" జీవితంలో ‘ఏడుపు’ అన్నది ఉండకూడదు "

 

"కైలాసపురి" .. మహేశ్వర పిరమిడ్ మహా ప్రాంగణంలో 2014 డిసెంబర్ 18 నుండి 31 వరకు నిర్వహించబడిన "ధ్యానమహాచక్రం - V" వేదికగా ప్రతిరోజూ మధ్యాహ్నం సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే సజ్జనసాంగత్యం నిర్వహించబడింది.

 


ఇందులో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ "శ్రీ రాయ జగపతిరాజు" గారు "పత్రీజీతో మూఖాముఖి" కార్యక్రమం నిర్వహించి ధ్యానసాధకులకు వచ్చే ప్రాపంచిక మరి ఆధ్యాత్మిక సందేహాలకు పత్రీజీ ద్వారా వివరణాత్మకమైన సమాధానాలను పొందడం జరిగింది. వేలాదిమంది ధ్యానుల సమక్షంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమాన్ని youtube లో అప్‌లోడ్ చేసిన హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ M.నవకాంత్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ "ధ్యానాంధ్రప్రదేశ్" ద్వారా "పత్రీజీతో ముఖాముఖి" మీకోసం ..

-ఎడిటర్


 

జగపతిరాజు: "సత్యం తెలుసుకుని కూడా సత్య పూర్వకంగా ఎందుకు జీవించలేకపోతున్నాం?"


పత్రీజీ: సత్యంపట్ల సంపూర్ణ అవగాహన కలగాలంటే మనం ఎన్నో మానవ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా వేలకొద్దీ మనుష్యుల్లో " ‘సత్యాన్ని తెలుసుకోవాలి’ అని అనుకునేవారు" కొంత మందే అయితే .. అందులోంచి కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు .. తమ ప్రయత్నాల్లో సఫలత చెందేవారు ఇంకా కొంతమందే! అంతిమంగా సత్య సాక్షాత్కారాన్ని పొందినవారే .. సత్యపూర్వకంగా జీవిస్తూ ఉంటారు.

 

ఇదంతా కూడా ఒక అద్భుత పరిణామ ప్రక్రియ. ఇందులో ఎవ్వరూ "ఎక్కువ" కాదు .. ఎవ్వరూ "తక్కువ" కాదు. తక్కువ జన్మల జ్ఞానంతో కూడిన "శైశవాత్మ" మొదలుకుని ఎక్కువ జన్మల పరిపూర్ణ జ్ఞానంతో కూడిన "వృద్ధాత్మ"వరకు ప్రతి ఒక్కరి స్థితి కూడా గొప్పదే! ఈ సత్యం తెలుసుకుని "మనం నిన్నటికంటే ఈ రోజు కొద్దిగానైనా మెరుగ్గా ఉన్నామా లేదా" అన్న అవగాహనతో జీవించడమే .. సత్యపూర్వకమైన జీవన విధివిధానం!

 

జగపతిరాజు: " ‘భయం’ అన్నది ఎలా పోగొట్టుకోవాలి?"


పత్రీజీ: ఈ ప్రపంచంలో సగం మందికి "చావు" అంటే భయం .. సగం మందికి "బ్రతుకు" అంటే భయం! సగం మందికి "సంసారం" అంటే భయం .. సగం మందికి "సన్యాసం" అంటే భయం. ఇలా "భయం" అన్నది ప్రతి ఒక్కరికీ వుంటుంది! మరి అలాంటి భయాల్లోంచే అనేకానేక సందేహాలు పుట్టుకొస్తూ వుంటాయి.

