" ఆధునిక యోగి .. శ్రీ శార్వరి "

 

"ఆధునిక వ్యాసుడు" అని పిలవబడుతూ "శార్వరి"గా ప్రసిద్ధి చెందిన శ్రీ వాసిలి రామకృష్ణశర్మగారు మాస్టర్ CVV అనుయాయులు. యోగసాధకులు అక్షరయోగి ఆరాధనా, అస్తిత్వవేదనా, ఉద్వేగమూ, ఉదాత్తతా మిళితమైన వందకు పైగా ఆధ్యాత్మిక గ్రంధాలను ఆంధ్రులకు అందించిన యోగిపుంగవులు, జ్ఞానమూర్తి "మాస్టర్ శార్వరి".

 

ప్రస్తుతం హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీశార్వరి నవంబర్ 7, 1929 గుంటూరు, జిల్లా, తెనాలి సమీపంలో కోపల్లెలో జన్మించారు. కోపల్లె, తెనాలి, గుంటూరు, బెనారస్‍లలో విద్యాభ్యాసం సాగించి M.A. పట్టా పొందారు. 1955లో యామినీ దేవితో వివాహం జరిగింది. 1958లో "ఆంధ్రప్రభ"లో సబ్-ఎడిటర్‌గా ప్రారంభించి ఆ తదుపరి ఎడిటర్‌గా అనేక సంవత్సరాలు కొనసాగారు. ఆ రోజులలోనే అనేక కథలు, నవలలు, నాటకాలు రచించారు. ఆధ్యాత్మిక రచనలు చేశారు. 1969 సంవత్సరంలో మద్రాసు నగరంలో "డాక్టర్ గాలి బాలసుందరరావు"గారి ద్వారా "ఇనీసియేషన్" జరిగింది. వీరి కుమారుడు "డాక్టర్ వాసిలి వసంతకుమార్"గారు కూడా యోగ సాధకులు మరి ఆధ్యాత్మిక రచయిత.

 

"మీలో మార్పు చెందడానికి దోహదం చేసేవారు మీ మాస్టర్. స్వతంత్రంగా మార్పు చెందించుకోగలిగినవారు స్వయంగా మాస్టర్స్ అవుతారు" అని చెప్తూ అనేక మందికి ఉపదేశం ఇచ్చి తనంతటి వారుగా కావడంతో చేయూతనిస్తున్న శ్రీ శార్వరి గారితో కొంతసేపు ముచ్చటించారు శ్రీ అక్కిరాజు మధుమోహన్ మరి స్వర్ణలత .. ఆ సారాంశం "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకుల కోసం ..

ఎడిటర్


 

స్వర్ణలత/మధుమోహన్: "నమస్కారమండీ .. మాస్టర్ సివివి అనుయాయులుగా, ఉపదేశకులుగా, ఆధ్యాత్మిక బహుగ్రంథకర్తగా, పాత్రికేయులుగా, యోగానుసంధానులుగా బహుముఖ ప్రావీణ్యం కలిగిన మీ జీవిత ప్రయాణం కొంచెం వివరించండి!"
శ్రీ శార్వరి: నమస్కారం! తప్పకుండా వివరిస్తాను! వృత్తిరీత్యా పాత్రికేయుడిని కావడం చేత మాత్రమే కాక జ్ఞానార్తితో నిరంతరం అధ్యయనశీలతతో ఆధ్యాత్మిక, తాత్విక, యోగ గ్రంధపఠనం చేసేవాణ్ణి. మహాత్ముల, యోగుల గురువుల జీవిత చరిత్రలను అనుశీలించి, వారి యోగ మార్గాలను అధ్యయనం చేసేవాణ్ణి. దానితో ప్రాచీన యోగ సంప్రదాయాలతో పాటు పాశ్చాత్య తాత్విక అంశాలపై అవగాహన పెరిగింది. యోగ సాధన, యోగ సాహిత్య పఠనం ఫలితంగా ‘యోగ ప్రపంచం’ లో చేరుతూ క్రమంగా యోగ సాధన మొదలైంది, ఆవిష్కృతమయింది.

 

స్వర్ణలత: "యోగం అంటే ఏమిటి?"

 

శ్రీ శార్వరి: ‘యోగం’ అంటే భగవంతుని తెలుసుకునే మార్గం. ఏకాగ్రత, ధ్యానాల ద్వారా యోగం అన్నది సాధ్యం. సంయోగమే యోగం! నేను మాస్టర్ CVV భృక్తరహిత తారక రాజయోగం సాధన చేసాను. అదే నా ద్వారా ఉపదేశించబడుతోంది.

