" ధ్యాన శక్తితో నాలో ఆత్మస్థైర్యం పెరిగింది "

 

 

నా పేరు శిరీష. మాది కర్నూలుకు 90కి.మీ. దూరంలో వున్న " కరిమద్దెల " గ్రామం. మా నాన్న వ్యవసాయదారుడు. చిన్నప్పటి నుంచి నేను ఎంతో చలాకీగా ఉంటూ .. స్కూలు చదువులో ఫస్టు వస్తూ అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేదాన్ని. ఆనందం తప్ప మరేమీ తెలియని నాకు 6 వ తరగతిలో ఉన్నప్పటి నుంచి క్రమంగా కంటి చూపు తగ్గిపోతూ వచ్చింది. మా తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెంది నన్ను అనేక హాస్పిటల్స్ చుట్టూ త్రిప్పుతూ .. నా చికిత్స కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టారు.

 

నరాలబలహీనత వల్ల ఇలా జరిగింది అని తేల్చి దానికి చికిత్స లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. క్రమక్రమంగా నా చూపు మరింత తగ్గిపోతూ కొంతకాలానికి పూర్తిగా పోయి .. ఇక నాది అంధకారపు బ్రతుకు అయిపోయింది. అడుగు తీసి అడుగువెయ్యాలన్నా మా అమ్మ తోడు ఉండాల్సిందే ! నా చీకటి బ్రతుకును తలచుకుని ఏడుస్తూ .. విపరీతమైన భయంతో కాలం వెళ్ళదీస్తుండే దానిని ; నా బాధ చూడలేక మా తల్లిదండ్రులు నన్ను బెంగళూరుకు తీసుకుని వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చుచేసి నాకు ఆపరేషన్ కూడా చేయించారు. అయినా లాభం లేకపోయింది.

 

ఈ క్రమంలో మా ఊరి ప్రక్కనే ఉన్న " పెసరవాయి " గ్రామం నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్ " మోహన్ సార్ " గారు నా దుస్థితి చూసి " ఇది కర్మసిద్ధాంతం ప్రకారం నువ్వే డిజైన్ చేసుకున్నావు .. ధ్యానం చేసి ఈ కర్మను నువ్వే తొలగించుకోవాలి " అని చెప్పి నాకు ధ్యానం నేర్పించి 41 రోజులపాటు ధ్యానం చేయమన్నారు. మాంసాహారం యొక్క అనర్థాలను వారి నుంచి తెలుసుకుని .. వెంటనే శుద్ధశాకాహారిగా మారిపోయి వారు చెప్పినట్లు మండల ధ్యాన దీక్ష చేశాను.

 

ధ్యానం చేసినంత సేపు నా కళ్ళల్లో ఏదో కాంతి ప్రవేశిస్తూ అక్కడి జీవకణాలన్నింటినీ ప్రకంపనలతో నింపివేస్తున్నట్లు నాకు స్పష్టంగా తెలిసేది. అంతకు ముందు కటిక చీకటితో నిండిన నా కళ్ళు .. ఎవరైనా నా ముందుకు రాగానే అస్పష్టంగా నీడలా కదలాడినట్లుతోయడం మొదలయ్యింది. నాలోని భయం పటాపంచలవుతూ .. " నేనొక్కదాన్నే ఎక్కడికయినా వెళ్ళగలను " అన్న ధైర్యం నాలో కలుగసాగింది ! నా చిన్నతనం నుంచి నన్ను వేధిస్తూ వస్తున్న ఆస్త్మా వ్యాధి పూర్తిగా నివారించబడింది !

 

ఈ క్రమంలో నేను పత్రీజీ సందేశాలతో కూడిన క్యాసెట్లను వింటూ ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నాను. " పిరమిడ్ శక్తి " గురించి తెలుసుకుని .. " మా ఊరి కోసం ఒక శక్తివంతమైన పిరమిడ్ నిర్మించాలి " అనుకున్నాను.

 

అనుకోవడమే తడవు మా తల్లిదండ్రులను ఒప్పించి దాదాపు అయిదు లక్షల విలువైన మా స్థలంలో 15'X15' పిరమిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. నా సంకల్పాన్ని మా ఊరి MLA గారికి తెలియజేయగా వారు ఎంతో దయతో పిరమిడ్ నిర్మాణం కోసం 25,000/- రూపాయలను తమ వంతు విరాళంగా అందించారు. పిరమిడ్ మాస్టర్లందరి సహకారంతో 2012 నవంబర్‌లో 2,25,000/- రూపాయల ఖర్చుతో " శ్రీ సదానందయోగి పిరమిడ్ ధ్యానకేంద్రం " నిర్మాణం పూర్తిచేసుకున్నాం.

 

14 ఫిబ్రవరి, 2014 తేదీన బ్రహ్మర్షి పత్రీజీ విచ్చేసి 1200 మంది గ్రామస్థులు పాల్గొన్న గొప్ప కార్యక్రమంలో నన్ను ఎంతగానో అభినందించి పిరమిడ్‌ను ప్రారంభించారు ! సీమాంధ్ర బంద్ కారణంగా ఆరోజు రోడ్లపై వాహనాలు నడవకపోయినా కర్నూలు నుంచి కరిమద్దెల వరకు 90కి.మీ. దూరాన్ని పత్రీజీ తామే స్వయంగా స్కూటర్‌ను నడుపుకుంటూ వచ్చి మరీ పిరమిడ్ ప్రారంభోత్సవం చేశారు !వారికి నా ధన్యవాదాలు !

 

ఇప్పుడు మా పిరమిడ్‌లో ప్రతిరోజూ 70 నుంచి 100 మంది వచ్చి కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ధ్యానం గురించీ .. శాకాహారం గురించీ .. తెలియజేస్తూ నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను ! ధ్యానశక్తి సహాయంతో తొందర్లోనే నేను నా కంటి చూపును మళ్ళీ పొందుతాను .. మరింతగా ధ్యాన విశ్వం కోసం సేవ చేసుకుంటాను. ఈ నమ్మకం నాకు వందకు వంద శాతం స్థిరంగా ఉంది.

 

 

శిరీష

కరిమిద్దేల గ్రామం, కర్నూలు
+91 9642353299

Go to top