" జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకున్నాం "

 

తమ తమ వయోబేధంతో నిమిత్తం లేకుండా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ధ్యానప్రచారోద్యమంలో పాల్గొంటూ తమ వంతు బాధ్యతలను చురుకుగా నిర్వహిస్తూన్న శ్రీ మధుసూధన్ రావు గారు మరి శ్రీమతి సూర్యప్రకాశం దంపతులు .. ఆధ్యాత్మిక పధగాములందరికీ స్ఫూర్తిదాతలు! ఈ ఆదిదంపతుల ధ్యాన జీవిత అనుభవాలు మరెంతో మందికి ఆచరణీయం కావాలని కోరుకుంటూ ..

-T. వాణి


 

వాణి: "నమస్కారం సార్! భౌతికపరంగా మరి ఆధ్యాత్మికపరంగా అనుభవజ్ఞానంతో పండిపోయిన మీతో ముచ్చటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం! మీ గురించి .."

 

మధుసూధనరావు గారు: మాది కృష్ణాజిల్లా .. కైకలూరు తాలూకా కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతం అయిన "పులపర్రు" గ్రామం. మా అమ్మ మాణిక్యమ్మ మరి మా నాన్న వీరాంజనేయులు గార్లకు మేము ముగ్గురు అబ్బాయిలం; మాకు ఒక చెల్లెలు! మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో ప్రకృతి వైపరీత్యాలతో, కొల్లేరు సరస్సుకు వచ్చే వరదలతో పంటనష్టాలు సర్వసాధారణం అయ్యి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేవాళ్ళం!

 

దీనికితోడు నేను పీలగా, బక్కపల్చగా ఉండడంతో వ్యవసాయానికి అస్సలు పనికిరానని మా నాన్నగారు చదువు నిమిత్తం కైకలూరు "సంస్కృత పాఠశాల" లో చేర్పించారు. మా ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న కైకలూరు నడిచి కొంతదూరం .. మధ్యలో ఉన్న వాగువంకలను బల్లకట్టుపై దాటుతూ కొంతదూరం .. మధ్యలో ఉన్న వాగువంకలను బల్లకట్టుపై దాటుతూ కొంతదూరం .. ప్రయాణం చెయ్యాల్సివచ్చేది. అప్పట్లో స్కూల్ ఫీజు "పది అణాలు" ఉండటంతో .. మా అమ్మ గేదెపాలను ఒక క్యానులో, పెరుగు ఒక క్యానులో ఉంచి పుస్తకాల సంచీతో పాటు నాతోనే స్కూల్లో ఉన్న మాస్టర్లకు "నెల నెలా వాడుక" పంపేది. వాటికి బదులుగా వాళ్ళు నా స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చు కట్టేసేవాళ్ళు!

 

ఇలా సంస్కృత పాఠశాలలో పది నెలలు చదివాక నన్ను అక్కడే ఉన్న "జిల్లా బోర్డు స్కూల్" లో వేశారు. అయితే నాది గ్రామీణ కుటుంబ నేపథ్యం కావడంతో .. తెలుగు, లెక్కలు బాగా చదివేవాడిని కానీ ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టంగా ఉండేది!

 

వాణి: "తరువాత మీ చదువు ఎలా సాగింది?"

 

మధుసూధనరావు గారు: 1947 మార్చిలో SSLC పరీక్ష తప్పాను! అదే సంవత్సరం క్రొత్తగా "సెప్టెంబర్ పరీక్షా విధానం" ప్రవేశపెట్టబడడంతో నేను మొట్టమొదటి విద్యార్థిగా విజయవాడ సెంటర్‌కి వెళ్ళి పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడయ్యాను. అది ఆ రోజుల్లో పెద్ద గొప్ప! ఆ తరువాత మచిలీపట్నం "హిందూ కాలేజీ"లో ఇంటర్ మీడియట్‌లో జాయిన్ అయ్యాను కానీ ఫీజు కట్టలేక చదువు మధ్యలోనే మనేసి .. విజయవాడలోని కృష్ణా -కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్‌లో నెలకు 65రూ||లకు క్యాషియర్‌గా ఉద్యోగంలో చేరాను.

