" స్వ - అధ్యయనంతో పాటు స్వాధ్యాయం "

 

విద్యాధికులు మరి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీ G.శ్రీనివాసరెడ్డి గారు తమ స్ఫూర్తిదాయకమైన ఆత్మవిజ్ఞాన సమాచారంతో కూడిన వర్క్‌షాపులను నిర్వహిస్తూ ముఖ్యంగా యువతకు చక్కటి మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశవిదేశాలకు చెందిన అనేకానేక ఆధ్యాత్మిక మరి మనోవైజ్ఞానిక శాస్త్రగ్రంథాలను వందలాదిగా అధ్యయనం చేసి .. వాటిని తెలుగులోకి అనువదించి అందిస్తూ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ స్వాధ్యాయ యజ్ఞంలో ముఖ్యపాత్రను పోషిస్తూన్న శ్రీనివాస్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ..

వాణి


వాణి: శ్రీనివాసరెడ్డి గారూ .. ప్రపంచవ్యాప్తంగా వున్న ఆధ్యాత్మిక శాస్త్రవిజ్ఞానాన్ని సేకరించి పిరమిడ్ మాస్టర్‌లకూ అందిస్తూన్న మీ నుంచి ఆ విశేషాలను ముచ్చటించుకోబోయే ముందు .. మీ గురించి కొంత సమాచారం ..

 

శ్రీనివాస్‌రెడ్డి గారు: మాది హైదరాబాద్. మా నాన్న "డా|| G.V.నారాయణ రెడ్డి" గారు "ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం"లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మా అమ్మ శ్రీమతి "G.ప్రమీలాదేవి" .. గృహిణి. నాకు ఒక అన్నయ్య, ఒక అక్క.

 

మా అక్క .. మీ అందరికీ సుపరిచితులైన "డా||న్యూటన్ కొండవీటి"గారి సతీమణి "డా||లక్ష్మీ న్యూటన్". నేను హైదరాబాద్ .. "చైతన్యభారతి ఇంజనీరింగ్ కాలేజి (CBIT)"లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి కొన్ని సంవత్సరాలపాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేశాను.

 

1999 సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రీజీ గారి పెద్దమ్మాయి "పరిణిత"తో కర్నూలు మొట్టమొదటి ధ్యానమహాయజ్ఞంలో నా వివాహం జరిగింది. CBIT లో ఇంజనీరింగ్ చదువుకుంటూన్న రోజుల్లోనే నాకు మా అక్క సహాధ్యాయి అయిన "డా||న్యూటన్"తో మంచి స్నేహం ఉండేది. ఆయనను కలవడానికి కర్నూలుకు వెళ్తూన్న క్రమంలో 1995 సంవత్సరంలో ఒకసారి న్యూటన్ నన్ను కర్నూలు "బుద్ధపిరమిడ్" దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడే నేను మొట్టమొదటిసారి పత్రీజీని కలవడం!

 

 

 

వారు మాతో ధ్యానం చేయించి మాకు కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి వాటిని చదవమన్నారు. చిన్నప్పటినుంచీ పుస్తకాలు చదవడం నాకు ‘హాబీ’ కావడంతో నేను వెంటనే పత్రీజీ చెప్పిన పేర్లున్న పుస్తకాలను వెతికి తెచ్చుకుని మరీ చదవడం మొదలుపెట్టాను!

 

అప్పటివరకూ ఇంగ్లీషు నవలలతో పాటు నాకు చాలా ఇష్టమైన ఫిజిక్స్ కు సంబంధించిన రిఫరెన్స్ పుస్తకాలను మాత్రమే చదివే అలవాటు వున్న నేను .. మొట్టమొదటిసారిగా "metaphysics మెటాఫిజిక్స్"కు సంబంధించిన విజ్ఞానాన్ని చదవడం చాలా క్రొత్తగా అనిపించేది! నేను చదివిన మొదటి పుస్తకం "Bringers of the Dawn". ఆ తరువాత "సేత్" .. "నీల్ డొనాల్డ్ వాల్ష్", "దీపక్ చోప్రా", "కార్లోస్ కాస్టొనెడా", "పీటర్ రిఛేలూ" ఇలా ఎందరెందరో ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రవేత్తలు అందించిన గ్రంథరాజాలను చదివి ఆకళింపు చేసుకున్నాను!

