"  ‘పిరమిడ్’ అన్నది కాస్మిక్ ఆరోగ్యశాల "

 

 

నా పేరు "వెంకటేశ్వర్లు". ప్రతి ఒక్కధ్యాని కూడా తాను ధ్యానంలోకి వచ్చిన తేదీని తన "రెండవ జన్మదినం"గా గుర్తుపెట్టుకుంటాడు. అలా నా రెండవ జన్మదినం 2003, మే 12 వ తేదీ!

 

మొదటి పుట్టిన రోజు అమ్మ చేతి స్పర్శ .. మరి రెండవ పుట్టిన రోజు గురువు చేతి స్పర్శ! ఈ ప్రపంచంలో నడిచేటప్పుడు క్రింద పడకుండా ఉండడానికి మొదటి అడుగు అమ్మ చేతి వ్రేలిని పట్టుకుని నడిచినా .. ఆ తరువాత మాయలో పడి జీవితంలో చాలాసార్లు క్రింద పడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే నేను గురువు వ్రేలు పట్టుకున్నానో .. అప్పుడు నాకు సత్యం అవగతమై ఇక జీవితంలో పడవలసిన అవసరమే లేకుండా పోయింది.

 

నేను పుట్టిందీ, మరి పెరిగిందీ అంతా రాజకీయ వాతావరణంలోనే! గెలుపే అక్కడి నినాదం! అదే నిజమైన గెలుపనీ .. దానికోసం ఎన్ని కథలో .. ఎన్ని వ్యథలో .. ఎన్ని ఒత్తిడులో .. మరెన్ని కుటుంబ సమస్యలో చెప్పలేను. వీటన్నిటికీ తోడు "గిఫ్ట్ ప్యాక్" లా నాకు 1998 సంవత్సరంలో పక్షవాతం వచ్చి .. ఎడమకన్ను సరిగ్గా కనబడకుండా, ఎడమవైపు ముఖం లాగినట్లు అయిపోయి నోటి నుంచి "జొల్లు" కారడం మొదలయ్యింది. ఎడమ చెయ్యి, కాలు కదలలేని స్థితిలో అతి కష్టం మీద కాళ్ళు ఈడ్చుతూ నడిచేవాడిని.

 

రకరకాల వైద్యాల పేరుతో వేలకు వేలు డబ్బు ఖర్చవుతూ ఉన్నా ఫలితం మాత్రం శూన్యం! ఆయుర్వేదంలో కాస్త గుణం కనబడినట్లు న్నా .. ఆ డాక్టరేమో "మందులు వాడుతూన్నంత వరకు మాంసాహారం తినకూడదు; తగ్గాక నీ ఇష్టం" అన్నాడు. అలా అయిదున్నర సంవత్సరాలు గడిచాక ఏ దేవుడు నా మొర విన్నాడో తెలియదు కానీ .. మా ఊరి హైస్కూల్‌లో ధ్యానం క్లాస్ ఏర్పాటు చేయబడి .. ఒక కరపత్రం నా చేతికి వచ్చింది. అది ఏమిటో పూర్తిగా చదవకుండానే .. ఇచ్చిన వాళ్ళ ఎదురుగా పారేస్తే బాగుండదని మడిచి జేబులో పెట్టుకున్నాను. కార్యక్రమం ఏర్పాట్లు చూస్తున్న సుబ్బారావుగారి బలవంతం మీద అక్కడికి వెళ్ళాను.

 

మొదటిసారి పత్రీజీ దర్శనంలో "ఎంతమంది మాంసాహారం మానేస్తారో చేతులెత్తండి?" అని స్టేజిపై నుంచి సార్ ప్రశ్న! ఒక్క చేయి పైకి లేవలేదు .. హాలంతా నిశ్శబ్దం! ఏం చేస్తాం .. మాంసం లేకపోతే ముద్ద దిగదు మరి! నేనేమో ఎప్పుడూ జబ్బు తగ్గిపోతే అప్పటి నుంచి మళ్ళీ తినడం మొదలుపెట్టాలని ఆశగా ఉన్నాను. మళ్ళీ రెట్టించిన స్వరంతో సార్ .. "మీ ఊరిలో మాంసాహారం మానేసే మగాళ్ళే లేరా?!" అని అదే ప్రశ్నను పది సార్లు అడిగారు! అయినా పరిస్థితిలో ఏం మార్పు లేదు! "చివరిసారి అడుగుతున్నాను .. ఈ ఊళ్ళో మాంసం మానగలిగే మగాడు కనీసం ఒక్కడు కూడా లేడా?!" అని అడిగారు తీక్షణంగా. అంతే ఆ క్షణంలో నేను లేచి నిలబడ్డాను!

