" ధ్యాన స్వగ్రామం "

 

 

నా పేరు రామసుబ్బారెడ్డి. వృత్తిరీత్యా కడప పట్టణంలో నివాసం ఉంటూన్న నేను .. కడపజిల్లా, ఖాజీపేట మండలం K.సుంకేసుల గ్రామంలో శ్రీమతి నారాయణమ్మ, శ్రీ ఎరుకల రెడ్డి పుణ్యదంపతలకు 16-8-1952 న జన్మించాను. శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్చుకుని ధ్యానం వలన ఎన్నెన్నో లాభాలను పొంది నిరంతర ధ్యానప్రచారం ద్వారా నా ఈ 62 సంవత్సరాల వయస్సులో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతూన్న నేను .. ప్రియతమ గురువు పత్రీజీ ఆవిష్కరించిన "ధ్యానగ్రామీణం"లో భాగంగా నా స్వగ్రామం K.సుంకేసులను ధ్యానమయం చేయాలని నిర్ణయించుకున్నాను. సుమారు 300 కుటుంబాలను కలిగిన మా గ్రామంలో 41 రోజుల మండల ధ్యానతరగతులను నిర్వహించాము.

 

దాదాపు 200 మందితో వీధి వీధిలో శాకాహార ర్యాలీలో నిర్వహించి ముఖ్యంగా అక్కడి హరిజన, గిరిజన తెగల వారికి మాంసాహరం గురించిన అనర్థాలనూ మరి శాకాహారం యొక్క ప్రాముఖ్యతనూ తెలియజేశాం. తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ A.హరినాథ్ బాబు గారి ఆధ్వర్యంలో "26వ ధ్యానసప్తాహం" కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించడం జరిగింది.

 

"ఇంటింటా ధ్యానవ్రతం" అన్న నినాదంతో ప్రతి ఇంటికీ వెళ్ళి ధ్యానం గురించీ, ధ్యానం వలన లాభాలను గురించీ సవివరంగా తెలియజేసి .. "ఆత్మసత్యంతో కూడిన ధ్యానవ్రతమే అసలు సిసలైన సత్యనారాయణస్వామి వ్రతం" అని తెలియజేసి ఇప్పటికి 11 గృహాల్లో ధ్యానవ్రతాన్ని నిర్వహించాము. గ్రామంలోని అన్ని గడపల్లో ధ్యానవ్రతాన్ని పూర్తి చేసుకోవడానికి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. "పిరమిడ్ శక్తి" గురించి కూడా విశేషంగా తెలుసుకున్న గ్రామస్థులు ఓ పిరమిడ్ నిర్మాణానికి ముందుకు రావడంతో గ్రామానికే చెందిన ఒక దాత తన స్థలాన్ని పిరమిడ్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు!


గత 62 రోజులుగా మా "స్వగ్రామ ధ్యానయజ్ఞం"లో పాల్గొన్న మాంసం వ్యాపారి "గంగిరెడ్డి నాగిరెడ్డి" ధ్యానంలోకి వచ్చిన మూడవ రోజు ధ్యానం చేస్తూండగా .. "మాంసాహారం .. పాపాహారం; కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళను చంపి వాటి మాంసంతో చేసే వ్యాపారం చాలా నీచకర్మతో కూడుకున్నది" అని అంతర్వాణి మాట గట్టిగా వినిపించిందట! వెంటనే అతను ఎన్నో సంవత్సరాలుగా తాను చేస్తూన్న మాంసం వ్యాపారాన్ని మానివేసి సంపూర్ణ శాకాహారిగా మారి .. క్రొత్త వృత్తిని చేపట్టాడు! ఇంకా ధ్యానానుభవాలనూ ధ్యానం వలన లాభాలనూ పొందుతూ ఇంత మంచి విద్యను తమకు చేరుస్తూన్నందుకు మమ్మల్నీ, పత్రీజీనీ గ్రామ ప్రజలందరూ ఎంతగానో అభినందిస్తున్నారు. ఇలా ధ్యాన ప్రచారం ద్వారా స్వగ్రామాన్ని ధ్యానమయం చేసుకుంటూ జన్మభూమి ఋణం తీర్చుకుంటూన్నందుకు నాకు ఎంతో తృప్తిగా ఉంది.

 

 

 

 

గజ్జెల రామసుబ్బారెడ్డి

K.సుంకేసుల

YSR జిల్లా

Go to top