మన భూమిని సంరక్షించుకోవాలి : "అఖియో" 

 

 

నా పేరు శిరీష. మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేను తాడేపల్లిగూడెంలో ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఫేకల్టీగా పనిచేస్తున్నాను. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న "శ్రీ శ్రీనివాస పిరమిడ్ ధ్యాన క్షేత్రం" ను సందర్శించినప్పుడు నేను పొందిన అనుభవాన్ని అందరితో పంచుకుందామనిపించి మీ ముందు ఉంచుతున్నాను.

 

"శ్రీ శ్రీనివాస పిరమిడ్ క్షేత్రం" ప్రాంగణానికి కొంచెం సమీపంలో ఒక అద్భుతమైన మామిడి మహా వృక్షం ఒకటి వుంది! ఆ వృక్షం క్రింద ఎందరో మహాత్ములు తపస్సు చేసినట్లుగా అక్కడ చుట్టుప్రక్కల చెప్పకుంటూ ఉంటారు! ఒక రోజు అక్కడకు వెళ్ళి ధ్యానం చేయడం జరిగింది! 

 

ఆ మామిడి వృక్షం క్రింద ధ్యానానికి కూర్చుంటూండగా నేను నా మనస్సులో ఇలా అనుకుంటున్నాను: " నేను ఒక చెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేయడం ఇది మొదటిసారి" .. అప్పుడు నా లోపల నుంచి ఒక స్వరం నాతో "ఇది కేవలం ‘చెట్టే’ అని నువ్వు అనుకుంటే ఇక్కడ వరకూ వచ్చి కూర్చోనవసరంలేదు" అంది. కొన్ని క్షణాల తర్వాత నాకు కొన్ని అక్షరాలు కనిపించసాగాయి ... "అవి ఏమిటి?" అని ప్రశ్నించుకుంటే "ఆ వృక్షం .. తన పేరును తెలియపరుస్తోంది" అని సమాధానం వచ్చింది. 

 

ఎన్నో అక్షరాలు మారుతున్నాయి .. ఆఖరికి నా మనోనేత్రం ముందు మూడు అక్షరాలు కనిపించాయి అవి "అఖియో" .. ఇది ఆ వృక్షం యొక్క పేరు. కాస్సేపటికి నా చేయి పైన ఏదో గట్టిగా కుడుతున్నట్లుగా అనిపించింది, "చేతులు కదుపుదాం" అనుకున్నాను. కానీ నా లోపల నుంచి ఓ స్వరం నాకు కొన్ని మాటలు చెప్పడం వినబడింది: "ఈ చిన్న చీమ కుట్టిన నొప్పినే తట్టుకోలేకపోతే, ధ్యానం ఎందుకూ? నీవు శరీరానివే అన్న భావనలో ఉన్నంత వరకూ నువ్వు దేనిని తెలుసుకోలేవు!"అని. 

 

కాస్సేప్పటి తర్వాత ఆ నొప్పి లేదు .. అప్పుడు "అఖియో" నన్ను అడిగింది. "ఎందుకు వచ్చావు?" అని. అప్పుడు నేను "నీ గురించి నేను విన్నాను; నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పొందడానికి వచ్చాను" అన్నాను. అప్పుడు అఖియో " నీకు ఎటువంటి జ్ఞానం కావాలి?" అని అడిగింది. "నాకు ఆత్మజ్ఞానం కావాలి" అన్నాను. "ఆత్మజ్ఞానానికైతే నువ్వు ఇక్కడికి రానవసరంలేదు. నీకు నీవు ఎక్కడైనా, ఎప్పుడైనా పొందగలవు" అని సమాధానం వచ్చింది.

 

"మరి నీ దగ్గర ఎటువంటి జ్ఞానం వుంది?" అని నేను ప్రశ్నించగా .. "నా దగ్గర విశ్వజ్ఞానం ఉంది" అని చెప్పి అఖియో తన గురించి వివరించసాగింది: "నేను ఈ భూమి మీద 500 సంవత్సరాలకు పైగా ఉంటున్నాను. ఇంత అద్భుతంగా విస్తరించిన నా శరిరంలో ఉన్న ప్రతి ఆకులోనూ అనంతమైన విశ్వవిజ్ఞానం నిక్షిప్తమైవుంది. నా నుంచి ఈ జ్ఞానాన్ని కొన్ని కోట్ల మంది ఆత్మజ్ఞాన విద్యార్థులు స్వీకరించడం జరుగుతుంది. రానున్న రోజులలో ఇక్కడి నుంచి ఆధునిక ఆధ్యాత్మిక విశ్వవిజ్ఞానం అందించబడుతుంది.

