" పిరమిడ్ ధ్యాన జగత్ కోసం కృషి చేస్తాను "

 

 

నా పేరు హనుమంతరావు. నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో " అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ " గా టూటౌన్ పోలీస్ స్టేషన్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాను. నా వయస్సు 53 సంవత్సరాలు. నేను 2008 నవంబర్‌లో బయ్యారపు రామారావు గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. రామారావు గారు నన్ను నిర్మాణంలో ఉన్నటువంటి " శ్రీ సాయిసుధా పిరమిడ్ "కి తీసుకువెళ్ళి అక్కడ సువర్ణ మాస్టర్‍ గారిని పరిచయం చేశారు. సువర్ణ మేడమ్ ధ్యానం గురించి .. వారి యొక్క అనుభవాలూ చెబుతూ పిరమిడ్ క్రింద నాతో ధ్యానం చేయించారు.

 

మొదటిరోజు ధ్యానంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తరువాత వారు నా ధ్యాన అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు.

 

అదేరోజున రాత్రి మా ఇంట్లో ధ్యానం ఎంతసేపు చేయగలనో చూద్దాం అనిపించి ధ్యానంలో కూర్చుని 55 నిమిషాలు ధ్యానం చేశాను. కానీ అది కేవలం నాకు 10నిమిషాలు చేసినట్టుగా అనిపించి నా మనస్సు తేలిక పడింది. అలా 45 రోజుల పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేశాను.

 

నా చిన్నతనం నుంచే నేను వీరబ్రహ్మేంద్రస్వామి గారి భక్తుడిని. ధ్యానం చేయకముందు నేను లలితా, విష్ణు సహస్రనామ పారాయణలు, హనుమాన్ చాలీసా గంటలు గంటలు చేస్తూ, కార్తీకమాసంలో శివపూజలూ, హోమాలూ, మహన్యాస రుద్రాభిషేకాలు చేస్తూండేవాడిని. అన్ని పూజలు చేస్తూ కూడా నాకు ఎక్కడో కొంత వెలితిగా ఉండేది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ధ్యానం చేయాలని అనిపించేది కానీ .. " ధ్యానం అంటే ఏమిటి? " .. " ఎలా చేస్తారు? " అన్నది తెలియక కళ్ళు మూసుకుని కూర్చుని దైవ నామస్మరణ చేసేవాడిని. ధ్యానం మొదలుపెట్టాక 45 రోజుల ధ్యానంలో నేను పొందిన అనుభవం తరువాత మాత్రమే నాకు నా వెలితి ఏంటో తెలిసింది. " నేను ఆధ్యాత్మిక మార్గంలో నడవడమే కాదు నాతోటి వారందరూ ఈ మార్గంలో నడిచే విధంగా సేవచేయాలి " అన్న లక్ష్యస్పష్ఠత నాలో రాగానే నాకు ఎంతో తృప్తిగా అనిపించింది.

 

ధ్యానం చేయడానికి ముందు నేను B.P., అలసటలతో చాలా ఇబ్బందిపడేవాడిని. కాస్త పనికే ఎంతో కష్టంగా అలసటగా అనిపించేది. నిత్యం B.P., మాత్రలు వాడేవాడిని!

 

45 రోజులు ధ్యానం చేసిన తరువాత నాకు B.P. పూర్తిగా నయమయ్యింది. అయినా అనుమానం వచ్చి మధ్యమధ్యలో ప్రతి 15 రోజులకి ఒకసారి డాక్టర్ తో B.P. చెకప్ చేయించుకోగా అది పూర్తిగా సగటు స్థాయికి చేరి అక్కడే స్థిరంగా నిలిచిపోయింది. అలసట కూడా పూర్తిగా తగ్గి నేను చాలా హుషారుగా వున్నాను. 45 రోజుల ధ్యానం తరువాత నేను 28 సంవత్సరాల వయస్సు వున్నప్పుడు ఎంత హుషారుగా వున్నానో అంత హుషారుగా వున్నాను ! నా కుటుంబ సభ్యులతో మెలిగినట్లు ప్రతి ఒక్కరితో ప్రేమగా, ఆప్యాయంగా మెలగడం నాకే తెలియకుండా జరిగిపోతుంది. 

