నాయి కదా! కొన్నిసార్లు ఆ గొప్ప గురువు కార్యక్రమ నిర్వహణకు అవి ఇస్తే బాగుంటుంది కదా" అన్నాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు నిర్మలా మేడమ్ .. కొంత మంది పిరమిడ్ మాస్టర్స్ కలిసి భారతీయ విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమానికి మా దంపతులం వెళ్ళి పత్రీజీ సమక్షంలో ధ్యానం చేశాం. నిర్మల, విజయలక్ష్మి గార్లు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టడం మరి ఆ వెంటనే మేము పత్రీజీ ఇంటికి వెళ్ళి వారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది.

 

మార: "మీ మొట్టమొదటి ధ్యానానుభవం?"


ఉషారాణి: అంతకు ముందు "ధ్యానం గురించి బాబా వారు పెద్దగా చెప్పలేదేమిటా?" అన్న భావన నాలో ఉండేది. ఒకసారి నేను శివం కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక యాభై యేళ్ళ ఆవిడ ఎవరో తెలియదు కానీ .. నా దగ్గరికి వచ్చి "నివృత్తి మార్గం" అనే పుస్తకాన్ని నా చేతులో పెట్టి వెళ్ళిపోయింది. ఆ పుస్తకంలో అంతా బాబా వారు చెప్పిన ధ్యానం, నివృత్తి మార్గం గురించే ఉంది. "నా మూర్ఖత్వాన్ని బాబా వారు బాగా తొలగించారు" అని నాలో నేనే ఆనందించి .. వెంటనే అక్కడే కూర్చుని ధ్యానం చేశాను. అయితే "ధ్యానం" అంటే "శ్వాస మీద ధ్యాస" అని నాకు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌ లోకి వచ్చాకే తెలిసింది!

 

ఇక పత్రీజీ సాంగత్యం గురించి .. 2001లో మా దంపతులం ఇద్దరం కలిసి పత్రీజీ స్వగృహానికి వెళ్ళి .. మా గురువు సత్యసాయి బాబాతో మా సాంగత్యం, సేవ గురించి చెప్పాము. అప్పుడు నిర్మల మరి కొంతమంది అక్కడే వున్నారు. మాటల మధ్యలో పత్రీజీ నన్ను బాగా తిట్టారు!

 

నేను బాగా ఏడ్చాను! ఎంతో దుఃఖం!! ఈలోగా పత్రీజీ కోసం భోజనం ప్లేటును ఎవరో తీసుకుని రాగా .. దానిని నా చేతులో పెట్టి "తినండి" అని గద్దించారు. "నేను తినను" అనగానే నా వైపు మరింత తీవ్రంగా చూడడంతో .. ఏడుస్తూనే భోంచేశాను. అంతవరకూ నా ప్రక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తూ భోజనం పూర్తికాగానే .. "ఎందుకు అంతగా ఏడ్చారు?" అని అడిగారు!! "మరి నేనెంతో ఇష్టంగా, భక్తి శ్రద్ధలతో మీ దగ్గరికి వస్తే .. మీరు అంత తిట్టారు. ఇంతవరకూ నేను ఎవ్వరితోనూ ఇలా తిట్లు తినలేదు! అందుకే నాకు దుఃఖం వచ్చింది" అన్నాను మళ్ళీ వెక్కిపెడుతూ!


ఎంతో కరుణతో వారు నా కళ్ళలోకి సూటిగా చూసి "నన్ను నేను తిట్టుకుంటే నీకెందుకు దుఃఖం?" అన్నారు! అంతే! నా దుఃఖం మటుమాయం అయ్యి .. నేను ఆనంద పారవశ్యంతో హాయిగా నవ్వేసాను! ఆ నాటి నుంచి మరి నేను ఇంకెందుకూ దుఃఖపడింది లేదు!!

 

బ్రహ్మజ్ఞానంలో పత్రీజీ పరాకాష్ఠ స్థితిలో వున్నవారు! వారితో సాంగత్యం మరి వారి బోధనలు విన్న తరువాతనే నాకు బాబా వారు చెప్పిన అష్టైశ్వర్య స్థితులను గురించి స్పష్టంగా అర్థం అయ్యింది! అనేకానేక నిగూఢమైన ఆత్మజ్ఞాన రహస్యాలను తమ విశేషణా నైపుణ్యంతో అతి సరళమైన రీతిలో వారు అందించే తీరు ఎంతో గొప్పది! ధ్యానంలో, నిద్రలో, సూక్ష్మశరీరయానంలో నేను వారి నుంచి ఎన్నో బోధనలు అందుకున్నాను. సేవా ధర్మంతో పాటు, సత్యం, జ్ఞానం, అవగాహన అనుభవం అనుభూతులను కలగలిపి వారు మా జీవితాలను చరితార్థం చేశారు!

