" పత్రీజీ సాంగత్యంలో .. నేను ‘కాల్చిన కుండ’లా అయ్యాను "

 

దక్షిణభారత ఆధ్యాత్మిక చలనచిత్రాల రచయితగా .. దర్శకులుగా ప్రసిద్ధి శ్రీ J.K.భారవిగారు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ ధ్యానజ్ఞానవాణి ధ్యానాంధ్రప్రదేశ్ మాసపత్రికకు .. పూర్వ చీఫ్ ఎడిటర్‌గా పత్రిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పుష్కరకాలంగా బ్రహ్మర్షి పత్రీజీతో అత్యంత సాన్నిహిత్యాన్నీ మరి సహచర్యాన్నీ కలిగి ఉన్న భారవి గారు .. 2014 నవంబర్ పత్రీజీ జన్మదిన సంచిక నుంచి "ధ్యానాంధ్రప్రదేశ్" .. "ధ్యానజగత్"గా రూపొందబోతూన్న శుభతరుణంలో .. పత్రికతో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. తమ హాస్య చతుర సంభాషణలతో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే భారవిగారితో ఇన్నర్‌వ్యూ మీ కోసం ..

 

మారం శివప్రసాద్, సెల్: 9347242373


 

మారం: "నమస్కారం భారవి గారూ! పత్రీజీతో మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీతో మీ అనుబంధం వివరించండి!"


J.K.భారవి: పత్రీజీ తో నా పరిచయం చాలా చిత్రంగా జరిగింది! అప్పటికే సెల్యూలాయిడ్ రంగంలో రచయితగా ఉన్న నేను .. 2002లో గుడిమల్కాపూర్ లోని శ్రీ అశోక్ కుమార్, శ్రీమతి ఉషారాణి దంపతుల స్వగృహంలో పత్రీజీని కలుసుకున్నాను.

 

మాటల సందర్భంలో ఒకానొక అంతర్జాతీయ చలనచిత్రం గురించి మా ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఎంతో ఘాటుగా ఒకరికొకరం తగ్గకుండా పాటు జరిపిన ఆ మాటల యుద్ధంలో నేను ఆగ్రహంతో ఊగిపోతూ ఇంటికి వెళ్ళిపోయాను. అదే పత్రీజీతో నా మొదటి పరిచయం! మర్నాడు మళ్ళీ శ్రీ అశోక్‌కుమార్ గారి ఇంటికి వెళ్ళి పత్రీజీకి సంబంధించిన పుస్తకాలు, CDలు, బ్రౌచర్లు బోలెడు తీసుకుని వచ్చి .. తీరిగ్గా కూర్చుని .. అందులోని సబ్జెక్టునంతా క్షుణ్ణంగా చదివాను. అంతకు ముందు రోజు పత్రీజీతో జరిగిన మాటల యుద్ధం ద్వారా నాలో కలిగిన ఆవేశం, ఉద్రేకంతో .. "ఎలాగైనా పత్రీజీ ఫిలాసఫీని తునాతునకలు చెయ్యాలి" అన్న కోరిక బలీయమై "ఆయన అంతు చూడాలి" అని పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివేస్తూ .. మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ ఒక "మహా స్వాధ్యాయ యజ్ఞమే" చేశాను. "అసలు ‘భారవి’ అంటే ఏమిటో నిరూపించాలి" అన్నదే నా తపన!

 

అంతకు ముందు కూడా భారతదేశంలోని అనేకమంది గురువులతో, స్వామీజీలతో మరి బాబాలతో నేను సాన్నిహిత్యాన్ని కలిగి ఉండి వారిపై పాటలూ, పద్యాలూ వ్రాసి ఉన్నాను .. మరి అనేక శాస్త్రాలనూ, ఉద్గ్రంధాలనూ, పురాణేతిహాసాలనూ సంపూర్ణంగా ఔపోసన పట్టి ఉన్నాను! కాబట్టి .. "నా జ్ఞానాన్నంతా ఉపయోగించి .. ఎలాగైనా పత్రీజీని మాటల్లో, రచనల్లో ఎక్కడో ఒక చోట ఇరికించి సాధించాలి" అని వారి ప్రతి పదాన్నీ, ప్రతి సందేశాన్నీ పట్టి పట్టి చదివాను.

