" మాంసాహారం మానమని ఆ బుద్ధిహీనుడికి చెప్పు "
పత్రీజీ ఉవాచ

 

నా పేరు దీప. చిన్నప్పటినుంచీ నేను చాలా సున్నిత మనస్కురాలిగా ఉంటూ ఎవ్వరు ఏ చిన్నమాట అన్నా విపరీతంగా స్పందించే దానిని. తరచూ డిప్రెషన్‌కు గురవుతూ .. ప్రతి చిన్న విషయానికి కూడా ఇతరులపై ఆధారపడుతూ పరాధీనురాలిగా బ్రతికేదాన్ని! ఇన్ని అవలక్షణాలకు తోడు .. థైరాయిడ్, విటమిన్, కాల్షియం లోపం, నడుము నొప్పి, గర్భకోశంలో సిస్ట్ వంటి పలురకాల అనారోగ్య సమస్యలతో మరి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేదానిని.

 

ఇటువంటి కష్టకాలంలో నేను 2010 వ సంవత్సరంలో నా స్నేహితురాలు .. "నీతా మిశ్రా" గారి ద్వారా "వర్షా మోరార్కా" అనే మాస్టర్ని కలిసి మొట్టమొదటిసారిగా ధ్యానం గురించి తెలుసుకున్నాను. వారు చెప్పినట్లు గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఉండగా కొంతలో కొంత నా సమస్యలు ఉపశమించడం మొదలయ్యింది. ఈ క్రమంలో "వర్షాజీ" .. 2013 జూలై 23 తేదీన "తత్వమసి" పేరుతో ఒక మెడిటేషన్ క్లబ్ ను ప్రారంభించారు. అక్కడే నేను "హరి", "వెంకటేశ్" అనే పిరమిడ్ మాస్టర్లను కలసి వారి ద్వారా ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్చుకున్నాను.

 

ఏ గురురూపం .. సంగీతం .. ఉపదేశం ఏమీ అక్కరలేకుండా .. కేవలం మన శ్వాస మీద ధ్యాస! మన శ్వాసే మన గురువు! శ్వాస క్రమంతోనే దివ్యశక్తులన్నీ పొందగలం .. ఎంత సింపుల్?!!!

 

"అందరినీ వదిలి .. ఏ హిమాలయాలకో .. అడవులకో పోయి పరమయోగులంతా చేసేది ఈ ధ్యానమేనా?! ఇది సులువా?!" అని ఆశ్చర్యపోయాను! ఇక క్షణం ఆలస్యం చెయ్యికుండా .. నేను శ్వాస ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను! నాలో .. నమ్మలేనంత గొప్ప మార్పు. నా అనారోగ్యాలన్నీ క్రమంగా సర్దుకున్నాయి; నా మానసికాందోళనలన్నీ మటుమాయం అయిపోయాయి; నా ఆలోచనలు పరాధీనత నుంచి సాధికారదిశగా చేరుకుని .. నా జీవిత నిర్ణయాలు ధైర్యంగా నేనే తీసుకోవడం మొదలుపెట్టాను.

 

ఇప్పుడు ఎంతో బాగుంది. నాకు భవిష్యత్తు గురించి బెంగలేదు; గతంతో పనిలేదు! కేవలం వర్తమాన క్షణమే నాది!! 2013 జూలై 26 వ తేదీన హొస్పేట్‌లో పత్రీజీని ప్రత్యక్షంగా కలిసిన రోజు .. నా జీవితంలో గొప్ప శుభదినం!! ఈ క్రమంలో ఒక రోజు నా భర్త "వీరేష్" గారికి అకస్మాత్‌గా తల తిరగడం మొదలై మైకం కమ్మి వాంతులు మొదలుఅయ్యాయి. పరిస్థితి చాలా తీవ్రతరం కావడంతో భయపడిపోయిన వారు .. బెల్గాంలో ఉన్న తమ డాక్టర్ సోదరుడికి ఫోన్ చేసి తక్షణ వైద్యం కోసం అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. వారి పరిస్థితిని చూసి ఆందోళన పడిన నేను మా గదిలో బెడ్‌పై కూర్చుని "మా వారు పాపం ఎంతో మంచివారు; ఎందుకు వారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందో తెలియజెయ్యండి?!" అని పత్రీజీని తలుచుకున్నాను! ఆశ్చర్యం ఏమిటంటే .. క్షణకాలంలో పత్రీజీ నేను కూర్చున్న బెడ్‌పై ఇంకో అంచున కూర్చుని కనిపించారు!! తమ తీక్షణమైన స్వరంతో "బుద్ధిహీనుడైన నీ భర్త తక్షణం మాంసాహారం మానివేయమను; లేకపోతే తిప్పలు తప్పవు" అని హుంకరించారు.

 

అవాక్కైన నేను .. మా వారి దగ్గరికి వెళ్ళి .. పత్రీజీ మాటలను యధాతథంగా వారికి చెప్పాను. విపరీతమైన బాధతో విలవిలలాడుతూన్న వారు .. వెంటనే పత్రీజీ మాటలను శిరసావహిస్తూ మాంసాహారం మానివేస్తానని .. ఆజన్మాంతం శాకాహారిగానే జీవిస్తాననీ మాట ఇచ్చారు.

 

చిత్రంగా వారి కడుపులో నొప్పి, తలతిరగడం, వాంతులు అన్నీ ఆగిపోయి .. కొద్ది నిముషాల్లోనే వారు స్వస్థులై .. తామే స్వయంగా డాక్టర్‌గారితో మాట్లాడి అప్పాయింట్‌మెంట్‌ను రద్దుచేసుకున్నారు. అప్పటినుంచి మేం ఏ అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తున్నాం. అంతకు మందు మమ్మల్నిబాధలకు గురిచేసిన తీవ్ర ఆర్థిక సమస్యలు కూడా వెన్నలా కరిగిపోయాయి. ధ్యానం .. ధ్యాన ప్రచారమే జీవితంగా నేను, నా భర్త మా జన్మలను ధన్యం చేసుకుంటున్నాము.

 

ఇటీవల ఆగస్ట్ 24 వ తేదీ "హొస్పేట్" పర్యటనకు వచ్చిన పత్రీజీ .. మా ఇంటికి కూడా విచ్చేసి .. ఒక రాత్రి అంతా వుండి మా ధ్యానజీవిత అనుభవాలు విని మమ్మల్ని అభినందించారు. ఆ రోజు వారే వంట చేసి అందరికీ వడ్డించారు; ఇది మా జీవితంలో గొప్ప మరుపురాని అనుభూతి! కాబట్టి ఫ్రెండ్స్! మనం అనుభవిస్తున్న సకల అనర్థాలకు మూలం మాంసాహార సేవనమే! ఇతర జీవులను హింసించి .. చంపి తినడం వల్ల మనం కూడా తిరిగి ఆ బాధలనే పొందుతాం కనుక ప్రతి ఒక్కరూ శాకాహారిగా మరి .. ధ్యానం చేసి ఆత్మస్వరూపుల్లా జీవించాలని కోరుకుంటున్నాను .

 

 

 

దీప జవళి

హొస్పేట్

కర్నాటక రాష్ట్రం

Go to top