 

మారం: "బాగుంది! మరి మీ గార్డెన్స్‌లో జరిగిన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కార్యక్రమాల గురించి వివరించండి .."


ఉషారాణి: 2003లో పత్రీజీ జన్మదినం మా అశోకా గార్డెన్స్‌లో బ్రహ్మాండంగా జరిగింది! ఆ తరువాత క్రమంలో కూడా ఇప్పటికి వరకు మూడుసార్లు వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే భాగ్యం మాకు కలిగింది! TV షూటింగ్‌లు, పత్రీజీ ప్రవచనాల వీడియో రికార్డింగ్‌లు మా గార్డెన్స్‌లో చాలా జరిగాయి. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు .. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు .. సంబంధించి పెద్ద పెద్ద కార్యక్రమాలెన్నింటికో మా గార్డెన్స్ వేదికగా నిలిచింది! పత్రీజీ చిన్నకూతురు "పరిణిత" మ్యారేజ్ రిసెప్షన్ మా గార్డెన్స్‌లో జరగడం మా మహాభాగ్యంగా తలుస్తున్నాము! అంతేకాకుండా "సత్యసాయి నిగమాగమం"లో కూడా ఒక గొప్ప ధ్యాన కార్యక్రమాన్ని మా వారే పూర్తి బాధ్యత తీసుకుని నిర్వహించారు. మరి 2011 లో జరిగిన మా షష్టిపూర్తి మహోత్సవాలకు పత్రీజీ దంపతులు విచ్చేసి మమ్మల్ని దీవించడం మా అదృష్టంగా భావిస్తున్నాం.

 

మారం: "మీ కుటుంబం గురించి చెప్పండి .."


ఉషారాణి: మాకు ఇద్దరు పిల్లలు: "పవన్", "పల్లవి" మా కోడలు "సంగీత" .. ధ్యానం అన్నా! పత్రీజీ కార్యక్రమాలు అన్నా వారికి ఎంతో ఇష్టం. గొప్ప గొప్ప ధ్యానానుభవాలు వారి స్వంతం.

 

మారం: " ‘బాలవికాస్’ ను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు: ఆ వివరాలను తెలియజేయండి!"


ఉషారాణి: గత 16 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం నేను బాలవికాస్ తరగతులను మా స్వగృహంలో నిర్వహిస్తూన్నాను. "బాలవికాస్" అనే బాబా పుస్తకంలో వివరించబడిన "స్వామి వాక్య విభూతులు", "పదసూక్తులు" వారికి బోధిస్తూంటాం. ప్రతి సంవత్సరం మే నెలలో 200 మంది పిల్లలతో సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహిస్తూంటాం!

 

మారం: "ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సందేశం?"


ఉషారాణి: నేను చదువుకున్న చదువు, సంస్కారం, సంస్కృతి, గురువుల సాన్నిధ్యం, బత్తుల కామాక్షమ్మగారి సేవాదృక్పథం ఆధ్యాత్మిక వాసనలు కలిగిన నా భర్త .. వెరసి నా జీవితం అత్యంత అద్భుతంగా గడుస్తోంది! నాకు అత్యంత ఇష్టమైన గురువులు .. కాళిదాసు, సత్యసాయి, బ్రహ్మర్షి పత్రీజీ! ఈ ముగ్గురి మార్గదర్శకత్వంలో నా జన్మ చరితార్థం అయ్యింది! ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటె "60 సంవత్సరాలు అప్పుడే అయిపొయ్యాయా?!" అనిపించి ఆశ్చర్యం వేస్తుంది. పత్రీజీని కలువక ముందు మా నిత్యకర్మల్లో, దైవారాధనల్లో మరి గురు దర్శనాల్లో ఒక విధమైన పవిత్రతను అనుభూతి చెందిన నేను .. పత్రీజీని కలిసిన తరువాత ధ్యాన యోగిగా మారి వారి నుంచి "శిక్షణ" - "రక్షణ" రెండూ అందుకున్నాను.

