" నన్ను మార్చిన ధ్యానం - ఐ లవ్ పత్రీజీ "

 

 

నా పేరు మహిత. ఇంటర్‌మీడియట్ ఫైనల్ సంవత్సరంలో ఉన్న నేను 2013 ధ్యానమహాచక్రం నుంచి ధ్యానం చేస్తున్నాను. 2010 లో నా కళ్ళకు C3R ఆపరేషన్ జరిగి .. నా చూపు మరింత మందగించి పోయింది. అలా అసలు ఎందుకు జరిగిందో .. ఏ డాక్టర్ కూడా చెప్పలేక పోయారు. " అదంతా నా గ్రహచారం " అనుకున్నాం. 

 

అదే సమయంలో మా అమ్మా, నాన్న " పిరమిడ్ ధ్యానం " గురించి తెలుసుకుని .. ప్రతి రోజు ఇంట్లో ధ్యానం చేస్తూ .. నన్ను కూడా చేయమని అడిగేవారు. నేను " ససేమిరా " అనడంతో నన్ను కోప్పడేవాళ్ళు. ఎప్పడూ వాళ్ళు ధ్యానప్రపంచంలోనే మునిగి తేలుతూ, ధ్యానకార్యక్రమాలకు వెళుతూ, కడ్తాల్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. దాంతో నేను " నా కుటుంబాన్ని నాకు కాకుండా చేస్తూన్నారు కనుక ‘ I hate Patriji ’ " అని కోపంగా కాగితాలపై వ్రాసేదాన్ని ; 2013 సంవత్సరం వరకు ఇదే తంతు! 

 

2013 డిసెంబర్‌లో అమ్మా నాన్నల బలవంతం మీద కైలాసపురి ధ్యానమహాచక్రం -4 కు వెళ్ళాను. అక్కడ నాకు " గిటార్ రావు " గారు పరిచయం అయ్యారు. వారు " Universal Sangeeth Academy USA " .. ని స్థాపించి .. ఒక టీమ్‌ను ఏర్పరచుకుని దాని ద్వారా ధ్యానప్రచారం చేస్తున్నారు. వారు చేస్తున్న పని నాకు చాలా నచ్చింది ! వారు నాకు గిటార్ వాయించడం నేర్పిస్తూనే ధ్యానం మీద ధ్యాస కలిగేలా చేశారు. ఇక నేను కూడా వారి  USA లో టీమ్ మెంబర్‌గా చేరి 13 రోజుల పాటు కడ్తాల్ చుట్టు ప్రక్క గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాం. ప్రతి రోజు ఒక క్షణంలా ఎంజాయ్ చేశాము.

 

ఈ క్రమంలో ధ్యానమహాచక్రం-4 ప్రాతః‌కాల ధ్యానంలో నా కంటికి ఆస్ట్రల్ సర్జరీ జరిగి క్రమంగా నా చూపు మెరుగుపడి ఇప్పుడు ఏ కంటి సమస్యా లేకుండా పోయింది ! ఇప్పుడు నేను అన్ని చక్కగా చూడగలుగుతున్నాను .. మరి హాయిగా చదువుకోగలుగుతున్నాను. " ధ్యానం " నా జీవితంలో ఒక ముఖ్య భాగంగా అయిపోయింది! 

 

ఇక ఇంటికి వచ్చినప్పటి నుంచి అమ్మా, నాన్నలు కూడా ఆశ్చర్యపోయేంతలా నాలో చాలా మార్పు! ధ్యానంలో నా గత జన్మలు చూసుకున్నాను. సూక్ష్మశరీరయానం చేసి ఎన్నెన్నో లోకాలు తిరిగాను! ఆత్మజ్ఞానపరమైన విషయాలను తెలుసుకున్నాను! " ధ్యానం చేయడం కాదు .. ధ్యానంలో ఉండాలి " అని తెలుసుకున్నాను. సంతోషం .. ఆనందం .. పరమానందం అంటే ఏమిటో రుచి చూశాను!

 

నాలో మార్పు నా ఆలోచనల్లో మార్పు నాకే స్పష్టంగా తెలిసిపోతోంది. చదువులో కూడా నాకు చక్కటి అవగాహన, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగాయి! ఇదివరలో గంటలు గంటలు చదివితే కానీ అర్థంకాని విషయాలు ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ధ్యానం గురించిన అవగాహన లోపంతో వున్న వాళ్ళకు నేను ధ్యానం గురించి ఇప్పుడు చక్కగా చెప్పగలుగుతున్నాను.

 

నా గత జన్మలకు సంబంధించిన ఆత్మ బంధుత్వాలను నేను గుర్తించగలుగుతున్నాను. పుష్పాలు, పాములు, పక్షులు ద్వారా ప్రకృతి సందేశాలను అందుకున్నాను. ఇటీవల మెదక్‌లో " శోభా మేడమ్ " ద్వారా నిర్మించబడిన 35'X35' పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రీజీ హాజరయినప్పుడు నేను వారిని నా అనుభవాలు చెప్పాను! వారితో జన్మజన్మలుగా పరిచయం ఉన్నట్లు అనిపించి నాకు ఎంతో ఆత్మానందం కలిగింది. ఆ రోజంతా వారి సమక్షంలోనే ఆనందంగా గడిపాను !

 

చిన్న కుటుంబంలో ఉన్న నన్ను పెద్ద పిరమిడ్ కుటుంబంలో ఒక సభ్యురాలిగా చేసిన పత్రీజీ కీ .. మరి " I hate Patriji "  నుంచి " I Love Patriji " గా నన్ను మార్చిన ధ్యానానికీ కృతజ్ఞతలు! 

 

 

లంకా మహిత

హైదరాబాద్

సెల్: 9032104075

Go to top