" ధ్యానమే భూమిపై స్వర్గావతరణకు మార్గం " 

 

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ మహాప్రస్థానంలోని అతి ముఖ్యమైన పిరమిడ్ మాస్టర్లలో శ్రీ I.V రెడ్డిగారు ఒకరు! వివిధ హీలింగ్ పద్ధతులలో నిష్ణాతులు అయిన వీరు తాము చేస్తున్న రాయలసీమ గ్రామీణ బ్యాంక్ ఏరియా మేనేజర్ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టి .. బెంగళూరు పిరమిడ్ నిర్మాణ బాధ్యతలలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ - బెంగళూరుకు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూన్న శ్రీ I.V  రెడ్డిగారు బుద్ధపౌర్ణమి సందర్భంగా ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులతో ఇన్నర్ వ్యూ ద్వారా తమ మనోభావాలను పంచుకుంటున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.. 

 

స్వర్ణలత: "నమస్కారం .. I.V రెడ్డిగారూ! మీరు ధ్యానంలోకి ఎప్పుడు, ఎలా ప్రవేశించారు? చిన్నప్పటినుంచి మీకు ఆధ్యాత్మిక ఆసక్తులు ఉన్నాయా?"

 

I.V రెడ్డిగారు: 1995, డిసెంబర్ 21 వతేదీన నేను పిరమిడ్ ఆనాపానసతి ధ్యానంలోకి ప్రవేశించాను. " ధ్యానం చేయటం వలన చక్కటి ఆరోగ్యం, పనులలో నైపుణ్యం పెరుగుతుంది" అని తెలుసుకుని ధ్యానం నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మిక ఆసక్తులు ఎక్కువగా లేవుగానీ .. భగవద్గీతను పారాయణం చేశాను. శ్రీ సుందర చైతన్యానంద స్వామీజీ వారి ప్రసంగాలపట్ల ఆసక్తి కలిగి కొంతకాలం ఆ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాను. బాగా పూజలు చేసేవాడిని. తరువాత పిరమిడ్ ధ్యాన పరిచయం జరిగింది. నేను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగం మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఆసక్తితో నేను ధ్యానసాధన క్రమం తప్పకుండా చేసేవాడిని.

 

స్వర్ణలత:" మీ ధ్యానానుభవాలను వివరించండి?"

 

I.V రెడ్డిగారు: "పిరమిడ్ ధ్యానం" లోకి వచ్చినతరువాత నేను ప్రతి ఒక్కరితో స్నేహంగా వుండాలని తెలుసుకుని, స్నేహంతో మెలగటం అలవాటు చేసుకున్నాను. దీనివలన నా సహోద్యోగులందరితో స్నేహపాత్రత పెరిగి అత్యున్నత ఫలితాలు సాధించాము. జీవితంలో కొడుకు, తండ్రి, భర్త, అధికారి పాత్రలను సమర్థవంతంగా, చక్కగా నిర్వహించాను. 

 

ధ్యానంలోకి వచ్చిన కొంతకాలానికి "హీలింగ్" అనే ప్రక్రియ ఒకటి వుందనీ, దాని ద్వారా మొండి రోగాలు సైతం నయం చేయవచ్చనీ పత్రిసార్ నాకు ఇచ్చిన "A Healer's Journey into Light" పుస్తకం ద్వారా తెలుసుకుని "ఇది సాధ్యమేనా?" అని పత్రిసార్‌ను అడిగాను. 

 

దానికి వారు " ఇది నూటికి నూరు శాతం సాధ్యమే! పిరమిడ్‍లో జరిగేది ఇటువంటిదే" అని చెప్పారు. "పిరమిడ్ ద్వారా కాకుండా మనుష్యులు ఇలాంటి ప్రక్రియలు నేర్చుకుని చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది కదా!" అని నేను అనగా "నువ్వే ఎందుకు నేర్చుకోకూడదు" అని సార్ అన్నారు. 

 

అప్పుడు నేను "రేకీ హీలింగ్" .. "మ్యాగ్నిఫైడ్ హీలింగ్" .. " కరుణా రేకీ " .. "మిల్కి జెడిక్ హీలింగ్" లు నేర్చుకుని హీలింగ్ చేయడమే కాకుండా హీలర్స్‌కు శిక్షణ కూడా ఇవ్వటం చేస్తూ మరి మందులకు కూడా నయం కాని అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థతపరచడం జరిగింది.

 

స్వర్ణలత: "పిరమిడ్ వ్యాలీ నిర్మాణంలో మీ పాత్ర?"

 

I.V రెడ్డిగారు: 2003 సంవత్సరంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ ప్రారంభించబడింది. తిరుపతి ధ్యానయజ్ఞంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాల్ విజయకుమార్, ఆంజనేయ శర్మ గార్లు నన్ను కోశాధికారిగా బాధ్యతలను స్వీకరించి, ట్రస్ట్ అకౌంట్లు నిర్వహించమని కోరారు. అందువల్ల 2004 మే నెలలో నేను చేస్తూన్న బ్యాంక్ ఉద్యోగం నుంచి మూడు నెలలు సెలవు తీసుకుని బెంగళూరు వెళ్ళాను. అలా వెళ్ళిన వాడిని అంచెలంచెలుగా సెలవు పొడిగించి చివరకు 2005 లో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాలీ నిర్మాణంలో పూర్తిగా పాలుపంచుకున్నాను.