 

స్వర్ణలత: "అనేక యోగ మార్గాలు ఉండగా మీరు మాస్టర్ CVV గారి మార్గమే ఎందుకు అనుసరిస్తున్నారు? ఆయన మిగతా వారికంటే ఏ విధంగా భిన్నమైనవారు?"


శ్రీ శార్వరి: "శ్రీ వెంకాస్వామిరావు గారు" తన నలుబదవ యేట తనను తాను తెలుసుకుని ఆత్మసాక్షాత్కారం పొంది "మాస్టర్"అయ్యారు. ఒక్కసారిగా వారిలో స్పందన ప్రారంభమయింది. ప్రజ్ఞ ప్రవేశించింది. తాను ఎవరైనదీ, ఎందుకు జన్మించినదీ, తన కర్తవ్యం ఏమైనదీ బోధపడ్డది .. ఆనాటి నుండి ఆయన "మాస్టర్ CVV" అయ్యారు.

 

అప్పటివరకు మానవాత్మలను, శరీరాలను తయారు చేసే యోగులను గురించి, గురువులను గురించి మనం వినలేదు. ‘గాసియస్ స్టేట్’ని గురించి భౌతికంగా గానీ, అభౌతికంగా గానీ తెలుసుకున్న వారు, చూసినవారు లేరు. ఈ జీవరహస్యం ఎవ్వరికీ తెలియదు. ఇది కేవలం పరబ్రహ్మ రహస్యం. మాస్టర్ CVV పరబ్రహ్మం యొక్క అవతారం కాబట్టి ఇది తెలుసుకోగలిగారు. భౌతిక దేహంతో ఉంటూనే ఆ శక్తులను పొందాలని ప్రయోగం జరిపి విజుయులయ్యారు.

 

స్వర్ణలత: "యోగం చెయ్యటానికి ఏ అర్హతలు ఉండాలి?"


శ్రీ శార్వరి: అవగాహనే అర్హత. మనం మత మౌఢ్యాన్ని వదిలి తత్వచింతన చేయగలగాలి. బుద్ధి స్థాయిని చేరుకోవాలి. మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు అంటూ అతుక్కుపోతే యోగంలో ముందడుగు వేయడం కష్టం. అసలు ఇవేవీ యోగార్హత కావు .. వీటన్నింటికీ దూరంగా జరగాలి .. పాతదాన్నంతా త్యజించాలి. అప్పుడే యోగసాధనలో ‘లో వెలుగులు’ అందుతాయి.

 

స్వర్ణలత: "లో వెలుగులు" అంటే?"


శ్రీ శార్వరి: మనం బాహ్య జగత్తులో చూసే వెలుగులు వేరు .. అసలైన వెలుగులు అంతరంగానివి .. అంతరంగ దర్శనం, అంతర్జ్యోతి దర్శనంతో పునీతులమవ్వాలి.

 

స్వర్ణలత: "అసలు మానవజన్మ యొక్క లక్ష్యం ఏమిటి?"


శ్రీ శార్వరి: మానవజన్మ ఎత్తిన మనం సంపూర్ణం కావాలి. మనం సంపూర్ణం అయితే తప్ప సృష్టి సైతం సంపూర్ణం కాదు. మనం మన లోపాలను మొదట సరిదిద్దుకోవాలి .. అది ‘సాధన’ వల్లనే సాధ్యం. అలా సరిదిద్దుకోగలిగితే మన సాధన, ధ్యానం పరిణామానికి, ప్రగతికి ఉపకరిస్తుంది .. కాబట్టి మనం లోపరహితులం కావాలి .. పూర్ణ పురుషులం కావాలి.

 

స్వర్ణలత: "దానికి గతజన్మ సంస్కారం దోహదం చేస్తుందా?"


శ్రీ శార్వరి: మన నడవడిక, ప్రవర్తనలకు మూలం ఈ జన్మలోనే వుంది. ఈ జన్మలో మనకు అబ్బే వ్యక్తిత్వానికి పూర్వజన్మల పాపపుణ్యాలతో ఏ మాత్రం సంబంధం లేదు. వర్తమానమే ముఖ్యం: గతం, భవిష్యత్తులను ఏ మాత్రం ఖాతరు చెయ్యనవసరం లేదు. మనలను మనం వంచించుకోకుండా, మనతో సంబంధం ఉన్నవారిని వంచించకుండా ఉండాలి.

 

స్వర్ణలత: "యోగం వ్యక్తిగతమా? సామూహికమా?"


