" గుజరాత్ రాష్ట్రంలో కూడా ధ్యానమహాచక్రాలు జరగాలి "

 

"అహ్మాదాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఫౌండర్" .. "శ్రీమతి రత్నమాల పటేల్" గారు శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి స్వయానా అక్కగారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఏర్పడిన తొలినాటి నుంచీ .. ఉద్యమప్రస్థానాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన వారు .. ఆ క్రమంలో పత్రీజీ మరి స్వర్ణమాల గారు ఎదుర్కొన్న పరిస్థితులను గురించి వివరంగా తెలియజేశారు! ఇటీవల హైదరాబాద్ సందర్శనకు వచ్చిన రత్నమాలగారు "ధ్యానాంధ్రప్రదేశ్" తో తమ ఇంటర్వ్యూ ద్వారా మరింత విశేష సమాచారాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ..

T.వాణి


 

వాణి: "నమస్కారం మేడమ్! శ్రీమతి స్వర్ణమాలా పత్రిగారికి స్వయాన అక్కగారైన మీ గురించీ .. మీ ధ్యాన జీవితం గురించీ మేం తెలుసుకోగోరుతున్నాం!"
రత్నమాల గారు: మా నాన్నగారు స్వర్గీయ "లక్ష్మీనారాయణ రావు" గారు మరి మా అమ్మ "శ్రీమతి రుక్మాబాయి"గారు. మేం ఆరుగురం అక్కచెల్లెళ్ళం; మాకు ఒక సోదరుడు. పెళ్ళిళ్ళయ్యాక మా పెద్దక్క "మంజుల" చెన్నైలో, రెండవ మూడవ అక్కలు "మృదుల", "ఊర్మిళ" అమెరికాలో స్థిరపడ్డారు. మా నాలగవ అక్క "పరిమళ" ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తూ ఒకానొక విమాన ప్రమాదంలో చనిపోయింది.

 

1972 లో నా వివాహం ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా ఉద్యోగం చేస్తూన్న "సతీష్ పటేల్"గారితో జరిగి, నేను అహ్మదాబాద్‌లో స్థిరపడగా మా అందరికంటే చిన్నది "స్వర్ణమాల" .. సుభాష్‌ని వివాహం చేసుకుంది. మా ఒకే ఒక్క సోదరుడు "ద్వారాకానాథ్" హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూన్న మా నాన్నగారు జియాలజిస్ట్‌గా హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రదేశాల్లోనే తమ విధుల నిర్వహిస్తూండడంతో మా బాల్యం మరి చదువు అంతా కూడా హైదరాబాద్‌లోనే గడిచింది.

 

వాణి: "పత్రీజీతో మీ పరిచయం ఎప్పటి నుంచి?"


రత్నమాల గారు: 1968 లో మా రెండవ అక్క "ఊర్మిళ" యొక్క వివాహం సుభాష్ గారి పెదనాన్నగారి కుమారుడు శ్రీ ఆనంద్ సాగర్ పత్రి గారితో జరిగినప్పటి నుంచి వారి కుటుంబంతో మాకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అదే వివాహంలో మా మూడవ అక్క "మృదుల" పెళ్ళి కూడా సుభాష్ గారికి స్వయాన అన్నగారైన "డా||వేణువినోద్"గారితో నిశ్చయమై వారి వివాహం కూడా 1969 సంవత్సరంలో జరిగింది.

 

ఆ తరువాత కొన్ని నెలలకే 1969 లో మా నాన్నగారు జడ్చర్ల దగ్గర జీప్ ఆక్సిడెంట్‍లో చనిపోవడం .. మరి నాకంటే పెద్దక్క "పరిమళ" విమాన ప్రమాదంలో చనిపోవడం .. మా కుటుంబానికి ఒక పెద్ద దెబ్బ అయ్యింది. అప్పట్లో నేను 10వ తరగతి చదువుతూండేదానిని. అప్పటికే పత్రీజీ వాళ్ళు "అంబర్‌పేట్"లో స్థిరపడి మా రెండు ఇళ్ళూ దగ్గర్లోనే ఉండడంతో పత్రీజీ మా ఇంటికి తరచూ వస్తూ పోతూ నాకు ట్యూషన్ చెప్పేవారు! అర్థంకాని విషయాలను ఎంతో విడమర్చి చెప్పేవారు! సరదాగా నవ్వుతూ .. అందరినీ నవ్విస్తూ .. వారు తమ ఇంటికి వచ్చిన అతిథులను ఆత్మీయంగా చూసుకునేవారు. ఆ విషయంలో అప్పుడూ ఇప్పుడూ వారికి వారే సాటి!