 

కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి యుద్ధం పట్ల కలిగిన భయం వలన అనేకానేక సందేహాలు పుట్టుకొచ్చాయి. అస్త్రశస్త్రాలను పడవైచి యుద్ధరంగం మధ్యలో కూర్చుని .. ఒక భీరువులా భయాన్ని నటిస్తూ లోకంలో అందరి తరపున వకాల్తా పుచ్చుకుని మరీ శ్రీ కృష్ణుడిని అనేకానేక సందేహాలు అడిగాడు. మరి ఈ లోకానికి భగవద్గీత అందించబడడానికి కారకుడయ్యాడు. ఇలా ఒక్కోసారి సుజ్ఞానులకు కలిగే భయం వల్ల లోకానికి ఉపకారం కూడా జరుగుతూ వుంటుంది. కనుక భయాన్ని తలచుకుని ఊరికే భయపడుతూ, భయపడుతూ కూర్చోకుండా .. భయరహితులైన వారితో కలిసి తిరుగుతూ ఉండండి. మీకు మేలు జరుగుతుంది.

 

జగపరతిరాజు: "మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి?!"


పత్రీజీ: ఎవ్వరూ ఎవ్వరినీ అర్థం చేసుకోవలసిన అవసరం లేదు! అసలు అలా "ఒకరు ఇంకొకరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం" అన్నది పరమ మూర్ఖపు చర్య! "ఒకరు ఇంకొకరిని ఎన్నటికీ అర్థం చేసుకోజాలరు" అన్న సత్యం తెలుసుకున్న ఆత్మజ్ఞాని .. ఇతరులను అర్థం చేసుకుంటూ తన సమయాన్ని వృధా చేసుకోవడానికి అవస్థలు పడకుండా .. స్వీయ అంతరంగ పరిశీలన ద్వారా తనను తాను సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఆత్మవత్ జీవనం గడపడానికి సదా ప్రయత్నిస్తూంటాడు.

 

జగపతిరాజు: "జంతువులను చంపితే వాటికి దుఃఖం కలుగుతుందా?"


పత్రీజీ: జంతువులకు కలగదు!! వాటిని చంపి తిన్నవారికి అపారమైన దుఃఖం కలుగుతుంది. జంతువులకు శరీరంతో పాటు సామూహిక ఆత్మ చైతన్యం వుంటుంది. వాటికి ‘మనస్సు’ అనేది ఉండదు కనుక అవి చంపబడుతూ ఉన్నప్పుడు వాటికి దుఃఖం ఉండదు. ‘బాధ’ మాత్రం ఉంటుంది!

 

మనిషికి మాత్రం శరీరానికీ, ఆత్మకూ మధ్య అనేకానేక కర్మలతో కూడిన ‘మనస్సు’ వుంటుంది కనుక జంతువులను చంపిన కర్మ ఫలితంతో కూడిన దుఃఖం అతనికి తప్పకుండా వుంటుంది. మానవ జీవితంలో "దుఃఖం" అనేది ఉండకూడదు అంటే మూగజీవులను చంపడం మానెయ్యాలి!

 

జగపతిరాజు: "చర్య (action)కు ప్రతిచర్య(reaction) ఉండవచ్చా?"


పత్రీజీ: "చర్య-ప్రతిచర్య" .. "action-reaction" అన్నవి రెండూ కూడా ప్రతిఒక్కమనిషి జీవితంలో అత్యంత సహజంగా వుంటాయి. అయితే ఉప్పు, కారం తినే సంసారేశ్వరుల్లో చర్యలకు బదులుగా "మామూలు ప్రతిచర్యలు"ఉంటే .. ప్రాణశక్తితో పరిపుష్ఠం అయిన యోగీశ్వరుల్లో చర్యలకు బదులుగా "సృజనాత్మక ప్రతిచర్యలు" ఉంటాయి. కాబట్టి సంసారంలో ఉంటూనే ధ్యానయోగీశ్వరుల్లా బ్రతికితే మన జీవితం కూడా సృజనాత్మక ప్రతిచర్యలతో విశేషంగా నిండిపోయి వుంటుంది.

 

జగపతిరాజు: "మీరు పిరమిడ్ మాస్టర్లను ఎంతో గౌరవంగా చూస్తారు. వాళ్ళంతా మీకు చాలా పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తారు! అది ఎలా సాధ్యం?!"

 

పత్రీజీ: నేను ఎలా ఉంటానో .. నాతో పాటు వున్న నా ఎదుటి వారు కూడా నాకు అలాగే కనిపిస్తారు! నన్ను నేను ఎలా గౌరవించుకుంటానో నాతో వున్న ఎదుటి వారిని కూడా నేను అలాగే గౌరవిస్తాను!

