పత్రీజీ దర్శనభాగ్యం .. స్వామి సంకల్పం

 

నా పేరు హేమలత. నా చిన్నతనంలో .. 7,8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచే .. నేను భగవాన్ సత్యసాయి భజనలు చేస్తూ బాలవికాస్ తరగతులకు హాజరు అవుతూ మరి నిష్ఠగా పూజలు చేస్తూ పెరిగాను.

 

1982 లో పెళ్ళయ్యాక మా వారితొ కలిసి బెంగళూరు వెళ్ళి అక్కడ నా బంగారు స్వామిని ప్రత్యక్షంగా కలుసుకున్నాను. హైదరాబాద్‍కు తిరిగి వచ్చాక మా వారు నేను చిక్కడపల్లిలోని మా ఇంట్లోనే ప్రతి గురువారం సాయి భజనలు, సత్సంగం నిర్వహించేవాళ్ళం. ఆ తరువాత కాలంలో ECIL లో టెక్నికల్ అఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్న మా వారు ఉద్యోగ రీత్యా కువైట్ దేశానికి వెళ్ళడం జరిగినా .. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ప్రత్యేకంగా స్వామిదర్శనం కోసమే మేము ఇండియాకి వచ్చి వెళ్ళేవాళ్ళం.

 

సాయి సేవా మార్గమే మా జీవిత పరమావధిగా జీవిస్తూ .. మా అమ్మాయి మరి అబ్బాయి చదువులు, అమెరికాలో వాళ్ళ ఉద్యోగం, పెళ్ళిళ్ళు అన్నీ స్వామి అనుగ్రహంతోనే పూర్తి చేసుకున్నాం.

 

హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక "ఆనంద సాయి కుటీర్" నిర్మించుకుని సాయిభావనలో జీవితం గడుపుతూ బీద విద్యార్థులకు చదువు చెప్పించడం, బీదవారికి కల్యాణాలు జరిపించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ స్వామి సేవలో పనిముట్లుగా జీవిస్తున్నాం. 

 

"మానవుడు సాక్షాత్తు చైతన్యస్వరూపుడు" .. "నీవు అల్పుడువు కాదు, అనంతుడవు" .. "సృష్టిలోని అనేకత్వంలో ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత" అన్న అనేకానేక సాయి సందేశాలను మనస్సులో పదిలపరచుకుని జీవిస్తున్న మాకు .. 2011, ఏప్రిల్ 24వ తేదీన బాబా మా నుంచి భౌతికంగా దూరం కావడం మమ్మల్ని కలచివేసింది. "దేహబ్రాంతిని వదలాలి; దానిపై మమకారం పెంచుకోవద్దు బంగారూ!" అంటూ స్వామి ఎన్ని సందేశాలు ఇచ్చినా భౌతికంగా వారు లేని పుట్టపర్తికి వెళ్ళడం .. వారి దర్శనం మరి వారితో సంభాషణం జరిపిన మాకు బాధాకరం అయ్యింది.

 

అయినా ఈ జగత్తు అంతటా స్వామి నిండి ఉన్నారన్న పవిత్ర భావనతో తర్వాతి మూడున్నర సంవత్సరాలు అనేకానేక తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతున్న మాకు హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ "డాక్టర్ B.ఇందిర" గారు పరిచయం కావడం మా అదృష్టం! వారు పిరమిడ్ సొసైటీ గురించీ, పత్రీజీ గురించి చెప్పి .. హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వర్ పూల, V.కృష్ణారెడ్డి గార్లు ఏర్పాటు చేసిన "కైలాస మానససరోవర ధ్యానయాత్ర" కు వెళ్ళమని సూచించారు. 

 

13రోజుల పాటు సాగిన ఈ అద్భుత ధ్యానయాత్రలో రాజేష్, కృష్ణారెడ్డి గార్ల స్నేహపూర్వక సహచర్యం చాలా గొప్పది! ధ్యానం గురించి వారి నుంచే తెలుసుకుని మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చోగానే తెల్లటి వస్త్రాలతో మెరిసిపోతూన్న పత్రీజీతో పాటు సత్యసాయి నాకు దర్శనం ఇచ్చారు!

 

ధ్యానంలోనే ఏడుస్తున్న నన్ను బాబా సమక్షంలో పత్రీజీ ఆర్తిగా ఓదార్చడం .. మరి ఎంతో కాలంగా నాలో పేరుకు పోయిన దుఃఖం నా నుంచి మబ్బులాగా విడిపోవడం .. నేను అనుభూతి చెందాను! "మానస సరోవర ధ్యానయాత్ర"నుంచి హైదరాబాద్ తిరిగిరాగానే నాకు ధ్యానంలో దర్శనం ఇచ్చిన దవళవస్త్రధారి అయిన పత్రీజీని కలుసుకోవాలన్న తపనతో "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రిక ఆఫీసులో వున్న పత్రీజీని కలవడానికి వెళ్ళాను. అక్కడ వారిని నేను నా ధ్యానంలో ఎలాంటి ధవళ వస్త్రాలతో చూశానో అవే తెల్లని వస్త్రాలు వారు ధరించి ఉన్నారు!

 

వారి దర్శనం, వారితో సంభాషణం,  వారి స్పర్శనం నాలో బాబా లేని లోటును తీర్చింది. ధ్యానం గురించీ, స్వీయ ఆత్మ ఉద్ధరణ గురించీ ఆత్మీయంగా వారు చెప్పిన మాటలు .. నడిసముద్రంలో పయనించే నావ లాంటి నాకు చుక్కానిలా దారి చూపాయి.

 

"పత్రీజీ దర్శనభాగ్యం కూడా స్వామి సంకల్పమే!" అనుకుని వారిని నా స్వామి చూపించిన గురువుగా తలచి వారికి వినమ్రపూర్వకంగా నమస్సుమాంజలులు అర్పించాను. వారు చూపించిన ధ్యానమార్గంలో నడుస్తూ, ఒక ఆత్మజ్ఞానిలా నా జన్మను ధన్యం చేసుకుంటాను.

 

 

హేమలత
హైదరాబాద్

Go to top