 

వాణి: "ఒక ఫిజిక్స్ స్టూడెంట్‌గా  .. మెటాఫిజిక్స్‌కు సంబంధించిన విషయాలను .. అది కూడా అంత చిన్న వయస్సులో ఎలా అవగాహన చేసుకున్నారు?"

 

శ్రీనివాసరెడ్డి గారు: "కంటికి కనిపించేదే నిజం" అని నమ్ముతుంది ఫిజిక్స్! "కంటికి కనిపించనిది ఇంకా ఎంతో ఉంది" అంటుంది మెటాఫిజిక్స్! ఈ రెండింటి మధ్య సమన్వయం కుదరక నేను కొంత సతమతమయిన మాట నిజమే! కానీ గాఢధ్యానంలో నేను నా అంతరంగంలోని కేంద్రబిందువు దగ్గరకు చేరుకుంటూన్న కొద్దీ నా లోని సంఘర్షణలు నా నుంచి దూరం అవుతూవచ్చాయి. ఇది సరియైన సాధనా మార్గంలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ ఎదుర్కొనే ‘సంధిదశ’! ఈ దశను దాటితే ఉన్నదంతా స్పష్టమైన సత్యదర్శనమే!

 

ఇలా ఒక్కసారి నాకు స్పష్టత వచ్చాక ఇక నేను వెనుతిరిగి చూడలేదు! నా స్వాధ్యాయాన్ని విస్తరించుకుంటూ .. ఒక మహాయజ్ఞంలా పుస్తకాలు చదువుతూ పోయాను! 1997 సంవత్సరం నుంచి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ విస్తరణ కోసం పత్రీజీ హైదరాబాద్‌కు చేరుకుని .. హైదరాబాద్‌లో వారి కార్యక్రమాలు ఎక్కువ కావడంతో .. నాకు వారితో మరింత చనువు ఏర్పడింది. ‘సార్’ను నా స్కూటర్ మీద ఎక్కించుకుని హైదరాబాద్ సిటీ అంతా తిరిగేవాడిని!

 

వారు కూడా నాతో ఒక స్నేహితుడిలా ఎన్నో విషయాలను చర్చించేవారు! ఇద్దరం కలిసి ఎన్నెన్నో పుస్తకాలను చదివి పరస్పరం చర్చించుకునేవాళ్ళం!

 

వాణి: మీరు "Innovative Works" అనే పబ్లిషింగ్ విభాగం ద్వారా చాలా అనువాద పుస్తకాలను అందించారు. వాటి గురించి తెలియజేయండి!

 

శ్రీనివాసరెడ్డి గారు: ఈ క్రమంలో నేను పత్రీజీ సూచనమేరకు నా భార్య "పరిణిత" సంపూర్ణ సహకారంతో "Innovative Works"  అనే పబ్లిషింగ్ విభాగాన్ని ప్రారంభించాను. టర్కీ దేశానికి చెందిన "టోర్కోమ్ సెరాయ్‌డారియన్" అనే ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్తను గురించి తెలుసుకుని .. ఇంటర్నెట్ ద్వారా "టోర్కోమ్ స్పిరిచ్యువల్ విశ్వవిద్యాలయం"వారిని సంప్రదించాను. టోర్కోమ్‌గారు గతించిన తరువాత వారి కుమార్తె "గీతా సెరాయ్‌డారియన్"గారు తమ తండ్రిగారి పేరు మీద ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి "వైస్ ఛాన్సెలర్"గా వ్యవహరిస్తున్నారు. వారితో సంప్రదింపులు జరిపి ఆ యూనివర్సిటీ లైబ్రెరీలో ఉన్న టోర్కోమ్‍గారి 160 పుస్తకాలలోంచి అతి ముఖ్యమైన వాటిని అధ్యయనం చేసి వాటిని తెలుగులోనికి అనువదించి అందించేకార్యక్రమం మొదలుపెట్టాను.