 

అయితే నేను చెయ్యాలని అనుకున్నది ఒకటి .. వాస్తవంగా అయ్యింది మరొకటి! నాకున్న మిడి మిడి జ్ఞానంతో పత్రీజీ వ్యాఖ్యానాలనూ మరి ప్రవచనాలనూ ఖండన ముండనగా చేద్దామనుకున్న నేను .. వాటి లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ అలౌకిక స్థితిని అనుభవిస్తూ "వామ్మో! వామ్మో! మామూలు మనిషి కాదు .. మహర్షులందరు కలిస్తే అవుతారు మన పత్రిగారు" అంటూ ఏకంగా పత్రీజీ మీద ఒక పాటే వ్రాసేశాను!! అలా నా అహంకారం పటాపంచలై .. అసలైన ఆత్మజ్ఞానం అంటే ఏమిటో అర్థమై .. నాలో సంపూర్ణ పరివర్తన జరిగి నేను పత్రీజీకి గొప్ప అభిమానిని అయిపోయాను! దటీజ్ పత్రీజీ!

 

మారం: " ‘ధ్యానాంధ్రప్రదేశ్’ " మాసపత్రికతో మీ అనుబంధం ఎలా మొదలయ్యింది?"


J.K.భారవి: 2003జూలైలో ధ్యానాంధ్రప్రదేశ్‌కి "చీఫ్ ఎడిటర్"గా పత్రికతో నా అనుబంధం మొదలైంది! తిరుపతి పిరమిడ్ మాస్టర్స్ "B.V.రమణ దంపతులు" అప్పట్లో ఎడిటర్లుగా పత్రికను విజ్ఞానదాయకమైన శీర్షికలతో తీర్చిదిద్దేవారు. వారితో పనిచేస్తూ నేను కూడా ఎంతగానో ఎదిగాను. ఆ తరువాత D.శివప్రసాద్ .. ఎడిటర్‌గా వచ్చారు. అప్పటికే న్యూస్ పేపర్ రంగంలో అనుభవాన్ని కలిగి ఉన్న "D.శివప్రసాద్"గారు తిరుపతి నుంచి "ధ్యానలహరి" మాసపత్రికను నిర్వహించేవారు.

 

ఆ తరువాత "B.నాగలక్ష్మి" గారు ఎడిటర్‌గా ఉన్నప్పుడు దాదాపు మూడు సంవత్సరాలపాటు నేను నా "ఆత్మీయపుత్రిక"తో గడిపినట్లు పత్రిక అభివృద్ధికి మరింత సృజనాత్మకంగా పనిచేశాను. ముందు ఎడిటర్లు .. పత్రిక స్క్రిప్ట్‌ను తయారు చేసి నాకు పంపిస్తే .. దానిని స్టడీ చేసి .. చిన్ని చిన్ని సూచనలతో సరిపెడుతూ .. "స్పెషల్ ఎడిటోరియల్" మాత్రం వ్రాస్తూ వచ్చిన నేను .. ఆ తరువాతి రోజుల్లో సినీరచయితగా ప్రొఫెషనల్ రైటర్‌గా పత్రికలో నా ప్రమేయాన్ని మరింత పెంచుకున్నాను.

 

అంతకుముందు నెలాఖరిలో ఒక్కసారి మాత్రం ఆఫీసుకు వచ్చి పత్రికను పరిశీలించే నేను .. క్రమంగా వారంరోజుల పాటు ఆఫీసులోనే మకాం వేసి ప్రతి పేజీని క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. ఆ తరువాత పత్రీజీ దానికి మెరుగులు దిద్దేవారు!