శ్రీ శార్వరి: రెండూనూ! అయితే తనకోసం యోగం చేసుకునేవాడు కర్మ బంధాలు జన్మబంధాలు అనుభవిస్తాడు. నిరపేక్షతో, నిస్వార్థంతో, విశ్వవికాసంకోసం తపస్సు చేసేవారికి పునర్జన్మలు, కర్మబంధాలు వుండవు. ఇది ధర్మ సూత్రం.

 

ఎవరు సాగుచేసి పంటలు పండించినా ఫలసాయాన్ని అందరూ అనుభవించేటట్లే .. ఎవరు ఎంత తపస్సు చేసినా తపఃఫలాన్ని మానవులందరూ పంచుకుంటారు. ఎవరు ఎంత సాధన చేసినా అది విశ్వ పరిణామానికి సహాయపడుతుంది.

 

స్వర్ణలత: "యోగ గమ్యం ఏమిటి?"


శ్రీ శార్వరి: జీవి అంటే సంపూర్ణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బ్రహ్మరేణువు. ఆ బ్రహ్మంలో వున్న మూలాధాతువులే మనలోనూ ఉంటాయి. అంటే బ్రహ్మసృష్టి అంతా మనలోనూ సూక్ష్మరూపంలో ఉన్నట్లే. బ్రహ్మం అంటే మూలప్రకృతి. ఉన్నదాన్ని తెలుసుకోగలగాలి! ఆ తెలుసుకునే వివేకమో, జ్ఞానమో నీకు కలగాలి! అందుకు శాస్త్రాలూ, సిద్ధాంతాలూ ఏ మాత్రం ఉపకరించవు. ఆ సత్యం తెలుసుకోవటమే యోగగమ్యం.

 

యోగసాధన ద్వారానే శరీరాన్నీ, మనస్సునూ దాటి ఆత్మను చేరగలం. యోగప్రస్థానంలో ఎవరికి వారే గమ్యం చేరాలి. అది ఇతరులు చెపితే తెలిసేది కాదు.

 

స్వర్ణలత: "అందుకోసం ఏం చెయ్యాలి?"


శ్రీ శార్వరి: మనస్సులో ఆలోచనలు ఎక్కడ నుండి పుడుతున్నాయో అక్కడకు చేరి వాటిని రహితం చేయాలి. అప్పుడు మనస్సు నిశ్చలమైన ఆత్మ దారుల్లో ప్రయాణం సాగుతుంది. నిజానికి మహాసంగ్రామంలో అయినా సేద తీరవచ్చేమో కానీ అంతస్సంఘర్షణలో అసాధ్యం. దానిని సాధించడానికి యోగసాధన అవసరం.

 

అగ్ని అన్ని సమిధలనూ కాల్చి బూడిద చేసినట్లు జ్ఞానం అన్ని కర్మలనూ బూడిద చేయగలదు.

స్వర్ణలత: "సాధకునికి వుండవలసిన లక్షణాలు ఏవి?"

 

శ్రీ శార్వరి: సాధకుడు ముందుగా సంస్కారం కలిగివుండాలి. అదే యోగమార్గాన్ని నిర్దేశించే యోగార్హత. బాహ్య జీవితంలో ఏ విధంగా వుండవలసి వచ్చినా అంతరంలో శూన్యం కావాలి. సాధనలో నటించకూడదు. మనల్ని అతలాకుతలం చేసే పరిస్థితుల్లో సైతం మనం జీవితం నుండి పారిపోకుండా ఎదురొడ్డి నిలవాలి. ఆ నిబ్బరం, నిలవరింపు ఉంటే మృత్యువు కూడా మనల్ని భయపెట్టలేదు. ఆ నిబ్బరం, నిలవరింపు ఉంటే మృత్యువు కూడా మనల్ని భయపెట్టలేదు.

 

సాధకుడైనంత మాత్రాన ప్రాపంచిక లంపటాలు లేకుండాపోవు. భౌతిక బంధాలు పడుతూనే వుంటాయి. కుటుంబ వాతావరణం బిగుసుకుంటూనే ఉంటుంది. ఇదంతా బాహ్యం మాత్రమే. అంతరంలో స్వేచ్ఛా విహారం చేయవచ్చు. విముక్తం కావచ్చు .. లో లోతులలో ఒక్కటొక్కటిగా సంకెళ్ళన్నింటినీ త్రెంచుకోవచ్చు - అప్పుడు ఆత్మ ప్రజ్ఞానం అవుతుంది.