 

వాణి: "పత్రీజీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక వారి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి?"


రత్నమాల గారు: మా రెండో అక్కయ్య "మృదల"కు స్వయాన మరిదిగారైన పత్రీజీతో మా చెల్లెలు స్వర్ణమాల వివాహం మే 26, 1974 సంవత్సరంలో జరిగింది. ఒక సంవత్సరం తరువాత వాళ్ళకు బాబు పుట్టి .. ఆరురోజులు తరువాత చనిపోయాడు. ఆ తరువాతి కాలంలో వారు చావు పుట్టుకల పట్ల ఒక రకమైన నిర్వేదానికి గురికావడం మేం గమనించాం. కొంతకాలానికి పెద్ద అమ్మాయి "పరిణిత" పుట్టిన తరువాత వారి మాటల్లో, ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ .. ఎప్పుడయినా మాట్లాడాల్సి వచ్చినా .. ఇదివరకటిలా సరదా సంభాషణలు కాకుండా "మనం ఎందుకు పుట్టాం?" .. "ఎక్కడికి నుంచి వచ్చాం?" .. "ఈ చావుపుట్టుకల మర్మం ఏమిటి?" .. "ఆధ్యాత్మికత అంటే ఏమిటి?" అంటూ కేవలం ఆ విషయాలను మాత్రమే చర్చిస్తూండేవారు.

 

అంతంత పెద్ద విషయాలు అప్పట్లో మాకు అర్థం కాకపోవడంతో "ఏమిటో ఈయన ధోరణి? మా చెల్లిలి జీవితం ఏమైపోనుందో?" అన్న బెంగ మాకు పట్టుకుంది. ముఖ్యంగా వారి అన్నయ్య "డా||వేణువినోద్"గారు ఈ విషయంలో ఎంతో ఆందోళన చెందేవారు; వారి చిన్న కూతురు "పరిమళ" జననం తరువాత రాన్రాను పత్రీజీ ఇంకా ఇంకా లోతుగా ఆధ్యాత్మికతలో మునిగిపోవడం జరిగింది.

 

"పిరమిడ్ శక్తి" గురించి విస్తృతంగా అధ్యయనం చేస్తూ ఇంట్లో .. చిన్న చిన్న పిరమిడ్‌లను తయారు చేయించి కూరగాయలతో, బ్లేడ్‌లతో తాము స్వయంగా ప్రయోగాలు చేస్తూ అందులోని శాస్త్రీయతను ఆ రోజుల్లో మాకు వివరించేవారు.

 

వాణి: "పత్రీజీ ధోరణికి స్వర్ణమాల గారు ఎలా స్పందించేవారు?"


రత్నమాల గారు: మా చెల్లెలు "స్వర్ణ" చిన్నప్పటి నుంచి కూడా తొణకకుండా, బెణకకుండా ఉండేది. అయితే తన భర్త ప్రవర్తనలో వస్తూన్న ఈ మార్పుపట్ల మొదట్లో ఆందోళన చెందిన మాట నిజమే! "పిరమిడ్ ధ్యాన ఉద్యమం" తొలినాళ్ళల్లో పత్రీజీ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తిగా ధ్యాన ప్రచారంలో మునిగిపోవడంతో తాను తల్లడిల్లింది. బంధువుల దగ్గరినుంచి ఎన్నో వెటకారాలూ, ఎత్తిపొడుపు మాటలు పడింది!

