" జాస్ముహీన్ "

 

ఆస్ట్రేలియా దేశానికి చెందిన మేడమ్ "జాస్మూహీన్" .. పదమూడు సంవత్సరాలనుంచి విశ్వంలోని ప్రాణశక్తిని మాత్రమే స్వీకరిస్తున్నారు! ప్రకృతితో ఏకత్వంతో వుంటే విశ్వంతో అనుసంధానం పొందితే భౌతికమైన ఆహారం అవసరం లేకుండా ఎవరైనా విశ్వశక్తితో మాత్రమే జీవించవచ్చని ఆవిడ చెపుతారు. శాంతిరాయబారి, రచయిత్రి, అంతర్జాతీయ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు మరి అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు (GCSS) కు జీవిత కాలపు అధ్యక్షురాలు! ఆరోగ్యకరమైన సమత్వంతో కూడిన ప్రపంచాన్ని సహసృష్టి చేయడం కోసం ఈ భూమిపై శాంతి కార్యాలయాల స్థాపన చేస్తూన్న జాస్ముహీన్ .. "The Pure Love Channel" ద్వారా ప్రతి ఒక్కరూ తమ స్వీయ ప్రకృతితో అనుసంధానమై స్వీయ స్వస్థతను పొందాలని బోధిస్తూంటారు. వారితో కాస్సేపు సంభాషిద్దాం ..

ఎడిటర్

స్వర్ణలత: "మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏవిధంగా సాగుతోంది?"


జాస్ముహీన్: నా ఈ జాగరూకతా ప్రయాణం బుద్ధునికాలంలోనే మొదలైంది. ఆ కాలంలో నేను బుద్ధుని దగ్గరి నుంచి మధ్యేమార్గం గురించి తెలుసుకున్నాను. ఆ తరువాత నా జాగరూక ప్రయాణం క్రీస్తుకాలంలో సంభవించినప్పుడు నేను ఏసుక్రీస్తు నుంచి ప్రేమమార్గం గురించి తెలుసుకున్నాను. అప్పుడు నేను నేర్చుకున్న వాటిని ఇప్పుడు అందరికీ బోధించడానికి ఒక సేవకురాలిగా ప్రయాణమై వచ్చాను. ఇది నా నిరంతర ప్రయాణం మరి దీనికి ఆది, అంతం లేదు! కేవలం సేవ ద్వారానే మనం మనలోని ప్రేమశక్తిని ప్రకటించగలుగుతాము.

 

ఆకలి, మరణం వంటి మానవ అనుభవాలు మనల్ని సేవకు చేరువ చేస్తాయి మరి కష్టం అన్నది తెలియకుండా కరుణ, సానుభూతి పెంపొందవు.
ఏడేళ్ళ చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను "దేవుని సామ్రాజ్యం నీ లోపలే ఉంది; వెదుకు" అన్న క్రీస్తుబోధనలను విన్నాను. "అవునా?! అది ఎక్కడ ఉంది?!" అని నేను ఆశ్చర్యంగా అనుకుంటూ ఉండగానే తీవ్రశక్తి ప్రకంపనా ప్రభావానికి లోనైన నేను నా గతాన్నీ, భవిష్యత్తునూ సరి చూసుకుని .. వర్తమానంలో కూడా సేవ చేయడం కోసమే ఈ భూమ్మీదకు జన్మ తీసుకుని వచ్చానని తెలుసుకున్నాను.

 

స్వర్ణలత: "ప్రాణశక్తితో మాత్రమే జీవించాలి అని మీరు ఎందుకు అనుకున్నారు?"


జాస్ముహీన్: ప్రతి ఒక్క వ్యక్తి కూడా "నన్ను నేను ఉన్నతీకరించుకోవాలి" అనుకుని స్వీయప్రకృతితో అనుసంధానం అయినప్పుడు ఈ ప్రకృతి అతడిని భిన్న విధానంలో వినియోగిస్తుంది. అలాగే నేను కూడా నా స్వీయ ప్రకృతిలోకి గాఢంగా ప్రవేశించినప్పుడు కేవలం ప్రాణా హారిగా ఉండాలన్న ప్రేరణను పొందాను. నా ఆధ్యాత్మిక సాధనలకు సేంద్రియ ఆహారపదార్థాలు మరి పాలపదార్థాలు అవరోధాలుగా నిలిచేవి. దాంతో నేను ప్రాణశక్తితోనే జీవించడాన్ని అలవాటు చేసుకున్నాను. మొదట్లో "అలా ఉంటే త్వరలోనే మరణిస్తావు" అని నా సన్నిహితులు అనేవారు. కానీ విశ్వానికి అంకితమైన నేను "విశ్వశక్తి తప్ప నాకు మరేమీ అవసరం లేదు" అనుకున్న క్షణం నుంచి నాకు ఆకలి దప్పులు పూర్తిగా నిలిచిపోయాయి.

