" ఆత్మజనిత ఇంగితజ్ఞానమే .. నిజమైన అనుభవం "

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నంకు చెందిన శ్రీ "Ch.S.N.రాజు" గారు .. మాస్టర్ C.V.V. మార్గంలో వుంటూ "మాస్టర్ E.K." గారితో సుదీర్ఘ సాన్నిహిత్యాన్ని కలిగివున్నారు. ఆధ్యాత్మికతను తమ దైనందిన జీవనవిధానంగా మార్చుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి .. "జగద్గురు పీఠం .. World Teacher Trust" కార్యకర్తగా ఆత్మవిద్యను విశ్వవ్యాప్తం చేస్తూ మచిలీపట్నంలో "మాస్టర్ E.K.బాలభాను విద్యాలయం" స్థాపించి విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు. జ్యోతిష శాస్త్రంపై అసాధారణమైన అవగాహన కలిగివున్న వీరు రచించిన జ్యోతిష్యశాస్త్ర గ్రంధాలు తెలుగు విశ్వ విద్యాలయంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్య గ్రంధాలుగా ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌తో సాన్నిహిత్యాన్ని కలిగి IFSS కార్యక్రమాల్లో పాల్గొని తమ జ్ఞానపూర్వకమైన సందేశాలు అందించే శ్రీ రాజుగారితో ఇన్నర్‌వ్యూ మీ కోసం ..

- M.స్వర్ణలత.


స్వర్ణలత: "నమస్కారం రాజుగారు! ‘మాస్టర్ CVV మార్గం’లో సుదీర్ఘకాలంగా ఉన్న మీరు .. మీ అమూల్యమైన జ్ఞానాన్ని ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు అందించగోరుతున్నాం .."

 

రాజు గారు:  ముందు జగద్గురు పీఠం నుంచి మొదలుపెడతాను. ‘జగద్గురువు’ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా "కృష్ణం వందే జగద్గురుమ్"అంటూ జ్వాలాకూల్ మహర్షి గారు ప్రయోగించారు. "జగద్గురువు అయిన శ్రీకృష్ణుడికి వందనం" అని దాని అర్థం! శ్రీకృష్ణుడు తన నిర్యాణానికి ముందు తన సన్నిహితులైన ఉద్ధవునికీ మరి మైత్రేయునికీ భాగవత ధర్మాలన్నింటినీ ఉపదేశించి .. తన జగద్గురువు అంశను మైత్రేయునిలో ప్రవేశపెట్టి ... మైత్రేయుడిని భావితరానికి జగద్గురువుగా ప్రకటించాడు.

 

"ఆ తరువాతి కాలంలో మైత్రేయుడు అనేక దేశాలలో, అనేక జాతులలో మరి అనేక కాలాలలో ఆ యా దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జగద్గురువులా ప్రకటితమై .. తమ సమకాలీనులు ఆత్మోన్నతి కోసం కృషిచేశారు" అని దివ్యజ్ఞాన సమాజం తెలియజేస్తోంది. ఇలా తమ గురుతత్త్వపు వెలుగులతో ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేసిన అనేకానేక గురువుల సామూహిక చైతన్యం అయిన జగద్గురుతత్త్వం పేరుతో మాస్టర్ E.K. గారు 1971లో "జగద్గురు పీఠం" స్థాపించడం జరిగింది.

 

స్వర్ణలత: "మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ఏ విధంగా వచ్చారు?"

 

రాజుగారు: మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు మా ఊరికే ఒక పెద్ద భూస్వామి! గాంధీజీ సిద్ధాంతాలను త్రికరణశుద్ధిగా పాటిస్తూ గాంధేయవాదిగా పేరు తెచ్చుకున్న వారు .. మా ఊరి ప్రెసిడెంట్‌గా గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

 

చిన్నతనం నుంచి నాకు నక్సలిజమ్ అంటేనూ మరి కమ్యూనిజమ్ అంటేనూ మహా పిచ్చి ఉండేది! అస్తమానం వాటికి సంబంధించిన సాహిత్యాన్నే చదువుతూ నాలోని విప్లవకారుడిని పెంచి పోషించేవాడిని! అయితే నాకు పదహారేళ్ళ వయస్సులో నక్సల్స్ మా తండ్రిగారిపై దాడి చేసినప్పుడు గానీ అందులోని హింసాతత్త్వం నాకు బోధపడలేదు.