 

"పాపం ఇంట్లో అందరికంటే చిన్నది; ఇద్దరు ఆడపిల్లలతో ముందు జీవితం ఎలా గడపనుందో" అని మేమంతా బాధపడ్డాం .. అయితే మా చెల్లెలు మాత్రం తన భర్త పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా వారిని వెన్నంటే ఉంటూ .. నిండుకుండలా కష్టాలన్నింటినీ భరించింది. క్రమంగా "ధ్యానం" లోని గొప్పతనాన్ని స్వయంగా తెలుసుకుంటూ .. ఈ రోజు ధ్యానఫలాలను అందుకుంటూన్న లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు పత్రీజీ పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని తెలియజేసుకుంటూంటే .. చూసి ఆనందిస్తోంది. తాను నమ్మిన సిద్ధాంతం పట్ల ఆనాడు పత్రీజీ .. త్రికరణశుద్ధితో ఉంటూ ధైర్యంగా వేసిన ఒక్క అడుగు .. ఈ రోజు ఎన్ని లక్షలమంది జీవితాల్లో ధ్యానవెలుగులను నింపుతోందో చూస్తూంటే వారి బంధువులుగా మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది!

 

వాణి: "మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది?"


రత్నమాల గారు: ఉపనిషత్తులు, భగవద్గీత చదవడం, అందులోని విషయాలను నేర్చుకోవడం అంటే నాకు చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం! "వాటి గురించి ఏ గురువైనా చెప్తారా?" అని చాలా కాలంగా వెతుకుతూంటే .. అహ్మదాబాద్ లోని మా ఇంటి దగ్గరే "చిన్మయా మిషన్" వారి సత్సంగ మందిరంలో అవి నేర్పుతున్నారని తెలిసింది. దాదాపు ఆరు సంవత్సరల పాటు వారి దగ్గర వాటిని అధ్యయనం చేస్తూ ఉండిపోయాను.

 

ఈ క్రమంలో ఒకసారి నేను ఒక జైన్ మందిరంకి వెళ్ళి అక్కడి ప్రశాంత వాతావరణంలో అలా కళ్ళు మూసుకుని కూర్చోగానే .. ఎప్పుడూ లేని విధంగా నా లోపలి నుంచి దుఃఖం తన్నుకుని బయటికి వచ్చి .. నేను ఎంతో సేపు ఏడుస్తూ ఉండిపోయాను. "నాకు ఇంకా ఏదో కావాలి .. నేనేంటో తెలుసుకోవాలి" అన్న తీవ్ర తపన నాలో బయలుదేరి నన్ను నిలువనీయలేదు! దాంతో గత కొంత కాలంగా పత్రీజీ మాకు చెబుతూ వస్తూన్న "శ్వాస మీద ధ్యాస ధ్యానం" చెయ్యడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో కర్నూల్‌లో "బుద్ధా పిరమిడ్" నిర్మాణం జరిగిందని తెలిసి మా అక్కాచెల్లెళ్ళం అంతా కలిసి పిరమిడ్‌ను చూడడానికి వెళ్ళాం! మిగతా వాళ్ళ సంగతి ఏమో గానీ .. నాకు మాత్రం అందులో కూర్చుని చేసిన ధ్యానం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది.

 

వాణి: "అహ్మదాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఫౌండర్‌గా మీ కార్యక్రమాలు .."


రత్నమాల గారు: అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చాక ఇంకా ఇంకా ధ్యానసాధన చేస్తూ అందులోని గొప్పతనాన్ని తెలుసుకుంటూ .. మా ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళకూ, బంధువర్గానికీ ధ్యానప్రచారం చేయడం మొదలుపెట్టాను.

 

మాఇంటి మీద 10' X10' పిరమిడ్ నిర్మించుకున్న తరువాత పత్రీజీ దానిని ప్రారంభోత్సవం చేసి "నిర్వాణ పిరమిడ్ ధ్యానకేంద్రం"గా దానికి నామకరణం చేసి నన్ను ఫౌండర్‌గా .. "అహ్మదాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ"ని ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి మా ధ్యానప్రచారం ఊపందుకుని .. సూరత్ .. పోర్‌బందర్ .. పాలితానా .. మెహసానా .. మొదలైన అనేక ప్రదేశాల్లో అద్భుతమైన మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎన్నో ధ్యాన శిక్షణా కేంద్రాలు ఏర్పడ్డాయి.

 

వాణి: "ధ్యానంలో ఇంకా మీ అనుభవాలు .."


