" ఇది నాకు అపూర్వమైన మరి అద్వితీయమైన గౌరవం "

 

విద్యాధికులు, ఉన్నత భావజాల సంపన్నులు, నిగర్వి మరి స్నేహశీలి అయిన ప్రొ|| బాలకిషన్ గారు ఉస్మానియా యూనివర్శిటీలోని "Centre for Indian Ocean studies"లో జియోగ్రఫీ ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నిరంతర ఉద్యమాలకూ మరి భావ సంఘర్షణలకూ నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని పరిచయం చేసి .. ధ్యానశక్తితో ఆ యువశక్తిని ఉత్పాదక శక్తిగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రొ||బాలకిషన్ గారు .. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంటర్నెట్ ఫోన్ ద్వారా "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రికకు స్ఫూర్తిదాయకమైన ఇన్నర్ వ్యూ ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ..

T.వాణి మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా


 

వాణి: "హలో సార్! ధ్యానమహాచక్రం - V కమిటీ వైస్ - ఛైర్మన్‌గా 2014 డిసెంబర్ మాసం కడ్తాల్ .. కైలాసపురిలో నిర్వహించుకోబోయే ధ్యానమహాచక్రం కార్యక్రమంలో మీ సేవలను అందించబోతున్నందుకు మీకు మా అభినందనలు! మీ గురించి తెలియజేయండి!"


ప్రొ||బాలకిషన్ గారు: మాది కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణం. మా నాన్న "అనుమల్ల లక్ష్మీరాజం"గారు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. మా అమ్మ "శ్రీమతి లక్ష్మీబాయి" గృహిణి. ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య కలిగిన కుటుంబంలో నేనే చిన్నవాన్ని. నీతి నిజాయితీకి మారు పేరైన మా నాన్నగారు తమ ఉన్నతమైన భావాలతో మాకు మార్గదర్శనం చేస్తూ మా మూర్తితత్వం మీద గొప్ప ప్రభావాన్ని చూపారు. వారిలాగే ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని నేను ఆకాంక్షించేవాడిని.నేను జగిత్యాలలో 8 వ తరగతి చదువుకుంటూ ఉన్నప్పుడు అక్కడ "తెలంగాణా రైతాంగ పోరాటం" మొదలై భారతదేశంలోనే మొదటిసారిగా .. జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలు నక్సలిజమ్ ప్రభావిత కల్లోల ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. రాజకీయ నేపద్యంలో కాలేజీలో కూడా విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలకు దారితీయడంతో ఇక ఇక్కడ ఉంటే నా చదువు సక్రమంగా సాగదని తలచి మా తల్లిదండ్రులను ఒప్పించి నేను హైదరాబాద్ చేరుకుని ఖైరతాబాద్ న్యూ గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కోసం చేరాను.

 

ఉన్న ఊరు కాకపోవడంతో సహజంగానే ఖర్చులు పెరిగిపోయాయి. కానీ డబ్బుకోసం మా నాన్నగారిని అడగడం ఇష్టంలేని నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ .. నా చదువు పూర్తి చేసుకున్నాను. అలా నా ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ నేను నా భావాలకూ మరి ఆలోచనలకూ విలువ ఇచ్చుకునే వాడిని; అదే సమయంలో పుస్తకపఠనం అంటే ఎంతో ఇష్టపడే నేను కేవలం ఇది అది అని కాకుండా కనబడ్డ ప్రతి పుస్తకాన్ని ఎంతో ఆసక్తితో చదివేవాణ్ణి. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది కానీ .. అప్పట్లో కొన్ని రోజులు లైబ్రరీ వాచ్‌మెన్‌లను బ్రతిమిలాడుకొని రాత్రి 8.00 గం||ల నుంచి మరునాడు ఉదయం వరకు లైబ్రరి లోపల ఒంటరిగా చదువుతూ గడిపేవాడిని. ఆ రోజుల్లో ప్రతి వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రధమ బహుమతి నాదే.తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో M.Sc. జియోగ్రఫీలో చదువుతూన్న యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయడం ద్వారా .. నాలోని నాయకత్వ లక్షణాలకు మరింత పదునుపెట్టుకున్నాను. ఆ రోజుల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు ఎంత తీవ్రంగా వుండేవి అంటే అప్పుడు వున్న నగర పోలీస్ కమిషనర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఎన్నికలకు బందోబస్తు కల్పించడం తమకు కష్టసాధ్యంగా మారుతుందని ఈ ఎన్నికలు రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరారు. అందుకే నేను పోటీ చేసిన ఎన్నికలే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఆఖరి ఎన్నికలు. ఆ మధ్యకాలంలోనే LLB, Ph.D కూడా పూర్తి చేసి యూనివర్సిటీలో అధ్యాపకుడుగా బోధనారంగంలోకి అడుగుపెట్టాను. ఆ తరువాత ఎక్కదేవి వనజతో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు కూతురు అపూర్వ B.Tech, కుమారుడు అభిషేక్ ఇంటర్ చదువుతున్నారు.