 

ఇక ఆ తరువాత  1953 సంవత్సరం జనవరి 30వ తేదీన నా వివాహం జరగడం .. ఉన్న ఉద్యోగం కాస్తా ఊడిపోవడంతో బ్రతుకుతెరువు వెతుక్కుంటూ బాపట్లలో కొంతకాలం పనిచేశాను. ఆ తరువాత హైదరాబాద్ వచ్చి మా మేనమామ గారి అబ్బాయి పనిచేస్తున్న "బ్రహ్మయ్య&co" .. అనే ఛార్టర్డ్ అకౌంటెంట్ ఆఫీసులో చేరి పనినేర్చుకున్నాను.

 

అలా పనినేర్చుకుంటూనే C.A, Inter మరి Final పూర్తి చేసి ALL India Institute of Chartered Accountants లో మెంబర్ అయ్యాను! ఈలోపు ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు పుట్టి .. అందులో ఒక అబ్బాయి చనిపోయాడు. 1996లో "A.మధుసూధన & Co" పేరు మీద నా స్వంత ఆఫీసు మొదలుపెట్టి అప్పటికే ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా మంచి నైపుణ్యాన్ని సంపాదించిన మా అబ్బాయితో కలిసి కొంతకాలం పనిచేసి 2012 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. ఎక్కడా రాజీపడకుండా క్లయింట్‌ల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ .. పని పట్ల నిబద్ధతను కలిగి వుండడం నేను బ్రహ్మయ్య & Co నుంచి నేర్చుకున్నాను.

 

వాణి: "ఆధ్యాత్మిక రంగంలోకి మీరు ఎలా వచ్చారు?"

 

మధుసూధనరావు గారు: నేను చిన్నప్పటి నుంచీ కమ్యూనిస్టు భావాలతో పెరిగి పెద్దవ్వడంతో పూజలు, పునస్కారాలు వంటి వాటికి దూరంగానే ఉండేవాడిని. ఈ క్రమంలో 1989 నాకు "ఆంజియోప్లాస్టీ" ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత 1999 లో మరింత అనారోగ్యం ముంచుకువచ్చి నాంపల్లిలోని కేర్ హాస్పిటల్‌లో చేరగా గుండెకు ఉన్న మూడు వాల్వులకు ఆపరేషన్ అయ్యి .. కేవలం ద్రవాహారాలపై ఒక నెలరోజులు ఉన్నాను. అదే సమయంలో నా భార్య కూడా ఇంట్లో నడుస్తూ నడుస్తూనే పడిపోయి కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యింది. ఇలా అన్నివైపులనుంచి సమస్యలు ముంచుకువచ్చి .. దానికి వృద్ధాప్యం తోడయి ఇద్దరం బెంగపడిపోయాము.

 

అప్పటికే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌లో "శ్వాస మీద ధ్యాస" ధ్యానం నేర్చుకుంటున్న మా చిన్న కూతురు"రమాదేవి" మాకు ధ్యానం గురించి చెబుతూ ఉండేది. "ఇదేదీ అయ్యేది కాదు .. పొయ్యేది కాదు" అనుకుని మేం ఊరకుండిపోయాం! అయితే, అదే సమయంలో 1999 ఆగస్ట్ 1న "పత్రీజీ మన ఇంటికే వస్తున్నారు; మీ ఇద్దరూ రండి" అంటూ మా రమాదేవి పోరుపెట్టడంతో వెళ్ళాం! అక్కడికి వెళ్ళాక కాస్సేపు ధ్యానం చేశాక .. పత్రీజీ నాకు షేక్‌హ్యాండ్ ఇస్తూ "ఇదే ఆఖరు జన్మ చేసుకోండి" అన్నారు.

