" సత్యనారాయణ వ్రతానికి బదులుగా ధ్యాన సత్యవ్రతం "

 

 

నా పేరు "లవకుమార్". నేను MBA చేసి ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా మామయ్య స్వర్గీయ J.సాంబశివారెడ్డి గారి ద్వారా 2001 సంవత్సరంలో మా అమ్మానాన్నలు ధ్యానం నేర్చుకుని శాకాహారులుగా మారి క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారు. అయితే నాకు మాంసాహారం అంటే ఇష్టం ఉండడంతో మాంసం తినడం మానివేయలేక ధ్యానాన్ని కూడా వదులుకున్నాను.

 

మా అమ్మా నాన్నల బలవంతం మీద 2011 సంవత్సరం నుంచి అయిష్టంగానే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. "మాంసం తినడం తప్పే అయితే .. అది మహా పాపమే అయితే .. ఆ పత్రి గారినే స్వయంగా వచ్చి నాతో చెప్పమనండి" అని మా అమ్మానాన్నలతో సవాలు చేసేవాడిని. ఈ క్రమంలో ఒకరోజు నేను ధ్యానస్థితిలో ఉన్నప్పుడు నాకు పత్రీజీ దర్శనం ఇచ్చి "సాంబశివారెడ్డి శాంత స్వభావి; నువ్వు మాత్రం జంతుజాతి పట్ల ఎలాంటి కరుణ లేకుండా ఇంకా రాక్షసుడిలా మాంసం తింటున్నావు ఎలా?" అంటూ నావైపు తీక్షణంగా చూసారు. ధ్యానం నుంచి బయటికి వచ్చిన నాకు ముచ్చెమటలు పట్టాయి. ఆ క్షణమే "ఇక నేను జీవితాంతం శాకాహారిగానే ఉంటాను" అని నిర్ణయం తీసుకున్నాను! అప్పుడు కానీ నా ఆత్మ శాంతించలేదు!!

 

ఈ క్రమంలో 2013 అక్టోబర్ 2వ తేదీ నా స్నేహితులతో కలిసి నేను విహారయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూండగా నా వాహనానికి ప్రమాదం జరిగి అందరికీ బాగా దెబ్బలు తగిలాయి. X-ray తీసి నన్ను పరీక్షించిన డాక్టర్లు ఫ్రాక్చర్ అయిన నా చేతికి "వెంటనే సర్జరీ చెయ్యాలి"అన్నారు.

 

సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేని నేను .. "నన్ను నా ధ్యానశక్తే రక్షిస్తుంది" అని ధ్యానం చేస్తూ కూర్చున్నాను. మర్నాడు సర్జరీకి ముందు మళ్ళీ X-ray తీసి చూడగా ఎముకలు అతుక్కుని కనిపించి డాక్టర్లు ఆశ్చర్యపోయారు! నా నా రకాల పరీక్షలు చేసి సర్జరీ అవసరం లేదని తేల్చి పంపించివేశారు!

 

ఈ మధ్యనే వివాహం చేసుకున్న నేను .. నా పెళ్ళి పత్రికలతో పాటు ధ్యానం, శాకాహారంల గురించి పాంఫ్లెట్లను ప్రతి ఒక్కరికీ పంచిపెట్టాను. పెళ్ళి సందర్భంగా సాంప్రదాయకంగా జరిపించే సత్యనారాయణ వ్రతానికి బదులుగా చుట్టుప్రక్కల ఊరివాళ్ళందరినీ పిలిచి మా ఊరిలో ఉన్న "స్వర్గీయ J.సాంబశివారెడ్డి పిరమిడ్ ధ్యానమందిరం"లో ధ్యానశిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి పిరమిడ్ మాస్టర్స్ శ్రీ భవాని జయప్రకాశ్ మరి G. రాఘవేంద్రరావు గార్లతో చక్కటి జ్ఞాన సందేశాలను అందించాం.

 

వైవిధ్యభరితంగా సాగిన ఆ కార్యక్రమం పట్ల సంతోషించిన దాదాపు 200 మంది బంధుమిత్రులు తమ తమ ప్రదేశాల్లో కూడా ధ్యాన కార్యక్రమాలను జరుపవలసిందిగా కోరారు. అంత వరకూ ఎప్పుడూ ‘శుభమా’ అంటూ పెళ్ళి చేసుకుని అశుభకరమైన మాంసపు కూడును వండి విందులు చేయడం ఆచారంగా ఉన్న మా ఊళ్ళో .. మొదటిసారిగా మేము వండి వడ్డించిన శాకాహార భోజనాన్ని తిని ఊరి జనాలు .. ఎంతో సంతోషించారు!

 

"ఈ శుభకరమైన సత్ సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగించుదాం" అంటూ మా ధ్యాన బంధు మిత్రులంతా మమ్మల్ని దీవించారు. ఇలా ధ్యాన - శాకాహార కుటుంబాలను తీర్చిదిద్దుతూ "ధ్యాన జగత్" స్థాపనకై కృషి చేస్తూన్న పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.

 

 


M.లవకుమార్

జగమర్ల గ్రామం

చిత్తూరు జిల్లా
సెల్:+918790743188

Go to top