 

వాణి: "మీకు ఆధ్యాత్మికత గురించిన పరిచయం ఎలా జరిగింది?"


ప్రొ|| బాలకిషన్ గారు: ఉద్యోగంలో స్థిరపడ్డాక నాకు మెల్లిమెల్లిగా సమాజంలో ఉన్న ప్రముఖలతో మరి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్ళ ఇళ్ళకు ఎవరైనా గురువులు, పీఠాధిపతులు వచ్చినప్పుడు నన్ను కూడా ఆహ్వానించేవారు. తద్వారా వారిని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు లభించింది. కానీ .. డబ్బుతో ముడిపడి ఉన్న అక్కడి అట్టహాసాలూ మరి పాద పూజలూ నాకు నచ్చకపోయేవి. "మనిషి తనను తాను తెలుసుకోవడానికి ఇంత హంగులూ, ఆర్భాటాలూ అవసరమా" అనుకునేవాడిని. ఆ గురువులు ఎవ్వరినీ అంటుకోకుండా దూరం నుంచే దీవెనలు అందజేయడం చూసి .. "ఇతరులను తాకితేనే మైలపడిపోయేవాళ్ళు మనల్నేం ఉద్ధరిస్తారబ్బా?" అనుకునేవాడిని.ఒక్కోసారి కుటుంబ సభ్యులతో వాదనలు ఇష్టంలేక ఎప్పుడయినా వాళ్ళ వెంట గుడికి వెళ్ళినా .. చిన్నతనం నుంచీ నాలో పాతుకుపోయిన అభ్యుదయ భావజాల ప్రభావం వల్ల నేను మాత్రం అక్కడ దేవుడితో బేరసారాలు ఆడకుండా కేవలం విగ్రహాల సౌందర్యాన్నీ, గుడి నిర్మాణంలోని కళాత్మకతనూ ఆస్వాదిస్తూ ఉండిపోయేవాడిని. అయితే ఏదో ఒక దివ్యశక్తి మనల్ని నడిపిస్తుందనీ .. ఏదో ఒకరోజు దానితో తప్పకుండా అనుసంధానం కావాలి అనీ నాకు అనిపిస్తూండేది.

 

వాణి: "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌తో మీ అనుబంధం?"