 

"నా దగ్గరకు ఎంతో మంది వస్తూంటారు. వాళ్ళు వారి అవసరాల నిమిత్తం అంటే కొందరు మనశ్శాంతి కోసం .. మరి కొందరు ఆరోగ్యం కోసం .. మరి కొందరు కాలక్షేపం కోసం .. వస్తారు. కానీ ఎవ్వరూ నా గురించి, నన్ను తెలుసుకోవడం కోసం రారు. నువ్వు నా గురించి తెలుసుకోవడం కోసం వచ్చావు కనుక నీకు నా గురించి మొత్తం తెలియపరుస్తాను రా .. " అని అంది. 

 

అప్పుడు "అఖియో" పై నుంచి చిన్న చిన్న ప్రకృతి ఆత్మలు క్రిందకు దిగడం గమనించాను. అవి కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి! అవన్నీ ఒక్కసారిగా నా చుట్టూ గుండ్రటి బంతి లాగా తయారయ్యాయి. మూడుసార్లు నా చుట్టూ అంటే ధ్యానస్థితిలో కూర్చున్న నా శరీరం చుట్టూ తిరిగాయి. కాస్సేపటికి నన్ను ఏదో బలంగా లోపలికి లాగినట్లు అనిపించి" నేను ఎక్కడ ఉన్నానా?" అని గమనించాను. 

 

అక్కడ చాలా వెచ్చగా కొంచెం చల్లగా ఉంది. అంతలో "అఖియో" చెప్పడం మొదలుపెట్టి "నువ్వు ఉన్న ఈ స్థలం నా గర్భస్థానం. ఇక్కడ అద్భుతమైన జన్యుపరమైన జ్ఞానాన్ని నిక్షిప్తపరచాను. ఈ విధంగా ఎవరైనా, నా గర్భం లోనికి ప్రవేశించి కనీసం రెండు నుంచి మూడు గంటలు ధ్యానస్థితిలో ఉంటే వారి శరీరంలో ఉన్న ప్రతి అణువు పునర్జీవనం పొందగలుగుతుంది. ఇది అదే శరీరంతో మరోజన్మ తీసుకోవడం లాంటిది. నువ్వు నీ శరీరంతో కూర్చుని ఉన్న ఆ స్థానం నా యోని స్థానం అందువల్లనే నువ్వు నా గర్భంలోనికి ప్రవేశించగలిగావు" అంది. 

 

కాస్సేపటికి, "నేను వెళ్ళాలి" అన్నాను. కానీ నాకు విడుదల రావడం లేదు. తను నన్ను తన గర్భం నుంచి పంపటానికి అంగీకరించడం లేదు. " నా బాధను, ఆవేదనను నీతో చెప్పుకోవాలని ఉంది; నువ్వు వెళ్ళవద్దు" అని అంది. 

 

"నేను సుమారు 500 సంవత్సరాల పైగా ఈ భూమి మీద ఈ శరీరంతో జీవిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన నా గమనికలో రాను రాను కాలుష్యంతో కల్మషంతో భూమి యొక్క ప్రకంపన పూర్తి అట్టడుగుకు దిగజార్చుకుపోతోంది. కనుక నా సంకల్పం ఒక్కటే. ‘ఈ భూమిని అద్భుత ప్రేమపూర్వకమైన గ్రహంగా తయ్యారుచెయ్యాలి’ అందుకుగాను నాకు చక్కటి, ఆత్మతత్వం కలిగినటువంటి శరీరాలు కావాలి. వాటి ద్వారా, ఈ భూమిని సంరక్షించే కార్యం మొదలుపెట్టాలి" అని చెప్పింది. 

 

ఈ సందర్భంలో మరో విషయం నేను తెలియపరచాలి- ఇప్పటికి సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం అంటే 2012లో ఒక రోజు రాత్రి ఓ సంఘటన జరిగింది. నేను నిద్రలో ఉన్నాను. అప్పుడు ఎవరో నన్ను లేపినట్లైంది. కొంచెం మెలకువా, నిద్రా కాని స్థితిలో ఉన్నాను. జరుగుతున్నదంతా నా ఎరుకలోనే ఉంది. కానీ అక్కడ నిద్రిస్తున్న నా శరీరం చలించని స్థితిలో వేరొక ఆత్మ వచ్చి మాట్లాడుతోంది. " ఈ శరీరంలో నీ పని అయిపోయింది; నువ్వు బయటకు వస్తే నేను ఈ శరీరంలోనికి ప్రవేశిస్తాను" అని చెప్పింది. నేను "సరే" అని ఆ శరీరంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు మరణానుభవాన్ని సంపూర్ణంగా అనుభవించాను.