 

ఇక నక్సలిజమ్ పట్ల విముఖత కలిగి దేశసేవ చేయాలని ఇంట్లో చెప్పకుండా కొచ్చిన్‌కు పారిపోయి ఇండియన్ నేవీలో చేరాను. నెల రోజుల తరువాత అదికూడా నా మార్గం కాదని అర్థమై .. అందులోంచి బయటికి వచ్చేశాను.

 

"నా జీవితాన్ని ప్రతిక్షణం అర్థవంతంగా జీవించాలి" అని నిర్ణయించుకుని వైజాగ్‌లో ఉన్న ఒక స్నేహితుని దగ్గరికి చేరుకున్నాను. ఆ స్నేహితుని ద్వారానే నాకు మాస్టర్ E.K.గారితో పరిచయం అయి .. నా జీవితానికి ఒక లక్ష్యం, మార్గం, దిశా నిర్దేశం అన్నీ లభించాయి. 24 జూలై 1970 సంవత్సరం నుంచి  మాస్టర్ E.K.గారితోనే ఉంటూ వారి దగ్గర హోమియో, జ్యోతిష్యం, యోగం, ఇతిహాసాలు, కావ్యాలు మొదలైనవి ఎన్నో నేర్చుకున్నాను.

 

స్వర్ణలత: "మాస్టర్ E.K.గారు చెప్పిన కొన్ని విషయాలు మాకు కూడా చెపుతారా?"

 

రాజు గారు: నిజ జీవితానికి ఉపయోగపడే అనేకానేక విషయాలను వారు మాకు అలవోకగా చెప్పేవారు. " ‘ఒక మతం’ .. ‘ఒక జాతి’ .. ‘ఒక దేశం’ అంటూ ఎలాంటి పరిమితులకూ లోనుకాకుండా అందరి దగ్గరినుంచీ, అన్నీ నేర్చుకోవడానికి సంసిద్ధతతో ఉండాలి; లేకపోతే అతి ముఖ్యమైన జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం కోల్పోయి కూపస్థమండూకాల్లా బ్రతకాల్సి వస్తుంది" అని చెప్పేవారు.

 

"ఉదయం లేవగానే ఇంటి కిటికీలు, తలుపులు తెరిస్తే గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఇంటిలోకి ధారాళంగా ప్రవేశించినట్లూ .. మనస్సు తలుపులను సదా తెరిచి ఉంచితే .. అంటే స్వీకరించే సంసిద్ధత Acceptance తో ఉంటే జీవితంలోకి జ్ఞాన వెలుగులు ప్రవేశిస్తాయి" అంటూ వారు బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, జీసస్, అరవిందులు వంటి గొప్ప గొప్ప యోగుల జీవన విధానాలను మాకు వివరించేవారు. అందుకే ఏ గురువును చూసినా వారు వేరుగా అనిపించరు. ఇది మాస్టర్ E.K.గారు మాకు చేసిన అలవాటు! "భిన్న భిన్న స్థాయిలలో ఉండే మానవుల ఎదుగుదల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న ఋషులు వారికి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాస ఆశ్రమాల వంటి భిన్న భిన్న మార్గాలను సూచించారు. ఇందులో గృహస్థ ఆశ్రమం అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది.

 

"గృహస్థులుగా సంసారపరమైన బాధ్యతలను నిర్వర్తించుకుంటూనే యోగం, ధ్యానం, జపం ఏదైనా సరే సాధన చేసుకోవాలి! భౌతిక ఆధ్యాత్మిక జీవితాలు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని సాగాలి కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కటీ విస్మరించబడకూడదు. "ఆధ్యాత్మికత కోసం భౌతికపరమైన బాధ్యతలను విస్మరిస్తే .. అవి రెట్టింపై మళ్ళీ మళ్ళీ చుట్టుకుంటాయి కనుక గృహస్థులుగా ఉంటూనే .. గురువులను సమాదరిస్తూ .. వారినుంచి ఉన్నత విషయాలను గ్రహిస్తూ .. వ్యక్తిగత సాధనను కొనసాగించుకుంటూ ఉండాలి. పిల్లల బాధ్యతలు తీరికపోయాక ఆ గురువుల వద్దకే వానప్రస్థం వెళ్ళిపోవాలి!