టోర్కోమ్ గారు రచించిన "Breakthrough to Higher Psychism" అన్న పుస్తకాన్ని "ఆత్మయోగంలోకి మహాప్రవేశం" పేరుతో మొట్టమొదటి అనువాద గ్రంథంగా అందించాము.

 

 

వాణి: ఏ ఏ విషయాలను ముఖ్యంగా అందులో చర్చించారు?

 

శ్రీనివాస రెడ్డి: మానవ జీవిత పరమార్థ సాధనకు ఉపకరించే ‘ధ్యానం‘ .. ‘సేవ’ అన్న రెండు అతి ముఖ్యమైన అంశాలను గురించి ఆత్మచైతన్యపరంగా ఇందులో వివరణాత్మకంగా విశ్లేషించబడింది. ఆత్మ చైతన్యపరిణామ క్రమంలో భాగంగా శక్తి వినియోగంలో ‘కనిష్ట స్థాయి’ కి చెందిన "సామూహిక చైతన్యం .. (mass consciousness)" మధ్యమస్థాయికి చెందిన "వ్యక్తిగత చైతన్యం (self consciousness)" మరి ఉన్నత స్థాయికి చెందిన "బృంద చైతన్యం (group consciousness)" లో వినియోగింపబడే ‘ధ్యానం’ మరి ‘సేవ’ల యొక్క అంతిమ ఫలితాలు ఇందులో చాలా అద్భుతంగా వివరించబడ్డాయి.

 

"మూర్ఖత్వం" .. "అజ్ఞానం"వంటి తక్కువ శక్తి తరంగధైర్ఘ్యం కలిగి ఉన్న కనిష్ఠ స్థాయి సామూహిక చైతన్యం నుంచి .. ‘ధ్యానం’, ‘సేవల’ ద్వారా అత్యున్నత శక్తి తరంగధైర్ఘ్యం కలిగి ఉన్న బృందచైతన్యస్థాయికి చేరుకోవడానికి మధ్యలో ఉన్న కీలక దశే వ్యక్తిగతచైతన్యం.

 

ఇక్కడే సాధకుడు ధ్యానం ద్వారా లభించే సిద్ధులు, అతీంద్రియ జ్ఞానం యొక్క వినియోగం పట్ల మరి సేవ ద్వారా లభించే కీర్తిప్రతిష్ఠల పట్ల ప్రలోభాలకు గురి అయ్యి యోగభ్రష్టత్వం  చెందకుండా ఆత్మచైతన్యపు ఎరుకను పెంచుకోవాలి. ఎంతగా అతనిలో ఎరుకస్థితి పెరుగుతుందో అంతగా అతని వ్యక్తిగత చైతన్యం వివరిస్తూ "పరస్పర సహకారపు బృందాలను" ఏర్పరచుకునే నిర్వహణా సామర్థ్యం అతనిలో పెరుగుతుంది. మరి పరస్పర సహకారపు ఆత్మచైతన్య బృందాల సహాయంతోనే లోకకల్యాణ కార్యక్రమాలు చేపట్టబడతాయి.

 

తన సర్వశక్తులనూ, సామర్థ్యాలనూ దివ్యజ్ఞానప్రణాళికకు అనుగుణ్యంగా మానవసేవ కోసం ఉపయోగించుకోకుండా ఏ మనిషి అయినా ఎంతటివాడైనా "నేను ఓ ఆత్మయోగిని" అని చెప్పుకోజాలడు మరి దివ్యత్వం స్పష్టంగా ప్రకటితం అయితే తప్ప ఏ ఆత్మశక్తులూ ప్రాప్తించవు. కఠిన అభ్యాసాల వల్ల బలవంతంగా సాధించుకోబడిన శక్తులన్నీ .. దుఃఖాన్నీ, కష్టాలనూ పెంచేందుకు మాత్రమే ఉపయోగపడితే .. అంతరంలోని దివ్యత్వం సహజంగా ఆవిష్కృతమై తత్ఫలితంగా ప్రాప్తించిన ఆత్మశక్తులు సర్వస్వాన్నీ ప్రేమించే లక్షణంతో మనిషిని తీర్చిదిద్ది తమను తామే ప్రకటించుకుంటాయి.