 

"మన చేతుల్లో ఉందేంటి?!" అన్నాను నేను నిర్లిప్తంగా! "అయితే చావండి" అంటూ ప్రక్కకు వెళ్ళిపోయారు వారు! లోతైన వారి మాటలు మొదట్లో అర్ధం కాకపోయినా ధ్యానపరంగా మరి ఆత్మజ్ఞానపరంగా ఎదుగుతున్న కొద్దీ .. "భౌతికంగా చనిపోయి అధ్యాత్మికంగా పునర్జన్మ ఎత్తు" అన్నది వారి సందేశంగా నాకు అర్థం అయ్యింది!

 

క్రమంగా ధ్యానంలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకుంటూ .. వాసవీనగర్ దగ్గరలోని సూర్యనగర్‍లో వున్న మా ఇంట్లో 40 రోజుల ధ్యానశిక్షణా తరగతులను నిర్వహిస్తూండగా మధ్యలో ఒకరోజు పత్రీజీ కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ధన్యుల్ని చేశారు! 2008లో సైనిక్‌పురిలో వున్న ఒక ఓల్డేజ్ హోమ్ బిల్డింగ్ పై 12'X12' పిరమిడ్‌ను కట్టించగా ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రీజీ దంపతులు వచ్చి చక్కటి ధ్యానశిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు!

 

ఈ క్రమంలో ఒకసారి 2011 సంవత్సరంలో నేను గుండెకు సంబంధించిన తీవ్ర అస్వస్థతో నాంపల్లిలో కేర్ హాస్పిటల్‌లోని అక్యూట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో నాలుగు రోజులు ఉండాల్సివచ్చింది! డాక్టర్‌ల సలహా మేరకు చివరి చూపులకోసం అప్పుడు దుబాయ్ లో వున్న మా పెద్దమ్మాయితో సహా బంధువులంతా వచ్చేశారు.

 

ఆ సమయంలో నా భార్య, నా కూతురు రమాదేవి సంయుక్తంగా చేసిన "సంకల్ప ధ్యానం"తో నేను తేరుకుని .. ఆ ధ్యానశక్తితొ స్వస్థత పొందడం డాక్టర్లను సైతం విస్మయపరచింది! ఇలా మృత్యుముఖం నుంచి కూడా తిరిగి వచ్చిన నా విలువైన జీవితం యొక్క అర్థం, పరమార్థం అన్నీ మా గురువు పత్రీజీ నిర్దేశకత్వంలోనే సాగించాలని నిర్ణయించుకున్నాను.

 

ఇప్పుడు నా వయస్సు 84 సంవత్సరాలు! వయోభారంతో నా శరీరం కూడా అప్పుడప్పుడూ అనారోగ్యానికి గురవుతూనే ఉంది! అయినా మంచానికి అంటుకుపోయి బాధపడకుండా .. వాటిని "వస్తూ పోతూ ఉండే చుట్టాలలా" తలచి .. నా పాటికి నేను అన్ని ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాను. నాకు తోచిన విధంగా సొసైటీలో జరిగే ధ్యాన కార్యక్రమాలకు నా వంతు సహకారాన్ని అందిస్తూనే ఉన్నాను.

 

వాణి: "ఇంకా మీ ధ్యానప్రచార కార్యక్రమాలు?"

 

మధుసూధనరావు గారు: 2012 డిసెంబర్‍లో బ్రహ్మర్షి పత్రీజీ కడ్తాల్ పిరమిడ్ ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన "ధ్యానమహాచక్రం-III" కోసం నిధుల సమీకరణకు నేను నా సహాయకుడిని వెంటేసుకుని నా శిష్యుల దగ్గరికి వెళ్ళాను. నా శిష్యులు అంటే ఇప్పుడు ఎవరికి వారే స్వంత ఛార్టర్డ్ అకౌంటెంట్ ఆఫీసులను నిర్వహిస్తున్నవాళ్ళు!

