"నీనా బ్రౌన్ - అమెరికా దేశం"
"మనం అంతా సర్వసత్తాకల చైతన్య శకలాలం"

అమెరికా దేశానికి చెందిన "నీనా బ్రౌన్" .. ఆధ్యాత్మిక దార్శనికత కలిగిన రచయిత్రి మరి ప్రత్యామ్నాయ వైద్య విధానాల చికిత్సకురాలు. గ్రహనియంత్రణా మండలిలో భూమి యొక్క సభ్యత్వం గురించిన సందేశాలను ఉన్నతలోకవాసుల ద్వారా అందుకున్న నీనా .. వారి ఆదేశం మేరకు అమెరికా దేశం నుంచి భారతదేశానికి విచ్చేసి బ్రహ్మర్షి పత్రీజీ సమక్షంలో పిరమిడ్ వ్యాలీలోని మైత్రేయ బుద్ధా మెగా పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఈ విశిష్ఠ ప్రక్రియను చేపట్టారు! తమ "S.T.A.R క్లినిక్"ల ద్వారా "ప్రేమతత్వపు రాయబారి (Ambassador of Love)"గా ఈ భూమ్మీద ప్రేమశక్తి తరంగాలను వ్యాపింపజేస్తున్న నీనా మేడమ్‌తో మనం కూడా కాస్సేపు ముచ్చటించుకుందాం ..

-ఎడిటర్


 

స్వర్ణలత: "హాయ్ నీనా! భూగ్రహ ఉన్నతీకరణ కోసం మీరు చేపట్టిన విశిష్ఠ ప్రక్రియ గురించి వివరించండి!"
నీనా బ్రౌన్: ముందుగా నన్ను ఇది చెప్పనివ్వండి! "భూగ్రహాన్ని గ్రహనియంత్రణా మండలి (Galactic Federation)లో సభ్యురాలిగా చేర్చడం" అన్న బృహత్ కార్యాన్ని నేను ఒక్కదాన్నే చేపట్టలేదు. మనం అందరం కలిసి సకల నక్షత్ర లోకవాసుల సహాయంతో ఈ పని చేశాం! ఈ పనికోసమే .. ఈ భూమిని కాంతివంతం చెయ్యడం కోసమే మనం ఇక్కడ జన్మ తీసుకుని ఉన్నాం. మనందరం కూడా సృష్టిలోని సర్వస్వాన్నీ మనలో కలిగి వున్న పరమోన్నత సర్వసత్తా గల వ్యక్తులం. అందుకే ఈ పని మనకు అప్పగించబడింది.

స్వర్ణలత: "మీ గురించి తెలియజేయండి!"
నీనా బ్రౌన్: సమత్వంతో కూడిన అత్యంత పరిణితి చెందిన సుదూర నక్షత్రమండలం నుంచి భూగ్రహచైతన్య పరిణామంలో తోడ్పడానికి నేను " ప్రేమతత్వపు రాయబారి (Ambassador of Love) "గా ఇక్కడికి వచ్చాను. గతంలో కూడా ఇలాంటి పని నిమిత్తం నేను అనేకసార్లు వినియోగించబడ్డాను. ఆ అనుభవజ్ఞానం మరి పత్రీజీ సహకారంతో మీ అందరి సమక్షంలో అక్టోబర్ 2వ తేదీ, 2014 నేను ఆ బృహత్ కార్యక్రమాన్ని పూర్తిచేయగలిగాను.