 

"అ అవకాశం కూడా లేని వాళ్ళు ఉన్న చోటనే ఉంటూ విషయ వ్యామోహాలను తగ్గించుకుని, ధ్యాన సాధనలో, సద్గ్రంధ పఠనలో మరి సజ్జన సాంగత్యంలో సమాజసేవలో నిమగ్నమై ప్రతిక్షణం చైతన్యవంతంగా గడపాలి! పక్వానికి వచ్చిన కాయ పండుగా మారినట్లు కాలానుగుణంగా జీవన ధర్మాలను కూడా మార్చుకుంటూ సహజంగా యోగమార్గంలో నడుస్తూ ఉండాలి" అని ధర్మబద్ధ జీవిత విధానాల గురించి వారు విశేషంగా చెప్పేవారు.

 

స్వర్ణలత: "గురు-శిష్యుల సంబంధం గురించి చెప్పండి!"

 

రాజు గారు: గురువు .. శిష్యుడికి మంచి-చెడుల మధ్య వున్న తారతమ్యాన్ని తెలియజేస్తాడు మరి శిష్యుడు దారి తప్పుతూ ఉన్నప్పుడు హెచ్చరించడం చేస్తాడు! కానీ సాధనా బాధ్యత మరి కష్ట-నిష్ఠూరాలు అన్నీ శిష్యుడే భరించాలి! ఈ విషయంలో మాస్టర్E.K.గారు మాకు ఒక గురువులా కాకుండా ఆత్మీయుడిలా మాతో వ్యవహరించేవారు. వారి సాంగత్యంలో మేమంతా యోగం, క్రమశిక్షణ, అభ్యాసాలను మా జీవన విధానంలా చేసుకున్నాం.

 

స్వర్ణలత: "ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్న మాస్టర్లకు మీ సూచనలు?"

 

రాజు గారు: ‘నేను’ .. ‘నాది’ అన్న భావనలు తగ్గించుకుని ఇతరులకు మార్కులు వేసే స్వభావాన్ని నిర్మూలించుకోవాలి. ఇతరుల పట్ల అభిప్రాయాలతో నిండిన మనస్సు ఉన్నవారికి ధ్యానం ఎంత మాత్రం కుదరదు! ప్రతి చిన్న విషయానికీ కలత చెందడం .. ఉద్వేగాలలో మునిగిపోవడం, తెలియనిదానిని తెలిసినట్లు నటిస్తూ డంబాతిశయాలను ప్రదర్శించడం సాధకుల లక్షణం కాదు! కనుక ప్రాపంచిక జ్ఞానంతో పాటు వినయ-వివేకాదులను పెంచుకుంటూ ఆత్మానుభవజనీన మైన ఇంగిత జ్ఞానమే నిజమైన జీవన-చుక్కానిగా ఎంచి ఎరుకతో ముందుకు సాగడం మాస్టర్ల లక్షణం!

 

స్వర్ణలత: "మీ ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ కార్యక్రమాలు తెలియజేయండి!"

 

రాజుగారు: 1970 సంవత్సరంలో మాస్టర్ గారిని కలిసినప్పటి నుంచి నేను నా సహజ అవగాహన ద్వారా వారి నుంచి వివిధ విషయాలను నేర్చుకుంటూ .. సాధన చేశాను. 1995 సంవత్సరంలో మొట్టమొదటిసారి మైసూరు శ్రీదత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో కలిసి ఆస్ట్రియా దేశంలోని వియన్నా నగరానికి వెళ్ళి వారి సహకారంతో అక్కడ జ్యోతిష్యం పై క్లాసులు నిర్వహించాను.