 

అన్నదానం కోసం  విరాళాలను అభ్యర్థించినప్పుడు వారు "అది ఎంత గొప్ప కార్యక్రమం కాకపోతే ఆ వయస్సులో కూడా ఈయన ఇంత నిజాయితీగా వచ్చి ఉంటారో" అనుకుని నా పట్ల వారికి ఉన్న గురుత్వభావనతో భారీ విరాళాలను అందించారు! పత్రీజీ చేపడుతూన్న మహాయజ్ఞంలో ఉడతా భక్తిగా నేను నా వంతు ఆర్థిక సహాయాలు అందిస్తూనే .. ఇలా ఇతరుల ద్వారా కూడా లోకకల్యాణ కార్యక్రమాలను చేయిస్తూ నా జన్మను ధన్యం చేసుకుంటున్నాను!

 

వాణి: "మేడమ్! మీ గురించి తెలియజేయండి!"

 

మేడమ్ సూర్యప్రకాశం గారు: మాది కృష్ణాజిల్లా .. గుడివాడ తాలూకాలోని "చౌటుపల్లి" గ్రామం! మా అమ్మ మురారమ్మ, మా నాన్నగారు పొట్లూరి లక్ష్మణదాసుగారు! నాకు ఐదుగురు తమ్ముళ్ళు .. ఒక చెల్లి! నా తమ్ముళ్ళలో అందరికంటే చిన్నవాడైన "రాంబాబు"గారికి మా చిన్నమ్మాయి "రమాదేవి"ని ఇచ్చి వివాహం చేశాం!

 

వ్యవసాయమే జీవనంగా ఉన్న మా కుటుంబంలో ఆ రోజుల్లో ఆడపిల్లల చదువులకు పెద్దగా ప్రోత్సాహం ఉండేది కాదు! అయినా మా మేనమామ గారి ప్రోద్భలంతో మా నాన్న గారు నన్ను మా ఊళ్ళోనే ఉన్న "ఎలిమెంటరీ పాఠశాల"కూ, ఆ తరువాత "అంగలూరు" లోని బాలికోన్నత పాఠశాలకు పంపించారు. దాదాపు ఐదుమైళ్ళ దూరం రోజూ స్కూలుకు నడిచి వెళ్ళి వస్తూ చదువు పూర్తి చేశాను.

 

ఆ తరువాత విజయవాడలోని బిషప్ అజరయ్య టీచర్ ట్రైనింగ్ కాలేజీలో రెండేళ్ళ SGBT కోర్సు చేస్తూ ఉన్నప్పుడు నాకు వివాహం జరిగింది. కొంతకాలం విజయవాడలోని కన్యకాపరమేశ్వరి హైస్కూల్ లో టీచర్‍గా పనిచేశాక మా వారి ఉపాధిరీత్యా హైదరాబాద్‌కు తరలి రావడం .. పిల్లలు పుట్టడం .. నేను నారాయణగూడ కేశవ మెమోరియల్ హైస్కూల్‌ లో ‘మ్యాథ్స్ టీచర్’గా చేరిపోవడం మరి 1983 సంవత్సరంలో రిటైర్ కావడం జరిగింది.

 

వాణి: "మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు?"

 

మేడమ్ సూర్యప్రకాశం గారు: చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా పూజల పట్ల ఆసక్తి ఉండకపోయేది! పెళ్ళి చేసుకుని మా అత్తవారింటికి వచ్చాక నోములనీ, వ్రతాలనీ ఏవో చేయించేవారు కానీ .. నిమిత్త మాత్రంగా అయినా నేను వాటిని శ్రద్ధగా పూర్తి చేసేదాన్ని!      

 

నాకు అనారోగ్య సమస్యలంటూ పెద్దగా ఉండేవి కాదు కానీ .. 1997లో మొదటిసారి, 1999లో రెండవసారి ఏ కారణం లేకుండానే ఉన్నపళంగా ఇంట్లో తిరుగుతూ తిరుగుతూనే పడిపోయి కాలు విరిగిపోవడంతో నేను ఆస్పత్రిపాలు అయ్యాను. కూలంకషంగా Bone Density పరీక్షలు చేయించడంతో .. నాకు "క్యాల్షియం లోపంతో కూడిన ‘ఆస్టియోపోరోసిస్’ అనే వ్యాధి సోకింది" అని తెలిసింది. ఆ వ్యాధి సోకిన వాళ్ళ ఎముకలు గుల్లబారిపోయి ఏ చిన్న బరువును కూడా ఓపలేక విరిగిపోతాయి. లేవాలన్నా, కూర్చోవాలన్నా, ఒక చిన్న గరిటెను మొయ్యాలన్న ప్రక్కవాళ్ళ సహాయం మీదే ఆధారం!

