" నాదం .. ధ్యానం రెండూ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి "

 

 

ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పద్మశ్రీ డా||యెల్లా వెంకటేశ్వరరావు గారి పేరు వినని సంగీత కళాభిమానులు ఉండరు ! " నవ మృదంగం " ప్రక్రియలో డాక్టరేట్ పట్టా పొంది .. 36 గం||ల పాటు నిరంతరాయంగా మృదంగం వాయించిన ఈ నవ్యయుగ వైతాళికులు " గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ " లో నమోదు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 లకు పైగా మృదంగ వాయిద్యకచేరీలను చేసి భారతప్రభుత్వం యొక్క " పద్మశ్రీ " అవార్డుతోపాటు కోకొల్లలుగా ఇతర అవార్డులనూ, రివార్డులనూ పొందిన " కళాతపస్వి " డా||యెల్లా వారు పిరమిడ్ ధ్యాన కుటుంబానికి అత్యంత ఆప్తులు !

 

" ధ్యాన మృదంగం " ప్రక్రియ ద్వారా బ్రహ్మర్షి పత్రీజీ వేణునాదంతో తమ మృదంగాన్ని మేళవిస్తూ వారు చేసిన శాస్త్రీయ ప్రయోగం .. ధ్యాన సాధనకు ఒక చక్కటి ఉపకరణంలా అందరి ప్రశంసలనూ అందుకుంది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్‌కు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటూ తమ మృదంగవాయిద్య విన్యాసంతో ప్రతి ఒక్కరినీ మైమరిపింపజేసే నాదమాంత్రికులు డా||యెల్లా వారికి సవినయంగా ప్రణామాలు అర్పిస్తూ .. అడిగిన వెంటనే " ధ్యానాంధ్రప్రదేశ్ " మాసపత్రికకు తమ అమూల్యమైన ఇన్నర్ వ్యూను అందించినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం !

 

మారం శివప్రసాద్, సెల్: 9347242373


మారం: " నమస్కారం స్వామీజీ, పిరమిడ్ ధ్యానకుటుంబానికి అత్యంత ఆప్తులయిన మీ గురించి మేం మీ ద్వారా వినగోరుతున్నాం ! "

 

డా||యెల్లా: నేను 1944 సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా " పాలకోడేరు " గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీరామమూర్తి దివ్య దంపతులకు జన్మించాను. మా తాతగారు శ్రీ యెల్లా వెంకటలింగం గారు మరి మా పెదతాతగారు యెల్లా వీరస్వామి గార్లు స్వాతంత్ర్య సమరయోద్ధులు .. మరి మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలను ‘తు.చ.’ తప్పకుండా పాటించే వారి నిజ అనుయాయులు ! గాంధీగారు భజనలు పాడుతూంటే .. మా తాతగారు వారికి అనుగుణంగా మృదంగం వాయించేవారట ! మృదంగానికి మా కుటుంబంలో నేను అయిదవ వారసుడిని.

 

మా నాన్నగారు వయొలిన్ విద్వాంసులు. " విజయనగరం సంగీత కళాశాల " లో వారు ప్రముఖ విద్వాంసులు " ద్వారం వెంకటస్వామి నాయుడు " గారికి శిష్యులు మరి అదే కళాశాలలో చదువుకున్న ప్రముఖ సినీ గాయకులు " ఘంటశాల " గారు మా నాన్నగారికి సహాధ్యాయులు !

 

సాంప్రదాయబద్ధమైన మడి ఆచారాలతో కూడుకున్న సంగీతం మరి వైద్యం వారసత్వంగా కూడిన కుటుంబం మాది ! " ఆయుర్వేదం " , " యునాని " వంటి సాంప్రదాయ వైద్యాలతో పాటు మా కుటుంబానికి వ్యవసాయం కూడా ఉండేది.

 

నా శ్రీమతి త్రిమూర్తమ్మ ! నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ! ఒక కుమారుడు మరణించాడు మరి ఇంకొక కుమారుడు ప్రస్తుతం గాయకుడిగా స్థిరపడ్డాడు !

