" ప్రకృతి శాంతించాలని సంకల్ప ధ్యానం "

 

 

నా పేరు "జ్యోతి". అక్టోబర్ 12 వ తేదీ, 2014 న వచ్చిన హుద్‌హుద్ తుఫాను సుమారు 100 సంవత్సరాల క్రితం వచ్చిందట. మళ్ళీ ఇప్పుడు వచ్చి "పంచభూతాలలో ఒకటైన గాలి తాను గతి తప్పితే మానవాళికి అధోగతే" అని చెప్పకనే చెప్పి అందరికీ ప్రకృతి పట్ల ఉండాల్సిన బాధ్యతను కూడా గుర్తుచేసింది. అయితే ధ్యానులు, శాకాహారులు, పిరమిడ్ నిర్మాణాలు వున్న ప్రదేశాలలో మాత్రం ఎటువంటి తీవ్రనష్టాలు లేకుండా ప్రకృతి సహకరించింది. 

 

మా ఇంట్లో గార్డెన్‌లో 6'X6' పిరమిడ్ నిర్మించుకున్నాము. ఉసిరి, కొన్ని రకాల పండ్లచెట్లు వున్నాయి. అలాగే అక్కడంతా కార్లు పార్క్ చేసి వున్నాయి. చూస్తూండగానే ఉదయం నుంచి గాలులు మొదలై తీవ్రంగా వీచడంతో ఇంటి ముందు సిమెంట్ రేకులు, ఇంటిపై వాటర్ ట్యాంక్ ఎగిరి పడ్డాయి. బయటంతా కరెంట్ వైర్లు, స్తంభాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. బిల్డింగ్ అద్దాలు పగిలాయి. మా గార్డెన్‌లో మేం చూస్తూండగానే పెద్ద మామిడి కొమ్మ "ఫట్" మని శబ్ధంలో విరిగి అతి నెమ్మదిగా కార్లకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ముందు అద్దంపై ఒరగడం జరిగింది. 

 

ఇక మధ్యాహ్నానికి "తగ్గింది" అనుకుంటూండగా మళ్ళీ మొదలైంది. ఆ సమయంలో మేము ప్రకృతి శాంతించాలని సంకల్పిస్తూ, అందరం సామూహిక ధ్యానం ఒక గంట సేపు చేసాము. ఆ పరిస్థితిలో కూడా విశాఖ మాస్టర్స్ అంతా ఆత్మస్థైర్యంతో, స్థితప్రజ్ఞతతో వుండగలగడం మాకు చాలా ఆనందమనిపించింది. ముఖ్యంగా ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంటిదగ్గరే వుండడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతోనే ప్రకృతి అద్భుతప్రణాళిక అనేది మనకు అర్థమవుతుంది. 

 

అలాగే మా వ్యాపార ప్రదేశమైన స్టోన్ క్రషింగ్ యూనిట్ దగ్గర కూడా 10'X 10' పిరమిడ్ మరి జనరేటర్‌కు పిరమిడ్ రూమ్‌ని నిర్మించడం జరిగింది. అయితే పిరమిడ్స్ వుండడం వలన తుఫాను రోజూ మా యూనిట్‌‍లో అతి స్వల్ప నష్టం మాత్రమే జరిగి అందరికంటే ముందుగా తిరిగి మా మెటల్ క్రషింగ్ యూనిట్ స్టార్ట్ అయ్యింది.

 

 

 

జ్యోతి

విశాఖపట్టణం

సెల్: +9193931 02993

Go to top