 

విశ్వశక్తికి సంబంధించిన జ్ఞానం ఎంత అద్భుతంగ ఉంటుందో నాకు "ధ్యానాంధ్రప్రదేశ్"లో పనిచేయడం ద్వారానే బోధపడింది. పత్రీజీ జ్ఞానం హిమాలయ గంగా ప్రవాహం! పత్రీజీ శైలినీ, ధాటినీ పట్టుకోగలిగిన వాళ్ళను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు! ఆ మహాగురువుతో కలిసి అంత గొప్పగా పనిచేయడం నా జీవితానికి ధన్యత చేకూర్చింది!

 

మారం: " ‘ధ్యానాంధ్రప్రదేశ్’ "లో మీకు బాగా నచ్చే శీర్షిక?"


J.K.భారవి: "పత్రీజీ టూర్ డైరీ!" పత్రిక అందగానే నేను తిరగేసేది "సార్ టూర్ డైరీ" కోసమే! లోకకల్యాణం కోసం అలుపెరగకుండా వారు చేస్తున్న కృషి ఆ పేజీల్లో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ప్రక్కనే వేస్తున్న ఫోటోలు వారి విశేష కృషికి నిదర్శనాలు!

 

మారం: "ముఖ్యంగా ఏ విషయాలపై మీరు శీర్షికలను పొందుపరచేవారు?"


J.K.భారవి: "ధ్యానం" .. "శాకాహారం" .. "పిరమిడ్ శక్తి" మరి "ఆత్మవిజ్ఞానం"! ఈ విషయాలనే చదువరులకు ఆసక్తిదాయకంగా ఉండేలా ఎప్పటికప్పుడు నిత్యనూతనత్వాన్ని జోడిస్తూ అందించాలి. అది కూడా సూటిగా వారి మనస్సులకు హత్తుకునేలా సరదా సరదా మాటల్లో సరళంగా అందించాలి! ప్రతి నెలా ఏదో ఒక క్రొత్త విషయాన్ని అందించాలన్న అలజడి!! ఈ ప్రయాణంలో పత్రీజీ నాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు! బుద్ధుడి స్నేహం, జీసస్ క్షమాగుణం ఎలా ఉంటాయో .. అవి ఏ స్థాయిలో ప్రదర్శించవచ్చో పత్రీజీని చూసే నేర్చుకున్నాను!

 

మారం: "పత్రీజీ జ్ఞానం మీ సినిమాప్రస్థానంలో ఎలా ఉపయోగపడుతోంది?"


J.K.భారివి: పత్రీజీ ప్రజ్ఞ, మరి "ధ్యానాంధ్రప్రదేశ్"లో నేను పొందిన అనుభవాలు, అనుభూతులు అన్నీ కలగలిపి నన్ను ఆత్మపరంగా ఎంతగానో ఎదిగించాయి! "పరిమితులతో కూడిన సినిమా రంగం ద్వారా నా ఎదుగుదల స్థాయికి ప్రజలను చేర్చలేక పోతున్నానేమో" అని ఒకింత బాధపడినా .. "జగద్గురు ఆది శంకరాచార్య" సినిమాలో పత్రీజీ పోషించిన గోవింద భగవాత్పాదుల వారి పాత్ర ద్వారా జగద్గురువుకు చేయించిన జ్ఞానబోధ నన్ను ఎంతో సేదదీర్చింది! డబ్బు సంపాదించడంలో, డబ్బును గౌరవంగా వాడడంలో, పత్రీజీ నుంచే నేర్చుకున్న నేను .. ఈ రోజు ఒక చలనచిత్ర దర్శకుడిగా, మాటల, పాటల రచయితగా నా సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నాను.

 

మారం: "ప్రస్తుతం మీ సినిమా కార్యక్రమాలు?"


