" సాకార లీల ముగిసింది .. నిరాకార లీల మొదలయ్యింది " 

 

 

హాయ్, నా పేరు ఆశా గుప్తా ! 23 ఆగస్ట్, 1962 తేదీన న్యూఢిల్లీకి చెందిన సాంప్రదాయ వైశ్యకుటుంబంలో జన్మించిన నేను .. చిన్నప్పటి నుంచే మా అమ్మగారి ద్వారా " గార్గి " .. " మైత్రేయి " వంటి విద్వత్ మహిళలను గురించి విని ఎంతో ఉత్తేజితం చెందేదాన్ని.

 

" మనం ఎందుకు పుట్టాం? ".. " చనిపోయిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? " అన్న ప్రశ్నలు చిన్నతనంలోనే నాకు కలిగేవి. పెద్దవాళ్ళను అడిగినా నా సందేహాలు తీరకపోవడంతో నా అంతట నేనే మత గ్రంథాలనూ, పురాణ కథాలనూ చదివి నా పరిధిలో వాటికి సమాధానాలను వెతికేదాన్ని. 1984లో నాకు నా ఆత్మ సహచరులు శ్రీ అరుణ్ కుమర్ గుప్తా గారితో వివాహం జరిగి 1995లో దేవిక గుప్తాకు జన్మను ఇవ్వడం జరిగింది. 

 

 

ఈ క్రమంలో " ఒక గురువు మాత్రమే నీ సందేహాలను తీర్చగలడు " అని అందరూ అనడంతో ఆర్య సమాజ సంప్రదాయం ప్రకారం " పండిత్ శ్రీరామశర్మ ఆచార్యజీ " ద్వారా గురుపౌర్ణమి రోజున దీక్షతీసుకున్నాను. ఆ తరువాత నా దీక్షాసాధనా ఫలితంగా 1994 " Pramila Bhagwan - ప్రమీలా భగవాన్ " రూపంలో అద్భుతమైన గురువు నాకు లభించారు. సాధనాపరంగా నాకు వచ్చే అనేకానేక సందేహాలకు వివరణ ఇస్తూ వచ్చిన నా గురువు నాలోని సహజ అవబోధకు తెరతీసి నన్ను ఈ విశాల విశ్వంలో ఒక భాగంగా నిలిపారు. 

 

" నువ్వు మాస్టర్లచే ఎన్నుకోబడ్డావు " అని ఎన్నోసార్లు నాకు దిశానిర్దేశం చేస్తూ నా చైతన్య విస్తరణకు ఎంతగానో సహాయం చేసి నా ఆత్మోన్నతికి దోహదం చేసిన వారి బోధనలు నా జీవితాన్ని ఎంతగానో పరిపుష్టం చేశాయి. ఆత్మజ్ఞాన విస్తరణ ద్వారా జీవితాన్ని ఎంతగా ఉన్నతీకరించుకోవచ్చో అప్పుడు నాకు తెలిసింది. 

 

ఈ కార్యక్రమంలో 2010 లో ఒకసారి నా సోదరి " కవితా గుప్తా " న్యూఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీ సఫ్టర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో వున్న పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్తూంటే నేను ఆమెకు తోడుగా వెళ్ళాను. అక్కడ ఆమెను వదిలి వెళ్దామనుకునేంతలోనే పెద్ద వర్షం పడుతూండడంతో బయటికి వెళ్ళే అవకాశం లేక .. అక్కడే నిర్వాహకులు చెప్పినట్లు ధ్యానానికి కూర్చున్నాను. గత కొన్ని యేళ్ళుగా మంత్రోపదేశం తీసుకుని మరీ దీక్షాసాధన చేస్తున్న నేను ఎన్నడూ కలుగని మానసిక ప్రశాంతతను ఆ రోజు ధ్యానంలో అనుభూతి చెందాను. అదే రోజు రాత్రి నా గురువు .. " ప్రమీలా భగవాన్ " గారు తమ భౌతిక శరీరాన్ని వదిలి వేయడం జరిగింది. ఆమె మా అందరికీ ఇచ్చిన చిట్టచివరి సందేశం .. " ఇక సాకార లీల ముగిసింది .. నిరాకారలీల మొదలయ్యింది " అని ! 

