" జీవితం యొక్క విలువ తెలుసుకున్నాను "

 

 

హాయ్! నేను నవనీత్ కౌర్! భారతదేశపు "సిక్కు" కుటుంబానికి చెందిన నేను మా తండ్రిగారి వ్యాపారరీత్యా .. సింగపూర్ దేశంలోనే పుట్టి అక్కడే పెరిగి పెద్దయ్యాను. నాకు ఇద్దరు చెల్లెళ్ళు.


నా స్నేహితులంతా "చైనా" మరి మలయా దేశాల నేపధ్యానికి చెందిన వారు కావడంతో నేను "మలయా" రెండవభాషగా నా స్కూలు చదువు పూర్తి చేశాను. "సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ" నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందాను.


చిన్నప్పటి నుంచి మా తల్లితండ్రులు మమ్మల్ని "సిక్కు" సాంప్రదాయపు విలువలతో పెంచడం వల్ల నేను సిక్కు గురువుల గురించి విశేషంగా తెలుసుకుని .. అవకాశం దొరికినప్పుడల్లా మా కుటుంబంతో కలిసి గురుద్వారాలు దర్శించడం, మరి అక్కడ "సేవ" చేయడం చేసేదాన్ని .. సరియైన ఆధ్యాత్మిక మార్గం దొరికేంతవరకూ .. ఇలా "భగవంతుడు" అనేవాడు ఎక్కడో పై లోకాల్లో ఉంటాడనీ .. మనకు అవసరం అయినప్పుడు వచ్చి తప్పక సహాయం చేస్తాడనీ ఎదురుచూస్తూ ఉండేదాన్ని! ఎప్పుడయినా భయపడే పరిస్థితులు నాకు ఎదురయినప్పుడు ప్రార్థన ద్వారా బలం పుంజుకుంటూ దైవం పట్ల కృతజ్ఞరాలిగా ఉంటూ వచ్చాను.


ఈ క్రమంలో నాకు వివాహం జరగడం మరి అనుకోని కారణాల వలన ఆ బంధం రెండు సంవత్సరాలకే విచ్ఛిన్నం కావడం జరిగి ముప్ఫై సంవత్సరాల వయస్సుకే .. నా జీవితం అనేకానేక చేదు అనుభవాలతో నిండిపోయింది. ఆ ప్రభావం నా శరీరంపై కూడా చూసి నేను "రుమటాయిడ్ ఆర్థరైటిస్" అనే ప్రాణాంతకమైన వ్యాధికి గురి అయ్యాను. శరీరంలోకి ప్రతి ఒక్క కీలు వాచి .. నొప్పితో విలవిల్లాడేదాన్ని! అల్లోపతి మందుల సైడ్ ఎఫెక్టులతో సమస్య మరింత జటిలం కావడం వల్ల .. హోమియో ఆయుర్వేదం మందులు కూడా వాడడం మొదలుపెట్టాను.

మానసిక ఉపశమనం కోసం గంటల తరబడి గురుద్వారాల్లో కూర్చుని ఆలోచించేదాన్ని. మెల్లి మెల్లిగా నాకు నా మానసిక - శారీరక తలాలకు మధ్య ఉన్న బంధం అర్థంకావడం మొదలై .. "అసలు నేను ఎవరు?" .. "నా జీవిత పరమార్థం ఏమిటి?" .. "నా లక్ష్యం ఏది?" అన్న ప్రశ్నలు నాలో ఉదయించడం మొదలైంది!
నా ఫ్రెండ్ ‘Tapsy’ ద్వారా నేర్చుకున్న పరమహంస నిత్యానంద, ఓషో, తీటా ధ్యానపద్ధతుల్లో ధ్యానం చేస్తూ "ఎఖార్ట్ టోలె"వంటి గొప్పవారు అందించిన స్వాధ్యాయ గ్రంథాలను అధ్యయనం చేస్తూ జీవితం పట్ల కొంత సానుకూల దృక్పధాన్ని పొందుతూ వచ్చాను. 2008 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం వరకు నా అన్వేషణ ఇలా సాగింది.


2011 సంవత్సరంలో ఒక స్నేహితురాలి ద్వారా "పిరమిడ్ మెడిటేషన్" గురించి తెలుసుకుని ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను. 60 నిమిషాలు సాగిన మొదటి సిట్టింగ్‌లోనే ఏదో తెలియని శక్తి ప్రకంపనలతో నా శరీరం పునరుజ్జీవాన్ని పొందడం వల్ల మానసిక వేదనతో గత కొంతకాలంగా నిద్రకు దూరమైన నేను ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను.