 

అంతేకాదు, మనం ఒక మార్గంలో ఉన్నంత మాత్రాన ఇతర మార్గాలను నిరసించకూడదు. మనం ఒకకొమ్మను పట్టుకుని చెట్టు ఎక్కుతున్నాం. మనం పట్టుకునే కొమ్మే ముఖ్యం .. మిగిలిన కొమ్మలు పనికిరావని అనుకోం కదా! చెట్టుకు ఎన్ని కొమ్మలు వున్నా మూలం ఒక్కటే. అలాగే మహాత్ములు అందరిలోనూ పనిచేస్తున్నది .. "పరబ్రహ్మ .. పరమాత్మ .. ఈశ్వరప్రజ్ఞ .. ఏ పేరైనా పెట్టండి, అది ఒక్కటే" అని గ్రహించాలి. సాధకులు ఆరు యోగసూత్రాలను ఆచరించగలిగితే ఆత్మను జయించవచ్చు. అవి ఇతరులకు సహాయపడటం; ఆత్మ సంయమనం పాటించటం, ప్రశాంతత, నిర్మలత, ఆనందాలు కలిగివుండటం; సత్యాన్ని గ్రహించటం; నిస్వార్థం; మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమించగలగటం.

 

 

స్వర్ణలత: "యోగస్థితి ఎప్పుడు, ఎలా సాధ్యమతుంది?"

 

శ్రీ శార్వరి: జీవాత్మ విశ్వాత్మతో ఏకభావన పొందినప్పుడు .. వ్యక్తి చేతన విశ్వచేతన అయినప్పుడు .. వ్యక్త చైతన్యం అవ్యక్త చైతన్యంగా పరిణమించినప్పుడు అది సాధ్యపడుతుంది. మన అల్పమైన అహాన్నీ, వ్యక్తిత్వాన్నీ సంపూర్ణంగా త్యజించాలి. శారీరక, మానసిక హింసలతో కాక ప్రేమతో ఆత్మ విశ్వ బ్రహ్మాన్ని స్పందింపచేయాలి. ప్రతివ్యక్తిలో వున్నపరమాత్మ ప్రతిస్పందించేటట్లు ఆత్మ ప్రేమించగలగాలి. మనలో మృగలక్షణాలు సమిసిపోనంత కాలం పరమాత్మ మనకు ఏమీ కానట్లు దూరంగానే వుంటుంది. మన వాంఛలకూ, కామనలకూ విశ్వదర్శనం ఆమడ దూరం, మనలోని అల్పగుణాలు పరమాత్మను మనకు చేరువగా రానీయవు.

 

స్వర్ణలత: "స్పిరిట్, బ్రహ్మచర్యం, సృష్టిరహస్యం, సమాధి వేదం - వీటిని గురించి తెలియచెయ్యండి .."


శ్రీ శార్వరి: "స్పిరిట్"అంటే ఆత్మకాదు, అంతకు మించినది, దానిని అధిమేధస్సు అంటే ఉన్నత ఆధ్యాత్మికం అంటారు. అంటే స్ఫటికం వలె స్వచ్ఛమైనదని అర్థం. మనిషి తనకు తెలియని దానిని తెలుసుకుని, ఆ తెలిసిన దానిని తెలియని దానితో సంయోగపరచాలి. దానివల్ల పరిపూర్ణత్వం సాధించటమే దివ్యత్వం. అదే సంపూర్ణ స్వేచ్ఛ. ద్వంద్వ ప్రవృత్తి నుండి దుఃఖం నుండి నశ్వరత్వం నుండి విముక్తం కావడం.


"బ్రహ్మచర్యం": అది వివాహబంధం నుండి తప్పుకోవటమూ, వాంఛలను కాల్చి వేసుకోవడమూ కాదు. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి చేసే కృషి బ్రహ్మచర్యం. అది గార్హస్థ్య జీవితంలోనే సాధ్యం. స్త్రీ, పురుషుల - భార్యా, భర్తల సాహచర్య, సంగమాలే బ్రహ్మాచర్యార్హతను కలిగిస్తాయి.

 

బ్రహ్మంలో ఐక్యం కావడం అన్నది లేనేలేదు. పరిణామ దశలను దాటుకుంటూ వచ్చిన జీవాణువు మళ్ళీ తన తొలిదశకు చేరదు. ప్రగతి అంటే ఉన్నత దశను పొందటమే. అది మానవత్వం నుండి దైవత్వానికి చేరుకుని, ఆ పైన బ్రహ్మత్వ సిద్ధిని పొందడం.