 

మారం: " మీరు మృదంగం ఎవరి దగ్గర ఎప్పుడు నేర్చుకున్నారు? "

 

డా||యెల్లా: మా పెద్దనాన్న కీ.శే.యెల్లా సోమయ్య గారు ప్రముఖ మృదంగ విద్వాంసులైన పాల్ఘట్ మణి అయ్యర్ గారి ప్రియశిష్యులు ! వారి ద్వారానే మా పెద్దనాన్న గారు తంజావూరు బాణీలనూ, తమిళసాంప్రదాయాన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తీసుకుని వచ్చారు. కొన్ని వేలమందికి మా పెద్దనాన్నగారు ఉచితంగా మృదంగాన్ని నేర్పించారు. బీద విద్యార్థులను మా ఇంట్లోనే వారాలకు ఉంచి మరీ .. వారికి మృదంగం నేర్పించి వారిని గొప్ప విద్వాంసులుగా రూపుదిద్దేవారు ! మా నానమ్మ, అమ్మ కూడా చక్కగా భక్తి గీతాలు పాడేవారు. నా ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో ఇలా సంగీత సాధనలు, కచేరీలు, విభావరులు, చుట్టుప్రక్కల వారంతా చేరి భజనలు చేస్తూ ఉంటే .. నాదంతో పాటే పెరిగి పెద్దయిన నేను నా నాల్గవ యేటనే మృదంగాన్ని వాయించడం మొదలుపెట్టాను.

 

ఒక ప్రక్క మా తాతగారు వైద్యం కోసం కల్వంలో ఆయుర్వేదం, యునానీ మందులను నూరుతూ పుటాలు పెడుతూంటే .. ఇంకో పక్క మా పెద్దనాన్నగారు వారి శిష్యులతో కలిసి మృదంగ కచేరీలు చేస్తూండేవారు. గొప్ప కళాక్షేత్రంలా ఉండేది మా ఇల్లు ! సంగీత విద్యార్థులకూ, వైద్యవిద్యర్థులకూ, రోగులకూ నిరంతరం ఉచిత భోజనాలతో మా పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి అంతా కైంకర్యం అయిపోయింది.!

 

మారం: మీ మొట్టమొదటి మృదంగ కచేరీ ఎప్పుడు జరిగింది?

 

డా||యెల్లా: దాదాపు 63 సంవత్సరాల క్రితం .. అంటే అప్పుడు నాకు ఏడేళ్ళ వయస్సన్న మాట ! మా పెద్దనాన్నగారికి సంతానం లేకపోవడంతో వారు నన్ను పెంచుకునేవారు. నాలో మృదంగం పట్ల ఉన్న ఆసక్తిని చూసి ముచ్చటపడి వారు అందులోని మెళకువలు నాకు నేర్పించడం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో వారు " ఆల్ ఇండియా రేడియో "లో నిలయ విద్వాంసులుగా పనిచేసేవారు.

 

ఒకసారి కచేరీలు నిర్వహించే ఒక పెద్దాయన మా పెద్దనాన్నగారి దగ్గరికి వచ్చి " మృదంగం వాయించే ఆర్టిస్ట్ ఎవరయినా కచేరీ కోసం కావాలి " అని అడగడంతో వారు ఆ వచ్చిన పెద్దాయన ముందు నన్ను మృదంగం వాయించమన్నారు. అది చూసి వెంటనే ఆ పెద్దాయన సాయంత్రం నాకోసం కారు పంపించి మరీ కచేరీకి పిలిపించుకున్నారు.

