" నా జన్మ ధన్యం అయ్యింది "

నా పేరు శ్రీనివాసరెడ్డి. మాది కొల్హాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా .. నేను 2006 ఫిబ్రవరిలో నా భార్య సావిత్రి  ప్రోత్సాహంతో " పిరమిడ్ ధ్యానం " లోకి వచ్చాను. మా ఇంటిలోనే పిరమిడ్ కేర్ సెంటర్‌ని ఏర్పాటు చేసి పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ శ్రీ ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో " 40 వారాలు - 40 మాస్టర్లు, ప్రతి నెలా పౌర్ణమి " కార్యక్రమాలను విశేషంగా నిర్వహించాం.

" ప్రతి గ్రామం ధ్యాన పిరమిడ్‌తో శక్తిక్షేత్రంలా మారాలి " అన్న పత్రీజీ ఆకాంక్షకు అనుగుణంగా " కొల్హాపూర్‌లో ఒక ధ్యాన పిరమిడ్ నిర్మించాలి " అన్న సంకల్పం నాకు కలిగింది. సంకల్పానికి అనుగుణంగా 2007లో కొల్హాపూర్ రాజా వారు వితరణ చేసిన స్థలంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివప్రసాద్ గారిచే భూమిపూజ జరిపించాం.

శంఖుస్థాపనైతే చేశాం కానీ .. పిరమిడ్ నిర్మాణానికి సరిపడా డబ్బు మా దగ్గర ఎంత మాత్రం లేదు. అయినా " అది విశ్వం కోసం తలపెట్టిన నిర్మాణయజ్ఞం కనుక దానిని కట్టించుకునే వారినే ప్రకృతి ఎంపిక చేసి మరీ పంపించాలి " అని సంకల్పం పెట్టి మరీ ధ్యానం చేశాము.

దాని ఫలితంగానే అప్పుడే ధ్యానంలోకి వచ్చిన పెద్దలు శ్రీ కాల్వగడ్డ నరసింహయ్య శెట్టి దంపతులు పిరమిడ్ నిర్మాణానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏ ఆటంకం లేకుండా 36'X36' సైజులో " ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యానకేంద్రం " నిర్మాణం సర్వాంగ సుందరంగా పూర్తి చేసుకుని బ్రహ్మర్షి పత్రీజీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించుకుంది !

ఇదంతా ఒక ఎత్తయితే .. పిరమిడ్ నిర్మాణం పూర్తయినప్పటి నుంచి దాని నిరంతర నిర్వహణ బాధ్యతను చేపట్టిన Y.జయశ్రీ, ప్రకాశ్ దంపతుల వితరణ మరెంతో గొప్పది. ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అందించి నిర్మించిన పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ అద్భుతమైన అనుభవాలను పొందుతున్నారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడంలో నాకు నా భార్య శ్రీమతి సావిత్రి చక్కటి సహకారాన్ని అందిస్తూ వుంది.

ధ్యానమహాచక్రం - IV లో సేవలు

2013 డిసెంబర్‌లో జరిగిన కైలాసపురి ధ్యానమహాచక్రం-IV కార్యక్రమాలలో పత్రీజీ మాకు 14 రోజులపాటు జరిగిన అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన " స్టోర్ రూమ్ ఇన్-చార్జ్ విధులు " అనే గొప్ప బాధ్యతాయుతమైన పనిని అప్పగించడం మా జన్మజన్మల సుకృతంగా భావిస్తున్నాం !

ప్రతిరోజూ వేలాది మంది యోగులకు అందించబడిన ఈ బృహత్ అన్నదాన కార్యక్రమానికి తరలి వచ్చిన వంట సామగ్రిని భద్రపరచడం .. మరి అవసరం మేరకు వాటిని వినియోగించడం .. అన్నీ కూడా లెక్కప్రకారం నేను పటిష్ఠంగా నిర్వహించగలిగాను.

ఉదయం అల్పాహారం మొదలుకుని రాత్రి భోజనం వరకు విరామం లేకుండా " వైష్ణవి కేటరర్స్ " వంట మాస్టర్లతో కలిసి పనిచేయడం .. మరి ఈ సందర్భంగా ఎందరో అంకిత భావం కలిగిన మాస్టర్లతో కలిసి పరస్పర సహకారంతో పనిచేసే అవకాశం మాకు కలగడం మా అదృష్టం ! " ఈ అనుభవంతో మేము, భవిష్యత్తులో, ఏ పనినైనా మరింత సమర్థవంతంగా నిర్వహించగలం " అన్న నమ్మకాన్ని పత్రీజీ మాకు కలిగించారు. పత్రీజీకి మా కృతజ్ఞతలు !

జంబుల శ్రీనివాస రెడ్డి, కొల్హాపూర్

సెల్ : +91 9550250160

Go to top