 

జగపతిరాజు: " ‘అవధులు లేని ప్రేమ’ గురించి వివరించండి!"


పత్రీజీ: ఈ ప్రపంచంలో లేనివి రెండే రెండు:


ఒకటి: "ప్రేమ" .. రెండు: "చావు" .. ఉన్నది ఒక్కటే అది మైత్రీతత్వం"!


"బృహదారణ్యకోపనిషత్తు" లో యాజ్ఞవల్కుడు తన భార్య అయిన మైత్రేయితో చెబుతాడు "ఈ ప్రపంచంలో ప్రేమ అన్నది ఎక్కడా లేదు. ఒకానొక స్త్రీ ఒకానొక మగవాడిని తన కోసమే పెళ్ళి చేసుకుంటుంది; అలాగే ఒకానొక మగవాడు కూడా ఒకానొక స్త్రీని తన కోసమే పెళ్ళి చేసుకుంటాడు; మరి ఆ ఇద్దరూ కలిసి తమ కోసమే ఒకానొక బిడ్డకు జన్మను ఇస్తారు. ఇదంతా కూడా అవధులు లేని మైత్రీతత్వంతో కూడుకుని ఉంటే .. ఎక్కడా ఒకరిపై ఒకరికి పెత్తనాలు ఉండవు. కేవలం ఒకరితో కలిసి ఒకరు నేర్చుకోవడమే వుంటుంది!

 

జగపతిరాజు: "అజ్ఞానం మరి సుజ్ఞానంల మధ్య బేధం ఎలా తెలుసుకోవడం?"


పత్రీజీ: ఒకానొక వస్తువును గురించిన యధార్థం మనకు తెలిసి ఉండడం .. "సుజ్ఞానం"! ఆ వస్తువును గురించిన యధార్థం మనకు తెలియకపోవడం "అజ్ఞానం". సుజ్ఞానం వల్ల మనకు దుఃఖం విముక్తి లభిస్తే .. అజ్ఞానం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. అందుకే


"లేనిది కోరరాదు .. ఉన్నది కాదనరాదు
వస్తూంటే వస్తుందని సంబరపడరాదు
పోతూంటే పోతుందని బాధపడరాదు"

 

.. అన్నారు మా గురువు శ్రీ సదానందయోగి గారు. వారు చెప్పినట్లుగానే నేను జీవితం యొక్క యథార్ధాన్ని తెలుసుకుని సుజ్ఞానపూర్వకమైన అవగాహనతో జీవిస్తూ హాయిగా ఉన్నాను.

 

జగపతిరాజు: "నిజమైన స్వేచ్ఛ ఎలా ఉండాలి?"


పత్రీజీ: ఒకానొక విద్యార్థి పరీక్ష హాలులో కూర్చుని పరీక్ష వ్రాస్తున్నాడు. అలాంటి సమయంలో అతడు "నాకు స్వేచ్ఛ కావాలి" అనుకుని పరీక్ష మధ్యలో లేచి బయటికి వెళ్ళిపోతే కావాలి" అనుకుని పరీక్ష మధ్యలో లేచి బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ ‘స్వేచ్ఛ’ అతని అభివృద్ధికి ప్రతిబంధంకం అవుతుంది. సంవత్సరం పాటు కష్టపడి చదివి .. ఆ కాస్త పరీక్ష వ్రాసి అందులో ఉత్తీర్ణుడయితే అది అతడికే లాభం! ఇంతలోనే "నాకు స్వేచ్ఛ లేదు" అని ఆక్రోశిస్తే అతడికి సంవత్సరం శ్రమ, డబ్బు అంతా వృధా అయిపోతుంది.