 

స్వర్ణలత: "పిరమిడ్ వ్యాలీలో మీ అనుభవాలు, వ్యాలీతో మీ అనుబంధం?"

 

I.V రెడ్డిగారు: 2007 వరకు నేను బెంగళూరు పిరమిడ్ ట్రస్ట్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించేవాడిని. 2007 నుంచి 2009 వరకు "మేనేజింగ్ ట్రస్టీ" గా బాధ్యత స్వీకరించి వ్యాలీ అభివృద్ధిలో చురుకుగా పాల్గొన్నాను. 2008 డిసెంబర్‌లో బెంగళూరు మహానగరంలో "ఏడురోజుల ధ్యానమహాయజ్ఞం" నిర్వహించాం. అదే సంవత్సరం మొట్టమొదటి ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సును పిరమిడ్ వ్యాలీలో నిర్వహించాము. శ్రీ శ్రేయాన్స్ డాగా గారి సహాయంతో ఆ సదస్సు నాటికి పిరమిడ్ నిర్మాణం పూర్తిచేయబడింది. అది చురుకుగా సాగటానికి "పరదేశి నాయుడు" గారు, "P.S.R.K ప్రసాద్" గారు, "పాల్ విజయకుమార్" గార్లు ఎంతగానో సహకరించారు!

 

ఇక పిరమిడ్ వ్యాలీతో నా అనుబంధం విషయానికి వస్తే .. వ్యాలీలో ప్రతి పుట్టా, గుట్టా, చెట్టూ నా మిత్రులే! వాటిన్నింటితో నాకు సాన్నిహిత్యమూ, అనిర్వచనీయ బంధమూ ఉన్నాయి! "పిరమిడ్ వ్యాలీ" నా తల్లి వంటిది! దానిపట్ల నాకు గౌరవమూ, మమకారమూ రెండూ వున్నాయి. నిరంతరమూ దాని అభివృద్ధిపట్ల ఆకాంక్ష, దానిని జాతీయంగానే కాక అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అత్యున్నతంగా విరాజిల్లేలా చేయటానికి అమలు చేయవలసిన కార్యక్రమాల గురించే నా ఆలోచనా, ధ్యాస.

 

స్వర్ణలత: " మీ ఆధ్యాత్మిక అనుభవాలు?"

 

I.V రెడ్డిగారు  : పత్రిగారి సహచర్యం మరి ఇతర మాస్టర్ల పరిచయం వలన జీవితంలో ఎదురైన సమస్యలన్నింటినీ "ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిష్కరించుకోవచ్చు" అని తెలుసుకున్నాను. ఈ పదేళ్ళకాలంలో నేను ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ ‘సమస్యలు’ గా కాకుండా అవి నేను నేర్చుకుని ఇంకా ఉన్నత స్థితికి ఎదగటానికి అవసరమైన పాఠాలు అని తెలుసుకున్నాను. 

 

జాస్ముహిన్, జూడీ సటోరి, కృష్ణానంద గురూజీ, పరంజ్యోతి మహాన్, విక్టోరియా వెబ్బీ, ఐరీన్, లామా సూర్యదాస్, రే చంద్రన్, మహాభిక్షుసంఘసేనల వంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వేత్తల పరిచయం నా జ్ఞానపరిధినీ, అవగాహనా స్థాయినీ విస్తరించి నా ఆధ్యాత్మిక ఆసక్తులను మరింత ఇనుమడింప చేసింది.

 

స్వర్ణలత: "పత్రిసార్‌తో మీ పరిచయం, అనుబంధం !"

 

I.V రెడ్డిగారు: 1995 డిసెంబరులో నేను కర్నూలు బ్యాంకులో ఉద్యోగం చేస్తూండగా నేనే స్వయంగా ధ్యానం నేర్చుకోవటానికి వెళ్ళి పత్రిసార్‌ను కలిసాను. మొదటిరోజు తరువాత మళ్ళీ ఆరు నెలల వరకు ఆయనను కలవలేదు. ఆ మధ్యకాలంలో నాకు వచ్చిన సందేహాలను ఆంజనేయశర్మగారు, పాల్ విజయకుమార్ గార్లతో తీర్చుకునే వాడిని. 

 

ఒకరోజు సాయంకాలం కర్నూలు "బుద్ధా పిరమిడ్"లో ధ్యానం చేసి వెళ్తూంటే పత్రిసార్ నన్ను పిలిచి నా ధ్యానానుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ రాత్రి వారు తమ ఇంటికి తీసుకుని వెళ్ళి నాకు స్వయంగా భోజనం వడ్డించారు! ఆ రోజు నుంచి వారితో సన్నిహితంగా మెలగుతూ కర్నూలులో జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొనేవాడిని.