 

"ఒట్టు" అంటూ ఎంతో సంతోషంగా పత్రీజీ తమ చేతిని ముందుకు చాచారు. మంత్రముగ్ధుడిలా వెళ్ళి .. వారి చేతిలో చేయి వేసి "ఒట్టు" అన్నాను. అంతే వారు నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఆ చేతి స్పర్శ .. నా శరీరాన్నంతటినీ పులకింపజేసింది. అది నా రెండవ పుట్టినరోజు! ఆ తరువాత పత్రీజీ అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి .. చేతుల్లో చేతులుపెట్టుకుని, కళ్ళు మూసుకుని శ్వాసను గమనించమన్నారు. అప్పటి వరకు నా పరిస్థితి .. ముక్కుతోని కాకుండా నోటితోనే శ్వాస పీల్చుకోవడం! కాళ్ళు చేతులు కూడదీసుకుని సార్ చెప్పినట్లు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నా .. తెరుచుకున్న నోటి నుంచి కారుతున్న "జొల్లు"ను ఆపలేని స్థితి!

 

అందరూ ఏమనుకుంటారో .. అని ఒకింత బిడియపడుతూనే సార్ వేణునాదం మీద ధ్యాస పెట్టి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయాను. మెల్లిగా కొండ నాలుక నుంచి లాలాజలం ఊరి 4,5 గుటకలు మ్రింగాను. క్రమంగా నా నోరు మూతబడి .. జొల్లు రావడం ఆగిపోయి .. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం మొదలయ్యింది. "నాలో ఏదో జరుగుతోంది" అని అర్థం అవుతూ ఉండగానే .. నలభై నిమిషాల ధ్యానం పూర్తయ్యిందని పత్రీజీ అందరితో చప్పట్లు కొట్టిస్తున్నారు!

 

నలభై సెకన్లు కూడా నా ఆధీనంలో ఉండని నా శరీరం .. నలభై నిమిషాల పాటు ధ్యానస్థితిలో ఉండిపోవడం .. నాకు చాలా ఆశ్చర్యం అనిపించి .. ఇక ఇంటికి వచ్చేశాను. కొన్ని సంవత్సరాల తరువాత మొదటిసారి .. కడుపు నిండా భోంచేసి .. ఏ రకమైన మందులు మింగకుండా హాయిగా నిద్రపోయాను. మర్నాడు లేచి క్రితం రోజు జేబులో మడిచి పెట్టుకున్న పాంప్లెట్ క్షుణ్ణంగా చదివి .. అందులోని "చంద్ర పిరమిడ్" .. "ఉనికిలి" గ్రామం అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను.

 

చంద్ర పిరమిడ్ లోని కింగ్స్ ఛేంబర్‌లో కూర్చుని ధ్యానం చేస్తూంటే .. నా ఒళ్ళంతా "కరెంట్ షాక్" తగిలినట్లు అయ్యింది. నా భ్రమేమో అనుకుని .. వెంటనే కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. ఎవ్వరూ లేరు! మళ్ళీ మొండి ధైర్యంతో కళ్ళు మూసుకుని కూర్చున్నాను. నాలుగైదు సార్లు అదే అనుభవం! పత్రీజీ చేతిలో ఒట్టువేసినప్పటి వారి చేతి స్పర్శలా .. ఒక రకమైన పులకరింతతో కూడి ఉంది ఆ షాక్!

 

ఆ మర్నాటి నుంచి శరీరంలో నొప్పులు మరీ ఎక్కువయ్యాయి. ఇదివరకెప్పుడో మందులు వేసుకున్నప్పుడు ఇలాగే జరిగినప్పుడు .. "అయితే మందులు పనిచేస్తున్నాయన్నమాట" అని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తువచ్చి "అయితే .. ఇప్పుడు మందులు వాడకపోయినా .. విశ్వశక్తి వల్ల ఈ నొప్పులు వస్తున్నాయన్న మాట" అని నేను అర్థం చేసుకున్నాను. ఇక రోజుకు 6,7 గంటల పాటు అలా ధ్యానంలో కూర్చునేవాడిని! ఇంతలో పౌర్ణమి వచ్చింది!

 

ఇక ఆ పౌర్ణమి మూడు రోజులు విపరీతమైన నొప్పులు, కత్తులు శరీరంలో దింపినంత బాధ! అప్పటికే మందులు మానేసి పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నానని ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక నా బాధ ఎవరికైనా చెపితే తిట్లు, రాద్ధాంతమే అనుకుని .. "ఉనికిలి పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు" గారితో నా గోడు వెళ్ళబోసుకున్నాను."దీనినే ‘క్లీనింగ్ ప్రోసెస్’ అంటారు. ఖంగారు పడకుండా ధ్యానం కంటిన్యూ చెయ్యండి" అన్నారు. దాంతో "పట్టుపట్టగరాదు పట్టి విడువగరాదు" అని పదేపదే పత్రీజీ చెప్పే మాటలు గుర్తుకువచ్చి ధైర్యంగా "చస్తే చచ్చాను కానీ .. దీని అంతేదో చూద్దాం" అనికుని బాధ భరిస్తూ ధ్యానంలో కూర్చున్నాను.

