" సంపూర్ణ ఆరోగ్యం పొందాను "

 

 

నా పేరు "రమాదేవి". నా వయస్సు 60 సంవత్సరాలు. నేను ధ్యానంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయ్యింది. ధ్యానంలోకి రాకముందు నేను షుగర్ వల్ల ఎప్పుడూ నీరసంగా ఉండేదాన్ని దానికి స్కిన్ ఎలర్జీ మరి విపరీతమైన నడుము నొప్పి తోడైనా బ్రతుకు నరకప్రాయంగా ఉండేది. 

 

ధ్యానం తెలుసుకున్న క్రొత్తల్లో నాకు కూర్చోవడానికి కూడా శక్తి ఉండకపోయేది .. మరి శ్వాసను గమనించడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయినా పట్టు విడవకుండా నేను ధ్యానంలో కూర్చుని ఒక రోజు పత్రీజీని తలచుకున్నాను. అప్పుడు నాకు ఒక స్త్రీమూర్తి కనపడి నన్ను అనునయిస్తూ .. " నువ్వు ధ్యానం బాగా చేస్తావు .. ధ్యానప్రచారం కూడా చేస్తావు" అని చెప్పింది. 

 

ఆనాటి నుంచి నాకు ధ్యానం కుదిరి క్రమంగా నా షుగర్ వ్యాధి కంట్రోల్ కావడం జరిగింది. ఇప్పుడు నాకు శారీరక నీరసం ఏమీ లేదు. రోజంతా ఉత్సాహంగా ఉంటూ చక్కగా నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇదివరలో నన్ను ఒక రోగిష్టిగా చూసిన మా బంధుమిత్రులు ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. వారందరికీ నేను ధ్యానం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నాను. 

 

ఇలా నా ధ్యానసాధన కొనసాగుతున్న క్రమంలో నేను ఒక రోజు  ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు నా నడుము నొప్పి బాగా ఎక్కువై పురిటి నొప్పిలాగా విలవిలలాడి పోయాను. కాస్సేపు అలా బాధపడ్డాక నాకు తెలియకుండానే నిద్రపోయాను. మర్నాడు ఉదయం 5.00 గం|| మెలకువ వచ్చాక గమనించుకుంటే కొన్నియేళ్ళుగా నన్ను బాధిస్తూ వచ్చిన నడుము నొప్పి తగ్గిపోయినట్లు తెలిసింది! 

 

ఇక ఆనాటినుంచి అంటే గత సంవత్సరకాలం నుంచి ఏ విధమైన నొప్పులు లేకుండా నేను హాయిగా తిరుగుతున్నాను. ఇలా ధ్యానంవల్ల నాకు కలిగిన శారీరకపరమైన అనుభవాలను మరి మానసికపరమైన మార్పులను ఒక పుస్తక రూపంలో రాసుకుని చీరాల "ముంతావారి పిరమిడ్ సెంటర్" కు పత్రీజీ వచ్చినప్పుడు వెళ్ళి దానిని వారికి చూపిస్తే ఆయన ఆ పుస్తకం పై వారు "మీరు దేవుళ్ళు" అని వ్రాసి ఆటోగ్రాఫ్ చేశారు. 

 

ఇలా ఈ వయస్సులో కూడా ధ్యానం, ధ్యానప్రచారం ద్వారా నన్ను నేనే ఉద్ధరించుకునేలా చేస్తూన్న పత్రీజీకి నమస్కారాలు!

 

రామలింగ రమాదేవి

చీరాల

ప్రకాశం జిల్లా

Go to top