" పత్రీజీకి కవితాకుసుమం "

 

 

నా పేరు "యాదగిరి రెడ్డి." నేను 1988లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు ఎందుకో జీవితం పై వైరాగ్యం ఏర్పడి శ్రీకాళహస్తి దగ్గర ఉన్న "శ్రీ శుకబ్రహ్మ ఆశ్రమానికి" వెళ్ళిపోయాను. దాదాపు మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి యోగాసనాలు నేర్చుకున్నాను. భారత, రామాయణ గ్రంథాలను పారాయణ చేసి భగవద్గీత శ్లోకాలను కంఠతా పట్టేశాను.

 

అయినా నాలో ఏదో తెలియని వెలితి! ఆత్మ సంతృప్తి లేదు! అన్నీ వదులుకునివచ్చినా ఇంకా ఏదో కావాలన్న ఆరాటం నన్ను అక్కడ కూడా ఎంతో కాలం నిలువనీయలేదు. దాంతో ఇంకా ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ఆశ్రమాన్ని వీడి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాను.

 

ఈ క్రమంలో నాకు హైదర్‌గూడలో ఉన్న "నాగరాజు" అనే పిరమిడ్ మాస్టర్ ద్వారా ధ్యానపరిచయం జరిగింది. వారి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన 9X9 పిరమిడ్‌లో కూర్చుని ప్రతిరోజూ ధ్యానం చేసుకునేవాడిని. క్రమక్రమంగా నా అంతరంగం ప్రశాంతంగా మారడం మరి నాలో తలెత్తే అనేకానేక ప్రశ్నలకు నా నుంచే సంతృప్తికరమైన సమాధానాలు రావడం జరిగి జీవితం పట్ల నాకు ఉన్న అజ్ఞానపు భావనలు అన్నీ తొలగిపోయాయి.

 

లౌకిక వ్యవహారాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తికావడం జరిగింది. నా శారీరక అనారోగ్యాలు కూడా ధ్యాన శక్తితో నయంకాబడి నేను పూర్తి స్వస్థునిగా మారిపోయాను. చిన్నతనం నుంచీ అనేక రకాలైన అసంతృప్తులతో బాధపడుతూ ఉండిన నేను నాలుగు సంవత్సరాల ధ్యానసాధన వల్ల కలిగిన ఆత్మ సంతృప్తితో మరి ఆత్మ విశ్వాసంతో ఇప్పుడు హాయిగా, ఆనందంగా ఉంటూ నా ఆదాయంలోంచి పదిశాతం డబ్బును సమాజశ్రేయస్సుకు ఖర్చుపెడుతున్నాను. అస్తవ్యస్తంగా ఉండిన నా జీవితాన్ని నా ధ్యానశక్తితో నేనే సరిచేసుకునేలా చేసిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

 

సామ యాదగిరిరెడ్డి

హైదరాబాద్

 

Go to top