 

" కన్నడ సేవా సంఘం " వారు విజవాడలోని ‘ వెల్‌కమ్ హొటల్లో ’ చేసిన ఆ కార్యక్రమంలో నేను వాయించిన మృదంగానికి జనం అంతా మెచ్చుకున్నారు ! అది చూసి మా పెద్దనాన్న గారు చాలా సంతోషపడిపోయి .. నాకు తమ విద్యనంతా ధారపోసి నన్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. కొంతకాలానికి వారి మార్గదర్శనంలో నేనే వారి శిష్యులకు మృదంగం పాఠాలు కూడా చెప్పుతూ వచ్చాను. ఈ క్రమంలో నా పధ్నాలుగవ యేట ఆల్ ఇండియా రేడియో వారి సారధ్యంలో నిర్వహించబడిన జాతీయ స్థాయి మృదంగం పోటీల్లో పాల్గొని నేను " ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ "ను అందుకున్నాను. ఢిల్లీ వెళ్ళి అప్పటి భారత రాష్ట్రపతి డా||సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా ఆ బంగారు పతకాన్ని అందుకోవడం ఒక గొప్ప అనుభూతి.

 

మారం: ఎవరెవరితో కలిసి మీరు కచేరీలు చేస్తూండేవారు?

 

డా||యెల్లా: చాలా మంది ప్రముఖ విద్వాంసులకు నేను మృదంగాన్ని వాయించాను. " చెంబై వైద్యనాద భాగవతార్ గారు " .. " శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారు " .. " భీమ్‌సేన్ జోషి " .. " అల్లా రఖా " .. " జాకీర్ హుస్సేన్ " వంటి గొప్ప గొప్ప విద్వాంసుల కచేరీలలో నేను సైడ్ ఆర్టిస్ట్‌గా మృదంగం వాయించగలగడం నా అదృష్టం !

 

ఇక నేను చేసిన " సోలో ప్రోగ్రామ్ " లకు లెక్కెలేదు ! ఒక్కోసారి ఆనందం పట్టలేని ప్రేక్షకులు ఉంగరాలు, వెండి పళ్ళాలు, డబ్బులు, వెండిగ్లాసులు కుప్పలుతెప్పలుగా నాకు బహూకరిస్తూ ఉండేవారు !

 

మారం: " ఇంకా కచేరీలు చేస్తూన్నప్పటి మీ అనుభూతులు? "

 

డా||యెల్లా: ఒకసారి భగవాన్ సత్యసాయిబాబా వారు పుట్టపర్తిలో కచేరీ చెయ్యమని నాకు పిలుపు ఇచ్చారు. దాదాపు 30,000 మంది భక్తులకు పైగా నిశ్శబ్ధంగా కొలువుదీర ఉన్న " సాయి కుల్వంత్ హాల్ "లో బాబావారి సమక్షంలో చేసిన నా మృదంగ వాయిద్య విన్యాసం .. అమరనాదంలా సాగి సాక్షాత్తూ బాబా వారినే దివ్యపారవశ్యపు స్థితికి తీసుకునివెళ్ళింది. కచేరీ అయిపోతూనే బాబా వారు స్వయంగా లేచివచ్చి .. నన్ను ఆశీర్వదించి .. చుట్టూ డైమండ్స్ పొదిగి ఉన్న డాలర్‌తో కూడిన ఒక పెద్ద బంగారు గొలుసును సృష్టించి మరీ నాకు బహుకరించారు ! ఆ తరువాత ఎన్నోసార్లు నేను వారి పుట్టినరోజు కార్యక్రమాలకు వెళ్ళి వారి సమక్షంలో మృదంగం కచేరీ చేశాను.

 

మారం: " మీరు పరిశోధించి రూపొందించిన ‘ నవ మృదంగం ’, ‘ శివతాండవం ’ అనే అద్భుత ప్రక్రియలను గురించి తెలియజేయండి? "

 

