" మాది బంగారు ధ్యానకుటుంబం "

 

 

నా పేరు ఆదిలక్ష్మమ్మ. ధ్యానమిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు! కడప పట్టణంలోని N.G.O. కాలనీలో ఉంటున్నాను. వయస్సు 80 సంవత్సరాలు. మాది మధ్యతరగతి కుటుంబం. దాదాపు 25 సంవత్సరాల నుంచి తీవ్రమైన అనారోగ్యం, ఉబ్బసం, ఆస్తమా, B.P., కీళ్ళనొప్పులు మరి T.B.జబ్బులతో బాధపడుతూ ఉండేదానిని. ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ, ఎంతోమంది డాక్టర్లకు చూపించుకున్నాను. వారు చేసిన వైద్యంతో ఏ మాత్రం కుదుటపడలేదు ."ఆఖరి దశ" అన్నారు! నా చిన్న కుమారుడు గుమ్మా మహేశ్వరరెడ్డితో తులసీతీర్థం కూడా పోయించారు. ఇలా మూడు పర్యాయాలు జరిగింది!

 

ఇలా ఉండగా 2003వ సంవత్సరంలో .. కడపలోని TTD కళ్యాణ మండపంలో .. బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆధ్వర్యంలో మూడు రోజుల ధ్యానశిక్షణా తరగతులు జరుగుతున్న సందర్భంగా నా మిత్రురాలి సలహాతో అక్కడికి వెళ్ళాను. అక్కడ పత్రీజీ గారిని చూసి ఆనందపడి "నువ్వే నన్ను కాపాడాలి గురుదేవా!" అని ఆయన చెప్పినట్లుగా "శ్వాస మీద ధ్యాస" ధ్యానం చేశాను. ఆ తర్వాత NGO కాలనీలోని "శ్రీ యోగీశ్వర పిరమిడ్ ధ్యానకేంద్రానికి" వెళ్ళి క్రమం తప్పకుండా రోజూ గంటలు, గంటలు రాత్రింబవళ్ళు ధ్యానం చేయసాగాను. తద్వారా నాకు ఉన్న రకరకాల అనారోగ్య సమస్యలన్నీ కేవలం నలభై రోజుల్లో పూర్తిగా మటుమాయమై సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను!!

 

అప్పటినుంచి ఇప్పటివరకు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా, ఎలాంటి మందులు వాడకుండా కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాను! ఎంతో మంది పిరమిడ్ యోగులతో సజ్జన సాంగత్యం పొంది ఎంతో జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నాను!

 

ఇలా ఉండగా, నా చిన్నకుమారుడు మహేశ్వరరెడ్డి "రెడ్డి చికెన్ సెంటర్" నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అప్పటికే అతడు కడుపునొప్పితో విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు. ఎంతోమంది డాక్టర్లకు చూపించగా "ఆపరేషన్ చేయాలి" అన్నారు.

 

ఆపరేషన్ చేయించడం నాకు ఇష్టం లేక "ధ్యానం" గురించి నా కుమారుడికి వివరించి "చూడు నాయనా! చనిపోయేదానిని బ్రతికాను. అన్ని జబ్బులనూ పోగొట్టుకున్నాను. నువ్వు కూడా ధ్యానం చేసి నీ కడుపునొప్పిని పోగొట్టుకుని, నీ మాంసం దుకాణాన్ని మూసివేసి జీవహింస చేయకుండా వేరే ఏదైనా వ్యాపారం చేసుకో .. జీవహింస మహాపాపమని పత్రిగారు చెప్పారు." అని చెప్పగా .. "అమ్మా! నా జీవనం, సంసారం ఈ చికెన్ సెంటర్‌తోనే నడుస్తున్నాయి; ఇది మానేస్తే ఎలాగమ్మా?" అన్నాడు.

 

నేను అప్పటినుంచి మహేశ్వరరెడ్దికి ఏమీ చెప్పకుండా ధ్యానంలో కూర్చుని గురువు గారికి వినిపిస్తూ - "గురుదేవా! జీవహింస మహాపాపమన్నారు మీరు - నా కుమారుడు రోజూ జీవహింస చేస్తున్నాడు. ఈ జీవహింసను ఆపి అతను ధ్యానం చేయాలి. అందుకోసమ్ మీరే దయచూపి ఈ వ్యాపారాన్ని ఆపించాలి" అని సంకల్పించి ప్రతిరోజూ గురువుగారికి నా తపనను విన్నవించేదానను. కొన్నిరోజులకు మహేశ్వరరెడ్డి కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టి "మా అమ్మగారికి అన్ని జబ్బులు పోయాయి కదా నాకు ఎందుకు పోవు? పత్రిగారే నా గురువు - ఆయన మార్గంలోనే నడుస్తాను! త్వరలోనే ఆరోగ్యం పొంది ఆనందంగా సమాజానికి ఏమైనా గొప్ప కార్యం చేయాలి" అని సంకల్పించి ధ్యానం చేశాడు.

 

మరి ధ్యానసాధన ద్వారా ఆరోగ్యాన్ని అద్భుతంగా సాధించుకున్నాడు! "ప్రజలందరి దగ్గరకు ధ్యానాన్ని చేర్చాలి" అని ఒక మంచి పిరమిడ్ కేర్ సెంటర్ "శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన-జ్ఞాన శిక్షణా కేంద్రం". ఓబుల్‌రెడ్డి కాంప్లెక్స్, N.G.O. కాలనీ, కడపలో ఏర్పాటు చేశాడు!

 


మరి ఇప్పటివరకు వేలాదిమంది ఈ పిరమిడ్ ధ్యానకేంద్రెంలో ధ్యానం చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు!

 


మంచి లాభాలతో నడుస్తున్న "మాంస వ్యాపారం" మానివేసిన తర్వాత నా కుమారుడు అంతకు నాలుగింతలు ఆదాయాన్ని పొందుతూ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నతస్థాయికి ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కడపపట్టణంలో అతి సుందరమైన "బుద్ధా టౌన్‌షిప్"ను కూడా నిర్మించడం జరిగింది!

 

నేను, నా పిల్లలు, మనుషులు, మనుమరాండ్లు, అందరూ ధ్యానం చేస్తూ ఆనందమయ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాము. మా కుటుంబం మొత్తం "బంగారు ధ్యాన కుటుంబం" అయ్యింది! చివరిగా నా సందేశం ఏమిటంటే .. "ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని మానివేసి .. ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొంది .. ఆయురారోగ్యాలతో, సుఖసంపదలతో. ఆనందంగా జీవించాలి" అని.

 


గుమ్మా ఆదిలక్ష్మమ్మ

కడప పట్టణం

కడపజిల్లా

సెల్:+91 98482 70415

Go to top