ప్రొ: బాలకిషన్ గారు: ఈ క్రమంలో ఒకసారి నేను లండన్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన "రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ"లో జరుగుతూన్న ఒక గొప్ప కార్యక్రమంలో నా "పేపర్" ను సమర్పించడానికి అనుమతి కోరాను. అయితే అనుకున్న గడువుకంటే కొంత ఆలస్యంగా పంపినందుకు నా పేపర్‌ను వాళ్ళు తిరస్కరించి "సారీ" చెప్పారు. ఏనాటి నుంచో కలలు కంటూన్న ఆ అవకాశం నా చేజారిపోయినందుకు నేను కొంత నిరాశకు గురి అయ్యాను.అదే సమయంలో మల్కాజిగిరి వినియోగదారుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న నేను అక్కడే మధుసూధన నగర్ కమ్యూనిటీ హాలుకు కూడా అధ్యక్షుడిగా ఉండడంతో కొందరు పిరమిడ్ మాస్టర్లు నా దగ్గరికి వచ్చి అక్కడ ధ్యానశిక్షణా కార్యక్రమ నిర్వహణ కోసం అనుమతి అడిగారు. ఒక పదిహేను చిన్న చిన్న పిరమిడ్‌లను హాలులో అమర్చి నన్ను వచ్చి దానికి ప్రారంభోత్సవం చేయమన్నారు.అయితే గురువుల పట్ల మరి ఆధ్యాత్మిక సంస్థల పట్ల పెద్దగా సదభిప్రాయం లేని నేను ‘ధ్యానం’, ‘గీనం’ అంటూ తిరుగుతే సంఘంలో నా పరువు ఎక్కడ దెబ్బతింటుందో అనుకుని .. "మీ గురువుగారినే పిలిచి కార్యక్రమం చేయించుకోండి" అని చెప్పాను. "ఇంత చిన్న కార్యక్రమానికి వారు రారు" అని వాళ్ళు చెప్పగా .. అసలే లండన్ అవకాశం చేజారిపోయిందని నిరాశతో ఉన్న నేను "మళ్ళీ ప్రయత్నించండి! ఆయనే వస్తారు నాకు ఇప్పుడు వీలు కాదు! తరువాత చూద్దాం లే" అని నిర్లిప్తంగా వాళ్ళకు చెప్పాను.


అది జరిగిన వారంలోనే మల్కాజిగిరిలోనే సాయిబాబా గుడిలో ఒక ధ్యానశిక్షణా కార్యక్రమానికి పత్రీజీ వస్తున్నారని తెలియడంతో కమ్యూనిటీ హాల్ లోని పిరమిడ్ ధ్యానకేంద్రం ప్రారంభోత్సవం కూడా సార్ చేతుల మీద జరగడానికి నిర్వాహకులు చకచకా ఏర్పాట్లుచేసుకున్నారు. "మీ సంకల్పం వల్ల పత్రీజీ ఇక్కడికి వస్తునారు .. మీరు కూడా రావాలి" అని వాళ్ళు నన్ను కోరారు. నేను వద్దు అనుకుంటూనే .. తప్పనిసరి పరిస్థితులలో కార్యక్రమం రోజు కమ్యూనిటీ హాలుకు వెళ్ళాను.రోడ్డుకు రెండువైపులా బారులు తీరి వందలాది జనం నిలబడి చప్పట్లు కొడుతూంటే .. పత్రీజీ వారిని ఆత్మీయంగా పలుకరిస్తూ .. వారి దగ్గరికి వెళ్ళి కరచాలనం చేస్తూ చిన్నా పెద్దా .. బీదా బిక్కీ తేడా లేకుండా వారిలో ఒకరిగా కలిసి పోవడం చూసి "ఈయనా .. ‘గురువు’ గారు?" అని ఆశ్చర్యపోయాను.అంతవరకు నేను చూసిన గురువుల్లా హంగులూ, ఆర్భాటాలూ, పూలదండలూ, కొబ్బరికాయలూ, కర్పూరహారతులూ మరి పాద పూజలు అక్కడ లేవు! అతి సామాన్య మానవుడిగా కనిపిస్తూన్నా వారి ముఖంలో ఏదో తేజస్సు! ఆశ్చర్యపోయి వారినే చూస్తున్న నాకు కూడా కరచాలనం ఇచ్చి ఒక స్నేహితుడిలా నా భుజంపై చేయివేసి నన్ను నడిపిస్తూ వేదిక దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆ శక్తి ప్రకంపనల అనుభూతి చెప్పలేనిది! "ఇంత గొప్ప వ్యక్తిని నేను ఇంతవరకు ఎందుకు కలవలేదు? నేను ఆయన దగ్గరకు వెళ్ళి కలవకపోవడం వలన ఆయనే నన్ను కలవటానికి వచ్చారేమో! బహూశా నేను అన్వేషిస్తున్న గురువు ఈయనేనేమో!" అని అనుకుంటూ "అర్జెంటుగా వారి గురించి చదివి .. వారి సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని వారితో పరిచయాన్ని పెంచుకోవాలి" అనుకున్నాను.ఇంతలో నిర్వాహకులు నన్ను స్టేజీ మీదకు పిలిచి మాట్లాడమని చెప్పగా పత్రీజీ చేతి నుంచి మైక్ అందుకున్న నేను .. ఇక నా ప్రమేయం ఏమీ లేకుండానే అనర్గళంగా నా మనస్సులోని మాటలన్నీ చెపుతూ వెళ్ళాను. నేను చెప్పాల్సింది అంతా అయిపోయాక పత్రీజీ లేచివచ్చి .. నన్ను గట్టిగా హత్తుకుని అభినందించారు!