 

"సృష్టిరహస్యం": అదే పూర్ణసిద్ధి. అది ప్రకృతిని గురించిన సాధారణ విజ్ఞానం కాదు. మనం ప్రకృతిని అర్థం చేసుకున్నా లేకపోయినా అది యధాప్రకారం నడుస్తూనే వుంటుంది. కాబట్టి మనం ప్రమాదవశాత్తూ జన్మించలేదని చెప్పవచ్చు. ఏదో సాధించాలి. ఆ సాధించవలసిన దానిని ఒంటరిగా సాధించలేము. సృష్టిలోని ముఖ్య విభజన స్త్రీ పురుషులు. వారి ఆత్మలు రెండూ ఏకమైతే ఇద్దరికీ జన్మరాహిత్యం కలుగుతుంది. మూలాణువు రెండుగా విడిపోవడం వల్లనే స్త్రీ పురుషులు ఏర్పడటం జరుగుతుంది. ఆ రెండూ తిరిగి ఏకం కావాలి. అదే సృష్టిరహస్యం.

 

"సమాధి": అంటే కుండిలినీ శక్తి తన మూలస్థానం నుంచి పైకి లేచి మనోమయ, భావమయ, ప్రాణమయ స్థితులకు భంగం కలగని విధంగా మహా ప్రజ్ఞతో సంబంధం కలిగివుండటం త్రిపుటి పరిణామమే విశ్వకుండలిని.


"వేదం": వ+ఇదం - అంటే ఇదంతా ఏమిటి? అదే తెలుసుకోవాలి - ఏం తెలుసుకోవాలి? ఇహం : పరం.


"ఇహం": అంటే భౌతిక శరీరంతో ఎలా బ్రతకాలి? అంటే శరీరాన్నీ, మనస్సునూ ఆరోగ్యంగా ఉంచుకోవడం, మనచుట్టూ శాంతి, ప్రేమలను పంచడం; మంచి సంతానాన్ని కని వారు సంఘానికి ఉపయోగపడేలా తయారుచెయ్యడం.


"పరం": భౌతిక శరీరం వదిలిన తర్వాత ఎలా బ్రతకాలి? అంటే ఆత్మ అభివృద్ధి, ఉన్నతి కోసం చేయవలసిన విధులు తెలుసుకోవడం, సాధన చెయ్యడం మన సాధన వల్ల లభ్యమయ్యే శక్తితో ఆత్మ ఉన్నతలోకాలకు ఎదుగుతూ .. సాధనలో వెనకబడి ఉన్న ఆత్మలకు సహాయం చెయ్యడం.

 

స్వర్ణలత: "శరీరం పంచభూతాలతో తయారవుతోంది; మరి ఆత్మ ఎలా తయారవుతుంది!"

 


శ్రీ శార్వరి: ఆత్మ ఈథర్ కణాలతో తయారవుతుంది. రవి కిరణ కాంతి కణాలే ఈథర్. ఈథర్ అంతా కాంతిమయం. ఆకాశతత్వం అంతా ఈథర్ మయం. మనుష్యుల జీవితాల రికార్డులు ఆకాశంలోని ఈథర్ కణాలతో కలిసి ఆత్మగా ప్రభవిస్తాయి. మనిషిలో ఈథర్ శాతం పెరిగితే ఆస్ట్రల్ పవర్ పెరుగుతుంది. ఈథర్ శూన్యంలో ఉత్పత్తి అవుతుంది. యోగం అంటే శూన్యం కావడమే. అందుచేతనే ధ్యానం వల్ల ఆత్మశక్తి, ఆస్ట్రల్ పవర్ ఆత్మజ్ఞానం పెంపొందుతాయి.

 

స్వర్ణలత: "సాధకులకు ఉపయోగపడే సూచనలు ఏవైనా తెలపండి!"


శ్రీ శార్వరి: సాధకులు మదిలో ఉంచుకోవలసిన సంగతులు కొన్ని వున్నాయి. యోగమంటే కోరిక లేని తపస్సు. సత్యం మనలోనే వుంది. దాన్ని చేరుకోడానికి అంతర్యానం చెయ్యాలి. అందుకు బాహ్య ఉపకరణాలు ఏవీ పనికిరావు .. ఒక గురుకృప తప్ప.

 

యోగపథంలో ప్రతి సాధకుడికీ ధ్యానం అయినా, సాధన అయినా ఒక మజిలీ మాత్రమే. సాధనలో అంతరంగ శోధన ప్రారంభమవుతుంది. విషయాలను బాహ్యం నుండి కాక అంతరావబోధ నుండి తెలుసుకుని అవగాహన చేసుకోగలగడమే జ్ఞానం.

