" ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాప్స్ "

 

 

"ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నది అందరికీ తెలిసిన నానుడి. ధ్యానంలో ఎందరికో ఆరోగ్యం చేకూరటం మరి కొందరికి ఆస్ట్రల్ సర్జరీలు జరగటం మనందరికీ తెలిసిన విషయమే. తీవ్ర అనారోగ్యాలు కలిగి వ్యక్తిగతంగా స్వస్థత చేకూర్చుకోవటం కష్టమైన వారికోసం ఉన్నత శక్తులను, ఊర్థ్వలోక నిష్ణాతులను ఆహ్వానించి ఆరోగ్యం చేకూర్చే ప్రక్రియే "ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాప్". గతకొన్ని సంవత్సరాలుగా పిరమిడ్ గ్రాండ్ మాస్టర్స్ శ్రీ G.బాలకృష్ణ, ప్రేమ్‌నాథ్, శ్రీ G.V.శ్రీనివాసరావు గార్లు ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాప్స్ నిర్వహించి ఎందరో స్వస్థత పొందటానికి దోహదం చేశారు. ధ్యానమహాచక్రం-V లో ఏర్పాటు చేసిన ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాప్ విశేషాలు శ్రీ బాలకృష్ణ గారి ద్వారా తెలుసుకుందాం.

 

ఫ్రెండ్స్! నా పేరు బాలకృష్ణ! నేను 2002 సంవత్సరంలో "ధ్యానం శరణం గచ్ఛామి" పుస్తకం చదివి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. తర్వాత క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ, పుస్తకాలు చదువుతూ, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్‌తో సాంగత్యం చేస్తూ నేను ఎదిగాను.

 

మొదటి రెండు సంవత్సరాలు పత్రిసార్ క్లాస్ హైదరాబాద్‌లో ఎక్కడ జరిగినా వెళ్ళి సార్ అక్కడ నుంచి వెళ్ళేదాకా సార్‌కి పది అడుగుల దూరంలో కూర్చుని "సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఏ ప్రశ్నలకు ఎలా జవాబు ఇస్తున్నారు?" మొదలయినవి గమనిస్తూ ఉండేవాడిని. సార్ నన్ను "ఎందుకు కూర్చున్నావు?" అని గానీ, "అవతలకు వెళ్ళు" అని గానీ ఎప్పుడూ అనలేదు! ఆ విధంగా నన్ను అక్కడ ఉండనివ్వడం ద్వారా నాకు సర్వం నేర్పించారు. "గురువులు ఎవరికి ఎలా నేర్పించాలో అలా నేర్పిస్తారు" అని నాకు తర్వాత అనిపించింది. నాకు ప్రేమనాథ్ సార్‌తో కూడా ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది.

 

ప్రేమ్‌నాథ సార్‌ను చూసి నేను కౌన్సెలింగ్ చేయడం నేర్చుకున్నాను. ఆ కౌన్సిలింగ్‌లో ఎదుటి వాళ్ళలో ఉండే భయం, బాధ, దుఃఖం వంటి మానసిక సమస్యలు తొందరగా తగ్గేవి.

 

అప్పుడు "శారీరకమైన సమస్యలు కూడా తగ్గితే బాగుంటుంది" అని నేను అనుకుంటూ ఉండేవాడిని. దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ప్రేమనాథ్ గారితో కలిసి "సేత్ వర్క్‌షాప్" 2008 సంవత్సరంలో మొదటిసారి మొదలుపెట్టిన తర్వాత ఆ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఇద్దరు, ముగ్గురు వచ్చి "మాకు వర్క్‌షాప్ పాల్గొన్న తర్వాత శారీరక రోగాలు తగ్గాయి" అని చెప్పారు.

 

నాకు మౌలిక ఆధ్యాత్మిక సత్యాల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉదహరణకు .. "యద్భావం తద్భవతి" .. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం" .. "ఉద్ధరేదాత్మనాత్మానం" .. "అడగండి ఇవ్వబడుతుంది" .. "తట్టండి తెరవబడుతుంది" .. మొదలైనవి. ఈ ఆధ్యాత్మిక సత్యాలే ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాప్‌కు పునాదులు. ఈ వర్క్‌షాప్ జరిగే పద్ధతి అంతా ఈ సత్యాలను అర్థం చేసుకుని ఆచరించడంలోనే ఉంది.

 

వర్క్‌షాప్ అంతా కూడా ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారానే జరుగుతుంది. కొన్ని వేల మంది ఆస్ట్రల్ మాస్టర్స్‌ను .. రకరకాల విధానాలలో నిష్ణాతులైన వాళ్ళను .. ఆహ్వానించడం ద్వారా వర్క్‌షాపు నిర్వహించబడుతుంది. ఎంతమంది వచ్చినా అక్కడ కూర్చున్నవాళ్ళ సంసిద్ధతని బట్టే హీలింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే మనకు ఈ భూమి మీద "సంకల్ప స్వేచ్ఛ" ఉంది! మనం పిలవనిదే మన జీవితంలోకి ఎవ్వరూ రారు!