ఉదయం లేవగానే ఇంత అద్భుతమైన ఆనాపానసతి పిరమిడ్ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తోన్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ గురించీ .. మరి బ్రహ్మర్షి పత్రీజీ గురించీ .. ఇంటర్నెట్ ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుని .. సింగపూర్‌లో ఉన్న పిరమిడ్ కేర్ సెంటర్‌లను వెతుక్కుంటూ వెళ్ళి సింగపూర్ పిరమిడ్ మాస్టర్ శశిధర్ రెడ్డిని కలిసి మరింత సమాచారం తెలుసుకున్నాను. వారి సూచన మేరకు ఒక క్రొత్త పిరమిడ్‌కేర్ సెంటర్‌ని మా ప్రాంతంలో ఏర్పాటుచేసి .. 40 రోజుల ధ్యానశిక్షణా తరగతులను నిర్వహించడం మొదలుపెట్టాం.

నా గదిలో బెడ్‌పై ఒక పిరమిడ్‌ను అమర్చుకుని క్రమం తప్పకుండా ఇంట్లో ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాను; శాకాహారం యొక్క విశిష్ఠతను తెలుసుకుని శుద్ధశాకాహారిగా మారిపోయాను. ఉద్యోగం, పిరమిడ్ కేర్ సెంటర్ నిర్వహణ, స్వాధ్యాయం నా జీవిత ముఖ్య కార్యక్రమాలుగా మారి నన్ను చాలా తక్కువ కాలంలోనే శారీరక - మానసిక స్వస్థురాలిగా మార్చివేశాయి.


2011 సంవత్సరంలో బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో జరిగిన GCSS-VII కార్యక్రమానికి హాజరై .. అక్కడ బ్రహ్మర్షి పత్రీజీని కలుసుకుని వారి సమక్షంలో నా అనేక ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలను పొందాను. అక్కడే నేను డాక్టర్ న్యూటన్ కొండవీటి, జాస్ముహీన్‌లను కలుసుకున్నాను. సింగపూర్‌కి తిరిగి వచ్చాక మరి నలుగురు సింగపూర్ పిరమిడ్ మాస్టర్లతో కలిసి ధ్యానశిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశాం. 2014 సెప్టెంబర్‌లో పత్రీజీ సింగపూర్‌కి వచ్చినప్పుడు నన్ను "సింగపూర్ స్పిరిచ్యువల్ సైన్స్ అకాడెమీ (SSSA)"ని స్థాపించి SSSA ద్వారా సింగపూర్ కేంద్రంగా చైనా తదితర ఆసియా దేశాలకు పిరమిడ్ ధ్యానాన్ని విస్తరించమని మార్గదర్శనం చేశారు. దానిని నా జీవిత పరమార్థంగా ఎంచి పత్రీజీ ఆదేశాన్ని అమలు చేస్తాను.

ఇటీవల అక్టోబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బెంగళూరు .. పిరమిడ్ వ్యాలీలో జరిగిన "GCSS-VII" కార్యక్రమంలో పాల్గొని .. అమెరికా దేశం నుంచి విచ్చేసిన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్త నీనా బ్రౌన్ గారు నిర్వహించిన గ్రహ నియంత్రణామండలిలో భూగ్రహం యొక్క సభ్యత్వ ప్రక్రియలో పాల్గొన్నాను. అనంతరం ఆస్ట్రేలియా పిరమిడ్ మాస్టర్ ప్రదీప్ మరి నీనా బ్రౌన్ లతో కలిసి హైదరాబాద్ కడ్తాల్ "కైలాసపురి" లో ఉన్న మహేశ్వర మహాపిరమిడ్‌ను దర్శించుకున్నాం.


అక్కడ నీనా బ్రౌన్ గారిచే నిర్వహించబడిన ప్రత్యేక ధ్యాన శిక్షణా కార్యక్రమంలో మరి పౌర్ణమి ధ్యానంలో పాల్గొని అద్భుతమైన శక్తితరంగాలను అనుభూతి చెందాం! అనంతరం అచ్చంపేట .. "ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్"ల సముదాయంలో ధ్యానం చేసుకున్నాం. మొత్తం మీద నా ఇండియా పర్యటన నాలో వున్న "భగవంతుడు వేరు, నేను వేరు" అన్న భావనను సమూలంగా మార్చివేస్తూ నాలోని అనంతతత్త్వాన్ని నాకు తెలియజేసింది.


ఒకప్పుడు నిరాశా నిస్పృహలకు గురై .. బాధాకరమైన జీవితాన్ని గడిపిన నేను ఇప్పుడు ధ్యానశక్తితో పునరుత్తేజితం పొంది .. నా జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నాను. ఇలా నాకు సత్యాన్ని తెలియజేసి నన్ను ఒక ధన్యజీవిలా మలచిన పత్రీజీకి నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

 


నవనీత్ కౌర్

సింగపూర్ దేశం

email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top