" విశ్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం - నా అనుభవాలు "

 

 

కడపపట్టణంలో "విశ్వాత్మ పిరమిడ్ ధ్యానకేంద్రం" ఒక నెలకొల్పిన అనతికాలంలోనే ప్రముఖ ఆత్మజ్ఞానక్షేత్రంగా, పేరు ప్రఖ్యాతులను పొంది "కడప పట్టణానికే వన్నె తెచ్చింది" అనడంలో అతిశయోక్తి లేదు.

 

ఈ ఆత్మజ్ఞానక్షేత్రం 2010వ సంవత్సరంలో మన గురువర్యుల ధర్మపత్ని శ్రీమతి స్వర్ణమాల పత్రిగారి అమృత హస్తాలతో ప్రారంభించబడి దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ ఆత్మజ్ఞాన క్షేత్ర వ్యవస్థాపకులమైన మేం .. శ్రీమతి డా||ఊర్మిళాదేవి, శ్రీ G.V.శేషారెడ్డిలు .. వృత్తిరీత్యా ఆచార్యులం. నేను ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గానూ, అకాడెమిక్ డైరెక్టర్‌గానూ పనిచేశాను.

 

నా శ్రీమతి డా||ఊర్మిళాదేవి చాలా సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారంలో పాలుపంచుకుంటున్నది. ఆమె బ్రహ్మర్షి పత్రీజీ గారు బోధించిన .. "ఆనాపానసతి" .. "శ్వాస మీద ధ్యాస" ధ్యాన పద్ధతి అత్యుత్తమైనదని, సులభమైందనీ, ఒక్కరూ ఆచరించదగినదనీ గ్రహించింది.

 

ఈ ధ్యానపద్ధతి తెలిసిన మూడు నెలలకే, పిరమిడ్ కట్టాలన్న సంకల్పంతో మా ఇంటిపైనే 20'X20' పిరమిడ్ కట్టించి "విశ్వాత్మ పిరమిడ్ యోగ ధ్యానకేంద్రం" అని నామకరణం చేశాం. దానిలో నిరాటంకంగా ఉదయం ధ్యానశిక్షణ, పతంజలి మహర్షి ప్రబోధించిన యోగాసనాలు, ప్రాణాయామాలు, బ్రహ్మర్షి పత్రీజీ ప్రబోధించిన "శ్వాస మీద ధ్యాస", సాయంకాలం 6.00 గం||ల నుంచి 8.00 గం||ల వరకు ధ్యానశిక్షణా తరగతులు ప్రతిరోజూ జరుగుతున్నాయి. ఈ ధ్యానకేంద్రం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన వారెందరో! వారి అనుభవాలు అద్భుతం!

 

నేను గత 43 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నిజాయితీగా పాఠాలు బోధిస్తూ ప్రాపంచికానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూన్న తరుణంలో నా శ్రీమతి నాకు గురువై, బ్రహ్మర్షి పత్రీజీ గారు సద్గురువై "శ్వాస మీద ధ్యాస"ను ఉంచి ఆత్మజ్ఞానం పొందాలి అంటే "అంతర్ముఖి కావాలి" అని తెలిపారు. "అంతర్ముఖీ సదాసుఖీ" అన్న సూక్తిలోని మర్మాన్నీ, పరమార్థాన్నీ గమనించి, ఆ విధంగా, నేను ధ్యాన గంగలో మునిగి ప్రతి సెకెండు, ప్రతి నిమిషం, ప్రతిరోజూ పవిత్రుడను అవుతూనే వున్నాను.

 

ధ్యానం పరిచయం కాకముందు "కడుపు నిండా తిని కదలకుండా పడుకుంటే కాశీ పోయినంత పుణ్యం" అని భావించే నాలో వచ్చిన పరిణామాలన్నింటికీ కారణం ధ్యానమే. ప్రాపంచికంగా అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలచే సత్కరించబడ్డాను. థాయిలాండ్ డిప్యూటీ ప్రధానమంత్రి చేతుల మీదుగా అంతర్జాతీయ పురస్కారమయిన "ఇంటర్నేషనల్ గోల్డ్ స్టార్ మిలీనియమ్" పురస్కారాన్ని అందుకున్నాను. ఈ పురస్కారం విద్యారంగ, సామాజిక రంగ సేవలకుగాను ప్రదానం చేశారు.

 

విద్యారంగసేవకూ, సామాజిక సేవకూ గుర్తింపుగా "ప్రైడ్ ఆఫ్ ఇండియా" .. "బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" "నేషనల్ అవార్డ్ ఫర్ టీచింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంగ్లీష్" "Y.S.R. విశిష్ట సేవా పథకం"లాంటి జాతీయ, ప్రాంతీయ పురస్కారాలు లభించడానికి "ధ్యానమే కారణం" అన్నది నా విశ్వాసం.