స్వర్ణలత: "ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఉన్నతలోకవాసుల సందేశాలను అందుకున్నప్పుడు మీ స్పందన?"
నీనా బ్రౌన్: చాలా ఆశ్చర్యపోయాను!! S.T.A.R. తత్వం అంటే "Surrender" .. "Trust" .. "Allow" .. "Receive" అనే ప్రకృతి సూత్రాలను ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందజేయాలని నేను దేశదేశాలు తిరిగే క్రమంలో భారతదేశానికి కూడా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను .. ఆ సమయంలోనే నాకు ఆ సందేశాలు అందించబడ్డాయి! "నా చే రూపొందించబడిన S.T.A.R ఫిలాసఫీ గ్రంథాలను పరిచయం చేయడానికే నేను భారతదేశం వెళ్తున్నాను" అనుకుంటూన్న క్రమంలో నాకు మూడు నెలల క్రితం "నువ్వు భారతదేశం ఎందుకు వెళ్తున్నావో తెలుసా?" అన్న అశరీరవాణి ప్రశ్న ఒకటి వినిపించింది. "ప్రతి ఒక్కరూ తమ తమ అహంకార వ్యక్తిత్వాలను వదిలి .. దివ్య ఉనికిని తెలుసుకునేలా వారికి మార్గదర్శనం చెయ్యడానికే నేను వెళ్తున్నాను" అని నేను ఆత్మ పూర్వకంగా అనుకున్నాను. అంతే! ఇక అప్పటినుంచి నాకు మరింత విస్తృతంగా ఉన్నతలోకవాసుల నుంచి సందేశాలు రావడం జరిగింది. ఆ సందేశాల సారాంశాన్ని విశ్లేషించుకున్న నాకు "నేను ఒక నూతన ఎజెండాతో కూడిన బృహత్ కార్యానికి వినియోగించబడబోతున్నాను" అని అర్థం అయ్యింది. అంతే .. ఇక నేను సర్వ సమర్పణా భావంతో విశ్వానికి అధీనమయ్యాను. నాలాగే ఎవరైతే తమ అహంకారపూరిత వ్యక్తిత్వాన్ని ఆ దివ్యత్వానికి అధీనం చేశారో .. వాళ్ళంతా కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు.

స్వర్ణలత: " ‘ప్రదీప్’ గారితో మరి "PSSM" తో మీకు ఎలా పరిచయం ఏర్పడింది?"
నీనా బ్రౌన్: విశ్వశక్తుల ప్రమేయం వల్ల ఒక అగంతకుడి నుంచి వచ్చిన ఇ-మెయిల్ ద్వారా నేను "ఆస్ట్రేలియా దేశపు పిరమిడ్ మాస్టర్ ప్రదీప్"గారిని కలుసుకోవడం జరిగింది. "ప్రతి ఒక్కరితో అనుసంధానం కావాలి" అన్న నా అభిలాషే ఇప్పుడు నన్ను మీ దగ్గర చేర్చింది!

స్వర్ణలత: "గ్రహ నియంత్రణా మండలి సభ్యులుగా భూగ్రహ వాసులమైన మనం భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాలు ..?"
నీనా బ్రౌన్: పరస్పర సామరస్యంతో మనందరం కలిసి ఉండడమే .. అభివృద్ధి చెందడానికి ఉన్న ఏకైక మార్గం. దానిని మనందరం ఇప్పటికే గౌరవ పూర్వకంగా మొదలుపెట్టాం. క్వాంటమ్ భౌతికశాస్త్రం ప్రకారం మనం అందరం ఒకే ఆలోచననూ, ఒకే అభిప్రాయాన్నీ కలిగి ఉన్నప్పుడే .. మన మధ్య ఒకే విధమైన "క్వాంటమ్ శక్తిక్షేత్రం" ఉత్పన్నమవుతుంది. ఆ క్వాంటమ్ శక్తిక్షేత్రంలో మన సృజనాత్మక చైతన్యం దేనిని ఎంపిక చేసుకుంటే అది వాస్తవ రూపం దాల్చి మన ముందు భౌతికరూపంలో సాక్షాత్కరిస్తుంది "మనం అంతా సర్వసత్తా కల చైతన్య శకలాలం" అన్న సంగతిని మనం ఈ సరికే తెలుసుకుని ఉన్నాం కనుక ఇప్పుడు ఆ తెలుసుకున్న సామార్థ్యాన్ని కలిసికట్టుగా ఉపయోగించుకుని ఏది కావాలనుకుంటే దానిని సృష్టించుకుందాం! ఇంతకు ముందువరకు మనం "మనం కంటే అన్యంగా బయట ఉన్న శక్తి ఏదో ఆ పని చేస్తోంది"అని భావించే వాళ్ళం! కానీ ఇప్పుడు "ఆ శక్తివంతులం మనమే" అనీ .. "ఆ సృష్టి జరిగేది కూడా మన వల్లనే" అనీ మనకు తెలిసిపోయింది. ఈ సనాతన మరి ప్రాచీన సత్యాన్నీ ఇప్పుడు ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేసి .. వారంతా కూడా తమలో ఉన్న తమ సృష్టికర్త యొక్క స్థాయిని గుర్తించేలా సహాయపడడానికి "THOTH" మరి "ENOCH" అనే ఉన్నత లోకవాసులు తమ వివేకాన్ని మనందరికీ బదిలీచేశారు.