 

క్రమంగా అంతఃశక్తులు అందుకోవడం సాధ్యమవుతుంది .. ఆ పరిణామంలో ప్రజ్ఞాన్విత ఆత్మజ్ఞానం కలిగి .. గురువుల రూపాలు ముఖ్యంకాదానీ "వారికి స్వ-పర శిష్యవర్గం ఉండదు" అనీ తెలుస్తుంది. "ఇహ-పర సంగమస్థితి వారికి విశ్వవేదిక" అనీ, "అమృతత్వ సిద్ధి వారి యోగవేదిక" అనీ, ఆకళింపుకు వస్తుంది. అలా విశ్వవేదిక వైపు సాగించే సాధనా ప్రయాణమే సాధకుల యోగ పరిణామం.

 

ప్రతి సాధకుడికీ తాను చేస్తున్న యోగం పైన అచంచల విశ్వాసం ఉండాలి. గురువు గారికి అంటే గురుతత్వానికీ, యోగతత్వానికీ సంపూర్ణంగా అధీనమవ్వాలి. ఎవరు ఎంత కాదన్నా గురువులు "తాము గురువులం" అని చెప్పుకోకపోయినా అధీనమవటం చాలా, చాలా అవసరం. నిజానికి విశ్వాసం, సాధన రెండు పట్టాల వంటివి. అప్పుడే యోగం అనే రైలు కదులుతుంది.

 

ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా గురువుపై విశ్వాసం సడలనీయ కూడదు. కష్టనష్టాలు గురువు ప్రకల్పించినవి కావు .. ప్రకృతి ప్రకల్పించేవి .. అందులో గురువు ప్రమేయం వుండదు. యోగ పద్ధతిలో కుండలినీ అంటే శక్తి కాదు, చైతన్యం. ఆ చైతన్య స్థితిలోనే నిర్వాణసుఖం అనుభవంలోకి వస్తుంది. "నిర్వాణం" అంటే యోగసాధనలో పొందే అద్భుతానంద స్థితి. సహస్రార అనుభూతిలో "అది వేరు, నేను వేరు" అన్న భేదం పోయి "త్వమేవాహం" అనిపిస్తుంది.

 

స్వర్ణలత: "వందకు పైగా మీరు రచించిన ఆధ్యాత్మిక గ్రంధాలలో ఎందరో ఆధ్యాత్మిక వేత్తల గురించి తెలియచేశారు. వారిలో/వాటిలో కొన్నింటిని గురించి ఒకటి రెండు వాక్యాలు?!"


శ్రీ శార్వరి: తప్పకుండా! వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ కొన్నింటిని చూద్దాం:


శ్రీకృష్ణావతారం: నిజానికి గీతోపదేశం జరిగింది భౌతికంగా రణరంగంలో .. అందులోనూ పరశురాముడు సంచరించిన తపోభూమిలో. అందుకే అది ఆదిభౌతికంగా అంతరంగానికి చేరింది .. విశ్వరూపదర్శనం చేసింది. "జ్ఞానమనే ఆత్మాయుధంతో అనుమానం అనే ఆలోచనలను సంహరించు! విశ్వం అనే ఈ వృక్షానాకి వ్రేళ్ళుపైన, కొమ్మలు క్రింద వుంటాయి. అంటే పరలోకంలో వ్రేళ్ళు పాతుకుని ఉంటాయి అన్నమాట. వాటి ఆకులు, కొమ్మలు, ఫలాలు ఈ లోకంలో కనిపిస్తాయి. విస్తరించిన కొమ్మలు ప్రకృతి గుణాలు, బెరడులు అనుభూతులు."

 

ఓషో: గౌతమబుద్ధుడంతటి ప్రతిభాశాలి. దార్శనికుడు. మహామహా తత్త్వవేత్తలలో ఎవ్వరికీ తీసిపోనివాడు! వివేచించడంలోనూ, విశ్లేషించడంలోనూ శంకరాచార్యునికి ధీటైనవాడు! ఆయన ఒక సామాజిక విప్లవాన్ని అభిలషించాడు. మిస్టిక్, మర్మయోగి, మార్మికయోగి, ఆయనది జన్మాంతర సంస్కారం.


సద్గురు సాయిబాబా: సాయిబాబా సద్గురువు
మానవతకు పరిమళాలద్దిన మహాజ్ఞాని
సుజన పరుసవేది, కాలాతీతుడు, బ్రహ్మజ్ఞాని
మహాపురుష లక్షణ లక్షితుడు, ప్రజ్ఞానభాస్కరుడు


ఆ జన్మ యోగి, బ్రహ్మచారి, ఆర్తత్రాణ పరాయణుడు, లోక సంగ్రహ వ్యావర్త, వివేకవైరాగ్య వ్యవహర్త, కర్మిష్ఠి సాయిబాబా మహాత్మా జీసస్: జీసస్ తాత్వికత సత్యసంథతలు విశ్వజనీనం, సత్యప్రమాణం. దివ్య భూమికలలో అత్యున్నత పాత్ర పోషిస్తున్న మహానీయుడు జీసస్.