డా||యెల్లా: " నవ్యమృదంగం " అన్నది ఒక వినూత్న పరిశోధనా ప్రక్రియ ! దానికి ఏకాగ్రత, పట్టుదల ఎంతో అవసరం ! వివిధ స్వరాల సమ్మేళనంతో రూపొందించబడిన ఈ ప్రక్రియ ఎందరో కళాభిమానులు మన్ననలను చూరగొంది. అలాగే " శివతాండవం " కూడా ! దివంగత ముఖ్యమంత్రి శ్రీ N.T.రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నా మృదంగ కచేరీ ఏర్పాటు చేయబడింది. దాదాపు అయిదు లక్షల మంది హాజరయిన ఆ కార్యక్రమంలో నేను శివతాండవం వాయిస్తూంటే .. NTR గారితో సహా అందరూ మైమరచిపోయారు. దురదృష్టవశాత్తు అప్పుడే వారిపై హత్యాప్రయత్నం కూడా జరిగింది. కానీ చిన్న గాయంతో బయటపడిన వారు .. చేతికి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా స్టేజీ పైకి వచ్చి నన్ను అభినందించి .. సత్కరించి మరీ వెళ్ళారు ! నవమృదంగం ప్రక్రియకు గాను నాకు " డాక్టరేట్ " కూడా వచ్చింది.

 

మారం: " మీరు యూనివర్సిటిలో సంగీత విభాగానికి అధిపతిగా ఉన్నారు కదా.. "

 

డా||యెల్లా: అవును, NTRగారు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపిస్తున్నారని తెలిసి అందులో కళాకారులకు కూడా సంబంధించిన ఒక విభాగం ఉండేలా చూడమని వారిని అభ్యర్థించాను ! అందుకు సంబంధించి వారికి ఒక ప్రాజెక్ట్ రిపోర్టును కూడా సమర్పించాను. దానికి వారు సానుకూలంగా స్పందించి జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేసి దానిని అధ్యయనం చేయడం జరిగింది. ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడినే ! కమీటీ నివేదికను అనుసరించి కళల్లో B.A..M.A..M.Phil.. Ph.D. కోర్సులను ప్రవేశపెట్టి నన్ను తెలుగు విశ్వవిద్యాలయంలో Head of the Department for the school of Fine Arts గా ఆ తరువాత ‘ డీన్ ’ గా 1989 నుంచి 2004 వరకు నియమించారు.

 

నా హయాంలో నాటక రంగం, జానపద కళలు, శిల్పకళ, జ్యోతిష్య శాస్త్రం, వీణ, వయొలిన్, మృదంగం, సత్యం, టూరిజమ్ వంటి వాటిరంగాల్లో డిప్లోమో .. డిగ్రీ .. పీజీ .. Ph.D. కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది.

 

మారం: " ధ్యానానికీ, నాదానికీ ఉన్న సంబంధాన్ని వివరించండి ! "

 

డా||యెల్లా: రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్న రెండు గొప్ప విభాగాలు ! రెండింటికీ మౌలిక సూత్రం సాధన ! " ధ్యాన సాధన ", " నాద సాధన " రెండూ కూడా గాఢ స్థితిలో మనల్ని ఒక అలౌకికమైన అనంత స్థితిలోకి తీసుకుని వెళ్తాయి. మిగతా కళలు కూడా మనల్ని అలౌకిక స్థితిలోకి తీసుకునివెళ్తాయి కానీ శబ్ధం లోంచి నిశ్శబ్ధంలోకి మనల్ని తీసుకుని వెళ్ళే నాదం మరి నిశ్శబ్ధంలోంచి పారలౌకిక నిశ్శబ్ధంలోకి మనల్ని తీసుకుని వెళ్ళే ధ్యానం .. రెండూ కూడా దివ్యత్వాన్ని మనం చేరుకునేదారులు ! ఇందులో ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేసే ధ్యానం యొక్క పరిధి ఎంతో విస్తృతమైంది ! ధ్యానం వలన సాధకుడిలో మౌలికంగా " ఏకాగ్రత " అన్నది సిద్ధిస్తుంది. సంగీత సాధన కూడా అలాంటి ఏకాగ్రతనే సాధకుడికి సిద్ధింపజేస్తుంది. కానీ దాని పరిధి అంతవరకే ! గాఢ ధ్యానస్థితిలో పొందే దివ్యచక్షువు అనుభవాలూ, సూక్ష్మశరీరయానాలూ అతీంద్రియ శక్తుల సిద్ధి, అనేకానేక లోకాల వాసులతో సంపర్కం, లోక కళ్యాణ కార్యక్రమాల నిర్వహణ .. ఇవన్నీ ధ్యానం వలన కలిగే అద్భుతాలు !