J.K.భారవి: ప్రస్తుతం నేను "తిరుపతి బాలాజీ" మీద ఒక టీవీ సీరియల్‌ను భారతదేశంలోని అన్ని భాషల్లో 500 ఎపిసోడ్‌లుగా నిర్మిస్తున్నాను. విశ్వానికి శాంతి సందేశాన్ని అందించగలిగే ఒక గొప్ప చలనచిత్రం రూపకల్పనకు కూడా స్క్రిప్ట్‌ను తయారు చేసుకుంటున్నాను. 40 సంవత్సరాలుగా నేను సంపాదించిందంతా "అదిశంకరాచార్య" సినిమాతో తుడిచిపెట్టుకుపోయినా .. చేసిన అప్పులతో నా జీవితం ఆత్మహత్యాసదృశం అయినా .. ఒక స్థితప్రజ్ఞుడిలా నిలద్రొక్కుకుని సజీవంగా ఈ భూమిపై నిలబడ్డాను.

 

ఇప్పుడు మళ్ళి రెట్టించిన ఉత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ పీస్ ఫిల్మ్‌ని తీసే ప్రయత్నంలో మునిగిపోయాను. ఇది ఆత్మజ్ఞానపూర్ణుడయిన ఒక పిరమిడ్ మాస్టర్‌కే సాధ్యం!

 

మారం: "సినిమాల్లోకి రాకముందు మీరు ఏం చేసేవారు?"


J.K.భారవి: సినిమాల్లోకి .. మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లోకీ .. రాకముందు నేను "తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్"లో పనిచేస్తూ వివిధ ప్రదేశాల్లో హరికథలు చెప్తూండేవాడిని. అప్పట్లో శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉండేవారు. అప్పుడే నాకు మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారితో సాన్నిహిత్యం కలిగింది. ఈ ప్రాజెక్టు వల్లనే నేను రచయితగా సినిమాల్లోకి వచ్చాను.

 

మారం: "ధ్యానులకు మీ సందేశం?"


J.K.భారవి: ధ్యానంలోకి, "ధ్యానాంధ్రప్రదేశ్"లోకి వచ్చాక అప్పటి వరకు ‘పచ్చికుండ’గా ఉన్న నన్ను ఆత్మ విద్యలన్నీ నేర్పించి బాగా ‘కాల్చినకుండ’గా రాటుదేలించారు పత్రీజీ! "కేవలం ‘జయించాలి’ అన్న ఆశయం మాత్రమే సరిపోదు! యుద్ధం చేసే కళను కూడా ఔపోసన పట్టాలి!" అని తెలుసుకున్న నేను .. "ఆ యుద్ధం మనతోనే మనం చెయ్యాలి .. అత్యంత మెళకువతో మన లోపలి అంతఃశత్రువులను మట్టుబెట్టాలి" అని పత్రీజీ సాంగత్యం లోనే తెలుసుకున్నాను. ఇక అప్పటి నుంచి వ్యూహ ప్రతివ్యూహాలను రచించుకుంటూ "జీవితం" అనే "మహాసంగ్రామం"లో ఎప్పటికప్పుడు విజయం సాధిస్తూనే ఉన్నాను!!

 

మారం: సుమారు ఆరు సంవత్సరాల పాటు మీరు "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రికకు చీఫ్ ఎడిటర్‌గా ఉండి మీ స్ఫూర్తిదాయకమైన శీర్షికలతో పత్రికను విశేషంగా తీర్చిదిద్దారు! ఇప్పుడు 2014 నవంబర్‌ సంచిక నుంచి "ధ్యానాంధ్రప్రదేశ్" .. "ధ్యాన జగత్"గా మన ముందు సాక్షాత్కరించబోతున్న శుభతరుణంలో మీ వ్యక్తిగత స్పందన?


J.K.భారవి: శాస్త్రీయ ఆధ్యాత్మిక క్షేత్రంలో సాటి లేని మేటి పత్రికగా నిలుస్తోన్న "ధ్యానాంధ్రప్రదేశ్" .. గురువు గారి జన్మదిన సంచిక నుంచి "ధ్యానజగత్"గా రూపుదిద్దుకోవడం .. ఒక శుభపరిణామం! ఈ సందర్భంగా "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులందరికీ నా అభినందనలు!

 

Go to top