" విద్యుత్‍శక్తి పిరమిడ్ ధ్యానమందిరం "

 

 

నా పేరు బాలన్న. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలో ఉద్యోగిగా పదవీ విరమణ చేసి .. ప్రస్తుతం అనంతపురంలో ఉంటున్నాను. విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నేను అనంతపురం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సహకార సంస్థకు సెక్రెటరీగా ఉన్నాను. అప్పుడు మా బిల్డింగ్ సొసైటీలో ఒక కమ్యూనిటీ హాలును కట్టించి అందులో ఉచిత హోమియో చికిత్సాలయం, ఆధ్యాత్మిక గ్రంధాలయం ఏర్పాటు చేయడం జరిగింది.

 

2001లో నేను విశ్రాంతి ఉద్యోగిగా మారిన తరువాత నాలో ఆధ్యాత్మిక చింతన మరింత పెరిగి .. గురువులనూ, పెద్దలనూ కలిసి పూజలూ, భజనలూ మరి నిత్యనామజపాలూ విపరీతంగా చేసేవాడిని. కొంతకాలానికి అవేవి నాకు తృప్తిని ఇవ్వకపోవడంతో .. నా అన్వేషణ మరింత తీవ్రం చేసాను. 2009 లో అనంతపురం పిరమిడ్ మాస్టర్ K. విజయ కుమార్ గారి ద్వారా " ధ్యానాంధ్రప్రదేశ్ " ఆధ్యాత్మిక మాసపత్రికను అందుకున్నాను. 

 

ఆ పత్రికలో వివరించినట్లు బుద్ధ ప్రబోధిత " ఆనాపానసతి " ధ్యానాన్ని సాధన చేయడం మొదలుపెట్టాను. అత్యంత సులభసాధ్యంగా ఉన్న శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని పత్రీజీ అతి తేలిక భాషలో వివరించిన తీరు నాకు ఎంతో నచ్చింది ! ఇక అప్పటినుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ అద్భుతమైన ధ్యానానుభవాలను పొందుతూ వచ్చాను. విజయ్‌కుమార్ గారిని తరచూ కలుస్తూ .. అనంతపురంలో ఉన్న " అగస్త్య పిరమిడ్ ధ్యానమందిరం " లో జరిగే ధ్యాన కార్యక్రమాలకూ, పౌర్ణమి ధ్యానాలకూ వెళ్తూ ఆనందంగా వున్నాను. 

 

విశాఖపట్టణం, కైలాసపురిలలో జరిగిన ధ్యానమహా చక్రాలకు వెళ్ళి ప్రాతఃకాల అఖండ ధ్యానంలో పాల్గొన్నాను. ఈ క్రమంలో బ్రహ్మర్షి పత్రీజీ సూచన మేరకు .. నేను సెక్రెటరీగా ఉన్న అనంతపురం విద్యుత్ ఉద్యోగుల సహకార సంస్థ భవనంపై .. అనంతపురం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అనంత వెంకట్రామ రెడ్డి గారి సహకారంతో 10'X10' ధ్యానపిరమిడ్‌నూ మరి అక్కడి ఉద్యానవనంలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహాన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. 

 

ఫిబ్రవరి 23వ తేదీన M.P. గారు మరి నగర కమీషనర్ గార్ల చేతుల మీదుగా " విద్యుత్ శక్తి పిరమిడ్ " ను ప్రారంభం చేయించుకోవడం జరిగింది. అనంతపురం పిరమిడ్ మాస్టర్ల పర్యవేక్షణలో జరిగిన ఆనాటి కార్యక్రమంలో ధ్యానుల అనుభవాలనూ, మరి ధ్యాన ఆవశ్యకతనూ గురించి విని ముఖ్య అతిథులు ఎంతో సంతోషించారు. 

 

ధ్యానం, ధ్యానప్రచారం, సజ్జన సాంగత్యాదుల ద్వారా నా విశ్రాంతి జీవితాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన పత్రీజీకి కృతజ్ఞతలు !

 

తోట బాలన్న

అనంతపురం

సెల్: 9052788279

Go to top