 

ఇంత చక్కటి ధ్యానాన్ని అందరికీ వివరించి వారితో కూడా ధ్యానం చేయించి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలని ధ్యానం చేస్తూ, ధ్యానం ప్రచారంచేస్తూ 2009 జనవరిలో బ్రహ్మర్షి పత్రీజీని మొదటిసారి కలవడం జరిగింది. నా మిత్రులతో కలిసి మొట్టమొదటిసారి సార్‌ను కలిసిన రోజు ఉదయం టిఫిన్ మరి మధ్యాహ్నం భోజనం వారి ఇంట్లోనే స్వయంగా వారి చేతుల మీద వడ్డించి వారు మమ్మల్ని ఓ తండ్రిలా, తన కుటుంబ సభ్యులుగా ప్రేమ అప్యాయతలతో చూసుకున్నారు. 

 

తరువాత 2011 సంవత్సరం .. పాల్వంచలోని బొల్లారిగూడెంలో మా ఇంటి ప్రాంగంణంలో " 10'X10' " సుధాదేవి పిరమిడ్ " ను నిర్మించి పత్రిసార్ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయించుకోవడం జరిగింది. ప్రతిరోజూ ధ్యానం చేస్తూ .. ఎవరికైనా ధ్యానం గురించి వివరిస్తూ, వారితో ధ్యానం చేయిస్తేనే కాని నాకు తృప్తిగా వుండదు. పోలీస్‌స్టేషన్‌లో కూడా సదా వృత్తిపరమైన ఒత్తిడితో సతమతమయ్యే నాతోటి పోలీస్ సిబ్బందితో పాటు వివిధ అవసరాల కోసం స్టేషన్‌కి వచ్చే వారికి ధ్యానం గురించీ, శాకాహారం గురించీ తెలియపరుస్తూ వారికి ధ్యాన, శాకాహార పుస్తకాలు ఇస్తూ వస్తున్నాను. 

 

నా సహ-ధ్యానమిత్రులతో కలిసి ఒక బృందంలా ఏర్పడి పాల్వంచ పరిసర ప్రాంతాలలో పిరమిడ్‌లను నిర్మిస్తూ, ప్రతివారాంతంలోనూ, పౌర్ణమి రోజులలో సామూహిక ధ్యాన క్లాసులను నిర్వహించడం మరి రాష్ట్రంలో సీనియర్ మాస్టర్లచేత సుమారుగా 200 పైగా క్లాసులను నిర్వహించడం జరిగింది. పాల్వంచ మండలంలో 18 మరి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఏడు .. వెరసి మొత్తం 25 పిరమిడ్‌లను నిర్మించి నా జన్మను సార్ధకం చేసుకుంటున్నాను. నేను ఇంత చక్కగా, ఆనందంగా సేవ చేయడానికి నా భార్య " సరస్వతి " మరి నా పిల్లలు " అపర్ణ " .. " అనూష " ఎంతగానో సహకరిస్తున్నారు. 

 

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నేను నా వృత్తిలో బిజీగా వున్నప్పటికీ నా కుటుంబసభ్యులు క్లాసులు ఇవ్వడానికి వచ్చిన మాస్టర్స్‌ని ఆహ్వానిస్తూ వారికి కావలసిన ఏర్పాట్లను చక్కగా చూసుకోవడమే కాకుండా మా పిరమిడ్‌కి వచ్చిన ధ్యానులను, క్రొత్తగా వచ్చే వారికి ధ్యానం గురించి వివరిస్తూ  వారి ధ్యాన అనుభవాలను శ్రద్ధగా వింటూ .. నా వెన్నంటేవుండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు.

 

మా పిరమిడ్ వచ్చే ధ్యానుల్లో చాలా మందికి వివిధ రకాలైన వ్యాధులు నయమవడమే కాకుండా కొందరు విద్యార్థులు మనోధైర్యాన్ని కూడా పొందడం జరిగి వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. నేను కూడా నా వృత్తిపరమైన బాధ్యతలను ధ్యానశక్తితో మరింత సమర్థవంతంగా నిర్వహించకుంటూనే సదా " ధ్యానజగత్ " సేవలో తరిస్తాను !

 

 

హనుమంతరావు
పాల్వంచ, ఖమ్మంజిల్లా

సెల్ : +91 9573369444

Go to top