 

ధ్యాన సాధన, లేదా సంగీత సాధన చేసే వారి ఆహార్యంలోనే గొప్ప స్పష్ఠత ఉంటుంది. విప్లవాత్మకమై తీవ్రధోరణులు ఉన్న వాళ్ళు కూడా ఈ సాధనతో సౌమ్యంగా, నమ్రతగా ఉంటారు. ఆనాటి త్యాగరాజస్వామి, అన్నమయ్య .. ఈనాటి గణపతి శ్రీసచ్చిదానందస్వామి, మన బ్రహ్మర్షి పత్రీజీ నాదం ధ్యానం కలగలపి గొప్ప గొప్ప ప్రయోగాలు చేసేవాళ్ళే .. చేస్తున్నవాళ్ళే !

 

మారం: " పత్రీజీ నాదధ్యానాన్ని గురించి వివరించండి ! "

 

డా||యెల్లా: పత్రీజీ ధ్యాన మార్గంలోకి రాక ముందు వారి స్థితి వేరు ! 35 యేళ్ళ క్రితం విశ్వం నుంచి వారిలోకి ఒక వినూత్న శక్తి ప్రవేశించి సిద్ధత్వంతో వారిని పరిపూర్ణులైన యోగీశ్వరులుగా మలిచింది. ధ్యానయోగీశ్వరుగా ఆవిష్కరింపబడిన పత్రీజీ మంత్రం కంటే .. జపం కంటే .. పూజ కంటే, ప్రార్థన కంటే లక్షల రెట్లు శక్తివంతమైన "నాద ధ్యానాన్ని" ఈప్రపంచానికి అందించారు. నాదం-లయ అయితే ధ్యానం-శక్తి ! శివుడు-లయ అయితే పార్వతి-శక్తి ! అర్థనారీశ్వర తత్వానికి పరిపూర్ణ రూపమైన శివపార్వతులే .. నాద ధ్యానం ! అందుకే పత్రీజీ ధ్యానానికి సంగీతాన్ని జోడించి .. నాదధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. అది వారికి విశ్వం నుంచి అందిన సందేశం ! వారు చేసే ధ్యానప్రచార సేవ నాకు ఎంతో ఇష్టం ! తమలో ప్రవేశించిన వినూత్న శక్తిపట్ల ఎరుకతో వారు తమ జీవన శైలిని పూర్తిగా మార్చుకుని, ప్రపంచానికి ఒక బ్రహ్మ మార్గాన్ని చూపారు. ఉన్నతలోకాల నుంచి తమకు అందించబడిన ఆ వినూత్న శక్తిని వారు అద్భుతంగా వినియోగించుకుంటూ తమ ఆధ్యాత్మిక ప్రగతిని మరింత వేగవంతం చేసుకుంటున్నారు !

 

వారు తమ శక్తినీ, జ్ఞానాన్నీ కేవలం తమ కోసం తమ కుటుంబం కోసం మాత్రమే వినియోగించుకోకుండా " ఈ ప్రపంచం అంతా కూడా నా స్వంత కుటుంబం " అనుకుని సేవ చేస్తున్నారు ! స్వతహాగా సంగీత విద్వాంసులు అయిన పత్రీజీ సంగీత కచేరీలు చేస్తే కనకవర్షమే కురిసివుండేది ! కానీ వారు తమ సంగీత విద్యనూ మరి జ్ఞానాన్నీ విశ్వశ్రేయస్సుకే ధారపోస్తున్నారు. వారి సమక్షంలో వేణునాద ధ్యానం చేసి నేను అద్భుత ఆనందస్థితిని పొందాను.

