" TV లో చూసి ధ్యానం నేర్చుకున్నాను "

 

 

 

నా పేరు రుద్రయ్య చౌదరి స్వామి. నేను 2007 సంవత్సరంలో "సంస్కృతి TV ఛానెల్" ద్వారా పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకుని అప్పటినుంచి ధ్యానమే జీవితంగా నా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాను.

 

2007కి ముందు నేను పూజలు విపరీతంగా చేసేవాడిని. గంటల కొద్దీ నా సమయాన్ని గురువారం శిరిడీ సాయికీ, శనివారం వెంకటేశ్వర స్వామికీ చాలా నిష్ఠతో పూజలు చేస్తూ గడిపేసేవాడిని. మిగతా రోజులు మాత్రం విపరీతంగా మాంసం తింటూ మందు త్రాగుతూ కాలం గడిపేవాడిని. 

 

ఫలితంగా అనేక రకాల శారీరక రోగాలతో, మానసిక వత్తిడితో బాధపడుతూ మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్‌కు వెళ్ళివస్తూండేవాడిని. ఈ క్రమంలో ఒకసారి "ఓం శాంతి" ధ్యాన కేంద్రానికి వెళ్ళి ఆరు నెలలపాటు అక్కడ సాధన చేసుకున్నాను. అక్కడ వాళ్ళు ఎక్కువగా హిందీభాషలో తమ సందేశాలను వినిపించడంతో వాళ్ళు చెప్పేవి నాకు పెద్దగా అర్థం అయ్యేది కాదు. ఇంటికి వచ్చాక TV లో "సంస్కృతి ఛానెల్" పెట్టుకుని తెలుగులో వచ్చే "ఓం శాంతి" కార్యక్రమాలను చూసేవాడిని.

 

ఒకరోజు అలా TV చూస్తూండగా బ్రహ్మర్షి పత్రీజీ సందేశాలను కూడా చూడడం తటస్థించింది. మృదుగంభీర స్వరంతో ముక్కుసూటిగా, సరళంగా, ఒక స్నేహితునిలా వారు ధ్యాన విధానాన్ని గురించి చెప్తున్న తీరుకు ముగ్ధుడనయ్యాను. ధ్యానం వల్ల కలిగే లాభాలను శాస్త్రీయమైన రీతిలో వారు చెప్పిన విధానానికి ఆశ్చర్యపోయి వారి వేణునాదం వింటూ నేను కూడా ధ్యానంలో కూర్చుండిపోయాను. 

 

బళ్ళారి పట్టణం నడిబొడ్దున "పాపయ్య హాల్"లో అప్పటికే "కృష్ణమోహన్ శెట్టి" గారిచే నిర్మించబడి ఉన్న 18'x18' పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి TV  ద్వారా విని ఆశ్చర్యపోయాను. కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజూ ఆ సెంటర్ మీదుగా ఎన్నోసార్లు తిరిగిన నేను .. అక్కడ వున్న పిరమిడ్ ధ్యానం మందిరం గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడ్డాను. మాంసాహారం తినడంలో అనర్థాలను గురించి నిష్కర్షగా పత్రీజీ చెప్పిన తీరుకు దాసోహం అయిన నేను ఆ క్షణం నుంచే శాకాహారిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతవరకు "ఎంతో గొప్ప భక్తుడనయిన నేను ఎందుకు పదే పదే అనారోగ్యం బారిన పడుతున్నాను? ఇన్ని పూజలు చేస్తున్నా .. ఏ దేవుడూ నన్ను ఎందుకు దయచూడడం లేదు?" అన్న ఆవేదన చెందేవాడిని. 

 

ఒక ప్రక్క భగవంతుడిని పూజిస్తూ మరొక ప్రక్క ఆ భగవంతుడే సృష్టించిన మూగజీవులను చంపి తింటూ సృష్టినియమాలకు వ్యతిరేకంగా చేసే చర్యలవల్ల జరిగే అనర్థాల గురించి చెప్పిన పత్రీజీ మాటలతో నా భ్రమలన్నీ తొలిగిపోయాయి. వెంటనే పిరమిడ్‌ను వెతుక్కుంటూ వెళ్ళి .. అక్కడ ఉన్న బళ్ళారి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ "శ్రీ పంపారెడ్డి" సార్‌ను కలిసి ధ్యానం గురించిన మరింత సమాచారం తెలుసుకుని పిరమిడ్‌లో ధ్యానం చేసుకున్నాను. ఆ రోజు 2009వ సంవత్సరం మార్చి నెల 12వ తేదీ! ఇక అప్పటి నుంచి ప్రతిరోజూ ధ్యానసాధన చేసుకుంటూ అహింసామార్గంలో .. ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను. మందులు వాడడం మరి డాక్టర్ల దగ్గరికి పోవడం అన్నీ బంద్! నేను పొందిన లాభాలన్నీ ప్రతి ఒక్కరూ పొందాలన్న తపనతో విస్తృత ధ్యానప్రచారం మొదలుపెట్టాను. 

 

బళ్ళారికి దగ్గరలో ఉన్న "హొన్నహళ్ళి కొండ" దగ్గర ఒక "మంచె పిరమిడ్" ను నిర్మించుకుని అందులో 41 రోజుల పాటు మౌనం, ధ్యానం, స్వాధ్యాయం దీక్ష చేశాను. దాని ఫలితంగా నాలో "వాక్‌శుద్ధి"తో పాటు "సంకల్ప శక్తి" కూడా పెరిగింది. అద్భుతమైన ధ్యాన జీవితాన్ని గడిపే అవకాశం నాకు ఇచ్చిన బ్రహ్మర్షి పత్రీజీ మరి పత్రీజీ సందేశాలను ప్రసారం చెయ్యడం ద్వారా నా జీవితానికి అర్థాన్నీ, పరమార్థాన్నీ అందించిన TV సిబ్బందికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం బళ్ళారి పట్టణంలో స్వంత కేబుల్ ఆఫీసును కలిగి ఉన్న నేను "లోకల్ ఛానెల్"లో ధ్యానం గురించీ, శాకాహారం గురించీ స్లైడులు వేస్తూ ప్రచారం చేస్తున్నాను.

 

 

రుద్రయ్య చౌదరి స్వామి
బళ్ళారి

కర్నాటక రాష్ట్రం

సెల్: 074066 55598

Go to top