ఓర్చుకున్నంతే .. నేర్చుకున్నంత

 

 

నా పేరు శారద. నేను మా నాన్నగారితో కలిసి వారి స్నేహితులైన విజయవాడ పిరమిడ్ మాస్టర్ జక్కా రాఘవరావుగారి "పిరమిడ్ హౌస్"లో జరిగిన బ్రహ్మర్షి పత్రీజీ ధ్యాన శిక్షణా తరగతికి హాజరు అయ్యి మొట్టమొదటిసారిగా వారి సమక్షంలో వేణునాద ధ్యానం చేసి ధ్యానశక్తిని అనుభూతి చెందాను.

 

ఆ తరువాత పిరమిడ్ హౌస్‌కు తరచుగా వెళ్తూ "పద్మా మేడమ్"తో సజ్జన సాంగత్యం చేస్తూ అనేకానేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుని నా ధ్యాన సాధనను కొనసాగిస్తూ వచ్చాను. కుండలిని జాగృతం కావడం, నా శరీరంలో, మనస్సులో ఉన్న కొన్ని అనారోగ్యకరమైన బ్లాక్స్ క్లియర్ కావడం, అందమైన దృశ్యాలను దివ్యదృష్టి ద్వారా చూడగలగడం జరిగింది.

 

కొన్నాళ్ళకు అందమైన దృశ్యాలు పోయి .. భయంకరమైన సర్పాలు, దయ్యాలు, మాంత్రికులు నాకు విజన్స్‌గా రావడం మొదలయ్యింది. అయినా భయపడకుండా ధైర్యంగా, ధ్యానం మరి సద్గురువుల పట్ల విశ్వాసం సడలకుండా, నా సాధన కొనసాగించాను.

 

గత అనేక జన్మల్లో నేను చేసిన చెడుకర్మలు మరి జంతువులను చంపి తిన్న పాపకర్మలు నన్ను అలా భయపెడుతున్నాయని అర్థం చేసుకుని .. ఎవరి కర్మలు వారే దగ్ధం చేసుకోవాలన్న తపనతో నా ధ్యాన సాధనను మరింత తీవ్రతరం చేసాను. ఈ క్రమంలో నాకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యి. నా "ధ్యానానుభవాలను చెప్పుకుందాం" అని పత్రీజీ ఇంటికి వెళ్ళాను. నా మొర వినకుండానే వారు "కూర్చో! డూ మెడిటేషన్!" అన్నారు తీక్షణంగా! .. "సరే" అని మారుమాట్లాడకుండా కూర్చుని నేను ధ్యానం చేస్తూంటే .. హాల్‌లో సార్ టీవీ పెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఇంతలో పత్రి మేడమ్ వచ్చి. "ఆమె ధ్యానం చేస్తూంది కదా?" అన్నారు. వెంటనే పత్రిసార్ "ధ్యానానికీ, టీవీకీ సంబంధం లేదు" అని స్ట్రిక్ట్‌గా చెప్పి మళ్ళీ ప్రశాంతంగా టీవీ చూడడంలో మునిగిపోయారు.

 

అప్పుడు నాకు అర్థం అయ్యింది! "ఆత్మలు, దయ్యాలూ, భూతాలూ, దేవుళ్ళూ వంటి విజన్స్ హోరు కూడా లెక్కచెయ్యకుండా నా పాటికి నేను ధ్యానం చేసుకుంటూ .. నా ప్రాపంచిక పనులు కూడా ప్రశాంతంగా చేసుకోవాలి" అని వారి సందేశంగా తెలుసుకున్నాను. మన సంకల్పానికి అనుకూలంగానే ప్రకృతి కూడా మనం నేర్చుకోవలసిన దానికి సర్వవిధాలా సహకారం అందిస్తుంది అనడానికి నిదర్శనంగా .. అంతవరకూ నన్ను బాధించిన విజన్స్ రావడం తగ్గిపోయింది!

 

"అసూయ, ద్వేషాల మధ్య కూడా ఆనందంగా జీవించగలిగితే .. ఆధ్యాత్మికత అలవడినట్లే; ఓర్చుకున్నంతే .. నేర్చుకున్నంత" అన్న పత్రీజీ సందేశాన్ని ఆదేశంగా తీసుకుని క్షీరసాగరమధనం "హాలాహలం తరువాత అమృతం" వచ్చినట్లు .. ఇప్పుడు నా జీవితాన్ని నేను చక్కగా ఆస్వాదిస్తున్నాను. "మన పాపాలే మన రోగాలు" అన్న శాస్త్ర వాక్యం ప్రకారం గత జన్మల పాప కర్మలు రోగాలుగా నాపై దాడి చేయకముందే వాటిని నా ధ్యానశక్తితో దగ్ధం చేసుకున్నాను.

 

ఈ మధ్య అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తూన్న నా చెల్లెలు "వాణి" తో మాట్లాడినప్పుడు .. తను నా అనుభవమంతా విని "నీలాంటి ఎన్నో కేసులు .. కౌన్సిలింగ్‌లకూ మరి చికిత్సకూ కూడా లొంగక .. వారు మరెన్నో రోగాల పాలు కావడమో లేక డిప్రెషన్‌లో పడి ఆత్మహత్యలు చేసుకోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు ధ్యానశక్తితో .. చక్కటి ఆత్మ జ్ఞానంతో మరి గురువు మార్గదర్శనంలో నిన్ను నువ్వే స్వస్థతపరచుకోవడం అద్భుతం" అని సంతోషపడింది. ఇలా నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకునేలా నాకు ఇంత గొప్ప ధ్యానవిద్యను అందించిన గురువు పత్రీజీకి కృతజ్ఞతలు!

 

 

 


G.శారద

కూకట్‌పల్లి

హైదరాబాద్

సెల్: +91 97048 94077

Go to top