 

మారం: " పత్రీజీతో కలిసి మీరు చేసిన ప్రయోగాలు .. "

 

డా||యెల్లా: ఎప్పటికప్పుడు మృదంగంపై నిత్యనూతనంగా విభిన్నమైన ప్రయోగాలు చెయ్యడం నాకు ఎంతో ఇష్టం ! 2013 డిసెంబర్ ధ్యానమహాచక్రంలో నేను చేసిన మరొక క్రొత్త ప్రయోగం కుండలినీ శక్తిని అనాహతంలో చేర్చడం: వేలాది మంది ధ్యానులు ఆ కార్యక్రమాన్ని అనంత పారలౌకిక ధ్యానస్థితిలో ఆనందించారు .. మరి తమ తమ అంతరంగాల్లో నర్తించారు. ఇక పత్రీజీతో కలిసి చేసిన " నాదమృదంగం " .. " మృదంగంపై ఓంకారం " .. " మృదంగం పై వేదం " .. వంటి ప్రక్రియలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి ! ముఖ్యంగా వారితో కలిసి నేను చేసిన నాదమృదంగం ప్రక్రియలో పంచభూతాల " బీట్స్ " ను శరీరంలోని " నాడు "లతో అనుసంధానం చేసి మరీ నూతనంగా ఆవిష్కరించాను.

 

మారం: " పిరమిడ్ కుటుంబానికి మీ సందేశం? "

 

డా||యెల్లా: 2001 సంవత్సరం నుంచినాకు పిరమిడ్ ధ్యానకుటుంబంతో సన్నిహిత సంబంధం ఏర్పడింది ! పత్రీజీ నాకు అత్యంత ఆప్తులు ! ధ్యానం .. శాకాహారం .. పిరమిడ్ శక్తి .. ప్రపంచం నలుమూలలూ విస్తరింపజేయడం ఒక్కటే వారి అజెండా ! ఈ లక్ష్యసాధన కోసం పిరమిడ్ సొసైటీ .. ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఎక్కుతూ ఆధ్యాత్మిక రంగంలో విజయకేతనం ఎగురవేస్తోంది. 

 

పూర్వం హిమాలయాలకూ, అరణ్యాలకూ వెళ్ళి చేసుకునే నిగూఢమైన సాధనలన్నింటినీ సంసారంలో ఉంటూనే .. ప్రాపంచిక పనులను నిర్వర్తించుకుంటూనే .. కాఫీ త్రాగినంత సులభంగా చేసుకుంటూ .. " సంసారంలోనే నిర్వాణం " పొందే చక్కటి మార్గాన్ని పత్రీజీ మనకు చూపారు. జన్మ జన్మల సాధన వల్ల హిమాలయ యోగులు పొందిన సిద్ధులను మీలో చాలా మంది పొందే ఉన్నారు ! అందుకే మీరంతా మీ మీ సాధారణ జీవన వ్యాపారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతున్నారు.

 

మొన్న 2013 డిసెంబర్‌లో నా స్థితి కూడా అంతే ! అప్పటికే గుండెకు బైపాస్ సర్జరీ జరిగి కొంతకాలంగా విశ్రాంతి స్థితిలో ఉన్న నేను ధ్యానమహాచక్రం కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఓపిక చేసుకుని మరీ వచ్చాను. మహానుభావులైన పత్రీజీ సమక్షంలో మరి నాకెంతో ఇష్టమైన కైలాసపురి శక్తిక్షేత్రంలో మళ్ళీ మళ్ళీ కచేరీలు చేయడం నా భాగ్యంగా భావిస్తాను ! పత్రీజీ ఎప్పుడు ఎక్కడికి పిలిచినా .. వస్తూనే ఉంటాను .. మృదంగ ధ్యానం చేయిస్తూనే ఉంటాను. ఇది నా కర్తవ్యంగా భావిస్తూ .. ఈ విధంగా పత్రీజీ ధ్యానప్రచారోధ్యమంలో నేను కూడా భాగస్వామిని అవుతున్నందుకు ఆనందిస్తున్నాను ! ఇంత గొప్ప గురువుతో కలిసి లోక కళ్యాణకార్యక్రమాలను చేపడుతూ .. జీవితాలను ధన్యం చేసుకుంటున్న మీ అందరికీ నా విశేష అభినందనలు !!

 

 

 

పద్మశ్రీ Dr.యెల్లా వెంకటేశ్వరరావు
హైదరాబాద్

Go to top