 

అప్పటివరకు ఎంతో చలాకీగా నా పనులు నేను చేసుకున్న దానిని ఇలా ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం నాలో డిప్రెషన్ కారణం అయ్యింది. బోన్‌డెన్సిటీ పెరగడానికి ఒక సంవత్సరం పాటు క్యాల్షియంతో నిండిన మందులు విపరీతంగా వాడి మళ్ళీ పరీక్ష చేయిస్తే .. కొంచెం కూడా ఇంప్రూవ్‌మెంట్ లేదని తేలింది. ఇక జీవితాంతం మంచానికే అంటుకుపోయి బ్రతకాలని డాక్టర్లు తేల్చేశారు!

 

అటువంటి పరిస్థితిలో మా చిన్నమ్మాయి రమాదేవి మాకు ధ్యానపరిచయం చేసింది. ఒకసారి వాళ్ళ ఇంట్లో  "ఏడు రోజుల పౌర్ణమి ధ్యానకార్యక్రమం" నిర్వహించి ఆ ఏడురోజుల పాటు నన్ను వాళ్ళ ఇంటికే వచ్చి ఉండిపొమ్మని కోరింది. నేను కూడా డిప్రెషన్‌లో ఉండడంతో మా వారు నన్నూ, నా వాకర్‌నీ, కార్యక్రమంలో నాలుగవరోజు అక్కడికి పంపించారు.

 

వెళ్ళినరోజే ధ్యానంలో కూర్చుని నాకే తెలియకుండా విపరీతంగా ఏడ్చేశాను! కన్నీళ్ళతో నా చీర కూడా తడిసిపోయింది! అయినా ధ్యానంలోంచి లేవకుండా అలాగే కూర్చుండిపోయాను! కొంతసేపటికి విపరీతంగా కాస్మిక్ ఎనర్జీ నా శరీరంలోకి ప్రవేశించడం .. శరీరమంతా శక్తివంతం కావడం నేను అనుభూతి చెందాను! ఆ రోజు క్లాసు నిర్వహించడానికి వచ్చిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ Y.J. శర్మ గారు "OK" చెప్పినా నేను కళ్ళు  తెరువలేక పోగా .. నా రెండు చేతులూ విడదీయలేనంత గట్టిగా బిగుసుకుపోయాయి!

 

అలాగే కాస్సేపు ఉన్న తరువాత మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచిన నేను కార్యక్రమం ముగిసిపోవడంతో శ్రీ Y.J. శర్మగారితో వచ్చినవాళ్ళంతా బయటికి వెళ్ళిపోతూండడంతో .. ఒక్కఉదుటున లేచి నా అంతటి నేనే గుమ్మం వరకూ పరిగెత్తుతున్నట్లు వెళ్ళిపోయి వాళ్ళకు వీడ్కోలు చెప్పాను. అప్పటికి సంవత్సరకాలంగా నేను వాడుతున్న ‘వాకర్’, ఏమైపోయిందో! ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ మంచం ఎక్కింది లేదు .. ‘వాకర్’ వాడింది లేదు!!