అక్కడినుంచి బయలుదేరుతూ "రండి స్వామీజీ" అంటూ నన్ను కూడా కారులో ఎక్కించుకుని సాయిబాబా ఆలయంలోని ఫంక్షన్ హాల్‌కు తీసుకుని వెళ్ళి అక్కడ తమకోసం ఎదురుచూస్తున్న సుమారు రెండువేల మంది ధ్యానులతో ధ్యానశిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కూడా నాతో మాట్లాడించి .. కార్యక్రమం అయిపోయాక నాకు షేక్‌హ్యాండ్ ఇస్తూ .. "రేపు మా ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి రండి" అని పిలిచారు. వారి ఆహ్వానానికి మురిసిపోతూ మర్నాడు ప్రొద్దున్నే 8.00 గం||లకు వారి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాను. అప్పటికే నా కోసం ఎదురు చూస్తున్న పత్రీజీ తామే స్వయంగా నాకు టిఫిన్ వడ్డించి ప్రక్కనే కూర్చుని కొసరి కొసరి నాతో తినిపించారు! కొద్దిసేపు వారితో గడిపాక ఇక యూనివర్శిటీకి వెళ్ళడానికి టైమ్ కావడంతో వారి నుంచి సెలవు తీసుకుంటున్న నాకు దాదాపు ముప్ఫై పుస్తకాలు వున్న కట్ట ఇచ్చి .. "ఇవన్నీ చదివి నా గురించీ, నా సిద్ధాంతం గురించీ మరి ధ్యాన ఉద్యమం గురించీ తెలుసుకోండి! I want you to become a Master who can lead thousands of Masters!" అన్నారు.

 

క్రితం రోజు నేను నా మనస్సులో అనుకున్న మాటే ఇప్పుడు వారినోటి నుంచి రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. "సరే" అని వారికి మాటిచ్చి యూనివర్సిటీకి వెళ్తూ దారిలో .. "నిన్నటి నుంచి పత్రీజీ గురించిన ఆలోచన తప్ప మరేమీ లేదు; నేనేమయినా వారి మాయలో పడిపోతున్నానా??" అని ప్రశ్నించుకున్నాను. ఈ లోగా యూనివర్సిటీకి చేరుకుని నా మెయిల్‌బాక్స్ తెరిచి చూద్దును కదా .. "లండన్ .. రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ" వాళ్ళు అంతకు ముందు తిరస్కరించిన నా అభ్యర్థనను పునః పరిశీలించి నా పేపర్‌ని ఆమోదించినట్లుగా నన్ను వెంటనే బయలుదేరి లండన్‌కు రమ్మన్నట్లుగా మెయిల్ వచ్చి ఉంది!ఇక నా ఆశ్చర్యానికి అంతే లేదు! వెంటనే నేను చక చకా ఏర్పాట్లు చేసుకుని లండన్‌కు వెళ్ళిపోయాను. అక్కడ నా పేపర్ ప్రజెంటేషన్ నచ్చిన నిర్వాహకులు దానిని ప్రత్యేక కేటగిరీ క్రింద ఎంపిక చేసి .. నేను కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజు సుమారు 10,000/- రూపాయలను తిరిగి ఇచ్చివేస్తూ నా వసతి ఏర్పాట్లు విమానఖర్చులు తామే భరించనున్నట్లు ప్రకటించారు! అది పత్రీజీ కోరికను "సరే" అన్నందుకు విశ్వం నాకు అందించిన బహుమతిగా భావించి .. పత్రీజీ వంటి శక్తిస్వరూపంతో కలిసి ఉన్నందుకు అసాధ్యాలన్నీ సుసాధ్యాలు కావడం నేను అనుభవం చెందాను.ఇక లండన్ నుంచి వస్తూనే నేరుగా మెహదీపట్నం "స్పిరిచ్యువల్ ఇండియా" ఆఫీసులో ఉన్న పత్రీజీని కలిసి నా అనుభూతులను పంచుకుని వారితో కలిసి భీమవరం వరకు రైలులో ప్రయాణించాను. ఇది మరొక మరచిపోలేని అనుభవం.