 

మాస్టర్సే కాకుండా వచ్చిన వాళ్ళ గత జన్మలలో సంబంధం ఉన్న ఆత్మస్వరూపులందరూ వస్తారు. వాళ్ళకు ధ్యానం నేర్పించి, క్షమాపణ కోరి కర్మల నుంచి బయటపడటం జరుగుతుంది. సమస్య చిన్నదా, పెద్దదా అన్న దానితో సంబంధం లేదు .. వచ్చిన వాళ్ళు ఎంతగా వాస్తవం తెలుసుకుంటున్నారు అన్నదాని మీదే అంతా ఆధారపడి వుంటుంది.

 

దీర్ఘకాల రోగాలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కర్మలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తొందరగా దేనీనీ అంగీకరించలేరు. అందుకని వాళ్ళను రెండు లేదా మూడు వర్క్‌షాప్స్‌కు రమ్మని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళలో కావలసినంత మార్పు వస్తుంది.

 

"వర్క్‌షాప్ చేయాలి" అనే ఆలోచన నాకు 2011 సంవత్సరం అక్టోబర్‌లో వచ్చింది. ఆ ఆలోచన రాగానే పత్రిసార్‌ను అడిగాను సార్ "సరే" అన్నారు. ఈ వర్క్‌షాప్ జరగడానికి పత్రిసార్, ఆస్ట్రల్ మాస్టర్సే కారణం. మమ్మల్ని ఈ వర్క్‌షాప్‌కు ఎన్నుకున్నందుకు నా తరుపున మా బృందం అందరి తరపున పత్రిసార్‌కు, ఆస్ట్రల్ మాస్టర్స్‌కు మా హృదయపూర్వక ఆత్మప్రణామాలు!

 

"ధ్యానమహాచక్రం -V" లో ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాప్ సందర్శించిన సందర్భంలో పత్రీజీ ఇచ్చిన సందేశం: "మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం" అన్న ఆధ్యాత్మిక శాస్త్ర సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త! ధ్యానం చేసాం అంటే అది మన వాస్తవం .. మరి ధ్యానం చెయ్యలేదు అంటే అదీ మన వాస్తవమే. మాంసం తినడం మన వాస్తవమే... మరి మాంసం తినడం మానలేకపోవడం కూడా మన వాస్తవమే. ధ్యానం తెలుసు కానీ చెయ్యలేకపోతున్నాం అన్నది కూడా మన వాస్తవమే!

 

"రామాయణంలోని ఒక ఘట్టంలో రావణాసురుడి భార్య మండోదరి .. సీతను అపహరించటం ఎంత అధర్మమో తెలియచేస్తూ .. ‘ఇతరుల భార్యలను కాంక్షించడం అన్న అధర్మవర్తనం వల్ల నువ్వు చనిపోతావు, నీ వాళ్ళందరూ చనిపోతారు. నీ వంశానికే అది ముప్పుగా పరిణమించవచ్చు! సకల శాస్త్రాలను చదివిన బ్రహ్మజ్ఞానివికదా! నీకు ఇది తెలియదా?’ అని తన భర్తను ప్రశ్నిస్తుంది.

 

"అప్పుడు రావణుడు ‘నాకు ధర్మం తెలుసు, అధర్మం తెలుసు; జరగబోయే పరిణామాలు కూడా తెలుసు. అయినా నేను సీతను వదలను’ అని చెప్పాడు.

 

"ఇలా ఎవరి వాస్తవాలను వారే స్వయంగా సృష్టించుకుంటారు. కనుక నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నా దుఃఖానికి నేనే సృష్టికర్తను, నా సుఖానికి నేనే సృష్టికర్తను; నా అజ్ఞానానికి నేనే సృష్టికర్తను, నా సుజ్ఞానానికి సృష్టికర్తను. నా అనారోగ్యానికి నేనే సృష్టికర్తను, నా ఆరోగ్యానికి నేనే సృష్టికర్తను.

 

"ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది. మర్రి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుందా? "మనకు అనారోగ్యం వచ్చిందనుకుందాం .. భౌతికంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు వ్రాయించుకోవాలి, అవి కొని వేసుకోవాలి. అప్పుడే జబ్బు తగ్గుతుంది. అయితే మన దగ్గర డబ్బులు లేవు. ఏం చెయ్యాలి? హాయిగా ధ్యానంలో కూర్చుని ఆస్ట్రల్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, ఆస్ట్రల్‌గా మందులు వేసుకోవాలి మరి ఆ ఆస్ట్రల్ డాక్టరే అవసరమైతే సర్జరీ కూడా చేస్తాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. కూర్చున్న చోటనే హాయిగా మూలం నుంచి జబ్బు తగ్గిపోతుంది.