 

జీసస్ కాలంలో నాగరికత తక్కువ. ప్రజల విజ్ఞతా తక్కువే. అప్పుడు మనిషిలో మానసిక వికాసం కోసం క్రీస్తు ప్రేమ, కరుణల ఆలంబనలతో జీవించారు. ది అక్వేరియన్ గాస్పెల్ ఆఫ్ జీసస్ దీని రచనకు తోడ్పడింది.

 

భగవాన్ బుద్ధ: భూలోక చరిత్ర బుద్ధుని వద్ద పెద్ద మలుపు తిరిగింది! బుద్ధికి పూర్వం చరిత్రకు కళ్ళు, హృదయం లేదు. కరుణ, ప్రేమ కనిపించని కాలంలో మానవత్వాన్ని నిద్రలేపిన వాడు బుద్ధుడు. మతం దేవుణ్ణి తలకెత్తుకుంటుంది. ఊరేగిస్తుంది. ఆ ఊరేగింపు క్రింద పడి నలిగి పోతున్నవారు దళితులు, బడుగులు. అందుచేత సిద్ధార్థుడు వేదాల నీడ కాదని బోధివృక్షపు నీడను ఆశ్రయించాడు; సుఖాలు పణంగా పెట్టి ఆనందాన్ని అన్వేషించాడు.

 

ధియోసాఫికల్ సొసైటీ: ప్రపంచ దేశాలన్నింటిలో భావచైతన్యం తెచ్చింది. మేధావుల ఆలోచనా సరళి మార్చింది. ఆత్మలతో ఆడుకుంది. ఆత్మల ఆధారంగా అద్భుత పరిశోధన చేసింది. లెడ్‌బీటర్, బ్లావెట్‌స్కీల సారధ్యంలో గొప్ప పరిశోధనలు జరిగాయి! మిస్టిక్ రైటింగ్, మహాత్ములతో సంభాషణలను సాధ్యం చేయటమే కాక ఆకాశిక్ రికార్డ్సు .. అంటే గాడ్స్ రిమెంబరెన్స్ .. మన జీవితం పైలోకాల్లో రికార్డ్ అయివుండటం .. గురించి తెలియజేసింది.

 

అరవిందుల ఆంధ్ర మహా సావిత్రి: సావిత్రీ సత్యవంతుల ఆదర్శజీవనం, యోగదాంపత్యం, సావిత్రి యమునితో దెబ్బలాడటం కాక మృత్యువుతో తలపడి, మృత్యువును జయించడాన్ని అనుభూతి చెందుతాము. "సావిత్రి" అంటే మహాయోగిని, యోగీశ్వరి .. యోగహృదయం, యోగసంస్కారం కలవారెవరికైనా "సావిత్రి"లో శ్రీ అరవిందులు, అరవిందునిలో పూర్ణయోగం కనిపించి తీరుతాయి. భౌతికానికి అది కవితాధారే అయినా నిజానికి అది చైతన్య ధార. కావ్యంలో ఆత్మ ఎలా ఏకత్వం కావలసిందో చెప్పబడింది. ఆ పూర్ణత్వాన్ని స్వప్రయత్నంతో, స్వయంకృషితో యోగసాధన ద్వారా సాధించాలి. అందుకు అధిమానసిక వికాసం, అధిమానవతా విలసనం, దివ్యప్రేరణ, దివ్యజీవనం ఆలంబనం కావాలి. అప్పుడు మనం అంటే మనిషి "మనీషి" అయి విశ్వంభరులం కాగలం.

 

జిడ్డు కృష్ణామూర్తి: స్వేచ్ఛ పొందినవారే మార్గం చూపగలరు. స్వేచ్ఛ ఏ కొందరికో పరిమితం కాదు. కర్మను అతిక్రమించేవారు ప్రతివారూ దానికి అర్హులే. జనన మరణాలకు అతీతులు కండి. బాధలను కష్టాలను అధిగమించండి. స్వేచ్ఛ అన్నది జీవన సూత్రం; స్వేచ్ఛ అన్నది కర్మరాహిత్య సూత్రం. అది మహాగ్నిగుండం. ఆ మంటల్లో కాలి వెలుగుగా మారాలి.