 

పత్రీజీ సాన్నిహిత్యం వల్ల " ‘ధ్యానం’ అన్నది కేవలం ఆరోగ్యం కోసమే, నైపుణ్యాల కోసమే కాదు .. ‘మనం ఆత్మ స్వరూపులం’ అని తెలుసుకునేందుకు, మన ఆత్మోన్నతి కోసం" అని అర్థం చేసుకున్నాను. ఆయనతో సాన్నిహిత్యం పెరిగి PSSM లక్ష్యాలు అవగతం చేసుకుని వాటికోసం కృషి చేయటం మొదలుపెట్టాను. 

 

దానిలో భాగంగానే కడపకు బదిలీ అయి వెళ్ళినప్పుడు గడప గడపకూ తిరిగి ధ్యాన ప్రచారం చేసి ధ్యానకేంద్రం నెలకొల్పి పత్రిసార్ సూచనతో ఆ పట్టణంలో "శ్రీ ఆంజనేయ పిరమిడ్" నిర్మాణం చేసాము. 

 

బెంగళూరు పిరమిడ్ వ్యాలీ " మేనేజింగ్ ట్రస్టీ" గా నన్ను నియమించిన తరువాత వారితో మరింత సాన్నిహిత్యం పెరిగి ఈ భూగ్రహ ఉద్ధరణకు పత్రిగారి ప్రణాళిక అయిన "PSSM " గురించీ, దానిలో కార్యకర్తలుగా మన పాత్ర గురించీ అర్థమై మరింత క్రియాశీలకంగానూ, చైతన్యవంతంగానూ మారగలిగాను. పత్రీజీ పరిచయం వలననే నా చైతన్య విస్తరణ జరిగి .. నా దృక్పథంలో మార్పులు సంభవించాయి. నాలో జరిగిన మార్పులకు ఆయనకు నేను సర్వదా కృతజ్ఞుడను.

 

స్వర్ణలత: " మీ భవిష్యత్ ప్రణాళికలు?"

 

I.V రెడ్డిగారు: పిరమిడ్ వ్యాలీని మరింత సౌందర్యవంతంగా, అత్యాధునిక సౌకర్యాలతో, ఆధ్యాత్మిక పిపాసులందరికీ అనువైనదిగా, ఈ ప్రపంచంలోనే అత్యున్నత అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దటం అనేది ఒకటి అయితే, మరొకటి పత్రిగారి ప్రణాళికలో తీర్చిదిద్దటం అనేది ఒకటి అయితే, మరొకటి పత్రిగారి ప్రణాళికలో భాగమైన ధ్యానాన్నీ, శాకాహారాన్నీ ప్రతిఒక్కరికీ తెలియచేయటం.

 

స్వర్ణలత: "IFSS సెక్రటరీ జనరల్‌గా మీ అనుభూతులు వివరించండి!"

 

I.V రెడ్డిగారు: " Indian Federation of spiritual Scientists" అనే నవీనయుగ ఆధ్యాత్మిక సంస్థకు నేను మొట్టమొదటి "సెక్రటరీ జనరల్"గా పత్రిగారి చేత నియమించబడటం నాకు లభించిన మరొక అదృష్టం. భారతదేశంలోని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపై వారి జ్ఞానాన్ని అందరికీ పంచే IFSS లక్ష్యంలో నేను ఎందరో మహానుభావులను కలుసుకోగలగటం ఒక వరంగా భావిస్తున్నాను.

 

"శ్రీ పరంజ్యోతి మహాన్" - యునైటెడ్ పీస్ ఫౌండేషన్, ఉడుమాల్‌పేట,తిరువూరు .."గురూజీ కృష్ణానంద- మానస ఫౌండేషన్, చిక్కుగొబ్బి.. "శ్రీ ఉదిత్ చైతన్య" .. కేరళ.. "శ్రీ నరసింహమూర్తి" .. నంజన్‌గూడ్, మైసూర్‌లతో పాటు మరెందరో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలను కలుసుకుని వారి జ్ఞానప్రకాశం స్వీకరించగలిగాను. ఈ లక్ష్యసాధన కోసం దేశవ్యాప్తంగా ఎన్నో సదస్సులు నిర్వహించి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తల జ్ఞానాన్ని అందరికీ అందించటం జరిగింది.

 

స్వర్ణలత : "మీ సందేశం?"

 

I.V రెడ్డిగారు: ఈనాటి సామాజిక రుగ్మతలన్నిటికీ కారణం ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటమే. ఎప్పుడైతే మనిషి తాను శాశ్వత ఆత్మననీ, దైవమనీ తెలుసుకుంటాడో అప్పుడు ఇతరులు కూడా తనవంటివారేనని తెలుసుకుంటాడు. ఆ అవగాహన కలిగినప్పుడు సమాజంలోని ప్రతికూల భావాలన్నీ అంతరించి శాంతి, ప్రేమ సహకారాలతో కూడిన నూతన సమాజం భూమిపై ఆవిష్కరించబడుతుంది. అదే భూమిపై స్వర్గావతరణ. దానికి మార్గం ధ్యానమే. కనుక అందరినీ ధ్యానులుగా చేయటానికి కృషి చేద్దాం.

Go to top