"అమెరికా దేశంలో ఆనాపానసతి ధ్యానప్రచారం"

హాయ్! నా పేరు పద్మజ! సికింద్రాబాద్, తిరుమలగిరి నివాసిని అయిన నేను .. 2003, ఫిబ్రవరి నెలలో మా అమ్మ "శ్రీమతి సుశీల"గారి ద్వారా ఆనాపానసతి .. "శ్వాస మీద ధ్యాస" ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని దానిని అందరికీ పంచాలన్న దివ్యసంకల్పంతో తిరుమలగిరికి చెందిన పిరమిడ్ మాస్టర్ "శ్రీమతి శాలిని బాలాజీ"గారితో కలిసి ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేపట్టాను.

2004 నుంచి 2008 సంవత్సరం వరకు భారతదేశం అంతా తిరుగుతూ మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సామ్, నాగాల్యాండ్, త్రిపురలలో అద్భుతమైన ధ్యానప్రచార కార్యక్రమాలు నిర్వహించాను.

ఈ క్రమంలో నేను అమెరికా, టెక్సాస్ రాష్ట్రంలోని Corpus Christi యూనివర్సిటీ లో MS చేస్తున్న నా కూతురు "విశ్వ" దగ్గరికి నేను 2013 డిసెంబర్‌లో వెళ్ళడం జరిగింది. అక్కడ బాలాజీ టెంపుల్‌కు ప్రెసిడెంట్ అయిన డా||కృష్ణయ్య గారిని కలిసి ఆ టెంపుల్‌లో ధ్యానశిక్షణా తరగతులు నిర్వహించడానికి అనుమతి కోరాము.

Corpus Christi యూనివర్సిటీకి చెందిన డా||కృష్ణయ్య గారు టెక్సాస్‌లో సైకాలజిస్ట్‌గా తమ సేవలు అందిస్తున్నారు. వైద్యపరంగా కూడా ధ్యానంలోని శాస్త్రీయతను తెలుసుకుని ఉన్న వారు .. మా ప్రతిపాదనకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వారి ఆధ్వర్యంలో బాలాజీ టెంపుల్‌లో మొట్టమొదటి ధ్యానశిక్షణా తరగతి ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ధ్యానం చేసి అద్భుతమైన అనుభవాలను తమ స్వంతం చేసుకున్నారు.

జనవరి 20వ తేదీ 2014న చికాగోకు ప్రయాణమై .. చికాగో పిరమిడ్ మాస్టర్ "శ్రీకాంత్" గారి ఇంట్లో నాలుగు రోజులు ఉండి .. అక్కడ వారు ఏర్పాటు చేసిన ధ్యానశిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నాను! చెన్నై పిరమిడ్ మాస్టర్ మరి ప్రస్తుతం బెంగళూరులో నివాసం వుంటున్న మధుసూధన్ రావు, జ్యోతి మేడమ్ గార్ల కుమారుడైన "శ్రీకాంత్" .. చికాగోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‍గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి జనవరి 24వ తేదీన మియామీ ఫ్లోరిడాకు వెళ్ళి "Harrison Klein" & "Marbet Dunn" దంపతులను కలిసాము.

2012 డిసెంబర్‌లో "డా|| యుగంధర్" గారు హైదరాబాద్‌లో నిర్వహించిన "World Parliament on Spirituality"లో పాల్గొనడానికి భారత దేశానికి విచ్చేసిన ఈ అమెరికన్ దంపతుల ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళి .. వారి ద్వారా మియామీ లో ఏర్పాటు చేయబడిన ధ్యానశిక్షణా తరగతిలో పాల్గొని .. PSSM యొక్క విశేష సేవలను వారికి వివరించడం జరిగింది.

జనవరి 25వ తేదీ ప్రాతఃకాలం మియామీ బీచ్‌ లో "Dream Catchers for Soul" బృందం వారికి నిర్వహించిన ధ్యానశిక్షణలో పాల్గొన్న ఆ బృందం సభ్యులు 40 నిమిషాల పాటు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి అద్భుతమైన అనుభవాలను పొందారు! PSSM తో కలిసి ధ్యానప్రచారాన్ని చేపట్టడానికి వారు తమ ఉత్సాహం చూపించారు.

వారితో కలిసి అదేరోజు మియామీలో "ధ్యానం" మరి "హీలింగ్" తరగతులను నిర్వహించే Madam Lorrain Henry Mayer గార్లను కలవడం జరిగింది. అక్కడ అమెరికా, కెనడా, అర్జెంటీనా, హంగరీ, పోలండ్, బెలిజ్ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ధ్యానం మరి హీలింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ నిర్వహించబడిన 30 ని||ధ్యాన శిక్షణా తరగతిలో పాల్గొన్న వాళ్ళంతా కూడా చక్కటి ధ్యానానుభూతులను స్వంతం చేసుకుని ధ్యానం గురించి మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

Corpus Christi సెంటర్‌లోని యోగా శిక్షకురాలు "Yuga Yoga Ms. లిండీ"ని కలిసి వారి యోగా స్టూడియోలో ధ్యానశిక్షణా తరగతులను నిర్వహించాం. ఐదు ప్రదేశాల్లో లిండీ నిర్వహిస్తూన్న యోగా తరగతుల్లో ధ్యానశిక్షణను అందించిన మేము లిండీతో పాటు ఆమె శిష్యులందరినీ మా ఇంటికి భోజనానికి పిలిచాము. రుచికరమైన భారతీయ వంటకాలు వాళ్ళు ఎంతో ఇష్టంగా తిన్నారు. చక్కటి సత్సంగంలా ముగిసిన ఆనాటి డిన్నర్ కార్యక్రమంలో PSSM ద్వారా పత్రీజీ చేస్తోన్న విశిష్ఠ ధ్యానప్రచార విశేషాలనూ, పిరమిడ్ నిర్మాణాలనూ ఆసక్తిగా అడిగి తెలుసుకున్న వాళ్ళంతా కూడా "పత్రీజీ రాక కోసం ఎదురు చూస్తాం" అని ఉత్సాహంగా తెలిపారు.
ఇలా రెండు నెలలపాటు అమెరికాలో ధ్యానప్రచారం జరిపి నా జన్మను ధన్యం చేసుకునే అవకాశం అందించిన పత్రీజీ కి మరి USA పిరమిడ్ మాస్టర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను!

T.పద్మజ - సికిందరాబాద్
సెల్:+919949066054.

Go to top