 

అలాగే మనం కూడా అనేకానేక నక్షత్రలోకాల్లో కొన్ని యుగాలు గడిపి ఎంతో సమాచారాన్ని సేకరించుకుని దానిని అనుభవజ్ఞానంలా మలచుకోవడానికి ఈ "భూమి" అనే "ఎగ్జామినేషన్ హాలు"లోకి వచ్చాం! ఇక్కడి రూల్స్ .. రెగ్యులేషన్స్ అన్నీ క్షుణ్ణంగా తెలుసుకునే వచ్చాం! అయినా "జీవితం" అనే క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే దానిని పూర్తి చేయకుండా "నాకు స్వేచ్ఛ కావాలి" అంటూ ఆక్రోశించడం మరి పరీక్ష మధ్యలోంచి లేచి బయటికి రావడం "మూర్ఖత్వం" అనిపించుకుంటుంది.

 

పరీక్ష హాలులోనే కూర్చుని ఒక్కొక్క ప్రశ్నకూ తన వద్ద వున్న జ్ఞానంతో చక్కగా "సమాధానం" వ్రాస్తూ .. అలా సమాధానం వ్రాస్తూ ఉన్నప్పుడు పొందే స్వేచ్ఛను ఒక్కొక్క కోణంలో అనుభవిస్తూ ఉండడమే ఉత్తమ విద్యార్థి లక్షణం!

 

జగపతిరాజు: "ద్వేషాన్ని ఎలా పోగొట్టుకోవాలి?"


పత్రీజీ: ఈ ప్రపంచంలో రకరకాల సంఘాలు ఉన్నాయి. పేకాట ఆడాలంటే "పేకాట సంఘం"లో చేరాలి; త్రాగుబోతు కావాలంటే "త్రాగుబోతుల సంఘం"లో చేరాలి; ధ్యానం నేర్చుకోవాలంటే "ధ్యానుల సంఘం"లో చేరాలి! ఒక బుద్ధుడిలా కావాలంటే "బుద్ధుళ్ళ సంఘం"లో చేరాలి మరి ద్వేషరహితులుగా కావాలంటే "ద్వేష రహితుల సంఘం"లో చేరాలి .. ద్వేషరహితులుగా ఉన్నవారి సంఘంలో చేరి వారితో కలిసి తిరుగుతూ ఉంటే లోపల ఉన్న ద్వేషభావాలన్నీ క్రమక్రమంగా అత్యంత సహజంగానే పోతాయి!

 

జగపతిరాజు: "కర్మలు చేస్తాం సరే .. కర్మఫలితాలను ఎలా గుర్తించాలి?"


పత్రీజీ: మనకు మన శరీరం గురించి తెలుసు .. అలాగే మన శరీరాన్ని వెన్నంటి వస్తూన్న ‘నీడ’ను గురించి కూడా తెలుసు. ఒక్కోసారి ‘నీడ’ మన వెనుక ఉంటుంది .. ఒక్కోసారి ముందు వుంటుంది .. ఒక్కోసారి మనకంటే పెద్దగా వుంటుంది .. మరి ఒక్కోసారి అది మనకంటే చాలా చిన్నదిగా అయిపోతుంది. మన శరీరాన్ని వెన్నంటి వచ్చే ‘నీడ’లాగే "కర్మ ఫలితాలు"అన్నవి కూడా మనం చేసే రకరకాల కర్మలను .. ‘నీడ’లా వెన్నంటే వుంటాయి. సాధారణంగా మనం మన నీడను అస్సలు పట్టించుకోనట్లే .. కర్మలు చేస్తున్నప్పుడు కూడా కర్మఫలితాలను పట్టించుకోము. లేదు. మనం పట్టించుకోకపోయినా సరే .. ఎప్పుడు, ఎక్కడ, ఏ మేరకు అవి మనల్ని ప్రభావితం చేయాలో అక్కడ, అప్పుడు ఆ మేరకు ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇదంతా కూడా అవగాహన చేసుకుని ఆత్మ చైతన్యపు ఎరుకతో జ్ఞానపూర్వకంగా జీవించినప్పుడే కర్మలూ బాగుంటాయి, కర్మ ఫలితాలూ బాగుంటాయి! వెరసి జీవితమంతా ఆనందదాయకంగా ఉంటుంది!!

 

 

రాయజగపతిరాజుగారు

విశాఖపట్టణం

Go to top