 

వాణి: "ధ్యాన సాధనలో మీ ఎదుగుదల గురించి తెలియజేయండి!"


ప్రొ||బాలకిషన్ గారు: నాలోని బలాలనూ మరి బలహీనతలనూ నేను గుర్తించాను. అంతకు ముందు నాలో వున్న తొందరపాటుతనం, ఆవేశం నాలో మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టాయి. రకరకాల మూర్తిమత్వాలతో కూడి ఉన్న సమాజంలో వున్నప్పుడు పలురకాల ఒత్తిడులకు గురవుతూంటాం. ఆ యా సందర్భాల్లో నేను పత్రీజీ నుంచి నేర్చుకున్న "చక్కగా మాట్లాడటమే కాదు .. ఎదుటివాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినడం కూడా ఒక కళ" అన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి .. ఎన్నో సమస్యలను అధిగమించాను.ఇక ధ్యానంలో దివ్యచక్షువు అనుభూతులు, సూక్ష్మశరీరయానాలు చెయ్యడం వంటివి పొందాను. నా జీవిత పరమార్థం నాకు అర్థమై నా లక్ష్యం నాకు విశదపడింది. అందరినీ అర్థంచేసుకోవడం, అందరితో అప్యాయంగా ఉండటం, అందరితో మిత్రత్వం పెంచుకోవడం నేర్చుకున్నాను.

 

వాణి: "ఇప్పుడు ధ్యానమహాచక్రం-V కమిటీకి వైస్-ఛైర్మన్‌గా ఉన్న మీరు ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించబోతున్నాను?"


ప్రొ|| బాలకిషన్ గారు: అపూర్వమైన మరి అద్వితీయమైన బాధ్యతలను పత్రీజీ నా మీద ఉంచారు. దానిని నేను నాకు దక్కిన గౌరవంగా భావిస్తూ .. నా సామర్థ్యానికి దీనిని ఒక సవాలుగా స్వీకరిస్తున్నాను. స్వీయ పరిశీలనాసహితమై ధ్యానాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ పత్రీజీ చేస్తున్న లోకకల్యాణ కార్యక్రమాలలో యువత, విద్యార్థులు మరింత పాలుపంచుకునేలా చూస్తాం! ప్రత్యేకంగా ఈసారి ధ్యాన మహాచక్రంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లను, లెక్చరర్లను, టీచర్లను, సైంటిస్ట్‌లనూ పాల్గొనేలా చేస్తాం. సమాజంలోని ప్రముఖలందరినీ కలిసి వారిని పేరు పేరునా ఆహ్వానిస్తాం. కార్యక్రమం నిర్వహణకు కావలసిన వనరుల కోసం ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తాను. ఒక "ప్రొఫెసర్‌"గా, "తెలంగాణా రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య" కు "సెక్రెటరీ జనరల్"గా సమాజంలో ఒక గుర్తింపు కలిగి, ఇంతవరకు నాకోసం ఎవరి ముందు చేయి చాపని నేను ఒక బుద్ధుడిలా ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్ళి జోలె పట్టి వనరులు అర్థిస్తాను. నా అహం (ego) పై నేను ఆధిపత్యం పొందడానికి నా గురువు నాకు ఇచ్చిన వరంగా దీనిని నేను భావిస్తున్నాను.

 

వాణి: "మీరు కొన్ని పత్రికలకు అసోసియేట్ ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిసింది. ఆ వివరాలు ..?"