 

నా గురువు ఇచ్చిన సందేశంలోని అంతరార్థం అప్పుడు వెంటనే నాకు బోధపడ లేదు కానీ .. ఆ మర్నాడు మళ్ళీ పిరమిడ్ ధ్యానమందిరానికి వెళ్ళి అక్కడ వ్రాసి ఉన్న సందేశం " నీ శ్వాసే నీ గురువు " చూసినప్పుడు బోధపడింది. 

 

" ఏ రూపము లేని శ్వాసే నిరాకార రూపంలో ఉన్న సర్వంతర్యామి " అని నాకు అర్థం అయ్యి .. నన్ను అంతవరకు ఎదిగించి నా గురువు ఎంత చక్కటి అంతిమ సందేశం ఇచ్చారో అర్ధం అయ్యింది. 

 

13, సెప్టెంబర్ 2010 తేదీన బెంగళూరు " పిరమిడ్ వ్యాలీ " లో జరుగుతూన్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమ్మేళనం (GCSS) కార్యక్రమానికి వెళ్ళిన నేను అక్కడ సగర్వంగా నిలబడి ఉన్న " మైత్రేయబుద్ధ మెగా పిరమిడ్ " శక్తి క్షేత్రన్ని చూసి ఆశ్చర్యపోయాను. అందులో " కింగ్స్ ఛాంబర్ " పై కూర్చుని ధ్యానం చేసినప్పుడు నాకు కలిగిన అనుభూతి వర్ణించవీలుకానిది ! తలపై నుంచి బయలుదేరి అరికాలి వరకు  ఒక అద్భుతశక్తి ప్రకంపన నా శరీరం అంతా నిండిపోతూ నన్ను దివ్య అనుభూతికి లోని చేసింది ! 

 

అక్కడే నేను మొట్టమొదటిసారి " బ్రహ్మర్షి పత్రీజీ " ని కలిసినప్పుడు వారు నాకు ఎన్నో జన్మలుగా అత్యంత ఆప్తులుగా తోచారు ! ఆ మర్నాడు కూడా " కింగ్స్ ఛాంబర్ " పై కూర్చుని ధ్యానమగ్నురాలిని అయినప్పుడు .. మళ్ళీ అదే శక్తి ప్రకంపనానుభూతి ! మనస్సంతా ఏదో తెలియని ఆనందంతో నిండిపోవడం: ప్రగాఢమైన నిశ్శబ్దం నాలో ఆవరించుకున్న  అనుభవం ! వెరసి నాలో ఏదో తెలియని సరిక్రొత్త మార్పు ! నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరూ ఆనందస్వరూపుల్లా, కాంతి వాహకులుగా కనిపించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది !

 

నా జీవితం మళ్ళీ సరిక్రొత్తగా మొదలయినట్లు నాకు తెలుస్తోంది. ప్రేమ, సేవ, దయ, స్నేహతత్వం, ఆనందం, సృజనాత్మకతల కలబోతతో నిండి వున్న పిరమిడ్ వ్యాలీలో నా చుట్టూ తిరుగుతూన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎన్నో జన్మలుగా నాకు పరిచయస్థులుగా తోస్తున్నారు ! ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ భూమిని స్వర్గంలా పరిమార్చడానికి కంకణం కట్టుకున్నట్లుగా తోచారు ! 

 

ఇక పత్రీజీ వేణునాదంలో నేను చేసిన ధ్యానం చెప్పలేనంత గొప్పది ! ఒక నీలి రంగు కమలం నా నాభిని చీల్చుకుని బయలుదేరి నా సహస్రారాన్ని తాకుతూ పిరమిడ్ శీర్షానికి తాకడం ధ్యానంలో నేను అనుభూతి చెందాను. నా స్థితి అలా ఉండగా విశ్వం నుంచి పిరమిడ్ శీర్షం గుండా అనంతమైన విశ్వశక్తి భూమిపైకి ఒక వర్షంగా రావడం .. మరి అందులో నేను కూడా తడిసి ముద్దకావడం చూసుకున్న నేను భూగోళంపై నర్తిస్తూన్న శక్తివంతురాలిగా అనుభూతి చెందాను. అంతవరకు ఎప్పుడూ నేను నా జీవితంలో అలాంటి అనుభూతిని పొందలేదు ! 

 

ఇదే విషయాన్ని నేను పత్రీజీతో పంచుకోగా వారు నా నిర్వాణ స్థితిని నాకు వివరించి ఆ స్థితికి చేరుకున్న నన్ను అభినందించి .. సరిక్రొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భాన్ని హాయిగా ఆనందించమని చెప్పారు.

