" ఆస్ట్రల్‌గా వచ్చి మమ్మల్ని కాపాడిన పత్రీజీ "

 

 

నా పేరు శ్రీదేవి. నేను వైజాగ్ పిరమిడ్ మాస్టర్ "B.వంశీకిరణ్" గారి ద్వారా 2012 సెప్టెంబర్ 5 వ తేదీన ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానస్థితిలోకి రాకముందు ఎన్నో సంవత్సరాలుగా నాకు తీవ్రమైన నడుమునొప్పి ఉండేది. ధ్యానం మొదలుపెట్టిన పదిరోజుల్లోనే నడుము నొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి పొందాను. అనేకానేక ధ్యానానుభవాలను పొందుతూ .. సూక్ష్మశరీరయానాలు చేస్తూ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని నా స్వంతం చేసుకున్నాను!

 

ఈ క్రమంలో ఒక రోజు నా జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు ఉదయం లేచిన దగ్గరినుంచి "ఈ రోజు ఏదో జరగబోతోంది" అంటూ నా చెవులలో అంతర్వాణి వినిపించసాగింది. విపరీతమైన ఒళ్ళునొప్పులతో జ్వరం వచ్చి పడుకుండిపోయాను. మధ్యాహ్నం మా వారు ఇంటికి వచ్చి జ్వరంతో ఉన్న నన్ను లేపి "ఆఫీసు పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను" అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళాక తలుపులు వేసుకుని పడుకోగానే మళ్ళీ "ఆయన ‘టాటా సుమో’ లో వెళ్తారు; దానికి ఆక్సిడెంట్ అవుతుంది కానీ మీ వారిని కాపాడటానికి పత్రీజీ సుమో వెనుక వెళ్ళారు" అని చెవుల్లో నా అంతర్వాణి నుంచి హోరులా వినిపించసాగింది. జ్వరంతో వణుకుతూ నేను అలాగే పడుకుండి పోయాను.

 

మరుసటిరోజు ఉదయం 8.00గం||ల సమయంలో మా వారు ఫోన్ చేసి .. తెల్లవారుజామున వాళ్ళు వెళ్తున్న టాటా సుమోకు ఆక్సిడెంట్ అయినట్లూ .. బండి నుజ్జు నుజ్జయినా అందరూ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. వెహికల్ బయలుదేరేంత వరకు కూడా తాను టాటాసుమోలో వెళ్తున్నట్లు వారికి తెలియదట! మరుసటి రోజు మా వారు వచ్చి ఆక్సిడెంట్ జరిగిన స్థలం ఫోటోలను తన సెల్‌ఫోన్‌లో చూపించారు .. ఆ రోజు అక్కడ జరిగిన అయిదు ప్రమాదాలలో చాలా మంది చనిపోవడం, కాళ్ళు చేతులు విరిగిపోవడం జరిగిందట .. కానీ ఒక్క వీళ్ళ బండిలో ఉన్నవాళ్ళే సురక్షితంగా ఉన్నారట!

 

పత్రీజీ కలిసినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేయగా "మీ ధ్యానం, ధ్యానం మీద మీకు ఉన్న నమ్మకం మిమ్మల్ని ఇద్దరినీ రక్షించాయి మేడమ్" అన్నారు. ఇలా ఒక కన్నతల్లిలా మనల్ని వెన్నంటి కాపాడుతూ ఆస్ట్రల్‌గా కూడా మన బాగోగులు చూసుకునే గురువు ఈ జన్మకు లభించడం మన అదృష్టం!

 

 

అల్లూరి శ్రీదేవి
విశాఖపట్టణం

ఆంధ్రప్రదేశ్

Go to top