" అక్షయ పిరమిడ్ ధ్యానకేంద్రం - రామవరప్పాడు "

 

జీవిత ప్రయాణంలో BSNL ఉద్యోగంలో స్థిరపడిన నేను ప్రతి గురువారం శిరిడీ సాయినాధుని గుడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణలు చేసి దినచర్య ప్రారంభించే రోజులలో .. మిత్రుడు, మేనల్లుడు అయిన శ్రీ "నరసరాజు"గారి మాటలు నన్ను ఆకర్షించి 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ధ్యానాభ్యాసం చేశాను.

'

ఆ తరువాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ "శ్రీ జక్కా రాఘవరావు", మాచవరం, కృష్ణాజిల్లా పిరమిడ్ సొసైటీస్ అధ్యక్షుల పరిచయం, సాన్నిహిత్యం నన్ను ‘పిరమిడ్ ధ్యాని’ గా మార్చింది.

 

ఈ జ్ఞానాన్ని, పిరమిడ్ శక్తిని అందరికీ అందించాలనే తపనతో మా ఇంటి మీద 14'X14' రూఫ్ టాప్ పిరమిడ్, రామవరప్పాడు, రాజుల బజారు దగ్గర నిర్మించి, "అక్షయ పిరమిడ్ ధ్యానకేంద్రం" అనే పేరుతో అనేక మంది మిత్రుల సహకారంతో అనునిత్యం ధ్యానం, పౌర్ణమి ధ్యానం క్లాసులు అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ తటవర్తి వీరరాఘవరావు భీమవరం, మరి ధ్యానరత్న శ్రీ ప్రేమ్‌నాథ్ గార్లచే జ్ఞానబోధ, సేత్ విజ్ఞానం పంచబడింది.

 

అందరికీ తల్లి గౌరవనీయురాలుగా వుంటుంది కానీ "ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకో" అని ధ్యానం ద్వారా తల్లిలాగా బోధించే బ్రహ్మర్షి పత్రీజీ జ్ఞాననిర్దేశకులుగా మనకు పరిచయం కలగటం ఎంతటి మహద్భాగ్యమో కదా!

 

మా పెద్ద తండ్రిగారైన "నరసరాజు"గారు ఆరోగ్యం బాగాలేని కారణంగా గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తర్వాత కొన్ని నెలలకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. ఆ తరుణంలో ధ్యానం, పిరమిడ్ శక్తి ఎంతగానో ఉపయోగపడి నిత్య ధ్యానసాధనతో ఆయన ప్రాణం నిలబడింది. ఆయన ఇప్పటికీ శ్వాసశక్తినే ప్రాణశక్తిగా వినియోగించుకుంటూ ఏ మందులూ వాడకుండా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు!

 

ఒకసారి మా సహచరుడు రిటైర్డ్ డివిజనల్ ఇంజనీర్ ఏర్పాటు చేసిన విపస్సన ధ్యానానికి వెళ్ళాను. ఆ మౌన ధ్యానం నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ఈ ప్రేరణలో భాగంగా మాకు వున్న ఐదు ఎకరాల మామిడితోటలో రెండు ఎకరాల భూమిని పూర్తిగా ధ్యానకార్యక్రమాలకు వినియోగించాలనే లక్ష్యంతో 2011 సంవత్సరంలో నా పదవీ విరమణ సందర్భంగా వచ్చిన ఇరవై లక్షల రూపాయలతో ఆగిరిపల్లి మండలం, "రావిచర్ల గ్రామం" (నూజివీడు దగ్గర)లో 18'X18' పిరమిడ్ నిర్మించాను. దీనిని పూర్తిస్థాయి శక్తిక్షేత్రంగా తీర్చిదిద్దాలని తపనతో నివాసయోగ్యంగా వుండే గదుల నిర్మాణం కార్యక్రమం చేశాను. ఈ స్థలం 12వ తేదీ, జనవరి 2015న బ్రహ్మర్షి పాదస్పర్శతో పునీతమైంది!

 

ఈ క్షేత్రంలో ధ్యానం చేసిన శ్రీ అప్పారావు మరి రాజ్యలక్ష్మిగార్ల (గొల్లలమామిడాడ)కు ధ్యానంలో ఒకేరకమైన అనుభవం వచ్చింది. "ఈ దేహంతో రామకృష్ణంరాజుగా జన్మతీసుకున్న ఆత్మ వ్యాసభగవానుడి అంశ .. ఈ క్షేత్రం ఒకనాటి శక్తిమహాముని తపోభూమి" అని తెలియపరచబడింది. శ్రీ వేదవ్యాసుల వారి కుమారులు పరాశర మహర్షి పరాశరుడి కుమారుడే శక్తి మహాముని; అప్పటి నుంచీ ఇది "శక్తి మహాముని క్షేత్రం"గా పిలవబడుతున్నది. ఈ క్షేత్రంలో 40 రోజుల ధ్యానం చేసి శ్రీ "దాసరి విజయకుమార్", రామవరప్పాడు, గారు తనకు సంక్రమించిన తీవ్రమైన చక్కెర వ్యాధిని క్రమబద్ధీకరించుకుని హాయిగా, ఆనందంగా జీవిస్తున్నారు. దీనికి గుర్తుగా వారి ఆర్ధిక సహాయసహకారాలతో ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. పూర్తి రెసిడెన్షియల్ పద్ధతిలో మూడు రోజుల పౌర్ణమి మౌనధ్యానం జరిపించాలనే ఉద్దేశ్యంతో నిర్మాణం జరుగుతోంది. దీనితోపాటు అనేకరకాలైన ఓషధీవృక్షాలను పెంచి పోషించాలని మరి గో ఆధారిత వ్యవసాయానికి చేయూత ఇవ్వాలనే ఉత్సాహంతో గోవులను కూడా పెంచి పోషిస్తున్నాము.

పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో భాగంగా ప్రతి సంవత్సరం బ్రహ్మర్షి పత్రీజీ గారి ధ్యానమహాచక్రం బోధనలను పుస్తక రూపేణ ముద్రించి అందరికీ అందిచడం జరుగుతోంది.

 

పత్రీజీ నెలకొల్పిన శాకాహార జగత్ లక్ష్యసాధనలో భాగంగా ప్రతి ఆదివారం రెండు గం||ల పాటు చిన్న చిన్న ర్యాలీలు నిర్వహిస్తూ వీధి వీధికి విజయవాడ చుట్టుప్రక్కల గ్రామాలలో అహింస యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ లక్ష కరపత్రాలను నిరాటంకంగా పంచటం జరుగుతోంది. "ధ్యానజగత్" ముగించుకుని, "పిరమిడ్ జగత్" మరి "శాకాహార జగత్"స్థాపనకై నడిపిస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు!

 

పత్రీజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో ..

 

అహింసయే జీవన వేదం, జీవనగతి
ధ్యానం - నిత్యకార్య ప్రణాళిక
శ్వాసశక్తి - జై జై జై

 

 

 

ఉప్పలపాటి రామకృష్ణంరాజు
రామవరప్పాడు

విజయవాడ రూరల్
సెల్:+9194414 94777

Go to top