" వ్యవసాయ క్షేత్రంలో భూమాత పిరమిడ్ "

 

 

నా పేరు బాల్‌రెడ్డి. కడప జిల్లా, పెద్దముడియం మండలంకు చెందిన "జంగాలపల్లె"అనే చిన్నగ్రామం మాది. ఆరు సంవత్సరాల క్రితం కడప పిరమిడ్ మాస్టర్ "గజ్జల రామసుబ్బారెడ్డి" గారి ద్వారా ధ్యానం నేర్చుకున్న మేము 2010లో మా ఇంటిపై పిరమిడ్ కూడా నిర్మించుకున్నాము. ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి స్వయంగా పత్రీజీ విచ్చేయడం మా గ్రామం చేసుకున్న అదృష్టం!

 

అంతకు ముందు ఫ్యాక్షన్ గొడవలతో, కక్షలతో, జగడాలతో .. "జగడాలపల్లె" అని అందరి నోళ్ళలో నానిన మా "జంగాలపల్లె" .. ఇప్పుడు గ్రామంలో పది పిరమిడ్‌లతో, నిరంతర ధ్యాన కార్యక్రమాలతో మరి సజ్జనసాంగత్యాదులతో "ధ్యానజంగాలపల్లె" గా మారి పలువురి ప్రశంసలను అందుకుంటూ పరిసర గ్రామాల ప్రజలకు ఆదర్శగ్రామంలా నిలుస్తోంది! 

 

 

 

పిరమిడ్ శక్తి గురించి వివరణాత్మకంగా తెలుసుకున్న మా గ్రామ రైతులు, పిరమిడ్‌లలో నిల్వ ఉంచిన విత్తనాలతో సేద్యం చేసి చక్కటి రాబడిని పొందుతున్నారు! పిరమిడ్ ధ్యానశక్తితో, శాకాహార జీవనంతో తమ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు! 

 

ఈ క్రమంలో నేను గురుదేవులు పత్రీజీ సూచన మేరకు మా వ్యవసాయ క్షేత్రంలో కూడా "భూమాత పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మించి, జూలై 2 వ తేదీన శ్రీరామ సుబ్బారెడ్డిగారి చేతుల మీదుగా దానికి ప్రారంభోత్సవం జరిపించుకున్నాము! 

 

ఈ సందర్భంగా 250 మంది గ్రామస్థులతో కన్నుల పండుగగా "శాకాహార ర్యాలీ" జరిగిన అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొద్దుటూరు నుంచి విచ్చేసిన సుజనాదేవి, కడప నుంచి విచ్చేసిన "శ్యామలాదేవి" గార్లు ధ్యాన వ్యవసాయం గురించి మరిన్ని వివరాలు తెలియజేశారు. పంటలు సమృద్ధిగా పండడానికి ప్రతి గ్రామంలోని వ్యవసాయక్షేత్రాల్లో పిరమిడ్‌లు నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పరిసర గ్రామాల నుంచి కూడా విచ్చేసిన సుమారు 200 మంది రైతులు ఈ కార్యక్రమంపట్ల సంతోషాన్ని తెలియజేసి తమ తమ గ్రామాల్లో కూడా ధ్యాన కార్యక్రమాలు చేపట్టడానికి ఉత్సాహం చూపించారు! 

 

2010 సంవత్సరం కంటే పూర్వం మానసిక ప్రశాంతత లోపంతో పరస్పరం గొడవలు పడుతూ జీవించిన మా గ్రామప్రజలు 2010 సంవత్సరం మే నెలలో బ్రహ్మర్షి పత్రీజీ వచ్చి ఒకే రోజు రెండు పిరమిడ్‌లను ప్రారంభోత్సవం చేసి .. గ్రామప్రజలతో విశేషంగా ధ్యానం చేయించి .. తమ సందేశం ద్వారా ధ్యానం యొక్క విలువను తెలియజేసినప్పటి నుంచి గ్రామ ప్రజలంతా హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. చాలామంది శాకాహారులుగా మారి అందులోని గొప్పదనాన్ని పదిమందికీ తెలియజేస్తున్నారు! ఇంతటి అదృష్టాన్నీ, మహాభాగ్యాన్నీ మాకు కలుగజేసిన గురుదేవులు పత్రీజీకి నమస్కరిస్తున్నాము!

 

కొనుముల బాల్‌రెడ్డి
జంగాల పల్లె

కడప జిల్లా

సెల్ : 95027 48067

Go to top