"ఆరోగ్యకర పునర్జన్మ ఎత్తాను"

 

నా పేరు లక్ష్మి. మా వారు రవీందర్ గారు పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగరీత్యా వరంగల్ జిల్లా"బచ్చన్నపేట మండలం"లోని అనేక గ్రామాల్లో ఉద్యోగం చేశారు. ఆ క్రమంలో మేము ఆయా ప్రాంతాల్లో నివాసం ఉన్నప్పుడు నాకు కీళ్ళవాతం సోకి మంచం బారినపడ్డాను. శరీరంలోని ప్రతి కీలు వాచిపోయి తీవ్ర జ్వరంతో నేను బాధపడేదానిని. ఎంతో డబ్బు ఖర్చు చేసి .. ఆయుర్వేద, యునాని, అల్లోపతి మందులను వాడినా కూడా లాభం లేకపోవడంతో వరంగల్, హన్మకొండల్లోని ఆర్థోపెడిక్ డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్ళి కొంతకాలం చికిత్స చేయించుకున్నాను.

 

ఈ క్రమంలో నాకు శరీరం అంతా మరి కడుపులో గ్యాస్‌తో కూడిన వాపు వచ్చింది. మళ్ళీ హన్మకొండలోనే స్థానిక నర్సింగ్‌హోమ్‌లో చేరగా వారు నాకు వారం రోజుల పాటు చికిత్స చేసి .. "జబ్బు చివరి దశలో ఉంది కనుక ఈమె బ్రతకడం కష్టం; అంతా దేవుని దయ" అని చెప్పి ఇంటికి పంపించి వేశారు. ఇక నేను కూడా నా జీవితంపై ఆశ వదులుకుని నొప్పులు భరించలేక .. చావుకోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను.

 

నా పరిస్థితి తెలుసుకున్న మా బంధువు మరి బచ్చన్నపేట పిరమిడ్ మాస్టర్ "గుంటిపల్లి మల్లికార్జున్" తమ బంధువుల పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ నన్ను పరామర్శించడానికి మా ఇంటికి వచ్చారు. నన్ను చూసి .. "నీకు ఎలాంటి వ్యాధి లేదు! నువ్వు మంచి ఆరోగ్యవంతురాలివి .. అధైర్య పడకు"అని నా వెన్ను తట్టి నాకు "శ్వాస మీద ధ్యాస" ధ్యానం నేర్పించి "నలభైరోజులు పాటు క్రమం తప్పకుండా చేయి" అన్నాడు.

 

"మాంసాహారినైన నేను ధ్యానం ఎలా చేయను?" అని ఆలోచిస్తున్న నాకు శాకాహారం గొప్పదనాన్నీ మరి మాంసాహారం తినడంలో అనర్థాలనూ వివరించారు. "ధ్యానం చేస్తూ, చేస్తూ ఉండగా నువ్వే శాకాహారిగా మారిపోతావు" అని తెలియజేసి నాకు కర్తవ్యాన్ని బోధించారు.

 

అన్నట్లే ధ్యానం మొదలుపెట్టిన పదిరోజులకే నేను సంపూర్ణ శాకాహారిగా మారిపోయాను! రోజుకు మూడుసార్లు ఉదయం 5.00గం||లకు, మధ్యాహ్నం 12.00గం||లకు, రాత్రి 8.00గం||లకు ఒక్కొక్క గంట చొప్పున ధ్యానం చేస్తూ వచ్చాను. నేను వేసుకుంటూన్న BP టాబ్లెట్లను తగ్గించి .. ధ్యానశక్తి మీద నమ్మకంతో నా సాధనను కొనసాగించాను.

 

క్రమక్రమంగా నా శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుముఖం పట్టి ఒంట్లోని నీరంతా పోయి అంతకుముందు 85 కిలోల బరువు ఉన్నదాన్ని 16 కిలోల బరువు తగ్గి 69 కిలోలకు వచ్చాను! నా ఆరోగ్యంలో మెరుగుదలను చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు; మరి మా ఇంటిల్లిపాదీ ఎంతగానో సంతోషిస్తున్నారు! ధ్యానశక్తితో నాకు నేనే చికిత్స చేసుకుని చక్కటి ఆరోగ్యవంతురాలిగా మారడమే కాకుండా నిరక్ష్యస్యురాలినైన నేను ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా చక్కగా చదువుగలుగుతున్నాను! బ్రహ్మర్షి పత్రీజీ అందించిన "తులసీదళం 1 and 2" గ్రంథాలను చదివి .. అర్థం చేసుకున్నాను. నన్ను ధ్యాన శాకాహారిగా మార్చి .. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా నాకు పునర్జన్మను ఇచ్చిన బచ్చన్నపేట పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున్ గారికీ మరి మా దేవుడు పత్రీజీకి జీవితాంతం ఋణపడి ఉంటాను.

 

 


యాక లక్ష్మి

బచ్చన్నపేట మండలం

వరంగల్ జిల్లా

సెల్: +9199591 20168

Go to top