 

స్వర్ణలత: "దీని వలన మీరు పొందిన ప్రయోజనం?"


జాస్ముహీన్: ఎంచుకునే స్వేచ్ఛను పొందాను. స్వచ్ఛమైన ప్రకృతిని ప్రేమించడం ద్వారా కరుణ, దయ వంటి లక్షణాలు నా సహజ వ్యక్తిత్వంగా మారిపోయాయి. కేవలం ప్రాణశక్తితో జీవించడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో నేను చాలా నీరసపడ్డాను. నాలోకి అపారంగా ప్రవేశిస్తున్న విశ్వశక్తిని నా భౌతికశరిరం గ్రహించగలిగేది కాదు. అలాంటి స్థితిలో ఒకరోజు నేను ప్రార్ధన చేసుకుంటూ ఉండగా ఒక అద్భుతమైన కాంతి నన్ను ఆవరించి .. నిలువెల్లా నాలోకి ప్రవహించింది. ఆనాటి నుంచి నేను కాంతిని స్వీకరించగలుగుతున్నాను; కాంతి సందేశాలను అందుకోగలుగుతున్నాను; మరి అనేకానేక నక్షత్ర మండల విషయాలను కూడా విశేషంగా తెలుసుకుంటున్నాను.

 

స్వర్ణలత: "మీ ఆధ్యాత్మిక-సామాజిక కార్యక్రమాలు?"


జాస్ముహీన్: బ్రెజిల్, కొలంబియా దేశాల్లోని గిరిజనుల కోసం మరి మురికివాడల పిల్లల కోసం నేను కార్యక్రమాలను చేపట్టి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచే ప్రయత్నం చేశాను. మనుష్యులను తమ స్వీయ ప్రకృతిలోకి మళ్ళించి .. వారిలోని మానవబలహీనతలను పోగొట్టి .. వారిలో దివ్యత్వం నెలకొల్పడమే నా లక్ష్యం!

 

స్వర్ణలత: "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌తో మీ అనుబంధం?"


జాస్ముహీన్: దైవసామ్రాజ్యంలోకి ప్రవేశించడం కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం"అని తెలుసుకుని ధ్యానాన్ని వెతుక్కుంటూ సనాతన సాంప్రదాయాలకు పుట్టినిల్లయిన భారతదేశం రావడం మరి ఇంటర్నెట్ ఛానెల్ ద్వారా డాక్టర్ న్యూటన్ కొండవీటి మరి శ్రేయాన్స్ డాగాలను కలవడం జరిగింది. ధ్యానప్రచారం కోసం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ ద్వారా బ్రహ్మర్షి పత్రీజీ చేస్తూన్న విస్తృత కార్యక్రమాలను గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఆ మైత్రేయబుద్ధుడిని కలవడానికి పిరమిడ్ వ్యాలీకి వచ్చి GCSSలో పాల్గొన్నాను! GCSSకు జీవితకాల అధ్యక్షురాలిగా పత్రీజీ నన్ను నియమించడం .. నా సౌభాగ్యంగా భావిస్తున్నాను!ప్రతి ఒక్కరినీ తమతో కలుపుకుని పోగల అపారప్రేమతత్వం మూర్తీభవించిన పత్రీజీ సమక్షంలో ఈ మైత్రేయబుద్ధా మెగా పిరమిడ్‌లో సంభవించే ప్రతి ఒక్క అద్భుతం కూడా భారతీయ ప్రజల యొక్క ఆధ్యాత్మిక ప్రేమతత్వాన్ని లోకానికి వెల్లడి చేస్తుంది! ప్రేమమూర్తి అయిన పత్రీజీ .. ధ్యాన శాకాహార ప్రచారాల ద్వారా ప్రపంచ మానవాళికి ఉన్నత జ్ఞానమార్గాన్ని ప్రబోధిస్తున్నారు. వారితో కలిసి పనిచేయడం మన అదృష్టం!!

 

స్వర్ణలత: "మీ ముఖ్య సందేశం?"


జాస్ముహీన్: ప్రేమ, వివేకం, కరుణ కలిగి ఉండి ప్రతిక్షణం ధ్యానంలో అనంత శాంతినీ మరి ఆశీర్వాదాన్నీ పొందండి. భూమాత పట్ల ప్రేమతో వ్యవహరిస్తూ .. ఆమె అందించే సందేశాలను ఎరుకతో వినండి.

 

Go to top