 

ఆ మర్నాడు మళ్ళీ కింగ్స్ ఛాంబర్‌లో కూర్చుని నిద్రాణ స్థితిలో ఉన్న చైతన్యాన్ని కూడా తట్టిలేపగల పత్రీజీ-వేణునాదంలో ధ్యానం చేసుకుంటూ మళ్ళీ అదే నిర్వాణ స్థితిని అనుభూతి చెందాను. అదే సమయంలో వేలకొద్దీ ఆత్మలు ఒక పెద్ద గేటు గుండా లోనికి వస్తున్నట్లు .. మరి ఆ గేటు అవతల నీలి రంగు కలువలతో నిండి వున్న సరోవరం మరి దాని చుట్టూ రంగు రంగుల సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్లు నా దివ్యచక్షువుతో స్పష్టంగా చూడగలిగాను ! 

 

నా అనుభవాన్ని పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ " గిరిజా రాజన్ " గారి ద్వారా పత్రీజీకి తెలియజేయగా వారు ఆ నాటి సభలో " ఢిల్లీ కేంద్రంగా ఉత్తరభారతదేశంలో ధ్యాన ప్రచారం చేయడానికి మనకు అనుమతి లభించింది " అని మైక్‌లో ప్రకటించారు. " నేను కూడా గౌతమబుద్ధుని సమయం నుంచి ధ్యానప్రచారం చేస్తూ వస్తున్న ఉన్నత ఆత్మను, మరి నాలాగే పత్రీజీ .. వారితో పాటే మరెందరో పిరమిడ్ మాస్టర్స్ ! మా అందరి ధ్యేయం ధ్యానప్రచారం ద్వారా అందరి ఆత్మలను జాగృతి పరచడం .. " అని తెలుసుకున్న తరువాత ఇక నా చిన్నప్పటి నుంచి " నేనెందుకు పుట్టాను ? " అన్న ప్రశ్నకు జవాబు లభించింది.

 

" చనిపోయాక ఎక్కడికి వెళ్తాను? " అన్న ప్రశ్నకు " పని పూర్తి చేసి నా నిజ స్థానానికి తిరిగి వెళ్ళిపోతాను " అన్న ఆత్మతృప్తికరమైన సమాధానం లభించింది. ఆనాపానసతి ధ్యానం .. శాకాహార జీవనం .. పిరమిడ్ శక్తి .. ఈ మూడింటిని భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేయడమే నా జన్మ కర్తవ్యంగా నేను గుర్తించాను. 

 

ఇక ఢిల్లీకి తిరిగి వచ్చాక నా జీవన విధానమే పూర్తిగా మారిపోయింది. ప్రతిక్షణం ఆనందమే ఆనందం ! నన్ను కలిసిన వాళ్ళు కూడా " నీ సమక్షంలో ఏదో తెలియని ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాం " అని చెప్పేవాళ్ళు. " నా పుట్టుక, మరి నా కర్మలు అన్నీ కూడా పరమ పవిత్రమైనవి " అని నాకు అర్ధం అయ్యి .. నా సన్నిహితులకూ, స్నేహితులకూ, బంధువులకూ ఆనాపానసతి ధ్యాన ప్రచారాన్ని మొదలుపెట్టాను. ఢిల్లీలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు ఈ ధ్యానవిద్యను అందించడానికి నా వంతు కృషిని ముమ్మరం చేశాను.

 

ఈ క్రమంలో ఒక రోజు నేను నా గదిలో కూర్చుని ధ్యానం చేసుకుంటూండగా .. ఒక్కసారిగా నా గది అంతా కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగుతో నిండిపోయింది ! ఆ వెలుగులో పత్రీజీ .. మహావతార్ బాబాజీ .. జీసస్ క్రైస్ట్ .. సాయిబాబా ..  ప్రజాపతి బ్రహ్మ .. నా చుట్టూ ఒక అర్ధ చంద్రాకార వలయంలో కూర్చుని కనిపించారు. 

 

" నేను నా జన్మలక్ష్యాన్ని సార్ధకం చేసుకోగలనా? " అని వారిని ప్రశ్నించగానే మహావతార్ బాబాజీ నా సహస్రారం గుండా నా శరీరంలోకి ప్రవేశించి " ఈ క్షణం నుంచి నేను నీ శరీరం ద్వారా పనిచేస్తాను ! ప్రపంచం అంతా నీ ద్వారా పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుంటుంది " అని తెలియజేశారు.