 

మారం: "నమస్కారం అశోక్‌కుమార్ గారూ! ఆదర్శ దంపతులైన మీకు అభినందనలు! ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే మీ గురించీ మీ ఆధ్యాత్మిక జీవితం గురించీ, తెలుసుకోవాలనుకుంటున్నాం .."


అశోక్‌కుమార్: గురువులందరి పట్లా చిన్నప్పటి నుంచీ నాకెంతో గౌరవం ఉండేది. బహుశః ఆ ఆసక్తి నాకు గత జన్మలనుంచే వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఉష ఇద్దరం కలిసి ఎంతో మంది గురువులను దర్శిస్తూ ఉండేవాళ్ళం! ఎందరో పీఠాధిపతులూ, మఠాథిపతులూ, స్వామీజీలూ, గురువులూ మా ఇంటిని పావనం చేసి .. మేము సమర్పించుకున్న పత్రం, ఫలం, తోయం స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేశారు. దివ్యజీవన సమాజం మహాగురువు "స్వామి శివానంద" గారు మా గృహాన్ని సందర్శించారు! నేను ఆహ్వానించిన గురువులకు వసతి సౌకర్యాలను కలగజేస్తూ వారి వారి అభిరుచుల మేరకు ఆహార పదార్థాలను వండిస్తూ మా కుటుంబ సభ్యులు నాకు ఎంతో సహకరిస్తారు. "గురువులు" అనే కాకుండా శ్రీ VSR మూర్తి గారు, ప్రముఖ సినీ రచయిత, దర్శకులు J.K. భారవి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు కూడా నాకు ఆప్తులే! వారిని పత్రీజీకి నేనే పరిచయం చేశాను. J.K.భారవి .. సెల్యులాయిడ్ రంగంలో భక్తి మార్గాన్ని ఎంత అద్భుతంగా పలికించారో వారి "మంజునాధ" .. "అన్నమయ్య" .. "రామదాసు" .. "పాండురంగడు" .. మరి "ఆదిశంకరాచార్య" సినిమాలు చూస్తే తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలపాటు భారవి "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రికకు చీఫ్ ఎడిటర్‌ గా కూడా తమ బాధ్యతలను నిర్వహించారు!


మారం: "సత్యసాయి, పత్రీజీ .. ఇద్దరి కార్యక్షేత్రాలను మీరెలా అవగాహన చేసుకుంటారు?"


అశోక్‌కుమార్: సత్యసాయి బాబా ఒక గొప్ప శక్తిక్షేత్రం! గొప్ప సిద్ధులు పొందిన వారు తమ బోధనల ద్వారా సేవ ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది సెంటర్లతో వారు ఏర్పరచిన "నెట్‌వర్క్" సామాన్యమైంది కాదు. ఇక బ్రహ్మర్షి పత్రీజీ .. అద్భుతమైన గురువు! ధ్యానం .. శాకాహారం .. పిరమిడ్ నిర్మాణం .. ఆధ్యాత్మిక పాలన నాలుగు స్తంభాలుగా వారు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు పటిష్టమైన భవనాన్ని నిర్మించారు. ఈ నాలుగు అంశాలను "నాలుగు వేదాలు" గా చేత బట్టుకుని .. భారతదేశమంతా, ప్రపంచమంతా తిరిగేస్తున్నారు. అలుపెరుగని నిర్విరామ కృషితో కూడిన వారి కార్యదక్షత నాకు ఎంతో ఎంతో ఇష్టం!! భగవాన్ సత్యసాయి, బ్రహ్మర్షి పత్రీజీ ఇద్దరూ మహాశక్తి స్వరూపాలు! వారు ఉన్న కాలంలో వారితో పాటు మనం కూడా ఈ భూమ్మీద జీవించి ఉండడం మన అదృష్టం! వారితో కలిసి పనిచెయ్యడం మన సౌభాగ్యం!

 

మారం: "పిరమిడ్ విశాల కుటుంబానికి మీ సందేశం?"


అశోక్‌కుమార్: "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రిక అద్భుతమైన శీర్షికలతో ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని అందరికీ పంచుతోంది! దానిని అందరం కొని, చదివి మరింతమంది తో చదివించి దాని అభివృద్ధికి చేయూతనిద్దాం!!

 

 

శ్రీ కొణిజేటి అశోక్ కుమార్

శ్రీమతి ఉషారాణి
హైదరాబాద్

Go to top