ప్రొ|| బాలకిషన్ గారు: నేను కొద్దికాలం క్రితం వరకూ ప్రతిష్టాత్మకమైన "Indian Ocean Digest Journal"కు మరి "Inida-Asia Journal" .. "అసోసియేట్ ఎడిటర్"గా పనిచేశాను. ఆసియా దేశాలకు చెందిన ఎకనామిక్స్, జియోగ్రఫీ, రాజనీతి మరి సామాజిక శాస్త్రాలకు చెందిన రంగాలలో నిరంతర పరిణామాలను అధ్యయనం చేస్తూ ఆ జర్నల్స్‌లో ఆర్టికల్స్‌ను ప్రచురిస్తూంటాము.ఇందుకుగాను నేను ఆ యా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఎడిటింగ్ కోసం చాలా సార్లు రాత్రి 9.00 గం||ల నుంచి ఒక్కోసారి తెల్లవారు జామున 5.00 గం||ల వరకు పనిచేస్తూ ఉండేవాడిని. మధ్య మధ్యలో అలసిపోయినప్పుడు కొంచెం సేపు ధ్యానం చేస్తూ మళ్ళీ పునరుత్తేజాన్ని పొందేవాడిని. ఇంతేకాకుండా వివిధ టీవీ ఛానెళ్ళకు, పత్రికలకు క్రిటిక్‌గా సేవలు అందిస్తున్నాను. "ధ్యానశక్తి వల్లనే నేను ఇంత మెరుగైన రీతిలో ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను" అని ఖచ్చితంగా చెప్పగలను!ఇక "స్వాధ్యాయ సేవ"లో భాగంగా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో అందిస్తూన్న నవీన ఆధ్యాత్మికతకు చెందిన అనేకానేక గ్రంథాలు ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క స్వరూప స్వభావాలనే మార్చివేశాయి. అంతేకాకుండా "ధ్యానాంధ్రప్రదేశ్" అంటే నాకు చాలా ఇష్టం! పత్రికలోని ప్రతి ఒక్క పేజీని క్షుణ్ణంగా చదువుతాను!

 

వాణి: "ఉస్మానియా యూనివర్సిటీలో మీ ధ్యాన కార్యక్రమాలు?"


ప్రొ|| బాలకిషన్ గారు: వ్యక్తిత్వపు పరివర్తనా సదృశమైన ధ్యానాన్ని ప్రతి ఒక్కవిద్యార్థికీ చేరవేస్తూ .. వారిలో నిక్షిప్తమైన ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలన్న తలంపుతో వారికి ధ్యానాన్ని పరిచయం చేయడం జరిగింది. 2007లో మొట్టమొదటిసారి ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్‌లో ధ్యాన శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థుల స్నేహపూర్వకమైన భాగస్వామ్యంతో ప్రతి ఆదివారం ఉదయం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు ఏకతా ధ్యానం కార్యక్రమం నిర్వహించబడింది. బ్రహ్మర్షి పత్రీజీ రాకతో ఉపాధ్యాయుల్లో మరి విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహం నిండింది. ఆ స్ఫూర్తితో అనేకసార్లు "టాగోర్ ఆడిటోరియమ్"లో ధ్యాన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.గర్ల్స్ మరి బాయ్స్ హాస్టళ్ళల్లో ఇప్పుడు క్రమం తప్పకుండా పౌర్ణమి ధ్యానం నిర్వహించబడుతోంది. శక్తికి నిలయాలైన యువతను ఉత్పాదకశక్తిలా మలచడానికి ధ్యానానికి మించిన ఉపకరణం లేదు కనుక .. తల్లి తండ్రులూ, అధ్యాపకులూ మరి మేధావులూ అందరూ కలిసి .. చిన్నతనం నుంచే వారికి ధ్యాన సంస్కారాన్ని అలవాటు చేసి .. చక్కటి సమాజ నిర్మాణానికి పాటు పడాల్సిందిగా ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో కడ్తాల్ పిరమిడ్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న "యూనివర్సల్ స్పిరిచ్యువల్ యూనివర్సిటీ" నిర్మాణంలో నా వంతు పాత్ర కోసం ఎదురు చూస్తూ వున్నాను.

 

 

సెల్: +9190301 59909
email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top