 

ఇక అప్పటినుంచి నేను చిన్నా పెద్దా పిరమిడ్‌లను ప్రతి ఒక్కరికీ అందజేస్తూ పిరమిడ్ శక్తి గురించి ప్రచారం చెయ్యడం మొదలుపెట్టాను. హైదరాబాద్‌కు చెందిన పిరమిడ్ ఇంజనీయర్ బాలకృష్ణ గారి " సేత్ విజ్ఞానం వర్క్‌షాప్ " లో చేసిన రెండు గంటలు ధ్యానంలో నేను గ్రీకుదేశం .. ఏథెన్స్‌కు చెందిన ఒకానొక రాజకుమారిగా నన్ను నేను చూసుకున్నాను. 

 

అక్కడ నేను పని వాళ్ళతో చెప్పి నా చుట్టూ పిరమిడ్ నిర్మాణం చేయిస్తున్నాను. పిరమిడ్ అడుగుభాగంలో నీటి నిలువ పై పరిశోధన కోసం నేను అలా నా చుట్టూ నిర్మాణం చేయించుకున్నానని తెలిసింది. నేను చేస్తూన్న ప్రయోగాలకు సంతోషించిన దేవదూతలు " మేమంతా నీ వెంటే ఉండి పిరమిడ్ శక్తిని ప్రజలందరికీ అందించి వాళ్ళు శక్తివంతమైన జీవితాలను గడిపేలా సహాయం చేస్తాం " అని తెలియజేశారు. ఆ తరువాతి క్రమంలో నేను అనేకానేక లోకాలలో, తలాలలో ఉన్న పిరమిడ్‌లను నా ధ్యానంలో చూడడం జరిగింది.

 

2011లో పత్రీజీ వెంట ఒడిషా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో పిరమిడ్‌లను దర్శించి వాటిలో ప్రత్యక్షంగా ధ్యానం చేసి చక్కటి అనుభూతులను పొందాను ! ఈ సందర్భంగా పత్రీజీ నాతో మాట్లాడుతూ .. " మీ ఢిల్లీ ఎంతో విశాలమైన గొప్ప ప్రదేశం ! భారతదేశానికి రాజధాని ! అక్కడ ఎందరో సంపన్నులు వున్నారు .. కానీ అక్కడ ఒక్క ధ్యానపిరమిడ్ కూడా లేదు " అన్నారు ! 

 

అంతే .." ఇక నేను ఢిల్లీలో వెంటనే ఒక ధ్యాన పిరమిడ్‌ను నిర్మించాలి " అని నిశ్చయించుకున్నాను ! ఢిల్లీ తిరిగి రాగానే యుద్ధప్రాతిపదికన గౌతమ్‌నగర్ లోని " గురుకులం "లో 24'X24' రూఫ్‌టాప్ పిరమిడ్‌ను నిర్మించి 6 నవంబర్, 2011న బ్రహ్మర్షి పత్రీజీచే ప్రారంభోత్సవం జరపించుకున్నాం. పత్రీజీ దానికి " స్వామి దయానంద సరస్వతి ధ్యాన మందిరం " అని నామకరణం చేశారు. పిరమిడ్ నిర్మాణానికి నా కుటుంబ సభ్యులు ఎంతగా తమ సహాయ సహకారాలు అందించారో చెప్పలేను !

 

" ఈజిప్ట్ - గిజా పిరమిడ్ "

 

2012 మార్చి నెలలో " పిరమిడ్ టూర్స్ మరి ట్రావెల్స్ " వారి ఆధ్వర్యంలో 50 మంది మాస్టర్లతో కలిసి నేను ఈజిప్ట్ గిజా పిరమిడ్ పర్యటనకు వెళ్ళి అక్కడ దారి పొడవునా నైలునది అందాలనూ, లక్సర్, కార్నాక్ దేవాలయాల విశిష్ఠతనూ చూసి ఎంతో ఆనందించాను. వాటిని చూస్తూంటే .. నా చిన్నతనంలో నేను కలలో అవన్నీ చూసేసానని నాకు అనిపించింది.