స్వర్ణలత: "ఇంకా ఈ విషయాన్ని విపులీకరించండి!"
నీనా బ్రౌన్: విశ్వసౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలసి ఉంటూ .. విస్తృత ప్రయోజనాలను కలిగిన దివ్యత్వపు ఎంపికలను గురించి కలలు కనాలి ఆ కలలను మీ సామూహిక ఆత్మశక్తితో స్వ వాస్తవీకరించండి. సృష్టి సర్వస్వంతో కలిసి .. అంటే ఖనిజ సామ్రాజ్యం .. వృక్ష సామ్రాజ్యం .. జంతు సామ్రాజ్యం .. మానవ సామ్రాజ్యం మరి ఇతర నక్షత్ర మండలాలతో కలిసి నిర్ణయాలు తీసుకోండి.

వ్యక్తిగతమైనవైనా లేదా సృష్టిగతమైనవైనా సరే .. ఇది వరకులా విషయాల పట్ల కేవలం మానవులు మాత్రమే ఆధిపత్యపు నిర్ణయాలు తీసుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. ఎందుకంటే "గ్రహ నియంత్రణా మండలి" లో సభ్యత్వం పొందిన భూమిపై ఇక ముందు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం యొక్క ప్రభావం ఆ మండలిలోని ఇతర సభ్యులైన నక్షత్ర మండలాలూ, పాలపుంతలూ మరి ఇతర గ్రహసముదాయలపై కూడా ఉంటుంది!

కేవలం మానవ వ్యక్తిగత అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ భూమిపై ఒకరో ఇద్దరో వ్యక్తులు నిర్ణయాలు చేయడం వల్ల గ్రహనియంత్రణా మండలిలోని సమతుల్యత దెబ్బతింటుంది కనుక ఇక నుంచి సృష్టిసర్వస్వపు ఔన్నత్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉన్నతలోక వాసుల ద్వారానే నిర్ణయాలు తీసుకోబడతాయి! మరి ఆత్మస్థితిలో వారితో అనుసంధానం అయి ఉన్న వారికే వాటిని అమలు పరిచే అధికారం ఇవ్వబడుతుంది.’

స్వర్ణలత: "‘పత్రీజీతో మీ అనుబంధం?!"
నీనా బ్రౌన్: బ్రహ్మర్షి పత్రీజీది ఒక విశిష్ఠ వ్యక్తిత్వం! వారు సుదూర నక్షత్ర మండలం నుంచి ఈ భూమి మీదికి విచ్చేసిన పాత మిత్రులు! నక్షత్ర మండల పరిధిలో నిత్యనూతనంగా ఏర్పడిన "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్" ప్రయోగం ద్వారా వారు ధ్యాన-శాకాహార ప్రచారాలతో సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభ్యుదయం కోసం కృషిచేస్తున్నారు. వారు చేస్తూన్న కృషికీ .. వారి ఆశయాలకూ నేను ఎంతో ముగ్ధురాలిని అవుతున్నాను! వారిని కలిసిన క్షణం నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.

"మైత్రేయ బుద్ధా పిరమిడ్" చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ అక్టోబర్ 2వ తేదీన జరిగిన అద్భుత కార్యక్రమం అంతా కూడా గ్రహనియంత్రణా మండలిలో నమోదు కాబడింది. ఈ భూమిపై అతి త్వరలో వసంతోదయం రాబోతోంది మరి ఈ దివ్యప్రణాళికను మనం అందరం హృదయ పూర్వకంగా స్వాగతిద్దాం?!

స్వర్ణలత: "ఒక్క వాక్యంలో మీ సందేశం?"
నీనా బ్రౌన్: మీ దివ్యత్వాన్ని అనుమతించండి!

స్వర్ణలత: "భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండబోతోంది?"
నీనా బ్రౌన్: మనం ఎంపిక చేసుకున్న విధంగా ఉంటుంది!

 

Go to top