రత్నమాల గారు: ఒకసారి నేను దసరా నవరాత్రుల రోజుల్లో మా పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేసుకుంటూండగా ఒక్కసారిగా నా శరీరం ప్రకంపనలకు లోనైంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు శక్తిపాతం జరిగి నాలో కుండలినీ జాగృతం కావడం నేను స్పష్టంగా అనుభూతి చెందాను. ఇంకో సందర్భంలో .. ఏడు సంవత్సరాల క్రితం అహ్మదాబాద్ .. గాంధీనగర్‌లోని "గాంధీ ఆశ్రమ్"లో పత్రీజీ ఆధ్వర్యంలో గుజరాత్ పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి ఒక ధ్యాన శిక్షణా కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకున్నాం. వేదిక, మరి ప్రాంగణం ఏర్పాట్లకు గాను ఆశ్రమ సభ్యులకు సూచనలిచ్చి వచ్చేశాం. మధ్యలో "ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?" అని తెలుసుకుందామని మా వారితో కలిసి వెళ్ళగా .. "నిన్ననే పత్రీజీ వచ్చి మాతో మాట్లాడి అంతా సరిచేసుకుని వెళ్ళారు కదా" అని అక్కడి నిర్వాహకులు ఖచ్చితంగా చెప్పారు.

 

మేము ఆశ్చర్యపోయి పత్రీజీకి ఫోన్ చెయ్యగా .. వారు డార్జిలింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నారని తెలిసింది. ఇది ఒక మిరాకిల్! మా వారు "సతీష్"గారు పత్రీజీ పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారు. ఇద్దరం కలిసి "బెంగళూరు పిరమిడ్ వ్యాలీ"ని దర్శించి అందులో ధ్యానం చేసుకున్నాం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరిగే పత్రీజీ కార్యక్రమాలకు మేం తప్పకుండా వెళ్ళేవాళ్ళం! తిరువణ్ణామలైలో జరిగిన ధ్యానయజ్ఞానికి వెళ్ళి ప్రాతఃకాల ధ్యానంలో పాల్గొనడం మాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది! క్రమంతప్పకుండా ధ్యానసాధనలో గడుపుతూ మావారు .. 2008 సంవత్సరంలో దేహవిరమణ చేశారు. చనిపోయిన తరువాత కూడా వారి వదనం ఎంతో ప్రశాంతంగా, ప్రకాశవంతంగా ఉండడం మాకు ఆశ్చర్యం కలిగించింది.

 

వాణి: "ప్రస్తుతం మీ కార్యక్రమాలు .."


రత్నమాల గారు: సూరత్‌లో "రీటా కెప్టెన్", "అనురాగ్ శర్మ", పోర్‌బందర్‌లో "నాతాభాయి మాలతి"గార్లతో కలిసి అహ్మదాబాద్‌లోని జైల్, గాంధీ ఆశ్రమ్ మరి ఇతర ప్రదేశాల్లో విరివిగా ధ్యానప్రచారం చేస్తున్నాం. ప్రస్తుతం మా ఇద్దరు కుమారులు వారి వారి జీవితాల్లో స్థిరపడిపోయారు. నేను ఒక "పిరమిడ్ మాస్టర్"గా ధ్యానప్రచారంలోనే నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇటీవలే కడ్తాల్ .. "కైలాసపురి"లో 180'X180' "మహేశ్వర మహాపిరమిడ్" ను దర్శించి అందులో ధ్యానం చేసుకుని బ్రహ్మానందాన్ని పొందాను! అచ్చంపేట్ "బ్రాహ్మణపల్లి"లోని "ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్" శక్తిక్షేత్రానికి కూడా వెళ్ళాను! మా గుజరాత్‌లో కూడా అలాంటి గొప్ప పిరమిడ్ నిర్మింపబడాలనీ, మరి ధ్యానమహాచక్రంలాంటి లోకకల్యాణ కార్యక్రమం మాచే జరపబడాలనీ సంకల్పం చేసుకున్నాను! మనం అందరం కలిస్తే పత్రీజీ ఆధ్వర్యంలో ఆ సంకల్పం త్వరలోనే సాకారం అవుతుందని ఆశిస్తున్నాను!

 

Go to top