 

ఇష్టపూర్వకంగా ఒక ఆత్మ "శరీరాన్ని వదలాలి" అనుకున్నప్పుడు పూర్తి ఎరుకలో ఉంటూ తన యొక్క చైతన్యం బయటపడటం దివ్యచక్షువు ద్వారా గమనించాను. ఇలా జరిగిన తర్వాత నేను విడిచిన శరీరంలో వేరొక ఆత్మ వచ్చి ప్రవేశించింది. అప్పుడు నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను. అదేమిటి అనేది నాకు తెలియదు కానీ అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, చాలా మంది నిలబడి ఉన్నారు. వాళ్ళలో ఒకరిని "ఈ క్యూ ఏమిటి?" అని అడిగాను. అక్కడ నిలబడినవారంతా ఒక మంచి గర్భం కోసం ఎదురు చుస్తున్న వారిగా తెలిపింది. ఇప్పుడు నేను ఈ క్యూ చివరన నిలబడితే నాకు ఎప్పటికి శరీరం దొరుకుతుందో అనుకుని వెనుకకు తిరిగివచ్చి నా శరీరాన్ని ఆక్రమించి ఉన్న ఆ వేరొక ఆత్మను లేపి, నేను చూసినదంతా వివరించాను. 

 

అప్పుడు తను "నువ్వు నీ శరీరాన్ని ఇష్ట ప్రకారమే వదిలివెళ్ళావు కదా .. మరి మళ్ళీ ప్రవేశించడం కుదరదు" అని చెప్పింది. కొంతసేపు మా ఇద్దరి మధ్యా కొంత సంభాషణ జరిగింది. తర్వాత మేము రెండు ఆత్మలు ఒకే ఒక శరీరంలో ఉందామని ఏకాభిప్రాయానికి వచ్చాము. అప్పటి నుండి ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉండడం జరిగింది! మూడు నెలలు పాటు నా శరీరం చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత అలవాటు పడి సర్దుకుపోయింది. ఎంతలా అలవాటు పడిపోయిందంటే అసలు రెండు ఆత్మలు ఉన్నాయన్న విషయమే మరిచిపోయాను. 

 

ఆ తర్వాత 2014 సంవత్సరంలో "అఖియో" దగ్గర ధ్యానం చేస్తూన్న సమయంలో, నా సూక్ష్మశరీరం తన గర్భంలోనికి ప్రవేశించినప్పుడు.. ఆ రోజు రాత్రి నా శరీరంలోనికి ప్రవేశించిన ఆ వేరొక ఆత్మ " నేను వచ్చిన పని పూర్తి అయింది" అని చెప్పి నా శరీరం నుంచి విడుదల అయి వెళ్ళిపోయింది!

 

ఈ  "అఖియో" తాలూకు వ్రేళ్ళు భూమిలోపల చాలా దూరం వరకూ విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు ద్వారకా తిరుమలలో కట్టబడుతూన్న పిరమిడ్ ప్రాంగణమంతా, మరి అక్కడ రాబోయే అతి గొప్ప ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంతా అది తన వేర్లను విస్తరింపచేసుకుని ఉంది!

 

రానున్న రోజుల్లో ఓ గొప్ప ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా మార్పుచెంది ఎంతో మంది ఆత్మజ్ఞానులను తయారు చేసే అతి గొప్ప వేదికగా "ద్వారకా తిరుమల" మారనుంది. ఇది "అఖియో" యొక్క సంకల్పం. మరి ఇది నెరవేరాలంటే తనకు శరీరాలు కావాలి. కనుక "మన భూమిని సంరక్షించుకోవాలి" అనే తపన ఉన్న ప్రతి ఒక్క శరీరధారి కూడా తన దగ్గరకు వస్తారని తనకు తెలుసు. వాళ్ళ ద్వారా ఆ వృక్షం చేయబోయే గొప్ప బృహత్కార్యానికి మనం మన వంతు సాయపడాలి. అలా చేయడం ద్వారా పది జన్మలలో జరగవలసిన ఆత్మోన్నతి మనకు ఈ ఒక్క జన్మలోనే సంపూర్ణం అవుతుంది.

 

 

శిరీష

తాడేపల్లిగూడెం

సెల్:+91 8978284214

Go to top