 

1997లో స్విట్జర్లాండ్ మాస్టర్లతో ఒక బృందాన్ని ఏర్పరచుకుని వారితో కలిసి .. ఇప్పటికి 25 సార్లు అనేక దేశాలు పర్యటించి, సెమినార్లు, ధ్యానశిక్షణా తగతులు నిర్వహించాను. "జ్యోతిష ప్రకాశం" అనే గ్రంథాన్ని మూడు సంపుటాలుగా రచించగా .. వాటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు తమ M.A. విద్యార్ధులకు పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించారు.

 

"నా వాణి" అనే ఆధ్యాత్మిక మాసపత్రికకు సంపాదకుడిగా కొంతకాలం పనిచేసి త్రివేణి పబ్లిషర్స్ సంస్థకు అధినేతగా "వాల్మీకి రామాయణం" .. "పోతన భాగవతం" .. "కవిత్రయ మహాభారతం" .. "జ్ఞానేశ్వర భగవద్గీత" అనే గ్రంథాలతో పాటు తెలుగు వచనంలో అనేక సంపుటాలను ప్రచురించాను. 1984 లో "మాస్టర్ EK బాలభాను విద్యాలయం" స్థాపించాను.

 

స్వర్ణలత: "బాలభాను విద్యావిధానంలో ప్రత్యేకతలు?"

 

రాజుగారు: మా విద్యార్ధులకు సాధారణ విద్యతో పాటు, ధ్యాన సాధన, సంస్కృత శ్లోకాల పఠనం తప్పనిసరి! పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వారు అతి సహజమైన వాతావరణంలో పెరిగేలా ఇక్కడి పాఠ్యప్రణాళికలు రూపొందించబడ్డాయి. ప్రాచీన భారత జీవన విధానంలోని నైతిక విలువలపట్ల గౌరవం కలిగేలా వారిలో చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక బీజస్థాపన చేస్తూ వారిలోని సహజ అవబోధలు వెలికి వచ్చేలా కృషి చేస్తూంటాం! పిల్లల సంపూర్ణ మేధో వికాసానికి దోహదం చేసే బోధనా పద్ధతుల వల్ల ప్రతి సంవత్సరం జరిగే రాష్ట్రీయ మరి జాతీయ పోటీల్లో మా పిల్లల సంపూర్ణ మేధో వికాసానికి దోహదం చేసే  బోధనా పద్ధతుల వల్ల ప్రతి సంవత్సరం జరిగే రాష్ట్రీయ మరి జాతీయ పోటీల్లో మా పిల్లలు తమ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇక పదవ తరగతిలో మా విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం ఎప్పుడూ 100 శాతంగా ఉంటుంది.

 

స్వర్ణలత: "పత్రీజీతో మీ అనుబంధం?"

 

రాజు గారు: 2000 సంవత్సరం ముందు నుంచే నాకు బ్రహ్మర్షి పత్రీజీతో పరిచయం ఉంది. ధ్యానప్రచారాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి వారు "ధ్యాన జగత్" కోసం చేస్తూన్న కృషి అసామాన్యమైనది! లక్షలాదిమంది మాస్టర్స్‌తో కూడిన వారి ఉద్యమం ఏ యేటికాయేడు విజయపధంలో పురోభివృద్ధి చెందుతూనే ఉంది! వేలాది మంది ధ్యానులను ఒక నిశ్శబ్ద శూన్యస్థితిలో కూర్చోబెట్టి గంటలు గంటలు వారితో ధ్యానం చేయించడం మామూలు విషయం కాదు! వారికి నా నమస్కారాలు! ఇక "IFSS" కార్యక్రమాలలో వక్తలా పాల్గొంటూ నా జ్ఞానాన్ని అందరితో పంచుకునే అవకాశం నాకు దక్కడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను. మంచి ఎక్కడ ఉన్న స్వీకరిస్తూ "గురువుల పట్ల కృతజ్ఞత" మరి మన "స్వీయ సాధన పట్ల విశ్వాసం" కలిగి ఉంటూంటే .. జీవితం విజయపధంలోకి దూసుకువెళుతుంది!

 

 

 

S.N.రాజు
మచిలీపట్నం

కృష్ణాజిల్లా

Go to top