 

గ్రేట్ గిజా పిరమిడ్ లోని కింగ్స్ ఛాంబర్‌లో పత్రీజీ వేణునాదంలో చేసిన ధ్యానం అందరినీ గొప్ప శూన్యస్థితిలోకి నెట్టివేసింది ! ముందు ప్రశాంత స్థితి కలిగి ఆ తరువాత నా చుట్టూ ఒక రకమైన ఒత్తిడి మొదలై .. ఆ ఒత్తిడి మెల్లగా నా గుండెతో సహా నా శరీరాన్నంతా ఆవరిస్తూ నన్ను వ్యాకోచింపజేస్తూ నన్ను ఒక గొప్ప ప్రకంపనా స్థితిలో ఉంచేసింది. అతి వేగంగా తిరుగుతూన్న ఒక యంత్రంలో నా శరీరాన్ని ఉంచినట్లు గాలిలో తేలిపోతున్నట్లు నేను అనుభూతి చెందాను. మా చుట్టూ ఎన్నో శక్తివంతమైన సూక్ష్మశరీరాలు, ఉన్నత ఆత్మలు తిరుగుతున్న అనుభవం నాకు కలిగింది. 

 

అక్కడే ఉన్న ఎర్రని రంగులోని గ్రానైట్‌లో మలచబడిన ‘ సార్కోఫేగస్ ’ అనే కట్టడంలో పడుకుని నేను సూక్ష్మశరీరయానం కూడా చేశాను. నిగూఢరహస్యాలను తనలో పొందుపరుచుకున్న గ్రేట్ గిజా పిరమిడ్ సందర్శన నాకు ఒక గొప్ప మధురానుభూతిని మిగిల్చింది !

 

" పిరమిడ్ ప్రయోగాలు "

 

అనేకానేక పరిశోధనాత్మక పుస్తకాలు చదివి, INTERNET అంతర్జాలంలో మరింత సమాచారాన్ని సేకరించుకుని నేను పిరమిడ్‌లతో ఎన్నెన్నో ప్రయోగాలు చేపట్టాను. ఒకరోజు నా కూతురు " దేవిక " తన స్కూలు ప్రాజెక్ట్ వర్కుకు సంబంధించిన పేపర్లను ప్రింట్ చేసుకునే క్రమంలో మా ఇంట్లో ఉన్న ప్రింటర్ చెడిపోయి ఖంగారు పడుతూంటే .. నేను తనను సముదాయించి .. ఒక క్రిస్టల్ పిరమిడ్‌ను ఆ ప్రింటర్‌పై ఉంచగానే మా ఇతర ప్రయత్నం ఏమీ లేకుండానే ప్రింటర్ క్షణాల్లో చక్కగా పని చెయ్యడం మొదలుపెట్టింది ! నా పడక గదిలో నేను 4' X 4' పిరమిడ్ క్రింద ధ్యానం చేసుకున్నా, పడుకున్నా నాలో అధిమానస శక్తులు మేల్కొన్న అనుభూతిని నేను పొందుతున్నాను. ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞురాలిగా నేను పిరమిడ్ శక్తి గురించి రకరకాల ప్రయోగాలను చేపడుతున్నాను. 

 

" పిరమిడ్ శక్తి " పుస్తకాన్ని " పిరమిడ్ ఊర్జా " గా హిందీ భాషలోకి తర్జుమా చేయడం ఈ జన్మకు మహాభాగ్యం అయితే .. ఆ పుస్తకాన్ని 10 ఫిబ్రవరి, 2014వ తేదీన న ఈజిప్ట్ దేశంలోని గ్రేట్ గిజా పిరమిడ్‌లోని కింగ్స్ ఛాంబర్‌లో పిరమిడ్ మాస్టర్‌ల సమక్షంలో బ్రహ్మర్షి పత్రీజీ ఆవిష్కరించడం నా జన్మ జన్మల మహాభాగ్యంగా భావిస్తున్నాను ! ఇంతటి మహాభాగ్యాన్ని నాకు కలుగజేసిన పత్రీజీకి నా ధన్యవాదాలు !

 

" ధ్యాన భారత్ "

 

          ప్రస్తుతం నేను " ధ్యాన భారత్ " హిందీ మాసపత్రికకు మరి " పిరమిడ్ ధ్యాన జగత్ " హిందీ న్యూస్ లెటర్‌కు " ఎడిటర్ " గా పనిచేస్తూ నా చైతన్యాన్ని మరింత విస్తరించుకుంటున్నాను !

 

 

 

ఆశా గుప్తా

న్యూ ఢిల్లీ

సెల్: +91 9971716896

Go to top