 

చాలాధైర్యంగా, ధ్యానశక్తి మీద నమ్మకంతో అన్ని సంవత్సరాలుగా వాడుతూన్న మందులన్నీ వదిలేసి గంటలు గంటలు ధ్యానం చేస్తూ .. ఆరునెలల తరువాత మళ్ళీ బోన్ డెన్సిటీ పరీక్ష చేయించుకటే 60 శాతం వరకూ ఇంప్రూవ్‌మెంట్ ఉందని రిపోర్టులు చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు! ఇక అప్పటి నుంచి ధ్యానశక్తి మీద ఉన్న గొప్ప నమ్మకంతో .. మరి ఆ విద్యను అందరికీ చేరవేస్తోన్న పత్రీజీ పట్ల గౌరవంతో పునర్జన్మను పొందిన మేము .. వారు చేపడుతున్న లోకకల్యాణ కార్యక్రమాలకు మా వంతు సహాయం అందిస్తున్నాం!

 

వాణి: "మరి ఇప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారా?"

 

మేడమ్ సూర్యప్రకాశం గారు: వయస్సు  మీరిన కొద్దీ పటుత్వం కోల్పోయే భౌతిక శరీరానికి రకరకాల ఇబ్బందులు రావడం సహజమే! కానీ వాటినే తలచుకుని తలచుకుని భయపడుతూ, బాధపడుతూ బ్రతుకులను ఈడ్వకుండా ... ఏదైనా శారీరక ఇబ్బంది కలిగినప్పుడు అది కూడా "అనుభవ జ్ఞానం"గా స్వీకరిస్తూ .. అధికభాగం ధ్యానం మరి ధ్యాన కార్యక్రమాలలో నిమగ్నమై సదా ముక్తిమార్గంలో మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం!

 

వాణి: "మీ ధ్యాన జీవిత అనుభవాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం మేడమ్! పిరమిడ్‌లతో మీరు ఏమైనా ప్రయోగాలు చేశారా?"

 

సూర్యప్రకాశం గారు: 2013 లో ఒకసారి ప్రమాదవశాత్తు దెబ్బతగిలి నా కుడికన్ను నల్లగా కమిలిపోయి .. కుడిమోకాలు హెయిర్‌లైన్ ఫ్రాక్చర్‌కి గురి అయ్యింది. మందులు ఏమీ వాడకుండా ఒక "knee పిరమిడ్"ను దెబ్బతగిలిన చోట పెట్టుకుని కూర్చుని పదిరోజులు ధ్యానం చేసి మళ్ళీ X-ray తీయించి ఫ్రాక్చర్ లేదు ఏమీ లేదు!

 

పిరమిడ్‌లో అరటిపండ్లు పెట్టడం, పిరమిడ్‌ను బెడ్‌ప్రక్కనే ఉంచుకోవడం, మేం త్రాగే మంచినీళ్ళ కుండపై వాటర్ బీమర్‌ను ఉంచడం చేస్తూంటాము. ఎప్పుడన్నా వాతావరణ మార్పుల వల్ల జ్వరంలాంటివి వచ్చినా ఖంగారు పడకుండా మా గదిలో అమర్చుకున్న "పిరమిడ్ ఛైర్" పై కూర్చుని .. ధ్యానశక్తితో తగ్గించుకుంటున్నాం!

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో కడ్తాల్, బెంగళూరుల్లో జరిగే అన్ని ధ్యాన కార్యక్రమాల ప్రచార బాధ్యాతలను శక్తిమేరకు నిర్వర్తిస్తూ మరి కార్యక్రమాల నిర్వహణకు కావలసిన నిధుల సమీకరణ బాధ్యతను శక్తిమేరకు వహిస్తూ మాతో పాటు ఆ ధ్యాన మహాయజ్ఞాలలో అందరి భాగస్వామ్యం కోసం కృషి చేస్తుంటాము. ఏ వయస్సు వారినైనా .. ధ్యానం ద్వారా ధ్యానప్రచారం ద్వారా తమను తాము ఉద్ధరించుకునేలా చేసి .. వారిని మరో పదిమందికి చేయూతనిచ్చే ధన్యజీవుల్లా తీర్చిదిద్దుతూన్న పత్రీజీకి కృతజ్ఞతలు!!

 

 

శ్రీ A. మధుసూధనరావు

శ్రీమతి A. సూర్యప్రకాశం
హైదరాబాద్

Go to top