" టర్కీ దేశంలో ధ్యానోదయం "

 

 

ఇరవై సంవత్సరాల క్రితం మాట!

 

ఇప్పటికి ఇంకా ఒక్కో ప్రాంతంలో నలుగురైదుగురు ధ్యానులు మాత్రమే వుండి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ధ్యానప్రచారం కోసం పత్రీజీ బస్సులలో ప్రయాణించే రోజులు!

 

ఒకానొక రోజు బస్‌స్టాండ్‌లో పత్రీజీతో కలిసి నేను బస్సు కోసం ఎదురు చూస్తూ వుండగా వారు నాతో "కొన్నాళ్ళకు విదేశాల నుంచి ధ్యానం బోధించడానికి రమ్మని ఆహ్వానాలు వస్తాయి; పాస్‌పోర్ట్ సిద్ధం చేసుకో" అన్నారు.

 

అది విని నేను "బస్సులో వెళ్ళడానికే కష్టంగా వుంది. విదేశాలు అంటే విమానాలలో వెళ్ళాలి. ఇక్కడి వాళ్ళనే బ్రతిమాలి, బ్రతిమాలి చెపితే కానీ వినటం లేదు. విదేశాల నుంచి మమ్మల్ని పిలిచి మరీ ధ్యానం నేర్చుకునే వాళ్ళు వుంటారా? ఈ గురువుగారు నా చెవిలో పువ్వులు పెడుతున్నారు" అనుకున్నాను.

 

కానీ నా ఆలోచనకు భిన్నంగా "ఇంతింతై వటుడింతై" .. అన్నట్లుగా ఈ రోజు PSSM అనేకానేక దేశాలలో విస్తరిస్తూ వుండటం చూసి "గురువుగారు మహాద్రష్ట, ఆయన చెప్పింది చేస్తే చాలు! విశ్లేషించటం మరి వ్యాఖ్యానించటం మూర్ఖత్వం" అని నేను తెలుసుకున్నాను. దానిని స్థిరపరుస్తూ నేను ఇటీవలే టర్కీ దేశం నుండి ధ్యానశిక్షణకు పిలుపు అందుకున్నాను!

 

అది కూడా తమాషాగా జరిగింది!


టర్కీ రాజధాని అంకారా నగరంలోని "టర్కిష్ పెట్రోలియం కంపెనీ" లో మెకానికల్ ఇంజనీయర్‌గా పనిచేస్తున్న "శ్రీ బైరాం గణయ్" గారు జీవితంలో అన్ని విషయాలూ సక్రమంగా, ప్రశాంతంగా ఉన్నప్పటికీ నిష్కారణంగా నైరాశ్యం, అభద్రతలకు గురి అయ్యారట. "ఆత్మహత్య చేసుకోవాలి" అనుకుంటూన్న స్థితిలో వెబ్‌సైట్‍లు వెతుకుతూ ‘ఓషో’ బోధనల పట్ల ఆకర్షితులయ్యి ధ్యానం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి తిరిగి జీవితంపై అనురక్తి ఏర్పడింది. అప్పుడు ధ్యాన వెబ్‌సైట్ కోసం అన్వేషిస్తూండగా "PSSMవెబ్‌సైట్" కనిపించి చాలా ఆసక్తి రేకెత్తించిందట!

 

ఆ తరువాత Facebook లో అనేకమంది పిరమిడ్ మాస్టర్లతో పరిచయం ఏర్పడి వారి సూచనల మేరకు పత్రీజీ విదేశ వ్యవహారాల విషయాలు చూసే నాకు (A.V.సాయికుమార్ రెడ్డి) ఫోన్ చేసి, నాతో ధ్యానం గురించి మాట్లాడారు. మా మధ్య నెలరోజులు పాటు Facebook ఛాటింగ్ జరిగింది! ఆ తరుణంలోనే ఆయన టర్కీలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ శాఖను నెలకొల్పడానికి ఉత్సాహం చూపించి మమ్మల్ని టర్కీకి ఆహ్వానించారు!

 

పత్రీజీకి ఈ విషయం తెలియజేసి, నేను .. నాతో పాటు "స్పిరిచ్యువల్ ఇండియా", "స్పిరిచ్యువల్ సైన్స్" మ్యాగజైన్ల ఎడిటర్ శ్రీ K.వేణుగోపాల రెడ్డి కలిసి మార్చి 13న టర్కీదేశం వెళ్ళి 23 వరకు టర్కీదేశంలో పది రోజుల పాటు ధ్యాన తరగతులు నిర్వహించాము. "అంకారా" నగరంలో బైరాం గారి ద్వారా వారి కంపెనీలో ఆయన సహచరులకు, సిబ్బందికి ధ్యాన శిక్షణ ఇచ్చాము!

 

 

అక్కడ "అంకారా" నగరంలో మేము ఒక పుస్తక విక్రయశాలకు వెళ్ళి కార్లోస్ కాస్టానెడా, లోబ్‌సాంగ్ రాంపా, డాన్‌యువాన్, నీల్‌డొనాల్డ్ వాల్ష్ వంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల పుస్తకాలను టర్కీ భాషలో చూసాము! ప్రపంచం మొత్తం విరివిగా విభిన్న భాషలలో నూతనయుగ శాస్త్రవేత్తల పుస్తకాలు అనువదింపబడుతున్నాయి అని వీటిని చూసినప్పుడు మాకు అర్థమైంది!

 

మన "PSSM"కార్యకలాపాలకూ,"18 ఆదర్శసూత్రాల"కూ, ధ్యానజగత్, శాకాహారజగత్ లక్ష్యాలకూ శ్రీ బైరాం గారు విశేషంగా స్పందించి తనవంతుగా PSSM సాహిత్యాన్ని టర్కీ భాషలో అనువదింప చేసి ప్రచురించటానికి సిద్ధమయ్యారు!

 

"కోన్యా" పట్టణంలో ఓషోకు మరి పిరమిడ్ మాస్టర్స్‌కూ అత్యంత ప్రీతిపాత్రుడైన సూఫీమాస్టర్ "మెవ్లానా జలాలుద్ధీన్ రూమీ" గారి సమాధిని సందర్శించి ధ్యానం చేశాం. UNICEF వారు గుర్తించిన "కెపెడోషియా" .. "కోన్యా" .. "పామాక్కుళె" .. "ఇస్తాంబుల్" .. పర్యాటక స్థలాలను సందర్శించాము.

 

ధ్యానం మరింత మందికి చేర్చే లక్ష్యంతో అక్టోబర్‌లో శ్రీ బైరాం గారు ఏడు రోజుల పాటు మళ్ళీ టర్కీదేశానికి రమ్మని మమ్మల్ని కోరారు!

 

 

 

A.V.సాయికుమార్ రెడ్డి

హైదరాబాద్
సెల్: +91 9849096111

 

Go to top