 

ఇంటిపైన పిరమిడ్ కట్టించిన తర్వాత నా అంతరంగంలోనూ, బాహ్యంలోనూ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వృత్తిరీత్యా నేను ఆంగ్లభాషా ఆచార్యుడిని. నేను ఆంగ్లంలో వ్రాసిన చాలా అంశాలు, వాక్చాతుర్యంపైన, విద్యార్థుల క్రమశిక్షణపైన, పిల్లలు - వారి మనస్తత్వం పైన జాతీయ, ప్రాంతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆంగ్లభాషా ఆచార్యునిగా ఆంగ్లంలో వ్రాయడం పరిపాటే, కానీ ఆంధ్రుల అభిమాన భాష శ్రీకృష్ణదేవరాయులు మెచ్చిన "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న తెలుగుభాషలో ఆత్మజ్ఞానాన్ని అందించే ఆధ్యాత్మిక అంశాలు చాలా వైవిధ్యం కలిగిన ఎన్నో ఆధ్యాత్మిక మాసపత్రికలచే ఎంపిక కాబడి ప్రచురితమయ్యాయి.

 

గత మూడుమాసాల వ్యవధిలోనే రెండు వ్యాసాలు "సన్యాసం", "చాతుర్వర్ణ వ్యవస్థ" ఉత్తమమైనవిగా ఎంపిక కాబడి నగదు బహుమతులు కూడా వరించాయి. ఈ సృజనాత్మకశక్తి నాలో కలగడానికి ప్రేరణ, స్ఫూర్తి పిరమిడ్ ధ్యానమే.

 

బ్రహ్మర్షి పత్రీజీ బోధించిన "శ్వాస మీద ధ్యాస" నాలోని అంతర్‌శక్తిని వెలికితీసి నన్ను ఉన్నతస్థితి నుంచి ఉన్నతస్థితికి చేర్చింది అంటే అతిశయోక్తి కాదు. ధ్యానం ద్వారా నేను నేర్చుకున్న జ్ఞాన సారాంశం "వస్తువుకోసం ఉబలాటం వద్దు - వాస్తవం కోసం ఉద్యమించు" .. "పదార్ధం కోసం పరితపించవద్దు - యదార్ధం కోసం పరితపించు" .. "ఆత్మజ్ఞానానికి తలవంచు - ప్రాపంచికం కోసం తలవంచవద్దు" .. "ఆధ్యాత్మిక తలపులతో మదిని నింపు." .. "అక్కరకు రాని తలంపులు వద్దు - అక్కరకు వచ్చే తలపులతో గమ్యం తధ్యం" .. "శ్వాసను గమనిస్తే జీవంతో మమైకం - అదే కదా బ్రహ్మతత్వం." ఈ విధంగా ఎన్నెన్నో విషయాలను ధ్యానం ద్వారా తెలుసుకుని జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గాన్ని ఎంచుకున్నాను.

 

బ్రహ్మర్షి పత్రీజీ కలలుకంటున్న "ధ్యాన జగత్" సాధనలో "మేము సైతం" అన్ని "విశ్వాత్మ పిరమిడ్ ధ్యానకేంద్రం" తరపున ధ్యానశిక్షణా కార్యక్రమాన్ని 2010 సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. "శాకాహార జగత్తు" కోసం శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ శాకాహారం అమృతాహారమని .. మాంసాహారం మృత ఆహారమని తెలియచేస్తున్నాం. "పిరమిడ్ జగత్తు" కోసమని "పిరమిడ్ శక్తి అపరిమితం" అని ప్రబోధిస్తూ, ఋజువులు చూపిస్తూ ఇంటింటా పిరమిడ్ స్థాపనకు కృషి చేస్తున్నాము.

 

ధ్యానం ద్వారా విచారణ, విశ్లేషణ, వితరణ కలుగుతాయని స్వయంగా తెలుసుకుని ప్రతి ఒక్కరికి ఈ అనుభూతిని ధ్యానం ద్వారా కలుగజేస్తున్నాం. తలలు బోడులయితే ప్రయోజనం లేదు .. తలపులు బోడులు కావాలన్న సత్యాన్ని, ధర్మాన్ని ధ్యానం నేర్పింది. "సర్వేజనా సుఖినోభవంతు" అన్నది ఒక నాటి నినాదం; "సర్వేప్రాణి సుఖినోభవంతు" అన్నది నేటి నినాదం.

 

 

ఆంధ్రరత్న prof. G.V.శేషారెడ్డి
విశ్వాత్మ పిరమిడ్

కడప జిల్లా

Go to top