 

" ఒకానొక చిన్న పసిపాపకు ఆకలివేస్తే కన్నతల్లో, ఇంకొకరో, ఎవరో ఒకరు వచ్చి పాపకు పాలో, పండో తినిపించి ఆకలి తీరుస్తారు. అలాగే ధ్యానంలో మనం ఆలోచనారహితస్థితిలో ఉన్న చిన్న పిల్లలం అయిపోయినప్పుడు ఆ ఆస్ట్రల్ మాస్టర్లే కన్నతల్లిలా మన దగ్గరికి వచ్చి మనకు కావలసినవి ఏర్పాటు చేస్తారు. మనం చెయ్యవలసిందల్లా కేవలం రెండు కళ్ళూ మూసుకుని, నోరూ మూసుకుని కూర్చుని శ్వాసను గమనిస్తూ ధ్యానం చెయ్యడం.

 

"భౌతికపరమైన డాక్టర్‌కు మన భౌతిక శరీరం గురించే తెలుస్తుంది. మిగతా శరీరాల గురించిన అవగాహన అతడికి ఎంతమాత్రం ఉండదు. ‘నాడీమండలశుద్ధి’ గురించి గానీ, ‘ప్రాణమయకోశం’ లో అక్కడక్కడా ఆటంకపడి ఉన్న కర్మ ఫలితాలు అనే ‘బ్లాక్స్’ గురించి గాని ఏదీ తెలియదు. అలా రోగి శరీరం గురించిన సంపూర్ణ జ్ఞానం తెలియని డాక్టర్ చేతిలో మన శరీరాన్ని పెట్టి చికిత్స చేయించుకోవడం గ్రుడ్డివాడి చేతిలో రాయితో సమానం.

 

"కనుక మన భౌతిక శరీరం గురించే కాకుండా మన ప్రాణమయకోశం, మనోమయకోశం, కారణమయకోశం, ఆనందమయకోశం మరి నిర్వాణమయ కోశాలను గురించిన సంపూర్ణా జ్ఞానంతో పాటు మన గత జన్మల పరంపరను గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్న కోటానుకోట్ల మంది ఆస్ట్రల్ డాక్టర్ల దగ్గరికి ధ్యానంలో వెళ్ళి వాళ్ళతో చికిత్స చేయించుకోవాలి. ధ్యానమహాచక్రం - V సందర్భంగా ఇలాంటి ఆస్ట్రల్ హీలింగ్‍లను ఎవరికి వారే స్వయంగా నిర్వహించుకునేందుకు వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. చక్కటి సేత్ విజ్ఞానాన్ని తెలుసుకోండి, మీ వాస్తవాలను మీరే చక్కదిద్దుకోండి" అన్నారు.

 

వర్క్‌షాప్‌లో స్వస్థత పొందిన కొందరి అనుభవాలు:

 

"శ్రీనివాస్", మహబూబ్‌నగర్

 

"నేను మూడు సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. నాకు ఎదురు రొమ్ముపై గడ్డ ఏర్పడింది. దానివల్ల నొప్పి వస్తూ వుండేది. ఆస్ట్రల్ హీలింగ్ క్లాసులో ప్రేమనాథ్ సార్, బాలకృష్ణ సార్ చెప్పిన విషయాలన్నీ శ్రద్ధాగా విని ఎలాగైనా ఈ క్లాసులోనే దానిని పోగొట్టుకోవాలనుకున్నాను. నేను గాఢమైన ధ్యానస్థితిలో వుండగా నా వెన్నుపూస దగ్గర ఎవరో పటపటా చెక్కినట్లు తెలిసింది. మెడపైన కట్టి విరిచినట్లు ‘టప్’ మని శబ్ధం వచ్చింది. ఒక డాక్టర్, సిస్టర్ రూపంలో ఇద్దరు మాస్టర్స్ వచ్చి నన్ను పడుకోబెట్టి నా హృదయభాగంలో పరపరా కోసి ఆపరేషన్ చేసి ఎర్రగా ఉన్న మాంసం గడ్డ తీసి నాకు చూపించి కుట్టివేసి .. ‘ఓకే! యూ ఆర్ పర్‌ఫెక్ట్’ అని చెప్పి వెళ్ళిపోయారు. నేను చెక్ చేసుకున్నాను. నాకు నొప్పి పోయింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాప్ చాలా గ్రేట్ వర్క్‌షాప్."

 

"రూపు సుధారాణి", యలమంచిలి

 

నేను ఎనిమిది సంవత్సరాల నుంచి స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నాను. నేను ఆస్ట్రల్ హీలింగ్ వర్క్‌షాపులో ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు విశ్వమంతా తానే అయినట్లుగా తెల్లని దుస్తులు ధరించి, తెల్లజుట్టుతో ఒక మాస్టర్ కనిపించారు! నా మెడ వెనుక ఉన్న పూసలు వంకరటింకరగా ఉన్నట్లు .. అందువల్లే నొప్పి వచ్చినట్లు చూపించారు. ఆయన తన రెండు చేతులతో ఆ పూసలన్నీ సరిచేసి ఆపరేషన్ చేశారు. నాకు నొప్పి తగ్గిపోయింది. ఆస్ట్రల్ హీలింగ్ టీమ్‌కు ధన్యవాదాలు."

 

 

G. బాలకృష్ణ

హైదరాబాద్

ధ్యానమహాచక్రం - V

 

Go to top