 

ఆత్మశక్తులను ఉపయోగించుకుని ఇతర మనుష్యుల మనస్సులను జయించి అధికారాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు ఎందరివల్లో ఎన్నిసార్లో జరిగాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆత్మశక్తుల్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా ఎన్నో జరిగాయి. ఇటువంటి ప్రయత్నాల వల్ల ఈ ప్రపంచంలోని సమస్త మానవాళీ నశించుపోతుంది కనుక త్యాగపూరితమైన సేవాతత్పరతతో ఉంటూ "సమస్త మానవాళి శ్రేయస్సు కోసమే మన జీవితం సాగుతోంది" అన్న విషయాన్ని మనకు మనమే ఋజువు చేసుకోవాలి.

 

సృజనాత్మకమైన జీవితాన్ని గడుపుతూ ధ్యానంతో మానవసేవతో మన చైతన్యాన్నీ, ఎరుకనూ పెంచుకుంటూ ఉండాలి! ఆ స్థితిలో మన శరీరంలోని నాడీమండలశుద్ధి జరిగి అద్భుత విద్యుత్ ప్రసారవ్యవస్థ మనలో ఏర్పడుతుంది. ఇదే ఆత్మ చైతన్యపరిణామ క్రమంలో "ఉన్నత చైతన్యస్థాయి" మరి ఇది ఆత్మపరిణామక్రమంలో చిట్టిచివరి దశ! వీటన్నింటినీ వివరించే నిజజీవిత అనుభవాలన్నీ ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి.

 

వాణి: గురువుల సహాయం ఇక్కడ ఎంతవరకు లభిస్తుంది?

 

శ్రీనివాసరెడ్డి గారు: ఏ గురువు అయినా "సామూహిక చైతన్య స్థాయి"వరకే మనకు ధ్యానం మరి సేవలను గురించిన చేయగలుగుతాడు. ఆ తరువాత మనకు ఎవరి సహాయమూ ఉండదు. మన ఎంపికల మీదే మన వివిధ దశల ఎదుగుదల మరి మన స్వంత పరిణామ క్రమం ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనకు ‘స్వాధ్యాయం’ అన్నది ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇదే విషయం "Going Deeper (ఆంతర్యపు లోతులు)" అనే అనువాద గ్రంథంలో "Harmony through Conflicts" అన్న విషయం ద్వారా ఇంకా వివరణాత్మకంగా విశ్లేషించబడింది.

జీవితంలోని ప్రతి ఒక్క దశలో కూడా మనం "Let go" అంటే "తేలిగ్గా తీసుకోవడం" అన్నదే విజయసూత్రంగా గుర్తించాలి. అయితే "అలా తేలిగ్గా తీసుకోవడం .. అజ్ఞానపు స్థితిలోనా లేక జ్ఞానపూర్వకమైన స్థితిలోనా" అన్నది మన ధ్యానస్వాధ్యాయ సాధనలను మరి మన సేవాతత్పరతను బట్టి నిర్ణయించబడుతుంది.

 

వాణి: స్వాధ్యాయ యజ్ఞంలో భాగంగా మీరు రకరకాల సాంప్రదాయాలకు సంబంధించిన ధ్యానరీతులను గురించి చెబుతూంటారు. ఆ సమాచారం కొంత మాకు కూడా అందించండి?!

