" నోరు కట్టేసుకోవడం .. గొప్ప సాధన "

 

 

నా పేరు "నంద కిషోర్". నేను చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. 2008 సంవత్సరంలో నేను అనారోగ్యానికి గురి అయ్యి వెన్నెముక నొప్పి మరి అధిక రక్తపోటు, మధుమేహాలతో బాధపడుతూ ఎందరో డాక్టర్ల చుట్టూ తిరిగాను. రకరకాల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో .. 2014 సంవత్సరంలో "పిరమిడ్ ధ్యానం" గురించి తెలుసుకుని క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను. అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించే పుస్తకాలనూ మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ముఖ్య పత్రికలైన "ధ్యానాంధ్రప్రదేశ్", "స్పిరిచ్యువల్ సైన్స్"లను చదువుతూ ఎన్నో క్రొత్తవిషయాలను తెలుసుకున్నాను.

 

రోజుకు అయిదు గంటల చొప్పున ధ్యానం చేస్తూ కేవలం నాలుగు నెలల సమయంలోనే నా అనారోగ్యాల నుంచి విముక్తి చెందాను! సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మారిన నేను ధ్యానంలో ఉన్న గొప్ప శాస్త్రీయతను అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ధ్యానప్రచారం చేస్తున్నాను.

 

2015 ఫిబ్రవరి 11వ తేదీన 15వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో జరిగిన అయిదురోజుల యాభైగంటల అఖండ మౌన ధ్యానంలో పాల్గొని అద్భుతమైన అనుభూతిని పొందాను. సెల్‌ఫోన్ కూడా లేని ఒక మూగ జీవిగా మారి ప్రతిరోజూ రెండు పూటలా మూడేసి గంటల చొప్పున పత్రీజీ సమక్షంలో నాదధ్యానం చేసుకోవడం .. ఒక అనుభూతి అయితే ధ్యానం ముగిసిన తరువాత కూడా అందరూ సుశిక్షుతులైన సైనికుల్లా చక్కటి క్రమశిక్షణతో మౌనంగా గడపడం ఒక గొప్ప అనుభూతి!

 

"నోరు కట్టేసుకోవడం" అన్నది కూడా ఎంత గొప్ప ఆధ్యాత్మిక సాధనో తెలియజేసిన భీమవరం అఖండ మౌన ధ్యాన కార్యక్రమం .. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అంతరంగ పరిశీలకులుగా మార్చిందనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుంచే కాకుండా మలేషియా దేశం నుంచి కూడా విచ్చేసిన ధ్యానులకు అయిదు రోజుల పాటు ధ్యానమహాచక్రాన్ని తలపించే రీతిలో భోజన వసతి సదుపాయాలను ఏర్పాటు చేసిన తటవర్తి వీరరాఘవరావు గారు మరి రాజ్యలక్ష్మి దంపతులు ధన్యజీవులు!! ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

 

 

 

 

G. నందకిషోర్

చెన్నై
సెల్: +9199520 53639

Go to top