 

పరేంగిత ప్రజ్ఞ - దాదా గవంద్: ఎవరికి వారే సమస్య బయట ఎవరో గొప్పవారికోసం, మహా గురువుల కోసం, మహాత్ముల కోసం అన్వేషించకండి. వారెవరైనా కొంతవరకే సహాయపడతారు. అసలు మార్గం మీది, అన్వేషణ మీది; ఉన్నచోటు నుంచే యాత్ర ప్రారంభించండి. ఎవరి హృదయంలోకి వారే వెళ్ళగలుగుతారు. ఆత్మను అన్వేషించడానికి సిద్ధాంతాలు, విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ఏమీ అవసరం లేదు.అవతార్ మెహర్ బాబా: అవధూతలకు దేహాభిమానం ఉండదు. ఆత్మాభిమానం అసలుండదు. ప్రపంచస్పృహ ఉండదు. లౌకిక మర్యాదలు పాటించడం చేతకాదు. తిండి ధ్యాస ఉండదు. కడుపాకలి తెలియదు. తానున్న విషయమే తనకు తెలియదు. అంతా పరధ్యానం. అది లోకం దృష్టిలో పిచ్చి ప్రవర్తన. హైందవ పద్ధతిలోని అవధూతలే ముస్లిం పద్ధతిలో బాబాలు, మస్త్‌లు. ఈ దైవ రక్షితుల్ని ఒక్కొక్క మతం ఒక్కో పేరుతొ పిలుస్తుంది. అందరి ఆరాటం ఒక్కటే. అందరి వర్తనం దాదాపు ఒక్కలాగే వుంటుంది.

 

స్వర్ణలత: "యోగ సాధకులకు మీ సందేశం?"


శ్రీ శార్వరి: యోగ సాధనలో సంఘర్షణలు, వేదనలు తప్పవు. ఆత్మశక్తిని సాధించగలిగితే ఎటువంటి ఒత్తిళ్ళనయినా తట్టుకోగలుగుతాం. మనలో ప్రతి ఒక్కరికీ ఆంతరిక ప్రజ్ఞ ఉంది. దానిని జ్ఞాననేత్రంతోనే చూస్తాం. అసత్యాలను తొలగించగలిగితే సత్యం బయటకు వస్తుంది. యోగిమత్వంలో సాటిలేని సంయమనం, అసాధారణ ఆత్మనిగ్రహం కనిపించాలి. ఆధ్యాత్మికతలో జాగృతి, చైతన్యం, నిత్యం నిరంతరం కావాలి. ధ్యానంలో సైతం మనోవిశ్లేషణ ఊపిరి కావాలి.

 

ప్రతి ఒక్కరి భౌతిక జీవితం, సంసారిక జీవితం, యౌగిక జీవితం అంతర్యుద్ధాల సమాహారంగా సాగుతుంది. ఏ విషయంలోనూ సందిగ్ధత పనికిరాదు. స్పష్టత అవసరం. శబ్ధం నుంచి తప్పించుకుని నిశ్శబ్ధం కావటమే ధ్యానం. ఆధ్యాత్మికత అంటే ఆస్ట్రల్ లెవెల్‌లో చేసే ప్రయాణం. అదే ఆధ్యాత్మికతకు పునాది. ప్రతిఫలాపేక్ష లేని సేవకే ప్రతిఫలం వస్తుంది. సేవ తృప్తిగా నిరపేక్షంగా చేయాలి.

 

స్వర్ణలత: "పత్రీజీ గురించి మీ మాటలలో .."


శ్రీ శార్వరి: ఓషో తరువాత ఆధ్యాత్మికతకు అంత నిష్కర్షగా నిర్భయంగా తెలియచేస్తున్నది పత్రీజీనే .. ఇక్కడ మనల్ని ఎవరు మెచ్చుకుంటారు, ఎవరు నొచ్చుకుంటారు అన్నది ప్రధానం కాదు. సత్యం తెలియ చెప్పటమే ముఖ్యం. ఆయన అదే చేస్తున్నారు!

 

స్వర్ణలత: "మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారం! మీ గురించి మీరు .."
శ్రీ శార్వరి: స్వీయ విశ్లేషణ, ఎరుక, దివ్యజ్ఞానం పొందడానికి తోడ్పడ్డాయి. ఏదీ సాధించాలని చెయ్యలేదు. ఏ కోరికతోనూ చెయ్యలేదు. ఏది ఓటమో, ఏది విజయమో ఎవ్వరూ చెప్పలేరు. అద్యంతాలు లేనిది ఆధ్యాత్మికత!

 

I don't want to expose myself trough media. My medium is soul. I am able to do my work at that level, it goes on forever.

 

 

 


యోగాలయ

+919393933946

 

 

 

 

 

 

 

Go to top