 

శ్రీనివాసరెడ్డి గారు: ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ధ్యానరీతులు వున్నాయి. ఒక్కొక్కదాని ఉపయోగం ఒక్కొక్క స్థాయికి చెంది ఉంటుంది. సాధకుడు శరీరపరంగా, మనస్సుపరంగా మరి భావనలపరంగా తమోగుణం నుంచి రజోగుణం వరకు .. రజోగుణం నుంచి సత్వగుణం వరకు .. సత్వగుణం నుంచి శుద్ధసత్వగుణం వరకు .. మరి శుద్ధ సత్వగుణం నుంచి నిర్గుణం వరకు ఎదిగేలా ఒక్కొక్క ధ్యానరీతి సహాయం చేస్తుంది.

 

ఓషో డైనమిక్ మెడిటేషన్ .. దీపక్ చోప్రా మంత్రా మెడిటేషన్ .. తావోయిస్ట్ మెడిటేషన్ .. సూఫిస్ట్ మెడిటేషన్ .. బుద్ధిస్ట్ మెడిటేషన్ .. ఇలా ఎన్నో ఎన్నెన్నో! మన మెదుడులోని జంతు సంబంధమైన కనిష్ఠ శక్తిస్థాయి స్పందనలను .. ప్రజ్ఞా సంబంధమైన మధ్యమ స్థాయి ఆలోచనలుగా మరి ప్రజ్ఞాసంబంధమైన మధ్యమస్థాయి ఆలోచనలను ఉన్నతస్థాయికి చెందిన సహజ అవబోధలుగా పరిమార్చి మన మేధస్సును అత్యంత శక్తివంతమైన "సూపర్ బ్రెయిన్‌"గా రూపాంతీకరణించడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం!

 

వీటన్నింటిలోకి అత్యున్నతమైంది బుద్ధుడి ఆనాపానసతి ధ్యానం! ఇది సాధకుడిని సంపూర్ణ ఆత్మ ఎరుక స్థితిలోకి తీసుకుని వచ్చి .. తమ ఆచరణాత్మకమైన బోధనల ద్వారా ఇతరులకు మార్గదర్శనం చూపుతుంది. ఇలా తమను తాము బుద్ధుడిలా ఉన్నతీకరించుకున్న ఆత్మస్వరూపులు ఇతరుల ఎదుగుదలకు కూడా ఇతోధికంగా సహాయం చేయగల సామర్థ్యాన్ని కలిగివుంటారు.

 

వాణి: పిరమిడ్ మాస్టర్లకు మీ సందేశం?

 

శ్రీనివాసరెడ్డి గారు: "మనం" అంటే .. ప్రపంచానికి ఒక "దర్పణం"! మనం ఎలా ఉంటే ఈ ప్రపంచం మనలో అలా ప్రతిబింబిస్తుంది. కనుక బాధ, కోపం ద్వేషం, కక్ష, కార్పణ్యం వంటి శక్తిని హరించే లక్షణాలను మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటామో, అంతగా మన ప్రపంచం కూడా అవే లక్షణాలను ప్రతిబింబిస్తూ మనతోపాటు మన చుట్టూ ఉన్నవాళ్ళ జీవితాలను కూడా నరకప్రాయం చేస్తుంది! కనుక మాస్టర్లు గుర్తించాల్సిన ముఖ్య విషయాలు!

 

          * మన మధ్య వ్యత్యాసాలను పట్టించుకుంటూ వుంటే పురోగతి వుండదు.

          * ఇతరులతో అనుసంధానం ద్వారా మనల్ని మనం తెలుసుకుంటాం.

          * కష్టం కలిగిస్తున్న ప్రేమను పట్టించుకోకండి.

          * కోరుకున్నంత ఫలితం, అభినందన ఎన్నడూ లభించదు.

          * మీరు స్వేచ్ఛ పొందటం ద్వారా మిగిలిన వారికి సహాయం చేస్తారు; అది విషయాన్ని సంక్లిష్టపరచటం కాదు. సులభతరం చేయటం.

          * ప్రతి వ్యక్తిగత ఉనికి కూడా "బృందగానంలోని సర్వమే" అని తెలుసుకోవడం.

 

 

 

శ్రీనివాస రెడ్డి 

హైదరాబాద్

email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

www.swadhyayayogablogspot.com

Go to top