 

ఎవరో కత్తిని నా గుండెలో దింపినట్లు .. గుండెలో దిగిన కత్తి వీపులోంచి బయటికి వచ్చి రక్తం చిందినట్లు అయ్యి శరీరమంతా బాధతో మెలికలు తిరిగిపోతూ .. కాస్సేపటికి మెల్లిమెల్లిగా సర్దుకోవడం మొదలయ్యింది! అకస్మాత్‌గా నా రెండు దవడలు "రెంచీ"తో కదిలించి మళ్ళీ "టైట్" చేసినట్లూ .. తలను ఎవరో బలంగా పైకి లాగినట్లూ .. మెడలోని నరాలను క్రమపద్ధతిలో మళ్ళీ "టైట్" చేసినట్లూ .. లాగి వదులుతున్నట్లూ రకరకాల అనుభవాలు వచ్చాయి.

 

నేను కళ్ళు మూసుకుని కూర్చునే ఉన్నా కూడా "ఇదంతా నాకు ఎలా కనబడుతోంది?" .. "నొప్పి భరిస్తున్న నేను మరి నొప్పిని గమనిస్తున్న నేను వేరు వేరా?" .. "ఈ నొప్పి కేవలం శరీరానికేనా?" అన్న ప్రశ్నలు నాలో తలెత్తాయి. ఆ తరువాత నాలో జరిగిన ప్రక్రియలన్నీ యోగశాస్త్రంలో ఉన్న "పెరాలిసిస్ మరి హృదయరోగానికి సంబంధించిన యోగాసనాలు" అని తెలిసి ఆశ్చర్యపోయాను. ధ్యానంలో నా సూక్ష్మశరీరం విడుదల అయ్యిందనీ మరి నాకు ఆస్ట్రల్ సర్జరీ జరిగిందనీ తెలుసుకుని ఆశ్చర్యపోయాను. పత్రీజీ చెప్పిన "నో డాక్టర్" .. "నో మెడిసిన్స్" .. "నో హాస్పిటల్స్" అంటే ఇదే అని నాకు అర్థం అయ్యింది!

 

ఇది జరిగిన ఏడవరోజు ధ్యానంలో నా భ్రూమధ్యం నుంచి ఎడమవైపు నాసికా రంధ్రం ద్వారా ఒక శక్తివంతమైన కాంతి ముక్కులోకి ప్రవేశించినట్లు అయ్యి .. మెల్లి మెల్లిగా నా శరీరంలోని నొప్పులన్నీ తగ్గు ముఖం పట్టాయి. అతి తక్కువ రోజుల్లోనే నా కాలూ చెయ్యి స్వాధీనంలోకి వచ్చి .. నా ముఖంలో, దవడల్లో ఉన్న నరాలన్నీ సరిచేయబడి .. నేను పూర్తి ఆరోగ్యవంతుడిగా మారాను.

 

"చికిత్స పేరుతో రూపాయి ఖర్చులేకుండా .. ఆపరేషన్ల పేరుతో ఒంటి మీద కోతలు లేకుండా నాలాంటి చాలా మందికి ‘కాస్మిక్ ఆరోగ్యశాల’ గా వెలుగుతూన్న పిరమిడ్‌లను విరివిగా నిర్మించి .. పిరమిడ్ శక్తిని ప్రతి గ్రామానికీ విస్తరింపజేయాలి"అని నాకు బలంగా అనిపించింది. వెంటనే నా మాతృ మరి పితృ సమానులైన తాడేపల్లిగూడెం పిరమిడ్ మాస్టర్లు శ్రీ గారపాటి సత్యనారాయణ, శ్రీమతి కళాలక్ష్మిగార్ల స్వగృహంపై "శ్రీనివాస పిరమిడ్ ధ్యానకేంద్ర" నిర్మాణంలో పాలుపంచుకోవడం ద్వారా పిరమిడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను.

 

ఇప్పటి వరకు ప||గో||జిల్లా వ్యాప్తంగా 175 పిరమిడ్‌లు ఉండగా వాటిలో నా ద్వారా 165 పిరమిడ్‌లు మరి ఒక్క తాడేపల్లిగూడెంలోనే 18 పిరమిడ్‌లు నిర్మించబడ్డాయి. పిరమిడ్ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి .. పత్రీజీ చేతుల మీదుగా దానిని ప్రారంభోత్సవం చేయించుకుని చప్పట్లు కొట్టించుకోగానే .. అప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఎగిరిపోయి మరింత శక్తివంతునిగా మారిపోతాను.

 

అమ్మ ఒడి లాంటి పిరమిడ్ నిర్మాణాలలో పాలుపంచుకోవడం ద్వారా భూమాతను మరింత శక్తివంతం చేస్తూ .. నా జీవితాన్ని అద్భుతంగా మలచుకుంటున్నాను. "మాంసాహారం మానేస్తాను" అని పత్రీజీకి ప్రమాణం చేసిన వెంటనే ఆరోగ్యం .. ఆనందం .. ఆర్థిక పటిష్టత వంటి అద్భుత వరాలు అందుకున్న నా పిరమిడ్ ధ్యానం అనుభవం చదివి .. ఒక్కరూ స్ఫూర్తి చెందిన నా జీవితం ధన్యం అవుతుంది!!

 

 

 

మేకా వెంకటేశ్వర్లు

అండలూరు గ్రామం 
పశ్చిమగోదావరి జిల్లా ధ్యాన ప్రచారకార్యదర్శి
సెల్:+9198498 58336.

Go to top